Print this page..

రబీ క్యాబేజీలో అధిక దిగుబడి - మేలైన యాజమాన్య పద్ధతులు

శీతాకాలం సాగుచేసే కూరగాయల్లో క్యాబేజి అతి ముఖ్యమైనది. క్యాబేజి పంటకు చల్లని వాతావరణం అనుకూలం. కొద్దిపాటి నీటి సౌకర్యంతోనే దీనిని సాగు చేసుకొని లాభసాటి పంటగా మలుచుకోవచ్చు. సకాలంలో సరైన యజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులతో పాటు మంచి ఆదాయాన్ని పొందవచ్చు.  క్యాబేజి కూరల్లోనే కాకుండా ప్రత్యేకంగా సలాడుగా కూడా ఉపయోగిస్తుంటారు. అందుకే దీనికి మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. క్యాబేజి సాగుకు ఇసుకతో కూడిన బంక నెలలు, సారవంతమైన ఒండ్రు నేెలలు అనుకూలం. చౌడు క్షార నేలలు పనికి రావు. ఉదజని సూచిక 5.5 నుంచి 6.6 గల నేలలు క్యాబేజి సాగుకు అత్యంత అనుకూలతగా ఉంటాయి. క్యాబేజికి చల్లని తేమ గల వాతావరణం అవసరం. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 300 సెల్సియస్‌ దాటకుండా ఉంటే ఎక్కువ దిగుబడి వస్తుంది. 

విత్తనాలు నాటుకోవడానికి అనుకూలమైన కాలం : 

స్వల్ప కాలిక రకాలను డిసెంబరు మొదటి పక్షం వరకు దీర్ఘకాలిక రకాలను డిసెంబరు మొదటి పక్షం నుంచి చివరివారం వరకు నాటుకోవచ్చు. ఎకరానికి సూటి రకాలు 300 గ్రా., హైబ్రిడ్‌ రకాలు 100-150 గ్రా. విత్తనాలు సరిపోతాయి. కిలో విత్తనానికి 3 గ్రా. థైరామ్‌ను కలిపి విత్తన శుద్ధిచేయాలి.

రకాలు :

గోల్డెన్‌ (ఎసిఆర్‌ఇ) :

దీనిగడ్డ గట్టిగా, గుండ్రంగా, 1-1.5 కిలోల బరువు ఉంటుంది. 60-65 రోజుల్లో ఈ రకం కోతకు వస్తుంది.

ఎర్లీ డ్రమ్‌ హెడ్‌ : 

గడ్డ చదునుగా, పెద్దదిగా ఉంటుంది, 60-70 రోజుల్లో ఈ రకం కోతకు వస్తుంది.

ప్రైడ్‌ అఫ్‌ ఇండియా

గడ్డ చదునుగా, పెద్దదిగా ఉంటుంది. 1-2 కిలోల బరువు ఉంటుంది. 60-65 రోజుల్లో ఈ రకం కోతకు వస్తుంది. 

లేట్‌ డ్రమ్‌ హెడ్‌ : 

గడ్డలు పెద్దదిగ, గుండ్రంగా ఉంటాయి. ఇది మధ్యకాలిక రకం. నల్ల కుళ్ళు తెగులును ఈ రకాన్ని తట్టుకుంటుంది. 100-120 రోజుల్లో కోతకు వస్తుంది. 

పూస డ్రమ్‌ హెడ్‌ : 

గడ్డ చదునుగా ఉంటుంది. ఇది దీర్ఘకాలిక రకం120 రోజుల్లో ఈ రకం కోతకు వస్తుంది. 

పూస ముక్త : 

గడ్డ గట్టిగ ఉంటుంది. ఒక్కోగడ్డ 2  కిలోల బరువు ఉంటుంది. బాక్టీరియా నల్ల కుళ్ళు తెగులును  తట్టుకుంటుంది.

హైబ్రిడ్‌ : 

నాద్‌ లక్ష్మి -401, గ్రీన్‌ ఎక్స్రెస్స్‌, సోనా, శ్వేతా, అవంతి, గ్రీన్‌ ఛాలెంజ్‌, గ్రీన్‌ బాయ్‌. 

