Print this page..

మామిడిని ఆశించే పురుగులు - యాజమాన్య పద్ధతులు

పండ్లలో రాజఫలం మామిడి. మామిడి సాగులో భారతదేశం అగ్రస్థానంలో ఉన్నప్పటికీ మామిడి పండ్ల ఉత్పత్తిలో మన రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది. మన రాష్ట్రం నుండి మామిడి పండ్లు హాంకాంగ్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఇంగ్లాండ్‌, సింగపూర్‌, మలేషియా, సౌదీ అరేబియా, కువైట్‌  మొదలగు దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 

మామిడి ఉత్పత్తిని ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన కారణాల్లో ఒకటి మామిడిని ఆశించే పురుగులుగా చెప్పవచ్చు. మామిడిని దాదాపు 250 రకాల పురుగులు ఆశిస్తాయి. మామిడిలో పూత మరాయు పిందె దశలో ఆశించే పురుగులు ఎక్కువగా నష్టపరుస్తాయి. వాటిలో ముఖ్యమైనవి తేనె మంచు పురుగులు మరియు తామర పురుగులు. మామిడి పిందెలు మరియు కాయలను ఆశించే పురుగుల్లో ముఖ్యమైనవి కాయపుచ్చు లేదా ముడ్డి పుచ్చు పురుగు మరియు వాటి నివారణ చర్యలు కింద తెలుపబడినవి. 

మామిడి పంట పూత సమయంలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో తేడా ఉండి మంచు పడడం వల్ల తేనె మంచు పురుగులు మరియు తామర పురుగులు ఆశించి పంటకు తీవ్రనష్టాన్ని కలుగచేస్తున్నాయి. రైతు సోదరులు ఈ పురుగులు ఆశించే సమయం, వాటి ఉద్రిక్తత, లక్షణాలు సకాలంలో గుర్తించి సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల పంటను రక్షించుకొని అధిక దిగుబడులు పొందవచ్చు. 

తేనె మంచు పురుగులు : 

తేనె మంచు పురుగులు గోధుమ రంగు, నలుపు రంగులో ఉంటాయి. సంవత్సరం పొడవునా మామిడి చెట్లలోని నెర్రెలు, మొదళ్ళలో నివశిస్తాయి. పూత వచ్చే సమయానికి తల్లి, పిల్ల పురుగులు గుంపులు, గుంపులుగా లేత ఆకులు, పూగుచ్ఛంపై చేరి రసాన్ని పీలుస్తాయి. పూగుచ్ఛం నుండి రసాన్ని పీల్చడం వల్ల పూమొగ్గలు మాడి రాలిపోతాయి. ఈ పురుగులు రసాన్ని పీల్చేటప్పుడు తియ్యని తేనెలాంటి పదార్థాన్ని విసర్జిస్తాయి. ఆకులపై, పూగుచ్ఛాలపై తేనె లాంటి పదార్థాన్ని విసర్జించినప్పుడు నల్లని కాప్నోడియం అనే శిలీంధ్రం (ఫంగస్‌) బాగా వృద్ధి చెంది ఆకులు, పూత, కాయలు, కాడలు, కొమ్మలపై నల్లని మసి తెగులు బాగా వృద్ధి చెంది ఆకుల్లో కిరణ జన్య సంయోగక్రియ జరుగక కాయలు / పిందెలు రాలిపోతాయి. ప్రస్తుత వాతావరణం ఈ పురుగులకు బాగా అనుకూలంగా ఉండడం వల్ల పురుగులు బాగా అభివృద్ధి చెంది. 50-60 శాతం పంట దిగుబడిని తగ్గిస్తున్నాయి. కనుక రైతు సోదరులు క్రింది తెలిపిన యాజమాన్య పద్ధతులను పాటించాలి. 

 • మురుగు నీరు తోటల్లో నిల్వ ఉండకుండా చూసుకోవాలి. 
 • తోటలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కలుపు నివారించుకోవాలి. 
 • పంట కోత అనంతరం ఎండు పుల్లలు, కొమ్మలను కత్తిరించుకోవాలి. ఇలా చేయడం వల్ల సరైన గాలి, వెలుతురు ఉండి పురుగుల సంతతిని తగ్గించుకోవచ్చు. 
 • జులై నుండి డిసెంబరు వరకు 50 రోజులకు ఒకసారి చెట్ల నెరళ్ళు, బెరడులు తడిచేటట్లు డైమిథోయేట్‌ 2 మి.లీ. లేదా వేపనూనె 3 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి కాండం, కొమ్మలు, బెరడు, నెరళ్ళు తడిచేటట్లు పిచికారి చేయాలి. 
 • పూత దశలో పూలు విచ్చుకోక ముందు థయోమిథాక్సామ్‌ 0.3 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 0.3 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 
 • మసితెగులు అధికంగా ఉన్నప్పుడు కార్బండిజమ్‌ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదా 3 గ్రా. కాపర్‌ఆక్సీక్లోరైడ్‌ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 

