Print this page..

అఖండ భారత్‌లో అతివలకు రక్షణ ఏది?

తాటికాయ అంత అక్షరాలతో ఆకాశంలో సగం... భూమిపైనా సగం. 'యత్ర నార్యేస్తు పూజ్యంతే..రమంతే... తత్రదేవతా..' ఆధునిక స్త్రీవాదులు, సనాతన హిందూ ధర్మ ప్రవచనాలూ రెండూ కూడా మహిళ గొప్పతనాన్ని చాటుతూ, సాధికారత గురించి ఘనంగా చెబుతూనే ఉన్నాయి. కానీ ఆధునిక సమాజంలో స్త్రీల కష్టాలూ, నష్టాలూ మరింత అధికమయ్యాయి. పురాణేతిహాసాల్లో, మనుధర్మ ప్రవచనాల్లో స్త్రీలను ఆకాశానికెత్తేస్తూ, పతివ్రతామ తల్లులుగా చిత్రీకరిస్తూనే లౌక్యంగా వారిని చిత్రహింసలకు గురిచేసినట్లుగానే, ఆధునిక భారతంలో స్త్రీయే దైవమని పొగుడుతూ కూడా అత్యాచారాల పర్వం, హత్యోదంతాలు జరుగని నిమిషం ఉండదంటే అతిశయోక్తికాదు. 

అలనాడు రాచరికపు, ఫ్యూడల్‌ భావజాలం స్త్రీని బానిసను చేసి, మిగిలిన 90 శాతం ప్రజలను పీడనకు గురిచేసినట్లుగానే ఆధునిక మనువాదం ముసుగులో ప్రతినిమిషం ఒక స్త్రీ అత్యాచారాలకు బలౌతూనే ఉంది. ఎందరో సీతమ్మలు, మరెందరో ద్రౌపదులు అలనాటి నీచసంస్కృతిలో అవమానాలుకు గురికాగా, ధర్మరాజు జూదంలో భార్యను ఓడినా, హరిచ్ఛంద్రుడు ఇచ్చిన మాటపేరుతో భార్యను తాకట్టుపెట్టినా కానీ హత్యలకు, మానభంగాలకు ఆనాటి వ్యవస్థసైతం పాల్పడలేదు. కానీ నిన్న గాక మొన్న తాసీల్దారు విజయ, పశువైద్యాదికారిణి ప్రియాంక, ప్రేమ ముసుగులో మోసపోయిన ఓ మానస దారుణ హత్యలకు గురికావడం నిజంగా క్షంతవ్యం కాదు. జనారణ్యంలో మానవ మృగాలు, మానసిక రోగులు స్త్రీలను చెరపట్టి, కిరాతకంగా చెరచి, పెట్రోలు, కిరోసిన్‌ పోసి తగులబెట్టడాన్ని ఏ సామాజిక ధర్మం, ఏ ప్రమాణాలతో సమర్ధించగలుగుతుంది. 

మహిళా సాధికారత పరిఢవిల్లే దశలో మానవత్వం లేని మృగాలు మహిళలను పొట్టన బెట్టుకొని, పురోగమన చరిత్రను తిరగదోడి తిరిగి ఫ్యూడల్‌ సమాజ బాట పట్టిస్తున్నారు. ఇది నిజంగా ఆందోళన కరమైన పరిణామం. ప్రియాంక రెడ్డి మృతదేహానికి అంత్యక్రియలు జరిగిన 24 గం||లోపే అదే ఛటాన్‌పల్లి గ్రామశివార్లలో మరో మృతదేహం కాలి బూడిదై విషాదానికి కొనసాగింపుగా ఉవ్వెత్తున వార్తలు ప్రసారమవుతున్నాయి. ఈ అభాగ్యురాలి గాథ ఇంకా వెలికిరాకముందే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంటుంది. 

