Print this page..

సేంద్రియ సేద్యంలో సమగ్ర సస్యరక్షణ

సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు తమ పొలాల్లో జీవవైవిద్యాన్ని పెంపొందించుకోవాలి. వ్యవసాయక్షేత్రాన్ని ఒక జీవ చక్రంగా చూసినట్లయితే అది నేల మరియు నేలలోని సూక్ష్మజీవులతో మొదలవుతుంది. నేలలో ఉండే కోటానుకోట్ల కంటికి కనపడని సూక్ష్మజీవుల చనిపోయిన మొక్కలు, జంతువులు, ఎరువులు వంటి వాటిని ఆహారంగా స్వీకరించి వాటిని కుళ్ళిపోయేటట్లు చేస్తాయి. ఈ పదార్థాలు కుళ్ళే క్రమంలో మొక్కలకు అవసరమైన పోషకాలను విడుదల చేస్తాయి. ఈ మొక్కలపై ఆధారపడి అనేక రకాలైన పురుగులు, తెగుళ్ళు, కలుపు మొక్కలు మనుగడ సాగిస్తాయి.

మొక్కలను ఆశించే పురుగులను నియంత్రించడానికి మిత్రపురుగులు, తెగుళ్ళను నివారించడానికి ఉపయోగకరమైన సూక్ష్మజీవులు కూడా ఈ చక్రంలోనే ఇమిడి ఉంటాయి. వీటివల్ల మొక్కలు అంతర్గత నిరోధక శక్తి పెంపొందించుకొని సంరక్షించ బడతాయి. ఎప్పుడైతే ఈ ఉపయోగకరమైన సూక్ష్మజీవుల సంఖ్య క్షీణిస్తుందో అప్పుడు మొక్కలకు హానిచేసే సూక్ష్మజీవులు వృద్ధి చెంది పంటను కబళిస్తాయి. ఎప్పుడైతే హానిచేసే కీటకాలు మరియు మిత్ర కీటకాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందో అప్పుడు పంటలో చీడపీడలు వృద్ధి చెందుతాయి. 

సేంద్రియ వ్యవసాయంలో తెగుళ్ళను మరియు హానిచేసే కీటకాలను నివారించడానికి రసాయన మందుల అనుమతి లేదు కనుక రైతులు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి లేనిచో పంట నష్టపోయే ప్రమాదం ఉంది. భారతదేశంలో సేంద్రియ వ్యవసాయంలో కేవలం అనుమతించబడిన యాంత్రిక, భౌతిక జీవబొటానికల్‌ మందులను మాత్రమే వాడాలి. 

వ్యవసాయ క్షేత్రంలో జీవ వైవిధ్య నిర్వహణ : 

వైవిద్యమైన పంటలను ఎంచుకోవడం ద్వారా దీన్ని సాధించవచ్చు. పంటతో పాటు ఆయా వాతావరణానికి తగిన మొక్కలు, చెట్లు కూడా పెంచుకోవడం వల్ల ఇవి నేల ఆరోగ్యాన్ని పెంచడమేకాక, కీటకాలను తినే పక్షులను, పరపరాగ సంపర్కానికి ఉపయోగపడే కీటకాలను ఆకర్షిస్తాయి. ఈ మొక్కలు మిత్ర పురుగులకు ఆవాసాన్ని మరియు ఆహారాన్ని అంటే మకరందం మరియు పుప్పొడిని ఆహారంగా ఇస్తాయి. బీర, ఆనప, గుమ్మడి, పుచ్చ వంటి తీగజాతి పంటల్లో పరపరాగ సంపర్కం చేసే కీటకాలు మగపువ్వు నుండి ఆడ పువ్వుకు పుప్పొడి బదిలీ చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయంలో ఈ మొక్కలు సరిహద్దుల్లో బహుళ అంతస్థుల పద్ధతిలో వేయవచ్చు. ఉదా : 10 ఎకరాల సేంద్రియ వ్యవసాయ క్షేత్రానికి 5 లేదా 6 వేపచెట్లు, 1 లేదా 2 చింత చెట్లు, 1 లేదా 2 మామిడి చెట్లు, 8-10 రేగు చెట్లు, 1 లేదా 2 రాతి ఉసిరి చెట్లు, 1 లేదా 2 మునగ చెట్లు ఆ ప్రాంతంలో తేలికగా పెరిగే కొన్ని పాదులు నాటాలి. సుబాబుల్‌ మొక్కలు పెంచడం వల్ల పశువుల మేతగా నత్రజనిని నేలకు అందించే మొక్కగా ఆకులు మంచి క్వాలిటీ కంపోస్టు తయారీకి ఉపయోగపడుతుంది. నిమ్మజాతి మొక్కలు పండ్లను ఇవ్వడమే కాకుండా వాటి ఆకులు, గింజలు అనేక రకాల కషాయాల తయారీలో ఉపయోగించవచ్చు. ఈ కషాయం ద్వారా కీటకాలను తద్వారా అవి వ్యాపింపచేసే వైరస్‌ తెగుళ్ళను అదుపు చేయవచ్చు. వేపాకులు, గింజలు కషాయాల తయారీకి తద్వారా కీటకాల, తెగుళ్ళ నివారణకు ఉపయోగపడతాయి. 

