Print this page..

బంతి సాగులో మెళకువలు

బంతి భారతదేశంలో పండించే పూలలో బంతి పేరెన్నిక గన్నది. బంతిలో చాలా ఆకర్షణీయమైన రంగులు, సైజులు, ఆకారాలతో బాటు ఎక్కువ కాలం నిలువ వుండే స్వభావం వున్నందువలన పూల సాగుదారుల్ని మరియు వ్యాపారస్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. మన రాష్ట్రంలో 3,285 హెక్టార్లలో సాగుచేయబడుతూ 24,638 టన్నుల దిగుబడినిస్తుంది. వాతావరణం: బంతి పెరుగుదలకు, పూల దిగుబడికి ఎక్కువ తారతమ్యాలు లేని వాతావరణం అనుకూలం. వాతావరణ పరిస్థితుల్ని బట్టి బంతిని జూలై మొదటి వారం నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు నాటితే అక్టోబర్ నుండి ఏప్రిల్ మాసం వరకు పూల సరఫరా చేయవచ్చు. సెప్టెంబరు-అక్టోబర్ లో నాటిన పంట నుండి మంచి నాణ్యమైన పూలను మరియు విత్తనాలను కూడా పొందవచ్చు. అధిక వర్షపాతం లేదా అధిక ఉష్ణోగ్రత వల్ల పూల నాణ్యత దెబ్బతింటుంది. 

నేలలు:

నీరు త్వరగా ఇంకిపోయే స్వభావం గల అన్ని రకాల నేలల్లో బంతి పూలను సాగుచేయవచ్చు. ఉదజని సూచిక 7.0-7.5 మధ్య గల నేలలు అనుకూలం. సారవంతమైన గరపనేలలు బంతికి అత్యంత అనుకూలమైనవి. సాగుచేసే ప్రదేశంలో నీడ వుండకూడదు. నీడలో బాగా పెరుగుతుంది. కాని పూలు పూయవు. 

రకాలు:
ఆఫ్రికన్ బంతి: ఇది ఎత్తుగా పెరిగే ధృఢమైన మొక్క దీనిలో ఒంటి రెక్క నుండి ముద్దగా, పెద్దగా వుండే రకాలు వున్నాయి. పూలు నిమ్మ రంగు నుండి పసుపు, బంగారు వర్ణం నుండి నారింజ రంగు వరకు అనేక వర్ణాల్లో వున్నాయి. పూసా నారింగ గైండా, పూసా బసంతి గైండా, యం.డి.యు-1. 

ఫ్రెంచ్ బంతి: ఇవి పొట్టిగా, గుబురుగా పెరిగి అనేక ఒంటి రెక్క లేదా ముద్దగా ఉండే పూలు పూస్తాయి. పూల రంగులు పసుపు నుండి నారింజ, ఎరుపు వర్ణం కల గోధుమ, ఎరుపు, బంగారు పసుపు మరియు వివిధ రంగులు మిళితమై వుంటాయి. 
 

హైబ్రిడ్స్ రకాలు:
అర్క బంగారం – 2 : మొక్కలు పొట్టిగా, గుబురుగా పెరిగి పసుపురంగు పూలని ఇస్తాయి. ఇది 45 వ రోజుకు పూతనిస్తుంది. ఇది 80 రోజులు వరకు పూలనిస్తుంది. ఇవి ఎకరానికి  18 టన్నులు దిగుబడినిస్తుంది.
ఎల్లో మాక్సిమం: ఇది పొట్టిగా గుబురుగా పెరిగి  పసుపు రంగులొ ఉండి 7-9 సెం.మీ. వ్యాసం కలిగి ఉంటాయి. ఇవి 90 రోజులు పంట. ఇది పూల నాణ్యత 5 రోజులు వరకు ఉంటుంది.