తామర పురుగులు : 

తామర పురుగులు చాలా చిన్నగా ఉండి పూత, కాయల నుండి రసాన్ని పీల్చి నష్టం కలుగచేస్తాయి. ఇవి 2 మి.మీ. సైజులో ఉండి పూగుత్తిపై, చిన్న గోళీ సైజు పిందెలపై చర్మాన్ని గోకి రసంపీల్చి వేస్తాయి. చిన్న పిందెలు రాలి పడిపోతుంటాయి. కాయ నాణ్యత తగ్గిపోతుంది. ఒక తెల్లని పేపరుపై పూగుచ్ఛాన్ని తట్టి చూస్తే ఈ పురుగుల ఉదృతిని తెలుసుకోవచ్చు. 

నివారణ : 

తామర పురుగులు ఆశించినట్లయితే పూమొగ్గ దశలో డైమిథోయేట్‌ 2 మి.లీ. లేదా థయోమిథాక్సామ్‌ 0.3 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. చిన్న పిందె దశలో ఆశించినట్లయితే ఫిప్రోనిల్‌ 2.0 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 

కాయతొలుచు లేదా కాయపుచ్చు లేదా ముడ్డి పుచ్చు పురుగు : 

మామిడి కాయతొలిచే పురుగులు జనవరి, ఫిబ్రవరి నుండి మే వరకు అపార నష్టం కలుగచేస్తాయి. ఈ పురుగు బఠాని సైజు కాయ నుండి ఎదిగిన పెద్ద కాయ వరకు ఆశిస్తుంది. 

కాయ తొలుచు పురుగు లక్షణాలు : 

కాయ ముక్కు భాగంలో నల్లటి రంధ్రంతో ఎండిన మామిడికాయ / పిందెలు గుత్తులు చెట్టుకు వ్రేలాడుట ప్రధానమైన లక్షణం. గోళీ సైజు కాయ దశలో ఒక్కొక్క గొంగళి పురుగు ఒకటి కన్నా ఎక్కువ కాయలకు నష్టం లుగచేయును. సాధారణంగా ఒక్కొక్క మామిడి కాయలో 4-6 గొంగళి పురుగులు ఉండును. చిన్న సైజు కాయలున్నప్పుడు పురుగులు ఒక కాయ నుండి మరొక కాయకు మారి ఎక్కువ నష్టం కలుగచేస్తాయి. ఎదిగిన లార్వాగులాబి, ఎరుపు అడ్డ చారలతో పొడవుగా ఉంటుంది. పెరిగిన లార్వాలు ఎండిన మామిడి కొమ్మలు, రెమ్మలు బెరడులో నిద్రావస్థలో డిసెంబరు వరకు కాలాన్ని గడుపుతాయి. పిందెలు ఏర్పడిన తరువాత రెక్కల పురుగులుగా రూపాంతరం చెంది, పూత, పిందెలతో మళ్ళీ జీవిత చక్రం కొనసాగిస్తాయి. 

నివారణ : 

 •  మామిడి పంట పూర్తయిన తరువాత ఎండిన కొమ్మలు, ఎండిన పుల్లలను తీసి ఏరివేసి తగులబెట్టాలి.
 • పురుగు ఆశించిన కాయలను చెట్టు నుండి కోసి నాశనం చేసి పురుగు వ్యాప్తిని నివారించాలి. 
 • జనవరి రెండవ పక్షంలో పురుగు మందులైన క్లోరిపైరిఫాస్‌ 20 ఇసి 2.5 మి.లీ. లేదా డైక్లోరోవాస్‌ 1.5 మి.లీ. లేదా తయాక్లోప్రిడ్‌ 1 మి.లీ. లేదా వేపనూనె 3 మి.లీ. + క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ., ఒక లీటరు నీటికి కలిపి సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి. 

పండు ఈగ / కాయ కొట్టే ఈగ : 

పండు ఈగలు మామిడి పండ్లపై కాయ పక్వానికి వచ్చిన సమయంలో గుడ్లు పెడతాయి. ఈ గుడ్ల నుండి పిల్ల పురుగులు బయటకు వచ్చి గుజ్జును తింటాయి. ఫలితంగా పండు కందినట్టు అవుతుంది. ఈ విధంగా కాయకొట్టే ఈగలు ఆశించిన పండ్లు రాలిపోతాయి. ఈ పండు ఈగ ఆశించిన పండ్లను వాటిపై సూదితో గుచ్చినట్లుగా ఉన్న రంధ్రాలను బట్టి గుర్తు పట్టవచ్చు. ఈ పండ్లకు తరువాత దశలో శిలీంద్రాల ఆశించి పండ్లు కుళ్ళి రాలిపోతాయి. 

