Print this page..

వరికోత, నూర్పిడిలో మెళకువలు - నాణ్యతా ప్రమాణాలు

తెలంగాణలో వరికోతలు సాధారణంగా నవంబరు మొదలుకొని డిసెంబరు 15 వరకు ప్రాంతాన్ని బట్టి కొనసాగుతాయి. ఇటీవల కాలంలో వరికోత మరియు పంటమార్పిడి చాలా వరకు కంబైన్డ్‌ హార్వెస్టర్స్‌తో జరుగుతుంది. కోతకు వారం, పది రోజుల ముందే నేల స్వభావాన్ని బట్టి నీటిపారుదలను ఆపి వేసి పంటను ఆరబెట్టాలి. వరిని సకాలంలో కోసి, సరైన నాణ్యతాప్రమాణాలను పాటిస్తే మార్కెట్‌లో మంచి ధర వస్తుంది. కోత మరియు నూర్పిడి సమయంలో ధాన్యంలో తేమశాతం 23-26 వరకు ఉంటుంది. కాబట్టి నూర్పిడి అయిన వెంటనే ధాన్యాన్ని టర్పాలిన్‌ లేదా ప్లాస్టిక్‌ పట్టాలపై పలుచగా ఆరబెట్టినచో గింజరంగు మారకుండా నల్లగా కాకుండా మంచి నాణ్యతను కలిగి ఉంటుంది. 

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సారంగా ధాన్యాన్ని పొడవు, వెడల్పు నిష్పత్తిని బట్టి రెండు రకాలుగా ఏ గ్రేడ్‌ మరియ సాధారణ రకాలుగా విభజించబడింది. దీని ప్రకారం పొడవు వెడల్పు నిష్పత్తి 2.5 మరియు ఆపై ఉన్నచో ఏ గ్రేడ్‌ (సన్నరకం) మరియు 2.5 కన్నా తక్కువ             ఉన్నచో సాధారణ (దొడ్డురకం) రకంగా గుర్తించబడును.

దీనితో పాటు (ఏ గ్రేడ్‌ కాని, సాధారణ రకం గాని) మిగతా నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించవలసి ఉంటుంది. అవి ఏమంటే వరి ధాన్యం ఆరిన తరువాత మట్టి బెడ్డలు, చెత్తా చెదారం లేకుండా చూడాలి. మార్కెట్‌లో (వ్యవసాయ మార్కెట్‌ కమిటీ, ఐకెపి కేంద్రాలు గాని, మండీలు గాని ఇతర ప్రభుత్వంచే నిర్ణయించబడిన కేంద్రాలు) కనీస మద్దతు ధర (రూ. 1835 ఏ గ్రేడ్‌కు, రూ. 1815 సాధారణ రకానికి) రావాలంటే ఈ కింది నాణ్యతా ప్రమాణాలను పాటించాలి. దీన్నే ఎఫ్‌.ఎ.క్యూ (ఫెయిర్‌ ఆవరేజ్‌ క్వాలిటీ) అని కూడా అంటారు. ఈ నిష్పత్తి ప్రకారం ఎంటియు-1010, బిపిటి-5204 లాంటి రకాలు ఏ గ్రేడ్‌ గాను మరియు ఎం.టి.యు-1001 లాంటి రకాలు సాధారణ రకాలుగా గుర్తించబడతాయి.

వివరాలు గరిష్ట పరిమితి (%)
ఇతర వ్యర్థపదార్థాలు    
సేంద్రియేతర (మట్టి బెడ్డలు, రాళ్ళు మొ||) 1
సేంద్రియ (గడ్డి, చెత్త మొ||)   1
దెబ్బతిన్న, రంగుమారిన, మొలకెత్తిన మరియు పుచ్చిపోయిన గింజలు (దీనిలో దెబ్బతిన్న, మొలకెత్తిన, పచ్చుబడిన గింజలు 4 శాతం మించకుండా చూడాలి) 5
పక్వానికి రాని, ముడత, కుంచించుకుపోయిన 3
తక్కువ జాతి రకం చెరకుల గింజలు 6
తేమశాతం  17

 పైప్రమాణాన్ని కూడా బి.ఐ.ఎస్‌ ఆహార ధాన్యాల విశ్లేషణ పద్ధతి ద్వారా చేయబడును. పైన పట్టికలో 1 శాతం సేంద్రియ పదార్థాల పరిధిలో విషతుల్య విత్తనాలు 0.5 శాతం మించకుండా చూడాలి. దీనిలో ఉమ్మెత్త 0.25 శాతం మరియు విసియా జాతి విత్తనాలు 0.2 శాతం మించకుండా ఉండాలి.

రైతు సోదరుల పై నాణ్యతాప్రమాణాలను పాటించి పండించిన ధాన్యానికి మంచి ధర వచ్చేలాగా చూసుకోవాలి.

రచయిత సమాచారం

డా||యం. నాగభూషణం, డా|| ఆర్‌. శ్రవణ్‌ కుమార్‌, డా|| కె. రాంజేంద్రప్రసాద్‌, డా|| బి. సతీష్‌ చంద్ర, డా|| కె. రుక్మిణిదేవి, డా|| ఎస్‌. మాలతి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, వరంగల్‌, ఫోన్‌ : 9010104998