నారుమడి : 

నేల అదునుకు వచ్చేవరకు 4-5 సార్లు కలియదున్నాలి. 100 చ.మీ. విస్తీర్ణంలో, 25-30 గంపల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. 10 నుంచి 15 సెం.మీ.ఎత్తు, 4 సెం.మీ. పొడవు, 1 మీటరు వెడల్పుతో నారుమళ్లను తయారుచేయాలి. విత్తనాలను సన్నని ఇసుకతో కప్పివేయాలి. విత్తనాలు మొలిచే వరకు (సుమారు వారం రోజుల వరకు) రోజు నీరు పెట్టాలి. మొక్కలు మొలకెత్తిన తరువాత ఎండిన ఆకులను తీసివేయాలి. నారు కుళ్ళు తెగులు సోకకుండా లీటరు నీటికి 3 గ్రా. కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌తో నేలను తడపాలి. నారుమడిని ఆకు తినే పురుగు బారి నుంచి రక్షించేందుకు 2 మి.లీ. మలాథియాన్‌ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

నాటడం : 

నేలను అదును వచ్చే వరకు బాగా దున్నాలి. సుమారు 10-15 రోజుల ముందు నేలను సిద్ధం చేసుకోవాలి. దీర్ఘకాలిక రకాలను 60I45 సెం.మీ, స్వల్పకాలిక రకాలను 45I45 సెం.మీ. దూరంలో నాటాలి. 25 నుంచి 30 రోజుల వయసు గల నారును నాటుకోవాలి. నాటే ముందు నీటి తడిని కచ్చితంగ ఇవ్వాలి. 

నీటి యాజమాన్యం : 

తేలిక నెలల్లో వారము రోజుల కొకసారి, బరువైన నెలల్లో 10 రోజుల కొకసారి (5 -6 సెం.మీ.) నీటి తడి ఇవ్వాలి. పొలాన్ని బాగా దుక్కిదున్ని బోదెలు వేసుకోవాలి. దున్నిన తరువాత నీటితో తదపడం ద్వారా మట్టిలోని నిద్రావస్థలో, కోశస్థ దశలో ఉన్న పురుగులు నాశనమవుతాయి. 21-25 రోజుల వయసు ఉన్న 3-4 ఆకులు  ఉన్న నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి.

ఎరువులు : 

తొలిదఫా ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువులతో పాటు 32-40 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్‌ ఎరువులను చివరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. 24-32 కిలోల నత్రజని మూడు దఫాలుగా నాటిన 25-30 రోజులకు మొదటిసారి, 50-60 రోజులకు రెండో సారి దీర్ఘకాలిక రకాలైతే 75-80 రోజులకు మూడోసారి వేయాలి. ఎరువులు వేసిన వెంటనే నీటి తడిని ఇవ్వాలి. నత్రజనితో పాటు పైపాటుగా వేయాలి. సూక్ష్మపోషకాలను అందించేందకు అగ్రోమిన్‌ మాక్స్‌ 5 గ్రా. లీటరు నీటికి కలిపి పంటకాలంలో 2-3 సార్లు పిచికారి చేయాలి.

కలుపు నివారణ :

పెండిమిథాలిన్‌ 30 శాతం ఎకరాకు 1.25 లీ. లేదా అలాక్లోర్‌ 1.0 మి.లీ. (తేలిక నేలలు), 1.2 లీ. (బరువు నేలలు) చొప్పున 200 లీ. నీటిలో కలిపి నాటిన 24-48 గంటలలోపు పిచికారి చేయాలి. నాటిన 20-25 రోజులకు అంతరకషి చేయాలి. పాలిథీన్‌ పేపరును మల్చింగ్‌గా వేయడం వల్ల కలుపును నియంత్రించవచ్చు. నీటిని ఆదా చేస్తుంది మరియు మట్టి కోతను నివారించి భూసారాన్ని కాపాడుతుంది.

సస్యరక్షణ :

వజ్రపు రెక్కల పురుగు (డైమండ్‌ బాక్‌ మాత్‌) : 

