Print this page..

పుదీనా సాగు చేసే విధానం - యాజమాన్య పద్ధతులు

ఆకు కూరల్లో పుదీనా ఒకటి. ఇది ఔషధ మొక్క. దీన్ని ఆంగ్లంలో మింట్‌ అని పిలుస్తారు. ఇది లాబియేటి కుటుంబానికి చెందింది. దీని ఆకులను ఎక్కువగా సువాసన కోసం, సుగంధదవ్య్రంగాను, పచ్చళ్ళలోను, సలాడ్‌ల తయారీలోనూ, ఉపయోగిస్తారు. ఆకుకూరగానే కాక పుదీనా నుండి నూనెను తీసి పలురకాలుగా వాడుతుంటారు. దీనికి సంవత్సరమంతా మంచి డిమాండ్‌ ఉంటుంది. 

పుదీనా మొక్క సుమారు 40 సెం.మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. ఆకులు గుండ్రంగా, ఆకుల పైభాగం మందంగా ముదురాకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ మొక్క నుండి కొమ్మలు ఆకుకూర కోసం త్వరత్వరగా కత్తిరిస్తుండడం వల్ల పూత సాధారణంగా రాదు. ఇందులో ''మెంథాల్‌'' అనే సుగంధ నూనె అతి తక్కువ పరిమాణంలో  ఉంటుంది. కానీ ''కార్వోన్‌'' అనే సుగంధ ద్రవ్య పదార్థం ఎక్కువగా ఉండి, సువాసనను, ప్రత్యేకమైన రుచిని కలిగిస్తుంది. 

పుదీనా కాండం నుండి తీసే నూనెను ''మెంథాల్‌'' అంటారు.మెంథాల్‌ను ఎక్కువగా వివిధ ఔషధాల తయారీలోనూ, షేవింగ్‌, టూత్‌పేస్టుల తయారీలోనూ విరివిగా వాడుతున్నారు. 

పుదీనా ఆకు ప్రయోజనాలు : 

  • పొట్ట నొప్పిని తగ్గించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. 
  • పుదీనా చాయ్‌ తాగితే మలబద్ధకం పోయి, పొట్ట శుభ్రపడడం, చర్మ సంబంధిత మొటిమలు నివారించబడతాయి. 
  • పుదీనా శరీరంలోని మలినాలను విసర్జిస్తుంది. 
  • పుదీనా ఆకులు చర్మానికి చల్లదనాన్ని ఇచ్చి, చర్మం మంటను పోగొడతాయి. 
  • పుదీనా శరీర రక్తాన్ని కూడా శుభ్రపరుస్తుంది. 
  • పుదీనా ఆకులను పేస్ట్‌ చేసి వాడితే దంతాలు తెల్లగా మెరిసిపోతాయి. చెడు శ్వాస నివారించబడుతుంది. 

రకాలు : 

పుదీనాలో ప్రధానంగా నాలుగు రకాలున్నాయి. మెంథాల్‌ కోసం సాగు చేసే పుదీనా రకాలు 

  1. జపనీస్‌ మింట్‌
  2. స్పియర్‌ మింట్‌
  3. పెప్పర్‌ మింట్‌
  4. బెర్గామాట్‌ మింట్‌. 

జపనీస్‌ మింట్‌ రకాలు :

మాస్‌-1 (ఎమ్‌.ఎ.ఎస్‌-1), హైబ్రిడ్‌-77 శివాలిక్‌ 

స్పియర్‌ మింట్‌ రకాలు :

ఎమ్‌.ఎస్‌.ఎస్‌-1, ఎమ్‌.ఎస్‌.ఎస్‌-5, పంజాబ్‌ స్పియర్‌ మింట్‌-1

బెర్గమాట్‌ మింట్‌ :

కిరణ్‌

పెప్పర్‌ మింట్‌ :

కుక్రెల్‌

వాతావరణం :

పుదీనా సాగుకు సమశీతోష్ణ, ఉష్ణప్రాంతాలు అనువైనవి. ఉష్ణోగ్రత 20-250 సెం. ఉంటే ఆకు నాణ్యత బాగుంటుంది. నూనెకోసం అయితే ఎత్తైన చల్లని ప్రాంతాలు సాగుకు అనుకూలం. ఉష్ణోగ్రత 300 సెం. కన్నా ఎక్కువగా ఉంటే నూనెశాతం పెరుగుతుంది. 

నేలలు :

సారవంతమైన అధిక సేంద్రియ పదార్థాలు గల తేలికపాటి ఇసుక నేలల నుండి మురుగునీరుపోయే వసతిగల తేలికపాటి ఒండ్రు నేలలు అనుకూలం. నీరు నిలిచే నల్లరేగడి నేలలు పనికిరావు. ఉదజని సూచిక (పి.హెచ్‌) 6.5 - 8.0 వరకు ఉన్న నేలలో కూడా పుదీనా పెరుగుతుంది. 

