Print this page..

వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత

ఆహార ధాన్యాల స్వయం సమృద్ధిసాధనలో రసాయనిక ఎరువుల వాడకం ప్రాధాన్యతను సంతరించుకుంది. రసాయనక ఎరువుల్లో ముఖ్యంగా నత్రజని ఎరువుల వాడకం వల్ల నేలల్లోని పోషకపదార్థాల నిల్వల సమతుల్యత దెబ్బతిని ఉత్పాదకశక్తి కోల్పోడం అధికంగా చీడపీడలు ఆశించడం, సూక్ష్మపోషకాలు లోపించడం చౌడు తదితర సమస్యలు ఉత్పన్నం కావడంతో దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. పంటల ఉత్పాదకత పెరగడానికి భూభౌతిక స్వరూప స్వభావాల్లో వివిధ మార్పులు తేవడానికి భూసార పరిరక్షణకు గాను రసాయనిక ఎరువులకు తోడుగా సేంద్రియ, జీవన ఎరువులను వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ప్రకృతిలో గల సూక్ష్మాతిజీవులు జీవించుటకు స్వతంత్య్రంగా కాని, మొక్కలతో కలసి కాని జరిగే ప్రక్రియలో పంటలకు కావలసిన పోషకాలను వాతావరణం లేదా నేల నుండి గ్రహించి మొక్కలకు అందించే జీవుల సముదాయాన్ని జీవన ఎరువులు అంటారు. జీవన ఎరువులు అనేవి వాటంతట అవి ఎరువులు కావు. రసాయన ఎరువులు, సేంద్రియ ఎరువుల మాదిరి వీటిలో పోషకాలు లేవు. అయితే ఇవి మొక్కకు కావలసిన పోషకాలు తీసుకోవడానికి దోహదపడతాయి. దానికనుగుణంగా మార్పులను భూమిలో కలుగచేస్తాయి. జీవన ఎరువులు సహజమైనవి వాడడం సులభం మరియు కాలుష్యం ఉండదు. పంటకు గాని, భూమికి గాని ఎలాంటి హాని కలుగచేయవు. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయన ఎరువుల ధరలు అధికంగా ఉన్నందున చాలినంత సేద్రియ ఎరువులు లభ్యం కానందున జీవన ఎరువుల ప్రాధాన్యత రోజు రోజుకూ పెరుగుతుంది. సమగ్ర ఎరువుల వాడకంలో ఇది ఒకభాగమై నేలఆరోగ్యం ఉత్పాదకత కాపాడడంలో దిగుబడి నాణ్యత పెంచడంలోనూ ప్రముఖపాత్ర వహిస్తుంది. 

జీవన ఎరువులు : 

 • నత్రజనిని స్థిరీకరించేది
 • భాస్వరాన్ని అందించేది.
 • పొటాషియం మొబిలైజర్స్‌.
 • జింకు సాల్యుబలైజర్స్‌
 • మొక్క పెరుగుదలను అభివృద్ధి పరచే జీవన ఎరువు (పి.జి.పి.ఆర్‌)
 • ద్రవరూపంలో రూపొందించబడిన జీవన ఎరువులు 

నత్రజని స్థిరీకరించే జీవన ఎరువుల వివరాలు :

పంట

నత్రజని స్థిరీకరణ

 సగటు దిగుబడి  

కిలోలు / ఎకరాకు

 పెరిగే శాతం

కంది 65-80 19
పెసర, మినుము 20 20
అలసంద  34  23
శనగ 34-44 22
బఠాణి  20-28 13
వేరుశనగ 20-24 19
సోయాబీన్‌ 24-32 35

 ఉపయోగించు విధానం : 

100 మి.లీ. నీటిలో 10 గ్రా. పంచదార / బెల్లం / గంజి కలిపి 10 ని|| మరగబెట్టి చల్లార్చి 200 గ్రా. రైజోబియం పొడిని కలిపి 10 కిలోల విత్తనాలపై చల్లి 10 ని|| నీడలో ఆరబెట్టిన తరువాత పొలంలో నాటుకోవచ్చు. 

ఇతర వివరాలు : 

వేర్వేరు పైర్లను వేర్వేరు రైజోబియం కల్చరు వాడాలి.