ఈ పురుగు ఆకుల అడుగు భాగాన్ని మరియు ఆకులను తిని నాశనం చేస్తుంది. ఇది ఆశించిన ఆకులు వాడి, ఎండిపోతాయి. పురుగు ఉధతి ఎక్కువగా ఉంటే పైరులో ఆకులన్నీ రంధ్రాలతో              ఉండి, క్యాబేజి గడ్డ పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది. దీని నివారణకు ప్రతి 25 క్యాబేజి వరుసలకు 2 వరుసల చొప్పున ఆవాలను ఎర పంటగా వేసుకోవాలి. టమాట, క్యారెట్‌, చైనీస్‌ క్యాబేజి పంటను అంతర పంటలుగా వేసుకోవడం ద్వారా ఈ పురుగును నివారించవచ్చు. ఎకరాకు 10 చొప్పున లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా, ఈ పురుగు ఉధతిని గమనించి తగిన చర్యలు చేపట్టాలి. ఈ బుట్టలను 15 రోజులకు ఒకసారి మార్చుకోవాలి. ఇవి ఒటా-టి అనే పేరుతో మార్కెట్‌లో లభిస్తున్నాయి. గుడ్లను నాశనం చేసేందుకు వేపగింజల కషాయాన్ని 5 శాతం పిచికారి చేయాలి. జీవ నియంత్రణ పద్ధతుల్లో భాగంగా, నాటిన 30-45 రోజుల్లో బిటి మందులు లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున పిచికారి చేయాలి. బవేరియా బానీయానా 1.15 శాతం యస్‌సి అను జీవశిలీంద్రనాశిని ఉపయోగించవచ్చు. దీన్ని మైకో-జాల్‌ అనే పేరుతో పెస్ట్‌ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియా వారు మార్చెట్‌లో విడుదల చేశారు. పురుగు ఉధతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటరు నీటికి స్పైనోశాడ్‌0.3 మి.లీ. లేదా నోవాల్యూరాన్‌ 1 మి.లీ. కలిపి కోతకు 15 రోజుల ముందు వరకు పిచికారి చేయవచ్చు. ఇవి కాకుండా కొత్తగా ఉపయోగిస్తున్న మందుల్లో క్లోరాంత్రానిలిప్రోల్‌ 18.8 శాతం యస్‌సి 0.8 మి.లీ. లేదా ఫూబెెండామైడ్‌ 20 శాతం డబ్ల్యుజి 0.2 గ్రా. లేదా సయాంత్రానిలిప్రోల్‌ 10 ఒడి 240 మి.లీ. (ఒక ఎకరాకి) లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పేనుబంక:

ఆకుల అడుగు భాగాన గుంపులు, గుంపులుగా చేరి రసాన్ని పేల్చి నష్టాన్ని కలుగచేస్తాయి. పసుపు రంగు జిగురు పలకలు ఎకరానికి 10 చొప్పున అమర్చాలి. కొత్తిమీరను పంట పొలం చుట్టూ వేసుకోవడం ద్వారా వీటి ఉధృతిని తగ్గించవచ్చు. వీటిని అదుపు చేయడానికి వేపగింజల కషాయం (5 శాతం)ను పిచికారి చేసుకోవాలి. ఎక్కువగా ఉన్నప్పుడు మలాథియాన్‌ 3 మి.లీ./ లీ. నీటికి లేదా సయాంట్రానిలిప్రోల్‌ (ఎకరానికి 240 మి.లీ) మందులను పిచికారి చేయాలి.

క్యాబేజి తల తొలుచు పురుగు :

లద్దె పురుగు బూజు లాంటి సాలె గూడును ఏర్పరచి మొదట బయటి వైపు ఆకులను తింటూ రంధ్రాలను ఏర్పరుస్తుంది. తరువాత కాడలు ఈనెల నుంచి చివరకు తల వరకు తొలచి వేసి పంటకు నష్టం కలిగిస్తుంది. పంటను ఆశించిన పురుగులను, దెబ్బతిన్న ఆకులను, పూలను ఏరివేసి నాశనం చేయాలి. హెక్టారుకు ఒకటి చొప్పున దీపపు ఎరలను ఏర్పాటు చేసుకోవాలి. క్వినాల్‌ ఫాస్‌ 2 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. గుడ్లను నాశనం చేయడానికి జీవనియంత్రణ పద్ధతుల్లో భాగంగా యస్‌.యన్‌.పి.వి (వైరస్‌) ద్రావణాన్ని 300 లీ. డోసులు ఒక హెక్టారుకు చొప్పున 8 సార్లు పిచికారి చేయాలి. ప్రతి పిచికారి మధ్య 10 రోజుల వ్యవధి  ఉండాలి.

పొగాకు లద్దె పురుగు :

ఇది ఆకులు, తల, పువ్వులను తిని నష్టపరుస్తుంది. ఆముదం మొక్కలను ఎర పంటగా క్యాబేజి చుట్టూ వేసుకోవాలి. దీపపు ఎరలను హెక్టారుకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలి. గుడ్ల సమూహాలను ఏరి నాశనం చేయాలి. మగ పురుగులను ఆకర్షించడానికి లింగాకర్షక బుట్టలను ఎకరాకు 6 చొప్పున ఏర్పాటు చేయాలి. హెక్టారుకు 3 లీ. క్లోరోపైరిఫాస్‌ లేదా ఒక లీటరు డైక్లోరోవాస్‌ మందును పిచికారి చేయాలి.

