Print this page..

మాఘీ జొన్న రకాలు - యాజమాన్య పద్ధతులు

జొన్న పంటను ఆహారంగా, పశుగ్రాసంకోసం మన దేశంలో వర్షాధార పంటగా సాగు చేస్తారు. భారతదేశంలో పండించే ఆహారపంటల్లో జొన్న నాల్గవ స్థానంలో ఉంది. ఒకప్పుడు విస్తారంగా పండించే జొన్న పంట ఇటీవల రైతులు తక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నారు. దీనికి గల కారణాలు, మార్కెట్‌ లో సరైన ధర లేకపోవడం, సరైన యాజమాన్య పద్ధతులను అవలంబించలేకపోవడం వంటి విషయాలు పేర్కొనవచ్చు. మాఘీ జొన్న ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు (53,300 హె.), గుంటూరు (34,400 హె.), అనంతపురం (22,900 హె) మరియు కడప (12,200 హె.) జిల్లాల్లో విస్తారంగా సాగు చేస్తున్నారు.  

మాఘీ జొన్నలో దిగుబడులు పెంచటానికి రైతులు మేలైన రకాలు/సంకరాల లక్షణాలను తెలుసుకోవటం చాలా అవసరం. దీనితో పాటు మాఘీ జొన్న సాగు చేయడంలో సరైన యాజమాన్య పద్ధతులను ఉపయోగించటంపై అవగాహన ఎంతో అవసరం.

సూటి రకాలు :

ఎన్‌.టి.జె-1

పంట కాలం : 105-110 రోజులు

దిగుబడి : 10-12 క్విం. / ఎకరానికి

గుణగణాలు : బెట్టను తట్టుకుంటుంది, గింజలు సులభంగా రాలుతాయి.

ఎన్‌.టి.జె-2

పంట కాలం : 95-100 రోజులు

దిగుబడి : 12-14 క్విం. / ఎకరానికి

గుణగణాలు : పంట త్వరగా కోతకు వస్తుంది, బెట్టను తట్టుకుంటుంది, గింజలు లావుగా తెల్లగా మెరుస్తుంటాయి, రొట్టెలు రుచిగా ఉంటాయి.

ఎన్‌.టి.జె-3

పంట కాలం : 100-105 రోజులు

దిగుబడి : 12-14 క్విం. / ఎకరానికి

గుణగణాలు : బెట్టను, ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది, పైరు పడిపోదు, నల్ల కాండం కుళ్ళు తెగులును తట్టుకుంటుంది.

ఎన్‌.టి.జె-4

పంట కాలం : 90-100 రోజులు

దిగుబడి : 13-15 క్విం. / ఎకరానికి

గుణగణాలు : పైరు పడిపోదు, నల్ల కాండం కుళ్ళు తెగులును తట్టుకుంటుంది, గింజలు నాణ్యత కలిగి ఉంటాయి.

ఎన్‌.టి.జె-5

పంట కాలం : 105 రోజులు

దిగుబడి : 14-15 క్విం. / ఎకరానికి

గుణగణాలు : పొట్టి తెల్ల జొన్న రకం, గింజలు తెల్లగా మెరుస్తుంటాయి, పడిపోదు బెట్టను తట్టుకుంటుంది, నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి ఇటీవలే విడుదలైన రకం.

ఎన్‌.టి.జె-13

పంట కాలం : 95-100 రోజులు

దిగుబడి : 7-18 క్విం. / ఎకరానికి

గుణగణాలు : ఇది తీపి జొన్న, బెట్టను తట్టుకుంటుంది, చొప్ప నాణ్యత కలిగి ఉంటుంది, జొన్న దిగుబడి ఎక్కువ, జొన్న మల్లెను తట్టుకొనగలదు, గింజలు పచ్చగా ఉంటాయి.

ఎన్‌-14

పంట కాలం : 105-110 రోజులు

దిగుబడి : 10-12 క్విం. / ఎకరానికి

గుణగణాలు : గింజలు పచ్చగా ఉంటాయి, కంకి పెద్దగా, ముద్దగా ఉంటుంది, బెట్టను తట్టుకుంటుంది.