అజటోబాక్టర్‌ :    

పంట

నత్రజని స్థిరీకరణ

సగటు దిగుబడి  

కిలోలు/ ఎకరాకు

 పెరిగే శాతం

పప్పుజాతి మినహాయించి అన్ని పంటలు

8-16 10

ఉపయోగించు విధానం : 

 కిలోల కల్చర్‌ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటిన సమయంలో ఒక ఎకరంపై చల్లాలి.

ఇతర వివరాలు : 

సేంద్రియ పదార్థం ఉన్నప్పుడు సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. తక్కువగా ఉన్న నేలల్లో కూడా పనిచేయును.

అజస్పైరిల్లమ్‌ :

పంట

నత్రజని స్థిరీకరణ

 సగటు దిగుబడి  

కిలోలు/ ఎకరాకు

 పెరిగే శాతం

వరి, పత్తి, మిరప,జొన్న, అరటి

 8-16  15

ఉపయోగించు విధానం : 

2 కిలోల కల్చర్‌ను 100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలంలో పోయాలి.

ఇతర వివరాలు : 

సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలల్లో కూడా పనిచేయును.

నీలి ఆకుపచ్చ నాచు :     

పంట

నత్రజని స్థిరీకరణ

 సగటు దిగుబడి  

కిలోలు / ఎకరాకు

 పెరిగే శాతం

వరి   8-12  15

ఉపయోగించు విధానం : 

ఒక ఎకరం పొలంలో వరినాట్లు వేసిన 3-7 రోజుల వ్యవధిలో 4-6 కిలోలు. 40-50 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి చల్లాలి.

ఇతర వివరాలు : 

రైతుతో తయారు చేసుకోవచ్చు. నాచు సేంద్రియ పదార్ధంగా  ఉపయోగపడును.

అసిటోబాక్టరు :  

పంట

నత్రజని స్థిరీకరణ

 సగటు దిగుబడి  

కిలోలు / ఎకరాకు

 పెరిగే శాతం

చెరకు 40-7 10

ఉపయోగించు విధానం : 

ఒక ఎకరం పంటకు 4 కిలోల జీవన ఎరువును ముచ్చెలు నాటేటప్పుడు 2 కిలోలు మోకాలు లోతు పంటయినప్పుడు 2 ని|| 100 కిలోల సేంద్రియ ఎరువుతో వాడాలి.

ఇతర వివరాలు : 

చెక్కెర శాతం 0.5-1.0 పెరుగుతుంది.

అజొల్లా :    

పంట

నత్రజని స్థిరీకరణ

 సగటు దిగుబడి  

కిలోలు / ఎకరాకు

 పెరిగే శాతం

వరి 8-12  15

 ఉపయోగించు విధానం : 

వరి నాటిన వారం తరువాత 200 కిలోల అజొల్లా ఒక ఎకరంలో వెదజల్లి 15-20 రోజులు నీటిపై బాగా పెరగనివ్వాలి.

ఇతర వివరాలు : 

ఎండబెట్టి పొడిగా చేసి పశువులకు తినిపించడం వల్ల పాలఉత్పత్తి పెరుగును.

భాస్వరం అందించే జీవన ఎరువులు : 

పంట మొక్కలకు వేసిన లభ్య భాస్వరం, భూమిలో చేరి కొద్ది రోజుల వ్యవధిలో భూమి యొక్క ఉదజని సూచికను అనుసరించి లభ్యం కాని భాస్వరం రూపంలో మారిపోవును. భాస్వరం అందించే జీవన ఎరువులు, సూక్ష్మజీవులు, శిలీంద్రాల ద్వారా భూమిలో నిల్వ ఉంచి లభ్యం కాని భాస్వరాన్ని మొక్కలకు అందుబాటులోకి తీసుకువస్తాయి. భాస్వరం వేసిన ఆమ్లనేలల్లో ఐరన్‌ లేదా అల్యూమినియం ఫాస్ఫేట్‌గాను మారి మొక్కకు లభ్యం కాదు. 

ముఖ్యంగా వాడుకలో ఉన్నవి...