తెగుళ్ళు :

100 గ్రా. వేప పిండిని ఒక చ.మీ. నారుమడిలో వేయాలి. (స్రెష్టోసైకిన్‌ ద్రావణాన్ని 100 పి.పి.యం తయారు చేసి, దానితో విత్తన శుద్ధి చేయాలి. పై రెండు చర్యల ద్నారా నారుకుళ్ళు మరియు నల్లకుళ్ళు తెగులును నివారించవచ్చు.

నారుకుళ్ళు తెగులు లేదా మొదలుకుళ్ళు తెగులు :

నారు మొక్కల కాండపు మొదళ్ళు మెత్తగా తయారై కుళ్ళి, వడలిపోయి చనిపోతాయి. దీని నివారణకు ఎత్తైన నారుమళ్ళపై లేదా ప్రోట్రేల్లో నారును పెంచాలి.  విత్తనం పలుచగా, వరుసల్లో వేయాలి. ఎక్కువ నీటిని (ముఖ్యంగా సాయంత్రం వేళలో) ఇవ్వరాదు. నారు మొలిచిన తరువాత 3 గ్రా. కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. లేదా బోర్డాక్స్‌ మిశ్రమం ఒక శాతం లేదా మాంకోజెబ్‌ 64 శాతం + మెటలాక్సిల్‌ 8 శాతం మందుని 3 గ్రా. / లీ. నీటికి కలిపి మొక్క మొదళ్ళలో పోయాలి.

నల్ల కుళ్ళు తెగులు :

ఈ తెగులు పంట ఏ దశలోనైనా ఆశించవచ్చు. ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి 'హ' ఆకారంలో ఉన్న మచ్చలు ఏర్పడతాయి. ఈనెలు నల్లగా మారతాయి. ఏదైనా నూనెగింజల పంటతో 3 సం|| పాటు పంటమార్పిడి చేయాలి. (స్రెష్టోసైకిన్‌ (1 గ్రా. / 10 లీ. నీటికి) మందుతో విత్తన శుద్ధి చేయాలి. ఇదే మందును (50 మి.గ్రా. /లీ. నీటికి) నారు నాటినప్పుడు, గడ్డ తయారువుతున్నప్పుడు పైరుపై పిచికారి చేయాలి. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ (3 గ్రా. /లీ.) నీటిడి మందు ద్రావణంతో మొక్కల మొదళ్ళ చుట్టూ తడపాలి. లేదా (స్టెష్టోసైక్షిన్‌ 1 గ్రా. + కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ 30 గ్రా. 10 లీ. నీటిడి కలిపి వాడాలి. ఎకరాకు 6 కిలోల బ్లీచింగ్‌ పౌడర్‌ను భూమిలో వేయాలి.

ఆల్టర్నేరియా ఆకుమళ్ళ తెగులు :

ఆకు పైభాగంలో ఊదా రంగు, గోధుమ రంగులో గుండ్రంగా మచ్చలు ఏర్పడతాయి. ఇవి క్రమంగా వలయాకారంలో పెరిగి చివరకు ఆకులు ఎండి రాలిపోతాయి. తెగులు సోకిన ఆకులను వెంటనే తొలగించాలి. ముఖ్యంగా క్రింది భాగంలోని ఆకులను ఉదయం పూట తాలగించి రాల్చివేయాలి. కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ 3 గ్రా. లేదా మాంకోజెబ్‌ 2.5 గ్రా. /లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉధతి ఎక్కువగా ఉందే ట్రిబ్యుకొనజోల్‌ 1 మి.లీ. 1 లీ. నీటికి లేదా ట్రిబ్యుకొనజోల్‌ (50 శాతం) + టైఫ్లోస్రోవిన్‌ (25 శాతం) మందుని 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

కోత కోయడం :

తగిన పరిమాణం వరకు ఎదిగిన గడ్డలను కోయాలి. గట్టిగా మరియు లేతగా ఉన్న గడ్డలను కోసుకోవాలి. కోత ఆలస్యమైతే గడ్డలు వదులుగా అయిపోతాయి. ఇలాంటి వాటికి మార్కెట్‌లో డిమాండ్‌ లేక తక్కువ ధర పలుకుతాయి. గడ్డలను చల్లని సమయంలో కోసి, గ్రేడింగ్‌ చేసి మార్కెట్‌కు పంపాలి.

దిగుబడి :

మంచి యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా ఎకరాకు 20 టన్నుల దిగుబడిని పొందవచ్చు.

రచయిత సమాచారం

బి. శివ, జి. వీరన్న, కషీ విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం, ఫోన్‌ : 7795708099, 9014393173