ఎన్‌-15

పంట కాలం : 115-120 రోజులు

దిగుబడి : 10-12 క్విం. / ఎకరానికి

గుణగణాలు :  ధిక గింజ మరియు చొప్ప దిగుబడినిచ్చు పచ్చ జొన్న రకం, చొప్ప నాణ్యత కలిగి ఉంటుంది, జొన్న మల్లెను, బెట్టను తట్టుకుంటుంది, రొట్టెలు రుచిగా ఉంటాయ, నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి ఇటీవల విడుదలైన పచ్చ జొన్న రకం.

ఎమ్‌-35-1

పంట కాలం : 115-120 రోజులు

దిగుబడి : 10-12 క్విం. / ఎకరానికి

గుణగణాలు : గింజ మరియు చొప్ప నాణ్యత కలిగి ఉంటుంది, మొవ్వు చంపు ఈగ, కాండం కుళ్ళు తెగులును కొంత వరకు  తట్టుకుంటుంది, చొప్ప దిగుబడి ఎక్కువ.

కిన్నెర

పంట కాలం : 110-115 రోజులు

దిగుబడి : 10-12 క్విం. / ఎకరానికి

గుణగణాలు : గింజ మరియు చొప్ప నాణ్యత కలిగి ఉంటుంది, మొవ్వు చంపు ఈగ, కాండం కుళ్ళు తెగులును కొంత వరకు  తట్టుకుంటుంది, చొప్ప దిగుబడి ఎక్కువ.

సి.ఎస్‌.వి. 29 ఆర్‌ 

పంట కాలం : 115-120 రోజులు

దిగుబడి : 10-12 క్విం. / ఎకరానికి

గుణగణాలు : పొడవు తెల్ల జొన్న రకం, మొవ్వు ఈగ, కాండం తొలచు పురుగులను తట్టుకుంటుంది.

సంకర రకాలు :

సి.ఎస్‌.హెచ్‌ - 16

పంట కాలం : 105-110 రోజులు

దిగుబడి : 15-17 క్విం. / ఎకరానికి

గుణగణాలు : ఆకు మచ్చ తెగులును తట్టుకుంటాయి, మొవ్వు చంపు ఈగను, గింజ బూజు తెగులును తట్టుకుంటాయి, గింజలు నాణ్యత కలిగి ఉంటాయి.

సి.ఎస్‌.హెచ్‌ - 25

పంట కాలం : 105-110 రోజులు

దిగుబడి : 15-18 క్విం. / ఎకరానికి

గుణగణాలు : ఆకు మచ్చ తెగులును తట్టుకుంటాయి, మొవ్వు చంపు ఈగను, గింజ బూజు తెగులును తట్టుకుంటాయి, గింజలు నాణ్యత కలిగి ఉంటాయి.

నేల తయారీ : 

లోతైన నల్లరేగడి భూములు అనుకూలం. నేలను 2-3 సార్లు నాగలి తో లేక ట్రాక్టరు తో దున్ని బాగా చదను చేసుకోవాలి

విత్తు సమయం : 

సెప్టెంబర్‌ మొదటి వారంలో విత్తుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చు.

విత్తన మోతాదు, విత్తడం : 

ఎకరాకు 3-4 కిలోల విత్తనం సరిపోతుంది. వరుసల మధ్య 45 సెం.మీ. మొక్కల మధ్య 12-15 సెం.మీ. దూరంలో గోర్రుతో విత్తుకోవాలి. మొలకెత్తిన 10-12 రోజుల తరువాత ఒత్తుగా ఉన్న మొక్కలను తీసివేయాలి.

విత్తన శుద్ధి : 

వివిధ రకాల తెగుళ్ళ నివారణకు ఒక కిలో విత్తనానికి 3 గ్రా. ధైరం/కేప్టాన్‌తో విత్తనశుద్ధి చేయాలి. మొవ్వు తొలచు ఈగను నివారించటానికి కిలో విత్తనానికి 3 గ్రా. థయోమిథాక్సేమ్‌తో విత్తన శుద్ధి చేయాలి.