 • ఫాస్ఫేట్‌ సాల్యుబలైజింగ్‌ బాక్టీరియా (ఫాస్ఫో బాక్టీరియా)
 • ఫాస్ఫేట్‌ సాల్యుబలైజింగ్‌ ఫంగై (ఫాస్పో ఫంగై)
 • ఫాస్ఫేట్‌ మొబిలైజింగ్‌ మైకోరైజా (వి.ఎ.ఎం)

భాస్వరం అందించి జీవన ఎరువుల వివరాలను కింద పొందుపరచినాము..

ఫాస్ఫో బాక్టీరియా : 

ముఖ్యంగా బాసిల్లస్‌ మెగథీరియంతో గాని, సూడోమోనాస్‌తో గాని ఉపయోగించి తయారుచేయబడును. అన్ని పంటలకు వాడుకోవచ్చు. సేంద్రియ ఎరువును వాడాలి. మొక్కలకు హార్మోన్లు సరఫరా చేసి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. 

వాడే విధానం : 

ఎకరాకు 2 కిలో ఫాస్ఫోబాక్టర్‌ను 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలో గాని సాళ్ళలో వేసుకోవలయును. వరినాట్లు వేసిన 3-7 రోజుల వ్యవధిలో వేసుకోవాలి.

ఫాస్పో ఫంగై : 

ఆస్పర్జిల్లస్‌ అవమోరి లేదా పెనిసీలియం డిజిటోటమ్‌  ఉపయోగించి తయారు చేయబడును. అన్ని పంటలకు వాడుకోవచ్చు. ఫాస్ఫో బాక్టీరియా కన్నా శక్తివంతమైన జీవన ఎరువు.

వాడే విధానం

2.0 కిలోల జీవన ఎరువును 100 కిలోల సేంద్రియపు ఎరువుతో కలిపి ఒక ఎకరం నేలకు విత్తనం నాటి సాళ్ళలో పడేటట్లు వేసుకోవాలి.

ఫాస్ఫేట్‌ మొబిలైజింగ్‌ మైకోరైజా : 

శిలీంద్రపు జాతికి చెందిన జీవన ఎరువు. భాస్వరంతో పాటు జింకు, కాపర్‌, సల్ఫర్‌, మాంగనీసు, ఇనుము వాటిని కూడా మొక్కకు అందించును. మొక్కల్లో నీటి ఎద్దడిని తట్టుకోవడం, రోగ నిరోధక శక్తి పెరగడం గమనించవచ్చు.

వాడే విధానం : 

5 కిలోల / ఒక ఎకరానికి వేయవలసి ఉంటుంది. తప్పనిసరిగా విత్తనం / మొక్క కింద మాత్రమే పడేటట్లు వాడాలి.

పొటాషియం మొబిలైజర్స్‌ : 

మొక్కకు అందుబాటులో లేని పొటాషియం అందుబాటులోకి తెచ్చును. ముఖ్యంగా ప్రటూరియా అర్షానియా అనే బ్యాక్టీరియా పొటాషియం మొబిలైజర్స్‌గా ఇవ్వబడుతుంది. 100 కిలోల సేంద్రీయ ఎరువుతో 2.0 కిలోల జీవన ఎరువును కలిపి ఒక ఎకరం భూమిపై వెదజల్లవలెను. నూనె పంటలో దీని ప్రభావం బాగా కనబడుతుంది. 

జింకు సాల్యులైజర్స్‌ : 

కొన్ని బాసిల్లస్‌ స్పీసిస్‌ ఉపయోగించి జీవన ఎరువును కొన్ని ప్రైవేటు సంస్థలు తయారుచేయబడుచున్నవి. వరి, మొక్కజొన్న వంటి పటల్లో దీని ప్రభావం కొంత మేరకు చూడవచ్చు. 

మొక్క పెరుగుదలను అభివృద్ధి పరచే జీవన ఎరువు (పి.జి.పి.ఆర్‌) : 

మిశ్రమ సముదాయంతో కూడుకున్న జీవన ఎరువు. బాసిల్లస్‌ మరియు సూడోమోనాస్‌ జాతి బ్యాక్టీరియాలను మిశ్రమంగా తయారు చేసి పి.జి.పి.ఆర్‌గా అందించనున్నారు. పోషకాలు అందించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించును. భూమిలోని మొక్కలకు తెగుళ్ళు కలుగచేసే శిలీంద్రాలను పెరగకుండా అరికట్టును. 