నివారణ : 

 • పండు ఈగ ఆశించిన పండ్లను గుర్తించి కాల్చివేయాలి. 
 • పండు ఈగ నివారణకు, కాయ కోతకు మూడు వారాల ముందు డెకామెత్రిన్‌ 2.8 ఇసి 0.5 మి.లీ. ఒక లీటరు నీటికి అజాదిరక్టిన్‌ 0.3 శాతం 2 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
 • మిథైల్‌ యూజినాల్‌ మరియు 3 గ్రా. కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలు లీటరు నీటిలో కలిపి తయారు చేసిన ద్రావణాన్ని ఒక ప్లాస్టిక్‌ సీసాలో ఉంచి 200 మి. లీ. చొప్పున పోసి తోటలో చెట్ల కొమ్మలకు వేలాడదీయాలి. దీనివల్ల ఈగలు ఆకర్షించబడి మందు ద్రావణంలో పడి చనిపోతాయి.
 • మిథైల్‌ యూజినాల్‌ ఎరలను ఎకరానికి  నాలుగు నుండి ఆరు చొప్పున పెట్టుకోవాలి
 • రాలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలి చెట్టు కింద ఉన్న కోశస్థ దశను బయటకు వేయాలి

కాండం తొలిచే పురుగు : 

కాండం తొలుచు పురుగు మామిడి కాండం తొలుచుకుంటూ బెరడును, కొమ్మలను ఆశించి నష్టపరుస్తుంది. ఇవి ఆశించిన కొమ్మలే కాక ఒక్కోసారి మొత్తం చెట్టు కూడా ఎండి పోతుంది. పురుగుల విసర్జనాన్ని చూసి గాని, కొమ్మను తట్టినప్పుడు వచ్చే బోలు శబ్దాన్ని బట్టిగాని  వీటి ఉనికిని గమనించవచ్చు. ఈ పురుగు తీవ్రంగా ఆశిస్తే మొక్కలు కూడా చనిపోతాయి

నివారణ : 

 • ఎక్కువై పాడైన కొమ్మలను తీసివేయాలి.
 • గట్టి ఇనుప తీగలను లోపలి చొప్పించి పురుగులను బయటకి లాగి చంపివేసి రంధ్రాల్లో మిథైల్‌ పెరాథియాన్‌ 50 శాతం ఐ.సి. మందును ఒక మి.లీ. లీటరు నీటికి కలిపిన ద్రావణం లేదా పెట్రోలు లేదా అల్యూమినియం ఫాస్ఫైడ్‌ బిళ్ళలను వేసి బంకమట్టితో మూయాలి 

పిండి నల్లి : 

 • మామిడి పిందెలు, లేత ఆకులు, కాడలు, పూలు మరియు మామిడికాయలపై ఆశించి రసం పీలుస్తుంది. కాయ  తొడిమ పై గుంపులుగా చేరి  రసాన్ని పీలుస్తాయి
 • పిల్ల మరియు యు తల్లి పురుగులు తెల్లటి, మెత్తటి దూదిలాంటి పదార్థంతో కప్పబడి ఉంటాయి.
 • పిండి నల్లి ఉధతి జనవరిలో మొదలై మార్చి, ఏప్రిల్‌లో తీవ్రంలో ఉంటుంది. తల్లి పురుగులు మట్టిలో 25 నుంచి 50 సెం.మీ. లోతులో గుడ్లు పెడతాయి. ఒక తల్లి పురుగు సుమారు 300-400 గుడ్లను పెడుతుంది. పిల్ల పురుగులు కొమ్మలపైకి పాకుతాయి. వీటిపై తెల్లని దూది వంటి పదార్థం కప్పబడి ఉంటుంది. తల్లి పురుగుల జీవితకాలం 18-50 రోజులు పిండినల్లి విసర్జించిన తియ్యని పదార్థంపై మంగు తెగులు ఏర్పడడానికి కారణమైన శిలీంద్రాలు పెరిగి ఆకులు, కాయలపై నల్లటి మసి ఏర్పడి కిరణజన్య సంయోగక్రియ జరగకుండా చేస్తుంది. వీటి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కాయలు రాలిపోయి వయ్యారిభామ, సుబాబుల్‌ వంటి కలుపు మొక్కలపై కూడా పిండినల్లి ఎక్కువగా ఆశిస్తుంది. 