విత్తనం : 

పుదీనా కాండం, ముక్కలుగా నాటుకోవడం ద్వారా సాగు చేసుకోవచ్చు. వేరుతో గల కాండం ముక్కలు 4-5 సెం.మీ. పొడవుతో 2-3 కణుపులు కలిగిన ముక్కలు ఎన్నుకోవాలి. ఎకరాకు 3-4 క్వింటాళ్ళ కాండం ముక్కలు అవసరం అవుతాయి. 

విత్తన శుద్ధి : 

కాండం ముక్కలను కార్బండిజమ్‌ 1 గ్రా. / లీటరు నీటికి లేదా కాప్టాన్‌ 3 గ్రా. లేదా కాపర్‌ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రా. / లీటరు నీటికి కలిపిన ద్రావణంలో 10 నిమిషాలు ఉంచి నాటుకోవడం వల్ల వేరుకుళ్ళును అరికట్టవచ్చు. 

నాటే విధానం : 

వరుసల మధ్య 30-45 సెం.మీ. దూరం వరుసలో రెండు మొక్కల మధ్య 10 సెం.మీ. దూరం ఉండేటట్లు 1-2 సెం.మీ. లోతులో ఒక కణుపు తప్పనిసరిగా భూమిలో ఉంటేటట్లు నాటాలి. 

నాటే సమయం : 

ఆకు కూర కోసం సంవత్సరం పొడవునా నాటుకోవచ్చు. నూనె కోసం సాగు చేస్తే నవంబరు 15 నుండి డిసెంబరు 15 లోపు నాటుకోవాలి. లేకపోతే నూనె దిగుబడి తగ్గుతుంది. 

ఎరువులు : 

ఆఖరి దుక్కిలో ఎకరాకు 4-5 టన్నుల పశువుల ఎరువు20 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్‌లనిచ్చే ఎరువులను వేసుకోవాలి. 

నీటి యాజమాన్యం : 

పుదీనా వేర్లు ఎక్కువగా నేలపైనే ఉంటాయి. కనుక వెంట వెంటనే తేలికపాటి తడులు ఇవ్వవలసి ఉంటుంది. నేల స్వభావాన్ని బట్టి శీతాకాలంలో 8-12 రోజులు, వేసవిలో 3-4 రోజులకొకసారి నీరుపారించాలి. 

అంతరకృషి : 

నాటిన 25, 50 రోజులకు రెండు సార్లు కలుపుతీయాలి. 50 రోజుల తరువాత మొక్కల పెరుగుదల ఎక్కువగా ఉండి కలుపుతీత కష్టమవుతుంది. మొదటికోత తరువాత మళ్ళీ ఒకసారి కలుపుతీయాలి. 

సస్యరక్షణ, పురుగులు : 

ఆకు కూరకోసం సాగుచేస్తున్నప్పుడు వీలైనంత వరకు ఎలాంటి క్రిమిసంహారక మందులు వాడకపోవడం మంచిది లేదా వేప సంబంధిత క్రిమి సంహారకాలను ఉపయోగించడం శ్రేయస్కరం. తప్పనిసరైతే ఆకుతినే పురుగుల నివారణకు మలాథియాన్‌ 2 మి.లీ. లేదా నువాన్‌ 2 మి.లీ. / లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 

తెగుళ్ళు : 

పుదీనాలో తెగుళ్ళ సమస్య తక్కువగానే ఉంటుంది. నేల ద్వారా సంక్రమించే కాండం కుళ్ళును అరికట్టడానికి పంట మార్పిడిని పాటించాలి. పుదీనాను మొక్కజొన్న, ఆలుగడ్డ, వరి, చిరుధాన్యాపు లాంటి పంటలతో పంట మార్పిడి చేయాలి. కాండం కుళ్ళు నివారణకు ''విత్తనశుద్ధి'' కూడా పాటించాలి. ఆకుమాడు తెగులు నివారణకు కాపర్‌ఆక్సీక్లోరైడ్‌ (బ్లైటాక్స్‌) 3.0 గ్రా. / లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 

వేసవిలో ఎండు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు మాగిన పశువుల ఎరువు 70 కిలోలకు, 2 కిలోల ట్రైకోడెర్మావిరిడి మరియు 10 కిలోల వేపపిండి కలిపి, నీళ్ళు చల్లి వారం రోజులు మాగనిచ్చిన తరువాత ఆఖరి దుక్కిలో వేసి ఈ తెగులును అరికట్టవచ్చు. పంటమార్పిడి తప్పనిసరిగా పాటించాలి. 

కోత : 

నాటిన 3 నెలలకు మొదటికోత వస్తుంది. మొదటి కోతలో మొక్కల మొదళ్ళను 4-5 సెం.మీ. వదలిపెట్టి కోయాలి. రెండవ కోత (అంటే నెల తరువాత) భూమికి దగ్గరగా కోయాలి. 

దిగుబడి : 

రెండు కోతల్లో ఆకు దిగుబడి ఎకరాకు 10-12 టన్నులు వస్తుంది. నూనె దిగుబడి ఎకరాకు 65-70 కిలోలు వస్తుంది. 
 

రచయిత సమాచారం

యన్‌. తేజస్విని, శ్రీ కొండా లక్ష్మణ్‌, తెలంగాణా రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌, ఫోన్‌ : 8106549944