Print this page..

రబీ మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ-సమగ్ర సస్యరక్షణ

మానవాళికి ఆహరంగానే  కాకుండా కోళ్ళ  పరిశ్రమకు ముడి సరుకుగా దాణా రూపంలో, పశువులకు మేతగా వివిధ రకాల పాప్‌కార్న్‌, బేబీ కార్న్‌, స్వీట్‌ కార్న్‌ రూపాలలో మొక్కజొన్న ప్రజలకు బహు రుచులలో లభిస్తుంది. తెలంగాణలో మొక్కజొన్న ప్రధానమైన పంట అనే చెప్పుకోవచ్చు. సాగు విస్తీర్ణం చూసినట్లయితే 16 లక్షల ఎకరాలు, ఉత్పత్తి 28 లక్షల టన్నులు మరియు దిగుబడి 17 క్వింటాళ్ళు ఒక ఎకరానికి (2017-18) గాను నమోదయింది. ఇటువంటి మొక్కజొన్న పంటకు ఊహించని రీతిలో రైతన్నల బ్రతుకులు కుదేలు చేస్తున్న పురుగు 'కత్తెర పురుగు' ఆంగ్లంలో దీన్ని ఫాల్‌ఆర్మీ  వార్మ్‌(స్పోడొప్తెర ఫ్రుజిపర్ద) అని అంటారు.

గత సంవత్సరం ఖరీఫ్‌ మరియు రబీలో సాగుచేసే మొక్కజొన్న, జొన్న మరియు ఇతర రకాల పంటలపై ఈ కత్తెరపురుగు ఆశించి దిగుబడి తగ్గించడమే కాకుండా రైతులు దీని నివారణ కోసం అధిక పెట్టుబడి పెట్టారు. మరి ఇటువంటి తరుణంలో రైతులు ఈ పురుగు నివారణకు సామూహికంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి పెట్టుబడిని తగ్గించి అధిక దిగుబడి రాబట్టాలి. 

కత్తెర పురుగు జీవిత చక్రం : 

కత్తెర పురుగు తన జీవిత చక్రాన్ని 34-36 రోజుల్లో పూర్తి చేసుకుంటుంది. ఒక్కొక్క ఆడ పురుగు సుమారు 1500-2000 వరకు గుడ్లను ఆకు క్రింది భాగంలో మరియు కాండంపై పెడుతుంది.

కత్తెర పురుగును గుర్తించడం ఎలా?

 • తొలిదశ లార్వాలు లేత ఆకుపచ్చని దేహం కలిగి, తల నల్లని రంగులో ఉంటుంది.
 • ఎదిగిన లార్వా ముదురు గోధుమ రంగులో ఉండి, తలపై తెల్లని తల క్రిందులుగా ఉన్న 'Y' ఆకారపు గుర్తు కలిగి ఉంటుంది.
 • ముదురు గోధుమ రంగు లార్వా దేహంపై నల్లని చుక్కల వరుసలు ఉండి, తోక వైపు 8వ కణుపుపై నాలుగు నల్లని చుక్కలను చతురస్రాకారంలో గమనించవచ్చు. 

మొక్కజోన్నలో కత్తెర పురుగు ఆశించే విధానం : 

 • మొదటి దశ లార్వాలు పత్రహరితాన్ని గోకి తినుట వల్ల ఆకులపై తెల్లటి పొర ఏర్పడుతుంది.
 • రెండు మరియు మూడవ దశ లార్వాలు ఆకుసుడిలో ఉండి రంధ్రాలు చేసుకుంటూ తినటం వల్ల విచ్చుకున్న ఆకుల్లో వరుస రంధ్రాలు ఏర్పడుతాయి.
 • సుడిలో ఆకులను పూర్తిగా కత్తిరించి వేస్తుంది. పురుగు విసర్జన పసుపు పచ్చని గుళికలను సుడుల్లో గమనించవచ్చు.

