Print this page..

యాసంగి వరిలో నారుమడి యాజమాన్యం

తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన అహారపంట వరి. ఈ రాష్ట్రంలో యాసంగిలో సుమారు 6 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. గత వానాకాలంలో విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా సాగునీటి వనరులు సమృద్ధిగా పెరిగాయి. రాష్ట్రంలో పెరిగిన నీటి వనరుల దృష్ట్యా యూసంగిలో వరి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. రైతులు అధిక దిగుబడులు పొందడానికి మేలైన యాజమాన్య పద్ధతులను పాటించాలి. అందులో ముఖ్యమైన అంశం నారుమడి యాజమాన్యం.

యాసంగికి అనువైన వరి రకాలు : 

యాసంగిలో స్వల్పకాలిక రకాలైన జగిత్యాల వరి-1 (జె.జె.యల్‌-24423), కూనారం వరి-1 (కె.ఎన్‌.ఎమ్‌-733), బతుకమ్మ (జె.జి.యల్‌-18047), కూనారం సన్నాలు (కె.ఎన్‌.ఎమ్‌-118), తెలంగాణ సోనా (ఆర్‌.ఎన్‌.ఆర్‌-15048), కాటన్‌ దొర సన్నాలు (యంటియు-1010), ఐ.ఆర్‌-64, అంజన (సె.జి.యల్‌-11118), తెల్లహంస (ఆర్‌.ఎన్‌.ఆర్‌-10754), ఎర్రమల్లెలు (డబ్ల్యు.జి.ఎల్‌-20471) ఎంపిక చేసుకొని అధిక దిగుబడులు సాధించవచ్చు.

నారుమడి తయారీ :

ఒక ఎకరా ప్రధాన పొలంలో నారు వేయడానికి 2 గుంటలు / 200 చ.మీ. / 5 సెంట్ల నారుమడి అవసరం అవుతుంది. అంతేకాక ఈ స్వల్పకాలిక రకాలను నవంబరు 10 నుండి 15 వరకు నార్లు పోసుకోవాలి. 

నారుమడి తయారీకి 2-3 వారాల ముందు బాగా మాగిన 500 కిలోల పశువుల ఎరువు వేసి బాగా కలియదున్నాలి. తరువాత నారుమడిలో నీరు పెట్టి 3-4 సార్లు 10-12 రోజుల కాల వ్యవధిలో దమ్ము చేసి చదును చేయాలి. నారుమడికి నీరు పెట్టడానికి మరియు అధికంగా ఉన్న నీటిని తీయడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఎత్తైన నారుమళ్ళను విధిగా తయారు చేసుకోవాలి. 

విత్తన మోతాదు : 

ఎకరానికి నాటే పద్ధతిలో దొడ్డురకాలైతే 25 కిలోలు, సన్నగింజరకాలైతే 20 కిలోల విత్తనం అవసరమవుతుంది. 

విత్తన శుద్ధి : 

విత్తనం ద్వారా సంక్రమించే వ్యాధుల నుండి పంటను కాపాడుకోవడానికి మెట్ట నారుమళ్ళకైతే కిలో విత్తనానికి 3 గ్రా. కార్బెండిజమ్‌ను పట్టించి ఆరబెట్టి 24 గం|| తరువాత నారుమడిలో చల్లుకోవాలి. దమ్ము చేసిన నారుమళ్ళకైతే లీటరు నీటికి 1 గ్రా. కార్బెండిజమ్‌ను కలిపిన ద్రావణంలో 24 గంటలు నానబెట్టి 48 గంటలు మండె కట్టాలి. మొలకెత్తిన విత్తనాలను లీటరు ద్రావణం సరిపోతుంది. 

నిద్రావస్థ తొలగింపు :

విత్తనాల్లోని నిద్రావస్థను తొలగించడానికి లీటరు నీటికి తక్కువ నిద్రావస్థ (2-3 వారాలు) ఉన్న విత్తనాలకైతే 6.3 మి.లీ. ఎక్కువ నిద్రావస్థ (4-5 వారాలు) ఉన్న విత్తనాలకైతే 10 మి.లీ. గాఢ నత్రికామ్లం కలిపిన ద్రావణంలో 24 గంటలు నానబెట్టి, కడిగి మండెకట్టాలి. మొలకెత్తిన విత్తనాలను నారుమడిలో పలుచగా, సమానంగా చల్లుకోవాలి. 

ఎరువుల యాజమాన్యం : 

నారుమడిలో 2 కిలోల నత్రజని (4 కిలోల యూరియా), 1 కిలో భాస్వరం (6.25 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌) మరియు 1 కిలో పొటాష్‌ (2 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌)లను ఆఖరి దమ్ములో సమానంగా పడేటట్లు వేయాలి. 

చలి యాజమాన్యం : 

యాసంగిలో ముఖ్యంగా తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరిలో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వల్ల వరి నారు సరిగా ఎదగక ఎర్రబడి చనిపోతుంది. దీన్ని అధిగమించేందుకు వీలుగా వరి నారు మళ్ళపైన ఇనుప చువ్వలు, కర్రలతో ఊతం ఏర్పాటు చేసి వాటిపైన పలుచగా పాలిథీన్‌షీట్‌ లేదా యూరియా బస్తాలతో కుట్టిన పట్టాలను సాయంత్రం వేళల్లో కప్పి ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి. దీనివల్ల చలి ప్రభావం తగ్గి నారు త్వరగా పెరుగుతుంది. నారుమడికి సాయంత్రం నీటిని ఎక్కువగా పెట్టి మరుసటి రోజు  ఉదయాన్నే చల్లటి నీటిని తీసివేసిమళ్ళీ కొత్త నీరు పెడుతూ ఉండాలి. 

యాసంగి చివర్లో తరుచుగా వచ్చే వడగండ్ల అకాల వర్షాల వల్ల పంటనష్టం తగ్గించేందుకు ఏప్రిల్‌ మొదటివారంలో పూ కోతలు పూర్తయ్యే విధంగా నార్లుపోసి నాటుకోవడం ముఖ్యం. మరీ ఆలస్యంగా డిసెంబరు చివరి నుండి జనవరి చివరి వరకు నార్లు పోసినట్లయితే పంట కోతలు ఏప్రిల్‌ లేదా మే లో వచ్చి పంట నష్టం జరిగే అవకాశం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సన్నగింజ రకాలు గింజ గట్టిపడే దశల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నట్లయితే గింజ పగుళ్ళు ఏర్పడి నూక శాతం అధికమవుతుంది. తద్వారా దిగుబడికి సరైన మద్దత ధర లభించక నష్టపోవడం జరుగుతుంది.

ఈ విధంగా యాసంగిలో సాగు చేసుకోవడానికి అనువైన రకాలను సరైన సమయంలో నారుపోసుకొని నారుయాజమాన్యం సక్రమంగా చేసుకుంటే వరిలో అధిక దిగుబడులు సాధించవచ్చు.

రచయిత సమాచారం

డా|| యం. నాగభూషణం, డా|| ఆర్‌. శ్రవణ్‌కుమార్‌, డా|| కె. రాజేంద్రప్రసాద్‌, డా|| బి. సతీష్‌ చంద్ర, డా|| కె. రుక్మిణీదేవి, డా|| ఎస్‌. మాలతి, డా|| పి. జగన్మోహన్‌ రావు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్‌, ఫోన్‌ : 9010104998