ప్రవర్ధనము:

బంతిని విత్తనం ద్వారా కాని, కత్తిరింపులు నాటి కాని ప్రవర్ధనం చేయవచ్చు. విత్తన మోతాదు, విత్తే పద్దతి: ఎకరానికి సరిపడే నారు పెంచడానికి 800-1000 గ్రా.ల విత్తనం అవసరం. విత్తనాలను ఎత్తైన మడులు తయారుచేసి విత్తాలి. మళ్ళు తయారు చేసే సమయంలో చదరపు మీటరుకి 8-10 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి. విత్తడానికి మొదలు ఫాలిడాల్ పొడి చల్లితే చీమలు, చెదలు నుండి రక్షించవచ్చు. సాధారణంగా 5-7 రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. , 

విత్తే సమయం:

మూడు సీజన్లలో అంటే వర్షాకాలం, శీతాకాలం మరియు వేసవి పంటగా సాగుచేయవచ్చు. 

సీజను  విత్తే సమయం  నాటే సమయం 

1. వర్షాకాలం   జూన్ మధ్య కాలం | జూలై మధ్య కాలం | 
2. శీతాకాలం  ఆగష్టు మధ్య కాలం : సెప్టెంబర్ మధ్య కాలం 
3. వేసవి కాలం జనవరి మొదటి వారం ఫిబ్రవరి మొదటి వారం . 

 ప్రోట్రేలలో బంతి నారు పెంపకం:

ప్రస్తుతం హైబ్రిడ్ విత్తనం రేటు ఎక్కువ మరియు నారుమడిలో పెంచడం ద్వారా నారుకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి రైతు సోదరలు ఆధునిక పద్ధతిలో ట్రేలలో నారు పెంచడం ద్వారా ఆరోగ్యవంతమైన నారును పెంచుకోవచ్చును. దీనికి వానపాముల ఎరువు 2 భాగాలు మరియు కొబ్బరి పొట్టు ఒక భాగాన్ని వేసి ట్రేలలో నింపిన తరువాత అందులో విత్తనాన్ని నాటుకోవాలి.

నాటే విధానం:

25 రోజుల వయసు, 3-4 ఆకులు గల మొక్కలు నాటడానికి అనుకూలము. నారుని సాయంకాలం వేళలో నాటుకుంటే బాగా పాతుకుంటాయి. ఆఫ్రికన్ బంతి మొక్కల్ని 40X30 సెం.మీ. దూరంలోను, ఫ్రెంచి బంతి మొక్కల్ని 20X20 సెం.మీ. దూరంలో నాటితే పూల దిగుబడి బాగా వుంటుంది. ఎరువులు: చివరి దుక్కిలో ఎకరానికి 20 టన్నుల చొప్పున బాగా చివికిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. దీనితో బాటుగా 20-40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు వేయాలి. నాటిన 37 రోజులకి 20-40 కిలోల నత్రజని పైపాటుగా వేసి నీరు పెట్టాలి.  

నీటి యాజమాన్యం:

నాటిన 55-60 రోజుల వరకు అంటే శాఖీయ పెరుగుదల సమయంలోను, సూ నేలలో తగినంత తేమ వుండేలా చూడాలి. ఏ దశలోనైనా మొక్కలు నీటి ఎద్దడికి గురైతే, పెరుగుదల కు పూల దిగుబడి తగ్గుతుంది. పించింగ్: ఎత్తుగా పెరిగే ఆఫ్రికన్ బంతి రకాల్లో పెరుగుదల ఎక్కువగా ఉండి చివరిగా పూ మొగ్గ ఏర్పడుతుం అప్పుడే ప్రక్క కొమ్మలు ఏర్పడతాయి. దీనికి బదులుగా నిటారుగా పెరుగుతున్న బంతి మొకు కొందరు భాగాన్ని ముందుగానే గిల్లి వేస్తే, అనేక ప్రక్క కొమ్మలు తొందగా ఏర్పడతాయి. ఈ కొమ్మలపై పూలు ఏరు దిగుబడి పెరుగుతుంది. నాటిన 40వ రోజు పించింగ్ చేస్తే పూల దిగుబడి పెరుగుతుంది. మామూలుగా గుర పెరిగే రకాలకు పించింగ్ అవసరం లేదు. 

