Print this page..

వ్యవసాయ ఉత్పత్తుల ప్రాథమిక ప్రాసెసాంగ్‌ ద్వారా స్వయం ఉపాధి

రైతులు తాము కష్టపడి పండించిన పంటను ఎటువంటి విలువ జోడింపు లేకుండా కల్లాల్లోనో లేక మార్కెట్లోనో అమ్ముకోవడం వల్ల ఒక్కో సారి కనీస పెట్టుబడి కూడా లేక గిట్టుబాటు కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరో పక్క వివిధ పంటల సాగు విస్తీర్ణం మరియు ఉత్పాదకతలలో హెచ్చుతగ్గుల వల్ల మరియు వాతావరణ ప్రతికూలతలు ఏర్పడినప్పుడు కొన్ని ఆహార ధాన్యాలకు అధిక డిమాండ్‌ ఏర్పడి వాటి రేటు గణనీయంగా పెరుగుతుంది. ఈ విధంగా గిరాకీ పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద వ్యాపారస్తులు దళారుల ద్వారా పెద్ద మొత్తంలో రైతుల నుండి తక్కువ ధరకే సేకరించి, వాటిని నిల్వ చేసి, కొంత ప్రాసెసింగ్‌ చేసి వినియోగదారులకు అందించడం ద్వారా లాభాలు గడిస్తున్నారు. కాని వాటిని పండించే రైతులకు మాత్రం ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదు. గతంలో పప్పుధాన్యాలు మరియు పప్పుల ధరలు ఇందుకు మంచి ఉదాహరణ. దీన్ని దృష్టిలో  ఉంచుకొని కోత అనంతరం ఎక్కడ పండిన ఆహార ధాన్యాలను శుద్ధి చేసి అక్కడే వినియోగదారుడికి చేరే విధంగా చేయుటకు ప్రాసెసింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్న ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 

గ్రామాల్లో ఉన్న చిన్న సన్నకారు రైతులు వారు పండించిన వ్యవసాయ ఉత్పత్తి నుండి ప్రారంభించి పంటకోత అనంతరం సాంకేతిక విధానాలను, ప్యాకేజింగ్‌, రవాణా మరియు మార్కెటింగ్‌ను కలిగి ఉన్న విలువ జోడింపు ప్రక్రియల కూర్పు విధానాన్ని ఏర్పాటు చేయగలిగితే రైతులు వారి ఆదాయాన్ని మెరుగు పరచుకోగలిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పప్పుధాన్యాలు, తృణధాన్యాలు మరియు నూనెగింజల కోత అనంతర విధాన ప్రక్రియలు (ప్రాసెసింగ్‌) ప్రధానంగా ప్రైవేటు రంగం చేత నిర్వహించబడుతుంది. గ్రామ స్థాయిలో సమర్థవంతమైన చిన్న ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పినట్లుయితే తక్కువ ధరలకు మధ్యవర్తులకు విక్రయించవలసిన అవసరం ఉండదు. తద్వారా రవాణా ఖర్చులు అదా అవడమే కాకుండా నిల్వలో వ్యవసాయ ఉత్పత్తుల నష్టాన్ని నివారించడం ప్రాసెస్‌ చేసిన పదార్థాల ధరలను స్థిరీకరించగలగడంతో పాటు రైతులకు రెట్టింపు ఆదాయాన్ని పొందే అవకాశం కలుగుతుంది. గ్రామీణ యువత పట్టణ ప్రాంతాలకు తరలిపోకుండా పల్లె ప్రాంతాల్లోనే చిన్న ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పరిశ్రమగా అభివృద్ధి చేయవచ్చు. ఈ విధంగా వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని వృద్ధిలోకి వస్తున్న కొందరి ఔత్సాహిక రైతు వ్యవస్థాపకుల విజయగాథను దిగువన ఉదహరించబడింది. 