ముఖ్యంగా రైతులకు చేదోడువాదోడుగా నిలిచే మహిళా వ్యవసాయ నిపుణులకు పెనుప్రమాదాన్ని ఈ సంఘటనలు సూచిస్తున్నాయి. రైతు వ్యవస్థకు  సన్నిహితంగా ఉండే రెవెన్యు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల్లో చురుకుగా పనిచేసే మహిళా అధికారుల ఉనికి ప్రమాదంలో పడడం దురదృష్టకరం. ప్రపంచీకరణ అనంతరం విద్య, ఉద్యోగాల్లో కీలకమైన విధి నిర్వహణలో మహిళల శాతం పెరుగుతూ వస్తున్న సమయంలో వ్యవసాయ విద్యను అభ్యసించి, గ్రామాలు, రైతుసేవలో పునీతమవ్వాలని అంకితభావంతో పనిచేసే మహిళా ఉద్యోగులు ఇప్పుడు భయాందోళనలకు గురికావలసి వచ్చింది. ఈ పరిస్థితిని అథ్యయనం చేసి వారి రక్షణకు తగిన చర్యలు తీసుకోవలసిన భద్రతా యంత్రాంగ వైఫల్యం సర్వత్రా గర్హనీయంగా మారింది. 

పోలీసులున్నారు ప్రతి సంవత్సరం కొత్తగా ఆ శాఖలో అనేక నియామకాలు జరుగుతున్నాయి. కానీ నేరాల శాతం పెరుగుతుంది. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు, క్రూరంగా హత్యచేయడాలు సమాజాన్ని కలవరపరుస్తున్నాయి. సమాజంలో అనేక కారణాలతో పక్కదోవ పట్టిన యువత మానసిక స్థైర్యాన్ని కోల్పోయి, రోగుల్లాగా మారి నేరప్రవృత్తిని అలవర్చుకొంటున్నారు. తీవ్రమైన నేరాలోచనలతో పాటు, మధ్యం, ఇంటర్నెట్‌ వల్ల కలిగే దుష్ఫలితాలు మహిళల రక్షణకు భంగం కలిగిస్తున్నాయి. మహిళలను దైవంగా కొలిచే దేశంలో వారిపై లైంగిక దాడులు, దౌర్జన్యాలు, హింస నిత్యకృత్యమైపోయాయి.

స్త్రీలు సైతం అర్థరాత్రి నిర్భయంగా సంచరించ గలిగిననాడే నిజమైన స్వాతంత్య్రమని మహాత్మాగాంధీ ఏనాడో ఉద్ఘాటించారు. కానీ స్వాతంత్య్రం వచ్చిన 7 దశాబ్దాల అనంతరం కూడా మహిళలను పట్టపగలే కాల్చి చంపి వేయడం, వారి పట్ల అమానుషంగా ప్రవర్తించడం జరిగిపోతూనే ఉన్నాయి. 

మహిళలపై నేరాలకు కారణాలు : 

పురుషాదిపóత్య భావజాలం :   

వాస్తవానికి దక్షిణ భారతదేశం మాతృస్వామ్య వ్యవస్థ పునాదులపైనే నిర్మించబడింది. దానికి అనుగుణంగానే కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కనక దుర్గమ్మ దేవాలయాలకు ప్రాచుర్యం ఏర్పడింది. ఊరూరా అనేక రకాల పేర్లతో గ్రామదేవతలకు పూజలు చేయడం దక్షిణాది వారి ఆనవాయితీ. కానీ ఆర్యులు మధ్య ఆసియా నుండి భారత్‌లోకి ప్రవేశించి, ఇక్కడి సంస్కృతి స్థానంలో మనుధర్మ శాస్త్రం, చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడడం, తల్లి అధిపతి కాగలిగిన కుటుంబాలను తండ్రి పెత్తనానికి అప్పచెప్పడం శతాబ్దాల క్రితమే ప్రారంభమైంది. దానితో పితృస్వామ్య వ్యవస్థ వేళ్ళూనుకొని మహిళలను వారి స్థానం నుండి కిందకు నెట్టివేసే పరిస్థితి దాపురించడం, వంటింటి కుందేళ్ళుగా, కేవలం పిల్లలను కనే యంత్రాలుగా, తమకు వర కట్నాన్ని తీసుకువచ్చే వారిగా మాత్రమే చూస్తూ పురుషాధిక్య సమాజానికి స్త్రీ జాతిని బానిసలను చేశారు. అబలలుగానూ, బలహీనురాలిగానూ, నిస్సహాయురాలిగానూ స్త్రీని కించపరచే విధంగా సమాజం తయారైంది. పెంపకంలో కొడుకును ఒక రకంగానూ, కూతుర్ని మరో రకంగానూ చూస్తూ లింగ వివక్షత చూపించే పితృస్వామి ఆధిపత్య ధోరణి మహిళలపై లైంగిక భౌతిక దాడులకు కారణమౌతోంది. 

