Print this page..

పెసర మరియు మినుము పంటల్లో సస్యరక్షణ

మన శరీరానికి అవసరమైన అనేక మాంసకృత్తులను, ఖనిజ లవణాలను అపరాల్లో అత్యధికంగా లభ్యమవుతాయి. మినుము మరియు పెసర పంటలను తొలకరిలో మెట్ట పంటగానూ, రబీలో ఆరుతడి పంటగానూ, వరి తరువాత మాగాణి భూముల్లో విత్తడం వెదజల్లడం ద్వారా పంటను సాగు చేసుకోవచ్చు. మినుము మరియు పెసర పైర్లను ఏక పంటగా కాకుండా పత్తి, కంది, ఆముదం వంటి పైర్లలో అంతర పంటగా కూడా సాగుచేయవచ్చు. వివిధ పంటల సరళిలో పంట మార్పిడిగా పండించడం వల్ల భూసారాన్ని పరిరక్షంచుకోవచ్చు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తొలిదశ నుండే  వివిధ రకాల పురుగులు, తెగుళ్ళు ఆశించడం వల్ల రైతులు అధిక దిగుబడులు సాధించలేకపోతున్నారు. సరైన రకాలకు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడంతో పాటు సకాలంలో సస్యరక్షణ చర్యలు పాటించడం వల్ల ఆశించిన దిగుబడులను సాధించవచ్చు. 

చీడపీడలు - సస్యరక్షణ : 

తెల్ల దోమ : 

ఇవి ఆకుల అడుగు భాగం నుండి రసం పీల్చడం ద్వారా ఆకులు మడతలు పడి క్రమేపి ఎండి రాలిపోతాయి. ఈ పురుగులు పల్లాకు తెగులు అనే వైరస్‌ తెగులును కూడా వ్యాపింపచేస్తాయి. దీని నివారణకు మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా మిథైల్‌ డెమటాన్‌ 2 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్‌ 0.2 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. 

తామర పురుగులు  : 

ఈ పురుగులు పైరు తొలిదశలో ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగచేస్తాయి. ఇవి ఆకుల అడుగు భాగంలో చేరి ఆకుల్లోని రసాన్ని పీల్చడం వల్ల ఆకులు మడతలు పడి వంకర్లు తిరుగుతాయి. తామర పురుగులు ఆశించిన మొక్కల పెరుగుదల ఆగిపోయి గిడసబారి పోతాయి. ఈ పురుగులు ఆకుముడత అనే వైరస్‌ వ్యాధిని వ్యాపింపచేస్తాయి. దీని నివారణకు మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1 గ్రా. లేదా ఫిప్రోనిల్‌ 2 మి.లీ.  లేదా స్పైనోశాడ్‌ 0.3 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 

చిత్త పురుగులు  : 

ఈ పురుగులు చిరు దశలో ఎక్కువగా ఆశించడం వల్ల మొక్కల్లో పెరుగుదల లేక లేత మొక్కలు చనిపోతున్నాయి. ఇవి ఆకులపై గుండ్రని రంధ్రాలను చేస్తాయి. నివారణకు క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. లేదా మోనోక్రోటోఫౄస్‌ 1.6 మి.లీ.లేదా ఎసిఫేట్‌ 1 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. 

మారుకా మచ్చల పురుగు : 

ఈ పురుగు మొగ్గ, పూత దశలో ఆశించి ఎక్కువ నష్టం కలుగచేస్తాయి. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటాయి. ఇవి గూళ్ళలోనే ఉండి తింటూ ఉండడం వల్ల పురుగులను ఆశించే బదనిక పురుగులు, పరాన్నజీవుల బారి నుండి రక్షించబడటమే కాక పురుగుల మందు ప్రభావం నుండి కూడా తప్పించుకునే అవకాశముంటుంది. దీని ఉధృతి అధికంగా ఉండి సరైన సమయంలో నివారించలేక పోయినట్లయితే దాదాపు 80 శాతం దిగుబడులకు నష్టం కలుగుతుంది. నివారణకు పూత దశలో 5 శాతం వేప గింజల కషాయం లేదా వేప నూనె 5 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. మొగ్గ పూత దశలో పిల్ల పురుగులు కనిపించినట్లయితే క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. లేదా థయోడికార్బ్‌ 1 గ్రా. లేదా ఎసిఫేట్‌ 1 గ్రా. లేదా నొవాల్యురాన్‌ 1 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. 

శనగపచ్చ పురుగు : 

ఈ మొగ్గ దశలో వర్షం లేదా చిరుజల్లులు పడినప్పుడు లేదా రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది. ఇది గింజను డొల్ల చేస్తాయి. పురుగు తిన్న కాయకు గుండ్రటి రంధ్రాలు కనిపిస్తాయి. నివారణకు క్వినాల్‌ఫాస్‌ 2 మి.లీ లేదా ఎండాక్సాకార్బ్‌ 1 మి.లీ లేదా స్పైనోశాడ్‌ 0.3 మి.లీ. ఒక లీటరు నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. 