గ్లైరిసీడియా, సెస్టేనియా వంటి పచ్చిరొట్ట ఎరువును అందించే పంటలతో పాటుగా సీతాఫలం, పొగాకు, వేప, ఉమ్మెత్త వంటి కషాయాల తయారీలో వాడే మొక్కలను కూడా పెంచుకోవాలి. ఇవి కాకుండా పశువుల చికిత్సలో వాడే అడ్డరసం, వావిలి, జట్రాఫా వంటి మొక్కలు మరియు వేర్లు భూమి పొరల్లోకి చొచ్చుకుపోయే మొక్కలను నాటుకోవాలి. జిల్లేడు వంటి మొక్కలు కషాయాల తయారీకే కాక బదనికలు వంటి అనేక మిత్ర పురుగులకు ఆశ్రయం కల్పిస్తాయి. 

నేల మరియు పంట ఆకృతిని సేంద్రియ విదానానికి అనుగుణంగా మార్చుకొనుట  : 

లోతైన వేసవి దుక్కులుదున్నడం ద్వారా కలుపు మొక్కల మూలాల్ని బహిర్గతం చేసి నిర్మూలిస్తుంది. ఇలా లోతుదుక్కులు దున్నడం వల్ల కీటకాల నిద్రాస్థితి బహిర్గతమై నిర్వీర్యమౌతుంది. అనేక వ్యాధి కారక సూక్ష్మజీవులు సూర్యరశ్మికి నశించబడతాయి. 

వర్షాకాలంలో పంటలను ముఖ్యంగా పసుపు, అల్లం, పప్పు ధాన్యాలు, కూరగాయలు, మొక్కజొన్న మొదలైనవి ఎత్తైన బెడ్స్‌ లేదా కట్టలపై వేయడం వల్ల మట్టి ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించుకోవచ్చు. 

సేంద్రియ వ్యవసాయంలో సాళ్ళ మధ్య మరియు మొక్కకు మొక్కకు మద్య తగినంత దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి. లేనిచో కలుపు మొక్కలు లేదా కీటకాలు, వ్యాధులు వంటివి ప్రబలుతాయి. మొక్కల మద్య అంతరం ఎక్కువగా ఉంటే కలుపు నివారించడం లేదా అంతరం తక్కువగా ఉంటే వ్యాధులు నివారిండచం కష్టమవుతుంది. 

సూర్యరశ్మీకరణ ద్వారా తెగుళ్ళ నిర్వహణ : 

నేల యొక్క సూర్యరశ్మీకరణ అనగా ప్లాస్టిక్‌షీట్ల ద్వారా నీటి  ఉష్ణోగ్రత పెంచడం తద్వారా హానికార సూక్ష్మజీవులు, నులిపురుగులు, కీటకాలు మరియు తెగుళ్ళను అదుపు చేయడం అనేది సేంద్రియ వ్యవసాయంలో అనుమతించబడిన ప్రక్రియ. ఈ ప్రక్రియలో సూర్యరశ్మి చొచ్చుకుపోయే పారదర్శక ప్లాస్టిక్‌ షీటు వాడినట్లయితే అది పగలు తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన సూర్యకిరణాలను మట్టిలోకి చొచ్చుకొనిపోయేటట్లు చేసి రాత్రివేళల్లో చల్లబడకుండా పట్టి ఉంచి నేలను వేడెక్కేటట్లు చేసి హానికారక క్రిమికీటకాలను సంహరిస్తుంది. ఈ ప్రక్రియ వేసవికాలంలో పారదర్శక ప్లాస్టిక్‌షీటు 25-30 సెం.మీ. మందం కలిగినది ఉపయోగించాలి. ప్లాస్టిక్‌షీటు తీసిన తరువాత ఉపయోగకరమైన బయోఫెర్టిలైజర్‌ (సేంద్రియ జీవన ఎరువులు) మరియు బయోపెస్టిసైడ్స్‌ (జీవన క్రిమి సంహారకాలు) వాడినట్లయితే అవి త్వరితగతిన వృద్ధి చెంది మొక్కను ఏపుగా పెరిగేటట్లు చేయడమే కాకుండా తెగుళ్ళ నుండి రక్షిస్తాయి. 