కన్యాశుల్కం, బాల్యవివాహాలు, సతీసహగమనం, విధవరాళ్ళపై వివక్షత వంటి అనేక రుగ్మతలను సంఘ సంస్కర్తల స్పూర్తి ద్వారా అధిగమించి, గృహ హింసచట్టం, వరకట్న నిరోధక చట్టం, అత్యాచార నిరోధక చట్టం, అభయ చట్టం లాంటి ఎన్ని చట్టాలు చేసినా మహిళల స్థితిగతుల్లో మార్పురాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం స్వర్గీయ ఎన్‌టి రామారావు పుణ్యమా అని మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించబడి కొంత వరకు న్యాయం జరిగి ఆత్మవిశ్వాసం ప్రోది కావడం శుభసూచికం. అయినా అత్యాచారాలు, హత్యలపర్వం కొనసాగుతుతూనే ఉండటంతో ఇప్పటికీ మహిళాలోకం తల్లడిల్లే స్థితిలోనే ఉంది. 

వరకట్న దాహం గత అనేక దశాబ్దాలుగా మహిళల హత్యలకు, భౌతిక దాడులకు దశాబ్దాలుగా కారణం కాగా కోటీశ్వరుల నుండి అందరూ వరకట్నం కోసం మహిళలను చిత్రవదలకు గురిచేస్తున్నారు. 

చలనచిత్రాలు, టివి సీరియళ్ళు, అన్ని రకాల వ్యవస్థల్లో మహిళలను ఆట వస్తువుగా చూడడం వల్ల దేశంలో 70 శాతం మంది మహిళలు ఏదో ఒక రూపంలో హింసను ఎదుర్కొంటున్నారు. ప్రతి 3 నిమిషాలకు ఒకసారి ఏదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంది. ప్రతి 9 నిమిషాలకొకసారి భర్త, అత్త, మామల వేదింపులతో హింసబారిన పడుతున్నారు. 

పనిచేసే మహిళల్లో ఎక్కువ శాతం విధులకు వెళ్ళి వచ్చేటప్పుడు తమకు రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహానగరాలైన ఢిల్లీ, ముంబై. పూనే, కలకత్తాతో పాటు హైదరాబాద్‌లోని పెద్ద పెద్ద సంస్థల్లో మరియు మధ్యస్థ, చిన్న తరహా కంపెనీల్లో పనిచేస్తున్న అనేక మంది మహిళలు తమకు పనిచేసే ప్రాంతంలో తమకు సరైన రక్షణ ఉండడం లేదని ఇటీవల జరిగిన సర్వేలో వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా బిపిఓ, ఐటి అనుబంధ రంగాలు, హాస్పిటాలిటీ, పౌర విమానయానం, నర్సింగ్‌¬మ్స్‌లో పనిచేసే మహిళలకు వారికి తగ్గ రక్షణ ఉండడం లేదని సర్వేలు వెల్లడించాయి. పట్టణ ప్రాంతాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు సైతం ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారంటే ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నేరాలు విచ్చల విడిగా జరుగుతున్నాయి. అభం శుభం తెలియని పసి మొగ్గలతోపాటు బాలికలు, మహిళలపై జరిగే దాడులు, దేశానికి, రాష్ట్రాలకు మచ్చను తెస్తున్నాయి. 

