Print this page..

రబీ మొక్కజొన్న సంకర విత్తనోత్పత్తిలో అనుసరించాల్సిన మెళకువలు

అన్ని కాలాలకు అనువైన పంటల్లో ప్రధాన ఆహార ధాన్యాపుపంట మొక్కజొన్న. ఈ మొక్కజొన్నను మనం ఆహారంగానేగాక, దాణారూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను, పేలాలు, తీపికండె మరియు బేబికార్న్‌ గాను ఉపయోగించడం జరుగుతుంది. ఇంతగా ఆర్థిక ప్రాముఖ్యతను సంతరించుకోవడం వల్ల మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరుగుతూ ఉంది. కానీ దిగుబడుల్లో స్థిరత్వం లేకుండా పోతుంది. సాంప్రదాయక పద్ధతిలో మొక్కజొన్న సాగు సత్ఫలితాలను ఇస్తున్నప్పటికీ రైతులు ఆశించినంత దిగుబడులను సాధించలేకపోతున్నారు. మొక్కజొన్న సాగులో స్థిరత్వమైన అధిక దిగుబడులను సాధించలేకపోతున్నారు. మొక్కజొన్న సాగులో స్థిరత్వమైన అధిక దిగుబడులను సాధించాలంటే సంకరవిత్తనోత్పత్తి చేపట్టినట్లయితే స్వచ్ఛమైన నాణ్యత కలిగిన విత్తనాలను పొందవచ్చు.

దేశంలోని మొక్కజొన్న హైబ్రిడ్‌ విత్తనోత్పత్తిలో దాదాపుగా 30 శాతం పైగా దక్షిణాది రాష్ట్రాల్లో చేపడుతున్నారు. మనతెలుగు రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు విత్తనోత్పత్తిపై మక్కువ చూపిస్తూ తద్వారా వ్యాపార సరళి మొక్కజొన్న సాగు కన్నా అధిక లాభాలు పొందుతున్నారు. 

మొక్కజొన్న సంకరరకాలు మూడురకాలు. అందులో ప్రధానంగా ఏకసంకరాల సాగు ఎక్కువ తరువాత ద్విసంకరాలు మరియు త్రిసంకర రకాలను విత్తనోత్పత్తి చేపట్టడం జరుగుతుంది. 

సంకర విత్తనోత్పత్తి చేయాలంటే కావలసిన ఆవశ్యకతలు : 

 • వాతావరణ సమయం అది నవంబర్‌, డిసెంబరులో విత్తుకోవాలి.
 • సారవంతమైన నేలలు
 • అంతకు ముందు పంట ఆ నేలలో మొక్కజొన్న కాకుండా ఉండాలి
 • నీటి వసతి ఉండాలి.
 • ఏర్పాటు దూరం ఖచ్చితంగా పాటించాలి.
 • అధిక దిగుబడినిచ్చే ఆడరకం, అధిక పుప్పొడిని ఎక్కువ సమయం వరకు ఇచ్చు మగ రకం
 • విత్తనోత్పత్తిలో నైపుణ్యత రైతులు కలిగి ఉండాలి
 • కూలీల కొరత ఉండకూడదు.

హైబ్రీడ్‌ విత్తనోత్పత్తిలో సాంకేతిక అంశాలు : 

 • అంతర ఏర్పాటుదూర లేదా అంతర సమయం
 • ఆడ మరియు మగ రకాల నిష్పత్తి
 • బెరకులు తీసివేయుట
 • ఆడ మరియు మగ రకాల సాళ్ళు ఒకేసారి పుష్పించుట
 • జల్లుల తీసివేయుట

మొక్కజొన్న  సంకరవిత్తనోత్పత్తిలో పాటించాల్సిన అంశాలు : 

విత్తనోత్పత్తి పొలం ఎంపిక : 

మురుగునీరు నిలవని, కలుపు మరియు తెగుళ్ళు ఆశించని నేలలు మరియు క్రితం సీజన్‌లో మొక్కజొన్నను సాగుచేయరాదు. ఒకవేళ వేసిన పొలాన్ని వినియోగిస్తే బెరకులు లేకుండా జన్యుస్వచ్ఛత కొరకై నీటితడిని ఇచ్చి క్రితం సీజన్‌ నేలలోని విత్తనాలను మొలకెత్తనిచ్చి దున్ని నశింపచేయాలి.

విత్తేసమయం : 

ప్రస్తుత సమయంలో డిసెంబరు రెండవ వారం వరకు స్వల్పకాలిక జనని, జనక రకాలను విత్తడానికి వీలుంటుంది. 

విత్తన మోతాదు : 

ఎకరానికి 10 కిలోలు ఆడ, మగ విత్తనాలు అవసరం అవుతాయి. మగ విత్తనాల మోతాదు ఆడ విత్తనాల మోతాదు కంటే ఎల్లప్పుడూ తక్కువగానే ఉంటుంది. 

విత్తుకునే పద్ధతి : 

60I20 సెం.మీ. చొప్పు న బోదెలకు విత్తుకోవాలి. ఎక్కువ లోతుల్లో మరియ మట్టి పెళ్ళల మధ్య విత్తుకోరాదు. ఆడ మొక్కలు ఎక్కువ దగ్గరగా విత్తుకోరాదు. మగ మొక్కలు దగ్గరగా ఉండేలా విత్తుకోవాలి. 

