Print this page..

పులుపు నిమ్మలో బదనికలు - వాటి యాజమాన్యం

లొరాంథస్‌ అనేది ఇటీవలి కాలంలో నిమ్మ చెట్లను ఆశించి ఎక్కువ నష్టాన్ని కలిగించే బదనిక మొక్క. నిమ్మలో ప్రధానంగా బంగారుతీగ మరియు లొరాంథస్‌ అనే రెండు రకాలైన పరాన్నజీవులు (బదనికలు) కనిపిస్తాయి. ఈ లొరాంథస్‌ అనే బదనిక కాండం, ఆకులు కలిగి వేరువ్యస్థ లోపించి ఉంటుంది. ఇది తెల్లగా, గుత్తులుగా ఉండే పూలను పూస్తుంది. దీని యొక్క ఆకులు కాని నిమ్మ మొక్కను పోలి ఉండి వెంటనే కనుగొనుట కష్టంగా ఉంటుంది. దీని ఎర్రని పండ్లని పక్షులు, పశువులు తిని విత్తనాలను ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చేస్తాయి. విత్తనాలు నిమ్మ కాండంపై మొలకెత్తి వాటి పాస్టోరియా అనే వేరు వంటి భాగాన్ని మొక్క కాండానికి చొప్పిస్తూ నీటిని కణిజ లవణాలను పీల్చుకుంటుంది. ఈ విధంగా మొక్క నుండి నీటిని ఖనిజ లవణాలను తీసుకోవడం వల్ల మొక్క బలహీన పడి తక్కువ దిగుబడికి కారణమవుతుంది. 4-5 సం|| తరువాత కొమకమలు ఎండిపోవడం, మొక్క పూర్తిగా చనిపోవడం జరుగుతుంది. 

నిమ్మ పరిశోధనా స్థానం పెట్లూరు శాస్త్రవేత్తలు వివిధ తోటలను సర్వే చేసినప్పుడు వీటి తీవ్రత ఎక్కువగా ఉండడం మరియు రైతులకు అధిక నష్టాలను కలుగచేయడం గమనించడమైంది. ఇది ఒక సామూహిక సమస్యగా గుర్తించి అరికట్టకపోతే అధిక నష్టం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పక్షుల ద్వారా త్వరగా వ్యాప్తిచెందే అవకాశం ఉంది. అందువల్ల దీన్ని పూత, కాయలు రాకముందే అరికట్టాలి.

లొరాంథస్‌ అనే బదనిక లొరాంథేసియా కుటుంబానికి చెందినది. దీన్ని సాధారణంగా బదనిక అని పిలుస్తుంటారు. దీని కాండం మరియు ఆకులు పెళుసుగా ఉంటాయి. ఇవి ఆకుపచ్చని ఆకులు కలిగి ఉండడం వల్ల ఇవి స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోగలవు. కాని దానికి కావలసిన నీటిని, ఖనిజలవణాలను ప్రధాన మొక్క నుండి తీసుకుంటాయి. ఇవి పోస్టోరియా అనే ప్రత్యేక వేరు వంటి భాగాలను కాండంలోనికి చొప్పించి తనకు కావలసిన నీటిని, ఖనిజలవణాలను తీసుకుంటాయి. ఈ పరాన్నజీవులు ముఖ్యంగా నమ్మతోపాటు పండ్ల మొక్కలైన మామిడి, సపోటా మరియు పనస వంటి వాటిని కూడా ఆశిస్తాయి. 

ఈ మొక్కల పండ్లు చిన్నవిగా ఉండి ఎరుపు వర్ణంలో బెర్రీస్‌ వలే ఉండి ఒక్కొక్క విత్తనాన్ని కలిగి ఉంటుంది. ఈ విత్తనాలు పక్షుల ద్వారా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాపిస్తాయి. ఇది ఎక్కడైతే మొక్క కాండానికి పట్టి ఉంటుందో అక్కడ బుడిప మాదిరిగా ఏర్పడుతుంది. 

ఇది ఆశించిన మొక్కలను గమనించినట్లయితే పెరుగుదల తక్కువగా ఉండటమేకాకుండా కాయల నాణ్యత మరియు సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. మూడు సంవత్సరాల తరువాత మొక్క క్షీణతకు గురై చనిపోవడం జరుగుతుంది. 

దీని నివారణకు ముందుగా ఆశించిన కొమ్మలను ఆశించిన బాగం నుండి 10 సెం.మీ. కింది వరకు కత్తిరించుకోవాలి. తరువాత కత్తిరించిన కొమ్మలకు బోర్బోపేస్టును పూయాలి. వీటి తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు చేతితో ఆ కొమ్మలను తీసివేసుకోవాలి. 1 శాతం ఎదిఫాన్‌ లేదా 60 శాతం డీజిల్‌ను ఎక్కువ పీడనం ఉండే స్ప్రేయర్స్‌తో రెండుసార్లు పిచికారి చేయాలి. 1 శాతం 2, 4-డి ద్రావణం తయారు చేసుకొని దాన్ని పూత పద్ధతిలో ఈ మందు ద్రావణంలో ముంచిన దూదిని ఎక్కడైతే బదనిక పెరుగుతున్న కొమ్మపైన బెరడును 0.5 సెం.మీ. చుట్టూ తీసివేసి ఈ మొదల్లో ఈ దూదిని అద్దాలి లేదా పూత లాగా పూయాలి.

రచయిత సమాచారం

డా|| యం. కవిత, సైంటిస్టు (ప్లాంట్‌ పాథాలజి), డా|| సి. మధుమతి, నిమ్మ పరిశోధనా స్థానం, పెట్లూరు, ఫోన్‌ : 9440478393