ఎరువుల వాడకం : 

ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. వర్షాధార పంటకు ఎకరాకు 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్‌ ఇచ్చు ఎరువులను విత్తేటప్పుడు వేయాలి. విత్తిన 40 రోజుల తరువాత ఎకరాకు 12 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులను రెండో దఫా పై పాటుగా వేయాలి. నీటి పారుదల పంటకు ఎకరాకు 16 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పోటాష్‌ ఇచ్చే ఎరువులను విత్తేటప్పుడు వేయాలి. విత్తిన 40 రోజుల తరువాత ఎకరాకు 16 కిలోల నత్రజని ఎరువును పైపాటుగా వేసి తరువాత నీటి తడి ఇవ్వాలి. 

సస్య రక్షణ : 

ఆలస్యంగా జొన్న పంటను విత్తినప్పుడు చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయి. కాబట్టి రైతులు సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటించడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు. జొన్న పంటలో ప్రధానంగా ఆశించే చీడపీడలలో కత్తెర పురుగు, మొవ్వు తొలుచు ఈగ, కాండం తొలుచు పురుగు, గింజ బూజు తెగులు మరియు నల్ల కాండం కుళ్ళు తెగులు ముఖ్యమైనవి. 

1. కత్తెర పురుగు : 

ఈ మధ్యకాలంలో కత్తెరపురుగు మొక్కజొన్నతో పాటు జొన్న పంటను కూడా ఆశించడం జరిగింది. దీని నివారణకు 20-30 రోజుల దశలో 5 శాతం వేపగింజ కాషాయాన్ని లేదా అజాడిరెక్టిన్‌ 1500 పి.పి.ఎం. అనే మందులను ఒక లీటరు నీటికి 5 మి.లీ. మందును కలిపి పిచికారి చేయాలి. 40-50 రోజుల దశలో విషపు ఎర (10 కిలోల తవుడు మరియు 2 కిలోల బెల్లం ను 2-3 లీటర్ల నీటిలో 24 గంటలు నానబెట్టి దీనికి 100 గ్రాముల ధయోడికార్బ్‌, పిచికారి చేసే 30 నిమిషాల ముందు కలుపుకోవాలి) లేదా స్పైనోశాడ్‌ అను మందును లీటరు నీటికి 0.3 మీ.లీ. లేదా క్లోరాంట్రాలినిప్రోల్‌ 18.5 శాతం ఎస్‌సి లీటరు నీటికి 0.3 మి.లీ. కలిపి 10-15 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.

2. మొవ్వు తొలుచు ఈగ : 

విత్తనం మొలకెత్తిన రోజు నుండి 30 రోజుల వరకు మాత్రమే ఈ పురుగు ఆశిస్తుంది. పురుగు ఆశించిన మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. మొవ్వుని లాగినప్పుడు సులువుగా వచ్చి కుళ్ళిపోయిన వాసన కలిగి               ఉంటుంది. పిలకలు అధికంగా వస్తాయి. దీని నివారణకు ఖరీఫ్‌లో పండించే జొన్నని జూలై 15 లోపే విత్తాలి. ఆలస్యంగా విత్తనం వేయవలసివస్తే, విత్తనమోతాదును పెంచుకోవాలి. కార్బోఫ్యురాన్‌ 3 జి గుళికలను  మీటరు సాలుకు 2 గ్రాముల వంతున విత్తెటప్పుడు సాళ్ళల్లో వేయాలి లేదా థయోడికార్బ్‌ 75 డబ్ల్యుపి 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్క మొలచిన 7, 14 మరియు 21 రోజుల్లో పిచికారి చేయాలి. 

3. కాండం తొలచు పురుగు : 

ఈ పురుగు పైరును 30 రోజుల తరువాత నుండి పంట కోసేవరకు ఆశిస్తుంది. ఆకుల పై గుండ్రని వరుస రంధ్రాలు ఏర్పడుతాయి. తెల్లకంకి ఏర్పడుతుంది. కాండాన్ని చీల్చి చూస్తే ఎర్రని కణజాలం కనపడుతుంది. దీని నివారణకు విత్తిన 35-40 రోజులలోపు ఎకరానికి 4 కిలోల కార్బోఫ్యురాన్‌ గుళికలను కాండపు సుడుల్లో వేయాలి.