కత్తెర పురుగు నివారణకు తీసుకోవాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు :

 • ఖరీఫ్‌ పంటతీసిన వెంటనే పొలాన్ని లోతుగా దున్నాలి, దీని వలన కోశస్థ దశలో ఉన్న కత్తెర పురుగును అదుపు చేయవచ్చు.
 • మొక్కజొన్నను సరైన సమయంలో సామూహికంగా వారం రోజుల వ్యవధిలో విత్తుకోవాలి, విడతలుగా విత్తుకున్నట్లయితే ఆలస్యంగా విత్తుకున్న పొలంలో ఈ పురుగు ఎక్కువ ఆశిస్తుంది.
 • ఎరువుల యాజమాన్యాన్ని సమతుల్యంగా పాటించినట్లయితే కత్తెర పురుగును అదుపులో ఉంచవచ్చు. 
 • విత్తుటకు 24 గంటల ముందు విత్తనశుద్ధి చేసుకోవాలి, విత్తనశుద్ది కొరకు ముందుగా ఒక కిలో విత్తనాలను ఫాలథీన్‌ కవర్‌పై పరచి ఇమిడాక్లోప్రిడ్‌ 600 ఎఫ్‌.ఎస్‌. 4 మి.లీ మందును విత్తనాలపై చల్లి కలుపుకోవాలి. తద్వారా పంటను 15-20 రోజుల వరకు కాపాడుకోవచ్చు.
 • మొక్కజొన్నలో అంతర పంటలను ముఖ్యంగా పప్పుధాన్య పంటలను సాగు చేయడం వల్ల మిత్ర పురుగుల సంఖ్య పెరిగి కత్తెర పురుగును అదుపులో ఉంచుతాయి.
 • పొలంలో కలుపు లేకుండా జాగ్రతలు పాటించాలి, మొదటి 45 రోజుల వరకు కలుపు యాజమాన్యం చాలా ముఖ్యం. 
 • కత్తెర పురుగు ఉనికిని గమనించడానికి మొక్కజొన్న విత్తిన మొదటి నుంచే ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి
 • పంట తొలిదశ నుంచే పక్షి స్తావరాలుగా ఎకరానికి 10-15 నిుకు ఆకారపు కర్రలను అమర్చుకోవాలి. వీటి వలన కత్తెరపురుగులను మొదటి దశలోనే అదుపు చేయవచ్చు.
 • పంట నాటిన తొలిదశనుంచే కత్తెరపురుగుపై నివారణ చర్యలు చేపట్టాలి.

మొదటి దశలో పంట విత్తిన 30 రోజుల వరకు తీసుకోవాల్సిన నివారణ చర్యలు :

 • మొక్కజొన్న పంటలో కత్తెరపురుగు గ్రుడ్లను లేదా లింగాకర్షక బుట్టలో రోజుకు ఒక రెక్కల పురుగు లేదా 5 శాతం పురుగు ఆశించిన మొక్కలను గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
 • కత్తెరపురుగు గుడ్లను మరియు మొదటిదశ పిల్ల పురుగులను నివారించడానికి ఆజాడిరక్టిన్‌ 1500 పి.పి.యం.ఏ 5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
 • కత్తెరపురుగు ఉధృతిని బట్టి (5-10 శాతం ఆశించిన ఆకులు) ఇమామెక్టిన్‌  బెంజోయేట్‌ 0.4 గ్రా లేదా స్పైనోశాడ్‌ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి మొక్క సుడుల్లో పడే విధంగా పిచికారి చేసుకోవాలి.
 • కత్తెర పురుగు ఉధృతి 20 శాతం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు క్లోరాంట్రానిలిప్రోల్‌ 18.5 శాతం ఎస్‌.సి. 0.4 మి.లీ లేదా స్పైనొటోరము 0.5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.
 • ఎకరానికి 9 కిలోల ఇసుక మరియు ఒక కిలో సున్నంతో కలిపి మొక్క సుడుల్లో వేసుకోవాలి, వేసుకున్నచో ఇసుక రాపిడికి లార్వాలు  చనిపోతాయి.
 • పొలంలో కత్తెర పురుగు గుడ్ల సముదాయం కనిపించిన వెంటనే టిలినోమస్‌ రీమస్‌ లేదా ట్రైకోగ్రమా ప్రిటియోజమ్‌ను ఎకరాకు 50,000 చొప్పున 7 నుండి 10 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు పొలంలో వదలాలి.
 • తొలిదశలో ఉన్న పిల్ల పురుగుల నివారణకు జీవకీటక నాశినియైన మెటారైజియం  ఎనైసోప్లియె లేదా నోమోరియా రిలియే అను శిలింధ్రాలను  5 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. 