నివారణ : 

 • చెట్టులో గాలి వెలుతురు బాగా ప్రసరించేటట్లు అడ్డుకొమ్మల్ని కత్తిరించివేయాలి.
 • తొలకరిలో చెట్టు మొదలు దాకా దగ్గరగా దున్నాలి లేదా పాదులను తవ్వి తిరగవేయాలి.
 • చెట్టుకు మీటరు ఎత్తులో పాలిథీన్‌ పేపరు షీట్స్‌ కట్టడం, గ్రీజు పూయడం ద్వారా పురుగులు చెట్టు పైకి పాకకుండా నివారించవచ్చు.
 • చెట్ల మధ్య దున్నుకొని కలుపు నివారించాలి. 
 • చెట్ల పాదుల్లో లిండేన్‌ 5 శాతం పొడిని చల్లి మట్టిని తిరగబెట్టి పాదుల్లో ఉన్న పురుగులను నివారించాలి. దీనివల్ల పిండినల్లి గుడ్లను, చీమలను అరికట్టవచ్చు.
 • పిండినల్లి ఆశించిన కాయలను ఏరి కాల్చివేయాలి.
 • పిండినల్లిని అరికట్టడానికి ప్రొఫెనోఫాస్‌ 50 ఇసి లేదా ట్రైజోఫాస్‌ 40 ఇసి లేదా మిథైల్‌ పరాథియాన్‌ 50 ఇసి 3 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 75 డబ్ల్యుపి 2 గ్రా. లీటరు నీటికి కలిపి చెట్టంతా తడిచేలా పిచికారి చేయాలి.

టెంక పురుగులు : 

 • ఈ పురుగు ముఖ్యంగా నీలం, తోతాపురి రకాన్ని ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగచేస్తుంది. తల్లి పెంకు పురుగులు మామిడి కాయలు గోళీకాయ సైజులో ఉన్నప్పుడు కాయలమీద గుడ్లు పెడతాయి. గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు కాయలలోనికి తొలచుకుపోయి టెంకను చేరతాయి. టెంకలోని గింజపైన తిని పెరిగి కోశస్థ దశను కూడా అక్కడే పూర్తి చేసుకొని పురుగు కాయను రంధ్రం చేసి బయటకు వస్తుంది. 

నివారణ :

 • తోటలో రాలిన కాయలు, పండ్లను ఏరి కాల్చివేయాలి. దీనివల్ల రాబోయే పంటలో పురుగుల సంఖ్య బాగా తగ్గుతుంది, 
 • చెట్ల మొదళ్ళలో దున్ని పురుగు కోశస్థ దశను బయటపెట్టాలి.
 • ఫెనిట్రోతయాన్‌ 1 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి పిందె ఏర్పడిన తరువాత ఒకసారి నెల తరువాత మరోసారి పిచికారి చేయాలి. 
 • డైమిథోయేట్‌ 0.1 శాతం 2 మి.లీ. లీటరు నీటికి పండ్లు గోళీ ఆకారంలో ఉన్నప్పుడు 15 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. 

చెద పురుగులు :

 • మామిడిలో చెదలు అక్టోబరు నుండి డిసెంబరు వరకు ఎక్కువగా ఆశిస్తాయి. చెదలు చెట్ల బెరడుపై మట్టి పొరను ఏర్పరుస్తాయి.
 • చెద పురుగుల ఉధృతి మొదటి వర్షం పడగానే పెరుగుతుంది.
 • చెదలు ఎర్రని ఒండ్రు మట్టి నేలలో ఎక్కువగా ఉంటాయి. 
 • చెదపురుగులు వేర్లను తింటూ పండ్ల తోటల్లో బెరడుపై గూళ్ళను ఏర్పరచుకొని తింటాయి. వీటి ఉధృతి నర్సరీ మరియు లేత మొక్కల్లో ఎక్కువగా ఉంటుంది. 

నివారణ :

 • కొత్తగా మొక్కలు నాటేటప్పుడు ఒక్కో గుంతకు మట్టిలో అరకిలో వేపపిండి లేదా 100 గ్రా. ఫాలిడాల్‌ పొడిని కలపాలి. 
 • పొలంలో గట్లపై ఉన్న చెదపుట్టలను తవ్వి రాణి పురుగును నాశనం చేయాలి. 
 • తవ్విన పుట్టలో క్లోరిపైరిఫాస్‌ 50 ఇసి 3 మి.లీ. / లీటరు నీటికి కలిపి పోయాలి.
 • క్లోరిపైరిఫాస్‌ 20 ఇసి 4 మి.లీ. / లీటరు నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. 
 • వర్షాలు తగ్గిన తరువాత తప్పకుండా కాండానికి 2-3 అడుగుల ఎత్తువరకు బోర్డోపేస్ట్‌ పూయాలి.

రచయిత సమాచారం

డా|| జి. స్రవంతి, డా|| ఆర్‌. రాజ్యలక్ష్మి, డా|| బి.కె.యమ్‌. లక్ష్మి, శాస్త్రవేత్తలు, మామిడి పరిశోధనా స్థానం, నూజివీడు, ఫోన్‌ : 7799332019