4. పేనుబంక : 

దీని నివారణకు దైమిధోఎట్‌ లేదా మిథైల్‌ డేమటాన్‌ అనే మందుని ఒక లీటరు నీటికి 2 మి. లీ. కలిపి పిచికారి చేయాలి.

5. కంకి నల్లి : 

పిల్ల,పెద్ద పురుగులు గింజలు పాలు పోసుకునే దశలో రసం పీల్చటం వల్ల గింజలు నొక్కులుగా మారతాయి. కంకిలో కొన్ని గింజలే మంచి ఉంటాయి. గింజల మీద ఎరుపు మచ్చలు ఏర్పడి అవి క్రమంగా నల్లగా మారుతాయి. గింజలు గట్టి పడిన తర్వాత ఈ పురుగు ఆశించదు. దీని నివారణకు తొలి దశలోనే కంకి నల్లిగా గుర్తించి ఎకరాకు 8 కిలోల కార్బరిల్‌ 5 శాతం పొడిమందును కంకుల మీద చల్లాలి.

6. బంక కారు తెగులు : 

మొక్కలు పుష్పించే దశలో ఆకాశం మేఘావతమై చల్లని తేమతో కూడిన వాతావరణం తెగులుకు అనుకూలం. తెగులు సోకిన కంకుల నుండి తెల్లని లేదా గులాబీ రంగుతో కూడిన తియ్యట జిగురు వంటి ద్రవం కారడం గమనించవచ్చు. దీని నివారణకు 3 గ్రా. కాప్టాన్‌ లేదా థైరామ్‌ కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకోవాలి. లీటరు నీటికి 2.5 గ్రా. మ్యాంకోజేబ్‌ లేదా 1 గ్రా. బెన్లెట్‌ కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచ్చికారీ చేయాలి. 

7. గింజ బూజు తెగులు :

ఈ తెగులు వర్షాకాలంలో అధికంగా కనిపిస్తుంది. గింజలపై బూజు కనిపిస్తుంది. పూత మరియు గింజ గట్టిపడే సమయంలో వర్షాలు పడితే నష్టం అధికంగా ఉంటుంది. దీని నివారణకు ఒక లీటరు నీటికి 0.5 మి.లీ. ప్రొపినోకొనజోల్‌ మందును కలిపి పిచికారి చేయాలి. పంటకోత ఆలస్యం చేయకుండా, గింజ క్రింది భాగంలో నల్లని చార ఏర్పడినప్పుడు కంకులను కోయాలి.

8. నల్ల కాండం కుళ్ళు తెగులు : 

లేత మొక్కల్లో నేల దగ్గర ఉన్న కాండం రంగు కోల్పోయి, మొక్కలు వాడి ఎండిపోతాయి. తాలు గింజలతో కంకులు త్వరగా పక్వానికి వస్తాయి. కాండం లోపల డొల్లగా మారి విరిగిపోతాయి. దీని నివారణకు కాఫ్టాన్‌/కార్బెండిజిమ్‌ కిలో విత్తనానికి 3 గ్రా. కలిపి విత్తన శుద్ది చేసుకోవాలి.

పంటకోత : 

గింజ క్రింది భాగంలో నల్లటి చార ఏర్పడిన తరువాత పంటను కోయాలి. కంకి క్రింద వరుసలో ఉన్న గింజలు ఆకుపచ్చ రంగు నుండి తెల్లగా మారి గింజలో సున్న పాలు ఎండిపోయి పిండిగా మారినప్పుడు పంటను కోయాలి.

రచయిత సమాచారం

ఎస్‌.కె. సమీర, శాస్త్రవేత్త (సస్య ప్రజననం), ఎస్‌. అయిషా పర్వీన్‌, శాస్త్రవేత్త (సస్య ప్రజననం), టి. భాగవత ప్రియ, శాస్త్రవేత్త (సస్య విజ్ఞానం),  ఎన్‌. కామాక్షి, శాస్త్రవేత్త (కీటక శాస్త్రం), ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, నంద్యాల