మొక్కజొన్న పంట 30-65 రోజుల దశలో తీసుకోవలసిన నివారణ చర్యలు :

 • 10-20 శాతం కత్తెరపురుగు ఆశించిన మొక్కలు గమనిస్తే నివారణ చర్యలు చేపట్టాలి. 
 • ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ 0.4 గ్రా లేదా స్పైనొటోరము 0.5 మి.లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ 0.4 మి.లీ లీటరు నీటికి కలిపి మొక్క సుడుల్లో పడే విధంగా పిచికారి చేసుకోవాలి. 
 • ఇసుక మరియు సున్నం 9:1 నిష్పత్తిలో కలిపి ఆ మిశ్రమాన్ని మొక్క సుడుల్లో వేసుకోవాలి.
 • ఎదిగిన లార్వాల నివారణకు విషపు ఎరను మొక్క సుడిలో వేసుకోవాలి.

విషపు ఎర తయారి విధానం :

ఎకరానికి 10 కిలోల తౌడు, 2 కిలోల బెల్లం తీసుకొని, బెల్లంను 2 లీటర్ల నీటిలో కరిగించి తరువాత తౌడులో కలిపి మిశ్రమాన్ని 24 గంటలు పులియనిచ్చి అరగంట ముందు ఈ మిశ్రమాన్ని 100 గ్రా. థయోడికార్బ్‌ కలిపి విషపు ఎరను తయారు చేసుకోవాలి.

65 రోజులు దాటిన పొలంలో తీసుకోవలసిన నివారణ చర్యలు :

 • ఈ దశలో పురుగు మందులు పెద్దగ పనిచేయవు.
 • ఎదిగిన లార్వాలను ఏరి కిరోసిన్లో ముంచి నాశనం చేయాలి.
 • ఎదిగిన లార్వాల నివారణకు విషపు ఎరను మొక్క సుడిలో వేసుకోవాలి.

పిచికారి చేయు పద్ధతి :

 • పైన చెప్పబడిన పురుగు మందులను మొక్క సుడిలో పడేటట్లుగా సాయంకాలం వేళలో పిచికారి చేయాలి.
 • నివారణ చర్యలను సరైన సమయంలో చేయగలిగితే దిగుబడి తగ్గకుండా జాగ్రత్త పడవచ్చు.

ఇతర వివరాలకు సంప్రదించ వలసిన ఫోన్‌ నెంబరు 8802345027 శాస్త్రవేత్త, (సస్యరక్షణ) జిల్లా ఏరువాక కేంద్రం ఆదిలాబాద్‌.)

రచయిత సమాచారం

డా|| వీరన్న, డా|| యం. సంపత్‌ కుమార్‌, డా|| సుధాన్షు కస్బే, శాస్త్రవేత్తలు, జిల్లా వ్యవసాయ సలహా మరియు సాంకేతిక పరిజ్ఞాన బదిలీ కేంద్రం (జిల్లా ఏరువాక కేంద్రం), ఆదిలాబాద్‌, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఫోన్‌ : 8802345027