Print this page..

రబీ నారుమడుల్లో చలితో జాగ్రత్త!

రబీలో రైతులు ఎక్కువగా దొడ్డు గింజ రకాల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల మరియు నీటి లభ్యత దష్ట్యా స్వల్పకాలిక రకాలు (120-130 రోజులు), కూనారం సన్నాలు (కె.ఎన్‌.ఎం-118), బతుకమ్మ (జె.జి.యల్‌-18047), ఎం.టి.యు -1010 (కాటన్‌ దొర సన్నాలు ), ఐ.ఆర్‌- 64, భద్రకాళి (డబ్ల్యూ. జి. ఎల్‌ 13962), జగిత్యాల రైస్‌ -1 (జె.జి .యల్‌ 24423), తెల్ల హంస, ఎం.టి. యు -1156, ఎం.టి. యు - 1153 వంటి రకాలను సాగు చేసుకోవచ్చు. చలి ఉధతిని బట్టి పంటకాలం 10-15 రోజుల వరకు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల చలి ప్రభావం నారు మళ్ల పై  పడకుండా ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

 • చలికి తట్టుకొనే రకాలను ఎంపిక చేసుకోవాలి. 
 • నారు మడిలో మండే కట్టిన విత్తనాలను వేయడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. 
 • నారు పోసుకునే ముందు నారు మడికి  సరిపడే 2 క్వింటాళ్ల బాగా మాగిన పశువుల ఎరువు లేదా కోళ్ల ఎరువు మరియు 1 కిలో జింక్‌ సల్ఫేట్‌ తప్పనిసరిగా వేసుకోవాలి. 
 • భాస్వరాన్ని రెట్టింపు మోతాదులో వేసుకోవాలి. 
 • రాత్రి పూట నారు మడిలో  నీరు లేకుంటే చలి ప్రభావం మొక్కలపై తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం, పగటి పూట వెచ్చని నీటిని పెట్టి సాయంత్రం తీసివేయాలి. 
 • చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నారు మడి చుట్టు ఒక అడుగు ఎత్తులో పలుచటి పాలిథీన్‌షీట్‌ లేదా ఖాళీ ఎరువుల సంచులతో కుట్టిన పట్టాలను సాయంత్రం వేళలో కప్పి ఉదయం పూట తీసివేయాలి.
 • రాత్రి ఉష్ణోగ్రతలను 100 సెం. కంటే తగ్గినప్పుడు, చలి తీవ్రత పెరిగి నారు ఎర్రబడటం, సరిగ్గా ఎదగకపోవటం, పంటకాలం పెరిగిపోవటం పోషకలోపాలు ముఖ్యంగా జింక్‌ లోపలక్షణాలు కనిపించే అవకాశం ఉంది. 
 • ఈ జింక్‌ లోపంవల్ల ఆకులపై తుప్పు మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు గాను లీటరు నీటికి 2 గ్రా. జింక్‌ సల్ఫేట్‌ కలిపి పిచికారీ చేయాలి. 
 • చలితీవ్రత మరి ఎక్కువగా ఉంటె స్వర్ణఫల్‌ లేదా ఫార్ములా 4 వంటి సూపోషకాల మిశ్రమాన్ని 5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. 
 • కాండం తొలిచే పురుగు బారినుండి నారును కాపాడుకోవడానికి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారు మడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలు వేయాలి. 
 • చలి తీవ్రత ఎక్కువగా ఉంటే అగ్గి తెగులు ఆశించే అవకాశం  ఉన్నందున ముందు జాగ్రత్తగా లీటరు నీటికి 0.6 గ్రాముల ట్రైసైక్లోజోల్‌ను కలిపి పిచికారీ చేయాలి.

పైన వివరించిన పద్ధతులను రైతులు పాటిస్తే ఆరోగ్యవంతమైన నారు పెంచుకొని తద్వారా అధిక దిగుబడులను సాదించవచ్చు.

రచయిత సమాచారం

సి. శుభలక్ష్మి, (అగ్రానమి), డి. అనిల్‌, శాస్త్రవేత్త (అగ్రానమి), జి.రంజిత్‌ కుమార్‌, (సాయిల్‌ సైన్స్‌& అగ్రికల్చరల్‌ కెమిస్ట్రీ), జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ, హైదరాబాద్‌