మహిళలకు ఆత్మరక్షణ : 

ప్రతి స్త్రీ బాల్యం నుండే తనను తాను రక్షించుకోవడం ఎలా అన్నది తల్లి ఉగ్గుపాలతోనే నేర్పించాలి. ఎందుకంటే చంటిపిల్లలతో సహా అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఇటువంటి దారుణ పరిస్థితుల నుండి తనను తాను రక్షించుకునేందుకు ఆత్మస్ధైర్యంతో నిలవాల్సిన అవసరం ఎంతో ఉంది. చిన్న నాటి నుండే కొన్ని జాగ్రత్తలను నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. మగపిల్లలకు చిన్ననాటి నుండే తల్లిని, చెల్లిని అక్కలను మొత్తం స్త్రీజాతిని గౌరవించాలని తల్లిదండ్రులు నేర్పాలి. స్త్రీ, పురుషులు సమానత్వమేనని చెప్పాలి. వివక్షత చూడకుండా బాల, బాలికలకు ఒకేరకమైన పాఠశాలలకు పంపడం, పౌష్టికాహారంతో పాటు ఆటపాటలు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. 

ఆత్మరక్షణ విద్య ఆడపిల్లల్లో ఎంతో ఆత్మస్ధైర్యాన్ని ఇస్తుంది. ఇటువంటి విద్యను అందించడంలో తల్లిదండ్రుల చొరవ ఎంతో అవసరం. నేడు సమాజ పోకడలను బట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు సరైన మార్గంలో పయనించే విధంగా మార్గనిర్ధేశకతను చేపట్టాలి. నేడు మహిళలకు పురుషులతో సమానంగా విద్యావకాశాలు ఉన్నప్పటికీ భద్రత, రక్షణలో వ్యత్యాసం ఎక్కువగా ఉండడం వల్ల కొంత మంది ఉన్నత చదువులు అభ్యసించలేని పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితులను అధిగమించేందుకు కుటుంబనేపద్యం నుండే పిల్లలకు సామాజిక సృహకలిగిన చైతన్యాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేడు వేగవంతమైన జీవితంలో మహిళలు అనేక రకాల వివక్షతకు గురై పురుషాధిపత్యదోరణిలో సమిధలౌతున్నారు. అసమానత గల సమాజంలో స్త్రీ జాతి ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చే పరిస్థితి నేడు కనిపిస్తుంది. ఇటువంటి భయానకర పరిస్థితుల నుండి మహిళలు తమను తాము రక్షించుకుంటూ సమాజంలో నిలదొక్కుకుంటూ స్త్రీలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమే. నేడు స్త్రీ జాతిని చిదిమేసే పరిస్థితులు తరుముకొస్తున్న స్థితి కళ్ళముందు కనిపిస్తుంది. ఇటువంటి భయానక పరిస్థితుల నుండి మహిళలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వాలు చేపట్టినా అవి మహిళలను పూర్తిస్థాయిలో రక్షణ కల్పించలేని దుస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితి నుండి మహిళలు తమకు తాము రక్షించుకునేందుకు ఆత్మస్థైర్యంతో యుద్ద తంత్రాన్ని కలిగి ఉంటేనే కొంత మేర తమపై జరుగుతున్న దాడులను తిప్పికొడుతూ నిలవాల్సిన అవసరం ఉంది. 

రచయిత సమాచారం

- వై.వి. నరసింహారావు, అసోసియేట్‌ ఎడిటర్‌, ఇ. రాంబాబు, అగ్రిక్లినిక్‌ ప్రతినిది