కొత్తరెడ్డిపాలెం వాస్తవ్యులు, చెబ్రోలు మండలం, గుంటూరు జిల్లాకు చెందిన గాదె వినయభూషణ రెడ్డి వ్యవసాయ యాంత్రీకరణపై తనకు ఉన్న మక్కువతో ముందుగా పిండి మరలను ఏర్పాటు చేసుకొని ఊరిలో పండే ఆహార ధాన్యాలను శుద్ధి చేయడానికి ఆగ్రో ప్రాసెసింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. రైతు కుటుంబానికి కావలసిన ఒకటి, రెండు బస్తాల వరి ధాన్యాన్ని మరాడించుటకు పెద్ద మిల్లుల్లో సాధ్యం కాదు. ఇందుకొరకు ఎక్కువ సమయం వృధా కావడంతో పాటు బియ్యం రికవరీ మరియు పాలిషింగ్‌ తమ అభిరుచికి కావలసిన విధంగా ఉండక పోవడంతో చిన్న తరహా రైస్‌ మిల్లుల వైపు దృష్టి సారించడం జరిగింది. ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం మరియు వ్యవసాయ శాఖ వారు వివిధ స్థాయిల్లో ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్ర ప్రదర్శనలు మరియు శాస్త్రవేత్తల సూచనల మేరకు వివిధ మినీ రైస్‌ మిల్లుల మరియు మొబైల్‌ రైస్‌ మిల్లుల గురించి తెలుసుకోవడం జరిగింది. వారి సూచనల మేరకు తక్కువ పరిమాణంలో ధాన్యాన్ని ప్రాసెసింగ్‌ చేసుకోగలిగి ఇంటిదగ్గరే అందరికీ అందుబాటులో ఉండే విధంగా మొబైల్‌ రైస్‌ మిల్లులను తెప్పించుకొని తాను పండించిన పంటతో పాటుగా ఊరిలో ఉండే మిగతా రైతుల ధాన్యాన్ని కూడా ప్రాసెంసింగ్‌ చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. ప్రజల్లో ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన దృష్ట్యా ముడిబియ్యాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీని ద్వారా ఎవరికి కావలసిన విధంగా వారు బియ్యాన్ని మరాడటానికి ఆస్కారం కలదు. అదేవిధంగా ఈ రైస్‌ మిల్లుకు అదనంగా డి-స్టోనర్‌ (మట్టిగడ్డలు వేరుపరచుటకు) మరియు గ్రేడర్‌ (ధాన్యంను బియ్యం నుండి వేరుచేయుటకు)లను జతకలిపి ట్రాక్టర్‌ పి.టి.ఓ షాప్ట్‌ సహాయంతో పనిచేసే విధంగా ఏర్పాటు చేసుకొని చిరుధాన్యాలను (కొర్రలు, అండుకొర్రలు) సైతం 3-4 దఫాలుగా శుద్ధి చేసి బియ్యంగా మార్చి కేవలం ఒక మనిషి (రైతు వినియోగదారుడు) సహాయంతో ఈ మొత్తం ప్రాసెసింగ్‌ చేసుకొని లాభాలను ఆర్జిస్తున్నారు. 

ఈ రైతు ఉత్తర ప్రదేశ్‌ నుండి ఈ మొబైల్‌ రైస్‌ మిల్లులను రూ. 2.40 లక్షలకు కొని తన గ్రామానికి రవాణా చేయుటకు అదనంగా రూ. 70,000 ఖర్చు చేయడం జరిగింది. ట్రాక్టరు పి.టి.ఓ షాప్ట్‌ సహాయంతో నడిచే ఈ మొబైల్‌ రైస్‌ మిల్‌ సగటున క్వింటాల్‌కు అరలీటర్‌ డీజిల్‌ ఇంధనం అవసరం పడుతుంది. ఈ రైస్‌మిల్‌ ద్వార క్వింటాల్‌కు 60 కిలోల ముడిబియ్యాన్ని లేదా 50 కిలోలు పాలిష్‌ చేయబడిన బియ్యాన్ని గాని పొందవచ్చు. సంవత్సరానికి మొత్తం ఖర్చులు పోను రూ. 80,000 నుండి లక్ష వరకు లాభం గడిస్తూ ఇతర రైతులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. మొబైల్‌రైస్‌ మిల్లుకు అదనంగా అవసరమైన డి-స్టోనర్‌ను రూ. 45,000కు గ్రేడర్‌ మరియు జల్లెడలను రూ. 40,000 లకు కొని వరి ధాన్యాన్ని శుద్ధి చేయడంతో పాటుగా చిరుధాన్యాలను శుద్ధి చేస్తున్నారు. సంవత్సరానికి నిర్వహణ ఖర్చుల నిమిత్తం సుమారు రూ. 3500-6000 వరకు ఖర్చు అవుతుంది. 

అదే గ్రామానికి చెందిన వి. వెంకట్రావు గారు పి.కె.వి. దాల్‌ మిల్లును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ సహాయంతో మహారాష్ట్ర నుండి పి.కె.వి. దాల్‌మిల్లు కొనుగోలు చేసుకొని దానికి తగిన షెడ్‌ను నిర్మించుకొని మినుములు, కందులు, శనగలను ప్రాసెసింగ్‌ చేస్తున్నారు. ఈ మిల్లు ద్వారా పప్పు రికవరీ సుమారుగా 65-70 శాతం వరకు వస్తున్నది. ఈ విధంగా అపరాలను ప్రాసెసింగ్‌ చేసుకొని తన స్వంత వ్యవసాయానికి అదనంగా రాబడి పొందుతున్నారు. వీరి యొక్క ఈ వినూత్న ఆలోచన మరియు కార్యాచరణ ఈ ప్రాంతంలోని గ్రామీణ యువత, రైతులు మరియు వర్ధమాన వ్యస్థాపకులకు కూడా అనుసరణీయం. మరింత సమాచారం కొరకు రైతులు వినయభూషణ రెడ్డి, ఫోన్‌ : 8074765385,వి. వెంకట్రావు, ఫోన్‌ : 7416497215.

రచయిత సమాచారం

వాసుదేవ రావు, ఎస్‌.వి.ఎస్‌ గోపాలస్వామి, ఎస్‌. విష్ణు వర్ధన్‌, డి. సందీప్‌ రాజా, బి. జాన్‌ వెస్లీ, పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీ సెంటర్‌, బాపట్ల, ఫోన్‌ : 8520989487