సేంద్రియంగా చీడపీడల నియంత్రణ : 

వర్మికంపోస్టు లేదా కంపోస్టు వాడేటప్పుడు అజటోబాక్టర్‌, ఫాస్పేట్‌ సాల్యుబిలైజింగ్‌ బ్యాక్టీరియా లేదా మైక్రోబియల్‌ కంసార్షియాతో సమృద్ధిపరచాలి. జీవామృతాన్ని ఎకరానికి 200 లీటర్ల చొప్పున అవసరాన్ని అనుసరించి నీటితడితో ఇవ్వవచ్చు. భాస్వరం తక్కువగా ఉన్న నేలల్లో ఎకరానికి 300 కిలోల రాక్‌ఫాస్పేట్‌ విదిగా వాడాలి.

ట్రైకోడెర్మా మరియ సుడోమోనాస్‌ ఫ్లూరసెన్స్‌ లేదా ట్రైకోడెర్మా మరియు బాసిల్లస్‌ సబ్టిలన్‌ ఎకరానికి రెండు కిలోలు సేంద్రియ ఎరువుతో కలిపి ఆఖరిదుక్కిలో వాడడం వల్ల ఎన్నోరకాలైన విత్తనం ద్వారా, నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళు మరియ నులిపురుగులను అదుపులో ఉంచవచ్చు. బవేరియా బసియానా లేదా మెటారైజియం అనైసోప్లియా ఎకరానికి ఒక కిలో వాడడం ద్వారా ఎన్నో రకాలైన కీటకాలను, చెదలను, వేరుపురుగులను నివారించవచ్చు. ఈ జీవనియంత్రణ శిలీంద్రాలను నేలలో వేయడం వల్ల నేలలో ఉండే అనేక పురుగుల నిద్రాణ దశలు నిర్మూలించబడతాయి. నూనెగింజల చెక్క 500 కిలోలు లేదా వేపచెక్క 100 కిలోలు చొప్పున నేలకు అందించిన ఇవి అనేక రకాల ఉపయోగకరమైన సూక్ష్మజీవులను వృద్దిపరచి వ్యాధికారక క్రిములను నివారిస్తాయి. 

విత్తన శుద్ధి : 

వీలైనంత వరకు విత్తనం నారు లేదా ఏదైనా నాటే ఉత్పత్తులు, వ్యాధికారక సూక్ష్మజీవులు, కీటకాలు మరియు కలుపు విత్తనాల నుండి శుద్ధి చేసుకోవాలి. కింద తెలిపిన సేంద్రియ వ్యవసాయంలో అనుమతించబడిన పద్ధతులు ఉపయోగించి తగిన విధంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. 

వేడినీటితో విత్తన శుద్ధి : 

విత్తనాలను 52 నుండి 540 సెం. ఉష్ణోగ్రత ఉన్న నీటిలో 25-30 నిమిషాలు ఉంచి విత్తుకున్నచో విత్తనాల ద్వారా వ్యాపించే శిలీంద్రాలు బ్యాక్టీరియా, ఫైటోప్లాస్మా మరియు వైరస్‌ తెగుళ్ళను అదుపు చేయవచ్చు. ఈ పద్ధతి ద్వారా విత్తనాలతో పాటు ఉన్న వివిధ రకాల పురుగులను వాటి యొక్క నిద్రావస్థలను నిర్వీర్యం చేయవచ్చు. వరి విత్తనాన్ని 540 సెం. వద్ద 25-30 నిమిషాలు ఉంచి నారుపోసుకోవడం ద్వారా విత్తనాల ద్వారా వ్యాపించే బైపోలారిస్‌, జాంతోమొనాస్‌ వంటి తెగుళ్ళను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. సేంద్రియ వ్యవసాయంలో రసాయన శిలీంద్రనాశినులకు అనుమతి లేదు కనుక చాలా జాగ్రత్తగా ఈ వేడినీటి విత్తన శుద్ధి పాటించవచ్చు. సిఫార్సు చేసిన దాని కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే విత్తనాలు మొలక కోల్పోతాయి. కనుక విత్తనశుద్ధి ఎంతో మెళకువతో అనుభవజ్ఞుల ఆధ్వర్యంలో చేసుకోవాలి.

