Print this page..

చేపల చెరువులో ఎరువుల యాజమాన్యం

నిజామాబాద్‌ జిల్లాలో 22,650 హెక్టార్ల నీటి విస్తీర్ణంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు జలాశయం మరియు 54,362 హెక్టార్ల విస్తీర్ణంతో 903 చెరువులు కలవు. నిజామాబాద్‌ జిల్లాలో 249 మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో 16,826 మంది సభ్యులు, 33 మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 2,136 మంది, 1 ఫిషరీస్‌ మార్కెటింగ్‌ కో-ఆపరేటీవ్‌ సొసైటీలో 150 మంది సభ్యులు కలరు. 

చేపల పెంపకం చేపట్టే రైతులు సరైన ఎరువుల యాజమాన్యం పాటించనట్లయితే మంచి దిగుబడులు సాధించి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. చెరువు నేలలో నత్రజని మరియు భాస్వరం శాతం 2:1 నుండి 4:1 వరకు ఉంటే మంచిది. కర్బనం మరియు నత్రజని శాతం 10:1 నుండి 20:1 వరకు ఉంటే మంచిది. లేని ఎడల సేంద్రియ మరియు రసాయన ఎరువులను వాడడం ద్వారా చెరువు మట్టిని, నీటిని ఫలవంతం చేసి అధిక పరిమాణంలో చేపల సహజ ఆహారమైన ప్లవకాల వృక్షప్లవకాల, జంతు ప్లవకాలను ఉత్పత్తి చేయడం కోసం ఎరువులు వాడతారు. పశువుల పేడ, కోళ్ళ పెంట సాధారణంగా వాడే సేంద్రియ ఎరువులు కాగా యూరియా, సూపర్‌ఫాస్ఫేట్‌, పొటాష్‌ వంటి రసాయనిక ఎరువులు కూడా వాడతారు. ఈ ఎరువులు దాదాపు అన్ని చోట్ల లభిస్తాయి. సేంద్రియ, రసాయనికి ఎరువులను నిర్ణయించిన పరిమాణంలోనే చెరువులో వేయాలి. 

వాడాల్సిన ఎరువుల పరిమాణం (హెక్టారు నీటి విస్తీర్ణం గల చెరువులో)

ఎరువు రకం    పరిమాణం (నెలకు / కిలోలు)
సేంద్రియ ఎరువులు  
పశువుల పేడ    5000
రసాయనిక ఎరువులు  
యూరియా 50
సూపర్‌ ఫాస్ఫేట్‌ 250
మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ 50

సేంద్రియ, రసాయనిక ఎరువులను 15 రోజుల వ్యవధిలో ఒక దాని తరువాత మరొకటి వాడాలి. ఎప్పుడైనా మాగిన సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలి, నీటి గుణం చెడిపోయినప్పుడు, అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉండే డిసెంబరు, జనవరిలో ఎరువుల వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలి. నిర్ణయించుకున్న ఎరువులను చెరువంతా సమాంతరంగా చల్లాలి. ఒకే దగ్గర లేదా అక్కడక్కడా కుప్పలుగా పోయరాదు. ఈ విధమైన మెళకువలను పాటించడం ద్వారా అధిక చేపల ఉత్పత్తిని పొందడమే కాక, అధిక ఆదాయం పొందవచ్చు. 

రచయిత సమాచారం

మాలోత్‌ మోహన్‌, డా|| ఆర్‌ విటి బాలాజీ నాయక్‌, డా|| యం. భవ్య మంజరి, డా|| యం. శ్వేత, డా|| బి.వి రాజ్‌ కుమార్‌, కృషీ విజ్ఞాన కేంద్రం, రుద్రూరు, నిజామాబాద్‌.