పూలకోత:

బంతి పూలను బాగా విచ్చుకున్న తరువాత కోయాలి. పూలను ఉదయం కాని, సాయంతం ఆ కోయాలి. కోతకు ముందు నీటి తడియిస్తే పూలు కోత తరువాత ఎక్కువ కాలం తాజాగా వుండి నిలువ మం...  సకాలంలో పూల కోతలు చేస్తూ వుంటే పూల దిగుబడి పెరుగుతుంది. 

దిగుబడి:

సాధారణంగా ఎకరానికి 4-5 టన్నుల పూల దిగుబడినిస్తాయి. 

సస్యరక్షణ: పురుగులు: 

పేను:

పెద్ద, పిల్ల పురుగులు మొక్కల పూ మొగ్గల్ని ఆశించి నష్టపరుస్తాయి. వీటి నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2 మి.లీ. లేదా ఫిప్రోనిల్ 15 రోజుల వ్యవధితో పిచికారి చేసి నివారించవచ్చు. తామర పురుగులు (త్రిప్స్): పిల్ల, తల్లి పురుగులు ఆకులు, పూల నుండి రసాన్ని పీలుస్తాయి. ఆకుల మీద తెల్లని మచ్చలు కనిపిస్తాయి. ఇవి ఆశించిన పూ మొగ్గలు గోధుమ రంగుకు మారి, ఎండిపోతాయి. నివారణకు డైమిథోయేట్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 

మొగ్గ తొలిచే పురుగులు:

గుడ్ల నుండి వెలువడిన చిన్న లార్వాలు పూల మొగ్గల్ని తొలిచి వేస్తాయి. పెరిగే లార్వాలు పూ భాగాల్ని తింటాయి. ఇవి ఆశించిన పూ మొగ్గలు విచ్చుకోవు. వీటి నివారణకు కార్బరిల్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పిండినల్లి: అన్ని దశల పురుగులు మొక్క యొక్క లేత భాగాల్ని ఆశించి రసాన్ని పీల్చుతాయి. దీని వలన మొక్కలు గిడసబారుతాయి. నివారణకు ప్రోఫినోఫాస్ 2 మి.లీ. లేదా డైమిథోయేట్ 2 మి.లీ. అనే మందులను ఏదో ఒక దాన్ని ఎన్నుకొని పిచికారి చేయాలి. 

తెగుళ్ళు:

నారుకుళ్ళు తెగులు:

నేలలో తడి ఎక్కువగా ఉండి, వెచ్చని వాతావరణంలో ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. 
మొలకెత్తుతున్న లేత మొక్కలు చనిపోతుంటాయి. దీని నివారణకు వేసవిలో నారుకుళ్ళను సోలరైజేషన్ (సూర్యం భూమిని వేడిచేయడం) చేయాలి. మళ్ళను పరిశుభ్రంగా వుంచాలి. నేలను లీటరు నీటికి 2 గ్రా. కొపాన్ లేదా - గ్రా. కార్బండిజమ్ కలిపిన మందు ద్రావణంతో తడపాలి. ఆకుమచ్చ: తేమతో కూడిన వెచ్చని వాతావరణంలో వ్యాప్తి చెందుతుంది. ఈ మచ్చలు కొన్ని సార్లు బూడిద , లేదా నల్లని రంగులో ఆయా శిలీంధ్రాన్ని బట్టి వుంటాయి. నివారణకు తోటను శుభ్రంగా వుంచుకోవాలి. అలా లీటరు నీటికి 2.5 గ్రా.ల మాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే క్లోరోథలోనిల్ 2 గ్రా., నీటికి కలిపి పిచికారీ చేయాలి. 

రచయిత సమాచారం

డా.ఎన్.సత్తిబాబు(ఉద్యాన విభాగము), డా.ఈ.చంద్రాయుడు(సమన్వయకర్త), డా.ఎన్.రాజ్ కుమార్, డా.డి.ఉమామహేశ్వర రావు మరియు డా.పి.బి.ప్రదీప్ కుమార్ (విస్తరణ విభాగము) కృషి విజ్ఞాన కేంద్రం, కొండెంపూడి