జీవనియంత్రణ పద్ధతిలో విత్తన శుద్ధి : 

ట్రైకోడెర్మా విరిడి లేదా ట్రైకోడెర్మా హర్జియానమ్‌ కిలో విత్తనానికి 4 గ్రా. లేదా సుడోమోనాస్‌ ఫ్లూరసెన్స్‌ కిలో విత్తనానికి 10 గ్రా. లేదా అనేక శిలీంద్రనాశనులు మరియు కీటకనాశనుల నులి పురుగుల మిశ్రమాలతో విత్తనశుద్ధి చేసుకోవచ్చు. విత్తనశుద్ధి ద్వారా భూమిలోకి చేరిన ఈ బయోఏంజంట్స్‌ మొక్క యొక్క వేరు వ్యవస్థ వద్ద త్వరితగతిన వృద్ధి చెందుతాయి. ఈ బయోఏజంట్స్‌ తెగుళ్ళను అరికట్టడమేకాక మొక్కలకు అనేక రకాల పోషకాల సంగ్రహణలో సహాయపడి త్వరితగతిన పెరిగేటట్లు చేస్తాయి. ఈ బయో ఏంజంట్స్‌తో విత్తన శుద్ధి చేసిన తరువాత వాటిని రాత్రంతా తగినంత వేడిమి మరియు తేమ ఉన్న ప్రదేశంలో ఉంచి విత్తనం పై వృద్ధి చెందించి మరుసటి రోజు విత్తుకోవడాన్ని ''బయోప్రైమింగ్‌'' అని పిలవబడుతుంది. 

బీజామృతంతో విత్తన శుద్ధి : 

5 కిలోల తాజా ఆవుపేడను గుడ్డలో మూట కట్టి నీటిలో వేలాడదీసి 12-16 గంటల తరువాత గుడ్డ సంచిని బాగా నొక్కి పేడ సారం మొత్తం నీటిలోకి వచ్చేటట్లు చూసుకోవాలి. 50 గ్రా. సున్నాన్ని వేరుగా ఒక గుడ్డ ముక్కలో కట్టి ఒక లీటరు నీటిలో వేలాడదీయాలి. ఈ సున్నపు నీటిని, ఆవు పేటడ సారాన్ని, 5 లీటర్ల ఆవు మూత్రాన్ని, 50 గ్రా. సారవంతమైన క్రొత్త అటవీమట్టిని కలిపి దీనికి 20 లీటర్ల నీరు కలిపి 8-12 గంటలు నిల్వ ఉంచి వడకట్టి విత్తనశుద్ధికి ఉపయోగించాలి. ఈ బీజామృతం విత్తనం పై ఒక పొరలా ఏర్పడేలా ముంచి నీడలో ఎండబెట్టి విత్తుకోవాలి. 

పైన తెలిపిన విత్తనశుద్ధి ప్రక్రియలే కాక పంచగవ్య సారం, పసుపు దుంపల పొడి + ఆవు మూత్రం, దశపర్లి కషాయం వంటి వాటిని ఉపయోగించి కూడా విత్తనశుద్ధి చేసుకోవచ్చు. పప్పుజాతి పంటలకు చెందిన విత్తనాలకు రైజోబియం అనే బ్యాక్టీరియాను మిగతా పంట విత్తనాలకు అజటోబాక్టర్‌, అజోస్పైరిల్లమ్‌ వంటి వాటితో విత్తనశుద్ది చేసినట్లయితే అవి నత్రజనిని స్థిరీకరిస్తాయి. సూడోమోనాస్‌ ప్లూరిసెన్స్‌ తెగుళ్ళను అరికట్టడమే కాక నేలలోని భాస్వరాన్ని మొక్కకు అందించడంలో తోడ్పడుతుంది. 