ఆడ మరియు మగ రకాల నిష్పత్తి : 

ఆడ మరియు మగ రకాల నిష్పత్తి హైబ్రీడ్‌ రకం దశ, మగరకం, పుప్పొడినిచ్చు శక్తిని బట్టి 1:3 లేదా 1:4 (ఏక సంకర) నుండి 1:5 లేదా 1:6 (త్రి, ద్వి సంకర) మరియు దశను బట్టి 200-600 మీ. వరకు ఉండాలి.

అంతర దూరము / సమయం : 

రెండు క్షేత్రాల మధ్య దూరం, హైబ్రీడ్‌ రకం (ఏక, ద్వి & త్రి సంకర) మరియు దశను బట్టి 200-600 మీ. వరకు ఉండాలి. 

కలుపు, ఎరువులు మరియు నీటి యాజమాన్యం : 

మూమూలుగా సాగుచేసే మొక్కజొన్నలో తడుల ఏ విధంగా అవసరమవుతాయో అలాగే పంట అన్ని దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. మొదటి తడి, ఆడ, మగ సాళ్ళలోని విత్తనాలను కలసిపోకుండా ఇవ్వాలి. గింజ తయారయ్యే దశలో (పంట 70 రోజలు) ఎకరాకు 20 కిలోల నత్రజనిని అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. 

ఆడ, మగ రకాలు ఒకేసారి పుష్పించుట : 

కాల పరిమితిని బట్టి ఆడ, మగ రకాలను వేరు వేరు తేదీల్లో విత్తుకోవాలి. రెండూ ఒకే కాలపరిమితిగలవి అయినచో ఆడ రకాన్ని, మగ రకాన్ని ఒకే సారి విత్తుకోవాలి. మగ రకాన్ని దగ్గర దగ్గరగా ఎక్కువ సాంద్రతలో విత్తుకోవాలి. 

బెరకులు తీసివేయుట : 

 • విత్తన పంట పుష్పించుటకు ముందే బెరకులను ఏరివేయాలి. 
 • నేలల్లో క్రితం పంటకు చెంది మొలకెత్తిన బెరకు మొక్కలు, ఇతర పంట మొక్కలు, కలుపు మొక్కలు ఏరివేయాలి.
 • శాఖీయ దశలో మొక్కల ఎత్తు, ఆకులు మరియు కాండం మొక్క లక్షణాలను బట్టి బెరకులు తీసివేయాలి.
 • పూత దశల్లో, జల్లులు పుప్పొడిని వెదజల్లులకు ముందే ఆడ మరియు మగ వరుసల్లోని కేళీలను జల్లు, పూల గుణ గుణాలను బట్టి ఏరివేయాలి.

జల్లు తీసివేయుట : 

 • ఆడ వరుసల్లోని ప్రతి మగపుష్పగుచ్ఛాన్ని మొవ్వు నుండి బయటకు వచ్చిన వెంటనే తీసివేయాలి.
 • ఎడమ చేతిలో కాండాన్ని పట్టుకొని కుడి చేతితో జల్లు మొత్తం ఒకేసారి వచ్చేలా లాగాలి.
 • ఈ ప్రక్రియని 10-15 రోజుల వరకు చేపట్టాలి.

కోత మరియు తదుపరి యాజమాన్యం : 

పంట పక్వదశలోకి రాగానే ముందుగా మగ వరుసల కోత చేపట్టాలి. తదుపరి ఆడ వరుసల కోతను గింజ 25-30 శాతం దశలో చేపట్టాలి. కండెలను కల్లాల్లో లేదా ఎండబెట్టే యంత్రాల్లో బాగా ఎండబెట్టి గింజలను ఒలచి తేమ శాతం 8-12 శాతం వరక ఆరబెట్టాలి. యంత్రాల్లో ప్రాసెసింగ్‌, గ్రేడింగ్‌ మరియు విత్తన శుద్ధి చేసి ప్యాకింగ్‌ చేస్తారు. 

దిగుబడి : 

ఎకరాకు ఏక సంకరాలు అయితే 12-18 క్వింటాళ్లు వస్తుంది. మార్కెట్‌ ధర లేదా ప్రైవేటు వారి వద్ద అమ్మకం దరిదాపుగా ఒక క్వింటా పేరు మీద కండెలతో అమ్మినప్పుడుగరిష్టంగా రూ. 3000 పొందవచ్చు. కానీ ఎకరానికి 30-35 క్వింట్ళా దిగుబడులను ఒక విత్తనోత్పత్తిలోనే సాధ్యమవుతుంది. రైతులు వెచ్చించే ఖర్చులు పోగా నికరాదాయాన్ని ఆర్జించవచ్చు. అదేవిధంగా నాణ్యమైన విత్తనాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురాగలము.  

రచయిత సమాచారం

డా|| యస్‌. మధుసూదన్‌ రెడ్డి, డా|| కె. గోపాల కృష్ణమూర్తి, డా|| వి. వెంకన్న, డా|| సి. నరేంద్ర రెడ్డి, ఫోన్‌ : 9492357905