పొగాకు లద్దె పురుగు : 

ఈ పురుగు తొలిదశలో ఆకుల్లోని పత్రహరితాన్ని గీకి తినడం వల్ల ఆకులు తెల్లగా జల్లెడాకుగా మారిపోతాయి. ఇవి ఆకులను, పూత, పిందె, కాయలను తినేస్తాయి. ఈ పురుగు పగటి పూట నీడలోని నేల మీద ఉండి రాత్రిపూట పైరుకు నష్టం చేస్తాయి. పైరులో ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు పెట్టి తల్లి పురుగులు ఉధృతిని గమనించాలి. నివారణకు పురుగు తొలిదశలో క్లోరిఫైరిఫాస్‌ 2.5 మి.లీ. / లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు సాయంత్రంవేళలో విషపు ఎరలను మొక్కకు మొదళ్ళ వద్ద పడేలా సాయంత్రం వేళలో చల్లి పురుగులను నివారించుకోవాలి. 

తెగుళ్ళ యాజమాన్యం : 

పల్లాకు తెగులు (ఎల్లో మొజాయిక్‌) : 

ఈ తెగులును కలుగ చేసే వూరస్‌ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. లేత ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి. పిందెలు, కాయలు పసుపు రంగులోకి మారి కాయల్లో విత్తనాలు ఏర్పడవు. తెల్లదోమ నివారణకు మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. పెసరలో డబ్ల్యుజిజి - 37, డబ్ల్యుజిజి-42 మరియు యంజిజి-351 రకాలు తెగులును కొంత వరకు తట్టుకోగలవు. మినుములో ఎల్‌.బి.జి-752, ఎల్‌డిజి-787, పియు-31 రకాలను సాగుచేయాలి. 

ఆకుముడత తెగులు  : 

ఈ తెగులును ఉధృతి వర్షాభావ పరిస్థితుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకుల అంచులు వెనుకు ముడుచుకుని మెలికలు తిరిగి రాలిపోతాయి. లేత దశలో వ్యాధి సోకినట్లయితే తలలు మాడిపోయి మొక్కలు ఎండిపోతాయి. ఈ తెగులు వ్యాప్తి చెందడానికి కారణమైన తామరపురుగు నివారణకు ఎసిఫేట్‌ 1 గ్రా. లేదా 2 మి.లీ. డైమిథోయేట్‌ లేదా 1 మి.లీ. ఫిప్రోనిల్‌ మందును లీటరు నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. 

సెర్కోస్పొర ఆకుమచ్చ తెగులు  : 

ఈ తెగులును పంట యొక్క పూత దశ నుండి ఆశిస్తుంది. తెగులు సోకిన ఆకులపై చిన్న గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. క్రమేపి ఈ మచ్చలు ముదురు గోధుమ రంగులోకి మారి మచ్చ మధ్యలో బూడిద లేదా తెల్లని రంగు చుక్క కలిగి ఉంటుంది. దీనివల్ల కాయలో గింజలు సరిగా నిండవు. దీని నివారణకు కార్బండిజమ్‌ 1 గ్రా. లేదా మాంకోజెబ్‌ 2.5 గ్రా. లీటరు నీటకి కలిపి పిచికారి చేయాలి. 

బూడిద తెగులు  : 

గాలిలో తేమ శాతం 80-85 శాతం ఉన్నప్పుడు మరియు వర్షాల వల్ల పొడి వాతావరణం ఉన్నప్పుడు ఈ తెగులు సమస్య ఎక్కువగా ఉంటుంది. ముదురు ఆకులపై బూడిద రూపంలో చిన్న మచ్చలు కనపడి క్రమేణా పెద్దవై ఆకుపై, కింది భాగాలకు కొమ్మలు మరియు కాండంపై వ్యాపిస్తాయి. నివారణకు కార్బండిజమ్‌ 1 గ్రా. లేదా కెరాథేన్‌ 1 మి.లీ. లేదా ప్రొపికొనజోల్‌ 1 మి.లీ. ఒక లీటరు నీటికి కలుపుకొని 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. 

సీతాఫలం తెగులు  : 

ఇది పేనుబంక పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకులు పెద్దవై ఆకుపై ఉబ్బెతై సీతాఫలం కాయలాగ కనబడుతుంది. ఈ తెగులు వ్యాప్తి చెందడానికి కారణమైన పేనుబంకను నివారించుకోవడానికి ఎసిఫేట్‌ 1 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 0.3 మి.లీ లీటరు నీటికి కలుపుకొని పిచికారి చేయాలి.

రచయిత సమాచారం

జి. నీలిమ, డా|| ఓ. శైలా, డా|| కె. అనిల్‌ కుమార్‌, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పాలెం. నాగర్‌ కర్నూలు