యాంత్రిక పద్ధతులు ఉపయోగించి సస్యరక్షణ : 

తెగులు సోకిన మొక్కలను, మొక్కల భాగాలను తొలగించి పాతిపెట్టడం, గుడ్ల సముదాయాన్ని నిర్మూలించడం, పక్షిస్థావరాలు ఏర్పాటు చేయడం, లైట్‌ ట్రాప్స్‌, జిగురు అట్టలు, ఫిరమోన్‌ ట్రాప్స్‌ వంటివి సేంద్రియ వ్యవసాయంలో అనుసరించవలసిన ముఖ్యమైన సస్యరక్షణ చర్యలు.

పొలంలో ''T'' ఆకారంలో 5-6 అడుగుల ఎత్తులో కర్రలతో లేదా పంట చుట్టూ పొదలు, చెట్లతో కాని పక్షిస్థావరాలు ఏర్పాటు చేసిన పక్షులు, పురుగులను ఏరుకొని తింటాయి. లైట్‌ ట్రాప్స్‌ను              ఉపయోగించి వేరుపురుగు (వైట్‌ గ్రబ్‌) యొక్క రెక్కల దశలను, అనేక పురుగుల, చెదల రెక్కల దశలను పట్టి నిర్మూలించవచ్చు. లింగాకర్షక బుట్ట ఉపయోగించి మగ పురుగులను పట్టి నిర్మూలించనిదే ఆడపురుగుల సంతతిని వృద్ధి చేయలేవు. మిథైల్‌ యుజినాల్‌ కలిగిన ఫిరమోన్‌ ట్రాప్స్‌ను ఉపయోగించినప్పుడు పండు ఈగ (ఫ్రూట్‌ ఫ్లై)ని పండ్లతోటల్లో అదుపు చేసుకోవచ్చు. 

జీవనియంత్రణ పద్ధతులు : 

మిత్రపురుగులు : 

పంట పొలాల్లో పంటకు హానిచేసే పురుగులతోపాటు వాటిని ఆరగించే మిత్రపురుగులు కూడా ఉంటాయి. పంటకు కీడు చేసే కీటకాలను సంహరించేందుకు ఉపయోగించే పురుగు మందులు వీటికి ప్రమాదకరం. సేంద్రియ వ్యవసాయంలో పురుగు మందులకు అనుమతి లేదు కనుక మిత్ర పురుగులను సమర్థంగా పెంపొందించుకోవచ్చు మరియు వాటిని పెంచి పొలంలో విడుదల చేసుకోవచ్చు. 

రైతులకు ఉపయోగపడే మిత్ర పురుగులను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. పారసైటాయిడ్స్‌ అనగా పరాన్నజీవులు. ఈ పురుగులు హానికారక కీటకాల గుడ్లు, పిల్లదశ, కోశస్థ దశ మరియు తల్లిదశ వంటి వాటిని ఆవాసం చేసుకొని వాటి నుండి ఆహారాన్ని సంగ్రహించడం ద్వారా వాటిని చంపి పంటను కాపాడతాయి. పంటను నాశనం చేసే కీటకాల గుడ్లపై పరాన్న జీవిగా జీవించే ట్రైకోగ్రామాచే పారసైటైజ్‌ చేయబడిన గుడ్లు 40000 / ఎకరానికి, చిలోనస్‌ బ్లాక్‌ బర్ని అనే పరాన్న జీవిని 6000 పిల్లదశను నిర్మూలించే బ్రాకాన్‌ హెబెటర్‌ను 2000 ఎకరానికి, కోశస్థదశను ఆశించి అపాంటిలస్‌ను 6000 ఎకరానికి తక్కువ ఖర్చుతో రైతులు ఉత్పత్తి చేసుకొని పొలాల్లో విడుదల చేసుకోవచ్చు. ఈ మిత్రపురుగులను అవసరాన్ని అనుసరించి విడుదల చేసుకున్నచో మంచి ఫలితం పొందవచ్చు. ఇవేకాక పురుగులను నేరుగా తినే బదనికలు క్రైజొపెర్లా కార్నియా, కాక్సినెల్లిడ్స్‌, రెడువిడ్‌ బగ్స్‌ వంటి అనేక మిత్రపురుగులను పంట పొలాల్లో విడుదల చేసుకోవచ్చు. సాలి పురుగుల గుడ్లను సేకరించి వాటి పిల్లలను కొన్నిరోజులు సంరక్షించి పొలంలో వదిలినట్లయితే అవి ఎన్నో రకాల పురుగులను సమర్ధవంతంగా నివారిస్తాయి. 