ఒక ఎకరాకు రెండు కిలోలు జీవన ఎరువును 100 కిలోలు పశువుల ఎరువుతో గాని, వానపాముల ఎరువుతో గాని విత్తనం నాటుకునే సమయంలో వెదజల్లాలి. అవసరమైనప్పుడు పైరుపై సాయంత్రం వేళ పిచికారి కూడా చేయవచ్చు. 

ద్రవరూపంలో రూపొందించబడిన జీవన ఎరువులు : 

ఆచార్య యన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారి అమరావతి వ్యవసాయ పరిశోధనా స్థానం వారు రూపొందించిన ద్రవరూపంలో జీవన ఎరువులు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. అధిక సంఖ్యలో పంట పొలానికి కావలసిన జీవన ఎరువులు, బ్యాక్టీరియా కణాలు (108 మి.లీ) లభ్యమగును. 

ఒక ఎకరం పొలానికి 300 మి.లీ.  నుండి 500 మి.లీ. వరకు ప్రతి ఒక్కొక్క రకపు జీవన ఎరువును మిశ్రమ ద్రావణంగా చేసి వాడాలి. వీటికి విత్తనానికి గాని, భూమిలో గాని, నారును ముంచే పద్ధతి, డ్రిప్‌ పద్ధతిలో గాని వాడవచ్చు.

జీవన ఎరువుల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు : 

 1. పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడు వాడుకోవాలి.
 2. రసాయనిక ఎరువులతో కలిపి జీవన ఎరువులు వాడరాదు. 
 3. ప్యాకెట్‌పై ఉన్న గడువు (షెల్ఫ్‌ పిరియడ్‌) దాటిన ఎరువులు వాడరాదు
 4. చల్లని ప్రదేశాల్లో నిల్వ ఉంచాలి. 
 5. పైరుకు నిర్ధేశించిన జీవన ఎరువునే వాడాలి. 
 6. విత్తనశుద్ధి చేయదలచినప్పుడు మొదటగా శిలీంద్రనాశినులతో శుద్ధి చేసి 24 గం|| తరువాత జీవన ఎరువులను పట్టించాలి.
 7. సేంద్రియ ఎరువుతో జీవన ఎరువు కలిపిన వెంటనే పంటకు వాడుకోవాలి.

జీవన ఎరువుల వల్ల కలిగే ప్రయోజనాలు : 

 1. నత్రజని స్థిరీకరిస్తాయి. నేలలోని భాస్వరాన్ని అందుబాటులోకి తెస్తాయి. 
 2. భూసార నిల్వలు పరిరక్షించబడతాయి. సూక్ష్మజీవులు పెరుగుతాయి. 
 3. 20-25 శాతం నత్రజని, భాస్వరం ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చును. 10-20 శాతం దిగుబడులు పెరుగుతాయి. 
 4. నేల నుండి సంక్రమించే తెగుళ్ళు కొంతమేర నిరోధించబడతాయి.
 5. హార్మోన్లు, విటమిన్లు, ఎంజైములు లభ్యమై మొక్క పెరుగుదల చురుకుగా ఉంటుంది.
 6. కాలుష్యం ఉండదు. నేలకు, పంటకు గాని ఎటువంటి హానికలదు. 
 7. చవుడు నేలల్లో సోడియం కరిగించి నేలను సారవంతం చేస్తాయి.
 8. క్రమం తప్పకుండా 3-4 కాలాలు వాడిన ఎడల దిగుబడులు గణనీయంగా పెరిగి నేలసారవంతమై ఉత్పాదక శక్తి పరిరక్షింపబడుతుంది.

రచయిత సమాచారం

డా||యస్‌. జాఫర్‌ భాష, డా|| ఎస్‌. బాలాజి నాయక్‌, డా|| ఎస్‌. ఖయ్యూం అహ్మద్‌, డా|| డి. సంపత్‌ కుమార్‌,  ప్రాంతీయ వ్యవసాయ పరశోధనా స్థానం, నంద్యాల, కర్నూలు, ఫోన్‌ : 9849871975, 07981809965