Print this page..

రబీకి అనువైన వరి రకాలు వాటి గుణగణాలు

తెలంగాణలో పండించే ఆహార ధాన్య పంటల్లో వరి ప్రధానమైనది. రాష్ట్రంలో దాదాపు రబీ కాలంలో 44 లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తున్నారు. వరి దిగుబడి ఖరీఫ్‌ పంట కాలంలో కంటే రబీ పంట కాలంలో ఎక్కువగా  ఉంటుంది. ఎక్కువ రైతాంగం రబీలో వరిని వాణిజ్యపంటగా అంటే మార్కెట్‌లో అమ్మడానికి పండిస్తారు. రబీలో ఎక్కువ దిగుబడులు రావడానికి ప్రధాన కారణం ఎక్కువగా సూర్యరశ్మి ఉండడం, ఖరీఫ్‌ పంట మాదిరిగా కాకుండా తక్కువ తెగుళ్ళు మరియు పురుగులు ఆశించడం మరియు వర్షాల వల్ల జరిగే నష్టం ఉండదు. 

రబీలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉండడం వల్ల వరి రకాల ఎన్నిక, విత్తేసమయం నిర్ధారించుట, నారుమడి యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు మొదలగు అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉంటే అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. విత్తనం కొద్దీ పంట అన్నారు పెద్దలు. వరి పంట దిగుబడులు పెంచేందుకు ధృవీకరించిన, నాణ్యతకలిగిన మంచి విత్తనాన్ని పండించాలి. మంచి విత్తనం అంటే శుభ్రత, నాణ్యతతోపాటు బాగా మొలకెత్తే స్వభావం (80 శాతం) కలిగి ఉండాలి. ఈ సందర్భంలో ప్రస్తుతం రబీలో సాగు చేయటానికి అనువైన వరి రకాలు వాటి వివరాల గురించి రైతాంగానికి అవగాహన కలిగించడం అవసరం.  

రకాలు : 

జెజియల్‌-3844 (జగిత్యాల సాంబ) : 

2009 సం||లో జగిత్యాల పరిశోధనా స్థానం నుండి విడుదల చేయబడింది. 135 రోజులకు కోతకు వచ్చి, చలిని తట్టుకునే సన్నగింజ రకం. ఉల్లికోడును, కంకినల్లి, సుడిదోమను సమర్ధవంతంగా తట్టుకుంటుంది. ఎకరానికి 25-32 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది.

జెజియల్‌-17004 (ప్రత్యుమ్న) : 

2012 సం||లో జగిత్యాల పరిశోధనాస్థానం నుండి విడుదల చేయబడింది. అగ్గితెగులును, చలిని మరియు నీటి ఎద్దడిని తట్టుకునే అతి స్వల్పకాలిక సన్నగింజరకం. రబీలో 110-115 రోజుల్లో కోతకు వస్తుంది. 60-65 చ.మీ. కుదుళ్ళు ఉండేటట్లు లేత నారు నాటినట్లయితే దిగుబడి అధికంగా ఉంటుంది. ఎకరానికి 25 క్వింటాళ్ళ వరకు దిగుబడినిస్తుంది. 

యం.టి.యు-1010 : 

పంటకాలం 130 రోజులు, గింజ సన్నగా పొడవుగా ఉండి మంచి నాణ్యత కలిగి ఉంటుంది. ఈ రకం సుడిదోమను, అగ్గి తెగులును తట్టుకుంటుంది. గింజలో మూడువారాల నిద్రావస్థ ఉంటుంది. ఈ రకంలో గింజ రాలే గుణం ఉన్నందున వెన్ను పచ్చగా ఉన్నప్పుడే పంట కోతలు చేసుకోవాలి. ఎకరానికి 30 క్వింటాళ్ళు దిగుబడినిస్తుంది. 

యన్‌.ఎల్‌.ఆర్‌-34449 : 

మధ్యకాలపు సన్నరకం గింజ, అగ్గి తెగులును సమర్థవంతంగా తట్టుకుంటుంది. 

ఐ.ఆర్‌-64 : 

ఇది అంతర్జాతీయ వరి పరిశోధనా స్థానం, ఫిలిఫ్పైన్స్‌ నుండి విడుదల చేయబడింది. పంట కాలం 130 రోజులు. అగ్గి తెగులును తట్టుకుంటుంది. దిగుబడి 28 క్వింటాళ్ళు ఎకరానికి ఇస్తుంది. గింజలో 2 వారాల నిద్రావస్థ ఉంటుంది. 

తెల్లహంస : 

స్వల్పకాలిక దొడ్డు రకం, పంట కాలం 120-125 రోజులు, అగ్గి తెగులు, ఎండాకు తెగులు చలిని కొంత వరకు తట్టుకుంటుంది. ఎకరానికి 25 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. 

వరాలు : 

పంటకాలం 100 రోజులు, ఉల్లికోడును, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఎకరానికి 22-25 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. 

జె.జి.యల్‌-18047 (బతుకమ్మ) :   

2015 సం||లో జగిత్యాల పరిశోధనా స్థానం నుండి విడుదల చేయబడింది. దొడ్డు గింజ రకం ఎకరానికి 30-35 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. స్వల్పకాఇక రకం ఉల్లికోడును, సుడిదోమ, అగ్గితెగులు, చలిని తట్టుకుంటుంది. అధిక దిగుబడినిచ్చే యం.టి.యు 1010 ని పోలిన దొడ్డుగింజ రకం. 

రచయిత సమాచారం

- పి. గోన్యానాయక్‌, బా. లక్ష్మీప్రసన్న, బి. శ్రీనివాస్‌, పి. మధుకర్‌,  ఎన్‌. బలరాం, ఉమారెడ్డి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పొలాస, జగిత్యాల, ఫోన్‌ : 9701592326