కీటకాలను ఆశించే శిలీంద్రాల ద్వారా పురుగుల నియంత్రణ బవేరియా బసియానా మెటారైజియం అనైసోప్లియా, నోమురియా రిలే, వెర్టిసీలియంల కాని (లకానిసిలియంలు కాని) వంటి శిలీంద్రాలు కీటకాలను ఆశించి వాటికి వ్యాధులు కలుగచేసి నిర్మూలిస్తాయి. బవేరియా, బసియానాను టెంకపురుగులు, పెంకు పురుగులు వివిధ రకాల లార్వాలు, చెదలు వంటి వాటిపై ఉపయోగిస్తారు. మెటారైజియం అనైసోప్లియాని కొబ్బరిలో (ముక్కుపురుగు) రైనోసిరాన్‌ బీటిల్‌, చెరకులో పచ్చదోమ, వరిలో పచ్చదోమ, సుడిదోమ, సుడి తెగులు కలిగించే దోమ వంటి వాటిపై ఉపయోగిస్తారు. లకానిసిలియంలకాని ముఖ్యంగా ఉద్యానవన పంటలైన వంగ, టమాట, బెండ వంటి వాటిలో పప్పుజాతి పంటలైన (అలసంద) కౌపి, కంది మరియు పూతోటల్లో రసంపీల్చే పురుగులైన పేనుబంక, పిండినల్లి, పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగులు, ఎర్రనల్లి వంటి వాటిని నివారించడానికి వాడతారు. నోయూరియా రిలె అనేక రకాలైన పురుగులపై సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఐసీరియా ఫ్యూమోసారో ఓ యూ అనే శిలీంద్రం డైమండ్‌ బ్లాక్‌ మాత్‌ (రెక్కల పురుగు) పేనుబంక, తెల్లదోమ, ఎర్రనల్లి, గోధుమ రంగు, నల్లి వంటి వాటిపై సమర్థవంతంగా పనిచేస్తుంది. పెసిలోమైసిన్‌ లైలాసినస్‌ అనే శిలీంద్రం వివిధ రకాల పంటలను ఆశించే నులిపురుగులపై సమర్ధవంతంగా పనిచేస్తుంది. 

కీటకాలను నిర్మూలించే బ్యాక్టీరియా : 

బాసిల్లస్‌ తురంజిమెన్సిస్‌ అనే బ్యాక్టీరియాను ఉపయోగించి రెక్కల పురుగుల యొక్క పిల్లపురుగులను, పెంకు పురుగుల యొక్క పిల్ల పురుగు దశలను అదుపు చేయవచ్చు. 

కీటకాలను ఆశించే వైరస్‌లు : 

వివిధ రాకలైన గ్రాన్యులోసిస్‌ మరియు న్యూక్లియర్‌ పోలిహైడ్రోసిస్‌ వైరస్‌లు పంటలను ఆశించే కీటకాలకు రకరకాల వ్యాధులను కలుగచేసే వాటిని నిర్మూలిస్తాయి. ఈ వైరస్‌లు ప్రతి పురుగుకు ప్రత్యేకంగా ఉంటాయి. ఉదాహరణకు Ha-NPV కేవలం పచ్చపురుగును మాత్రమే ఆశిస్తుంది. SL-NPV చీూహ కేవలం లద్దె పురుగును మాత్రమే ఆశిస్తుంది. పచ్చపురుగు, లద్దె పురుగు అనేక పంటలను ఆశించే కీటకాలైనా ఏ పంటపై ఈ పురుగు ఉన్నా దాని యొక్క  NPV పని చేస్తుంది. 

ఇవేకాక అనేక రకాలైన వృక్షసంబంధ తయారీలు మరియ కషాయాలు సేంద్రియ సేద్యంలో అనుమతించబడ్డాలి. కేవలం అనుమతించబడిన పదార్థాలను సమగ్రంగా వినియోగించుకొని పంటను కాపాడుకోవాలి.

రచయిత సమాచారం

ఈడ్పుగంటి శ్రీలత, జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ, రాజేంద్రనగర్‌, ఫోన్‌ : 9010327879