Print this page..

సేంద్రియ వ్యవసాయంలో పోషకాహార సరఫరా

సేంద్రియ వ్యవసాయంలో సమృద్ధిగా సేంద్రియ పదార్ధాలను తద్వారా మొక్కలకు అవసరమైన పోషకాలను అందించడం ముఖ్యమైనది. సేంద్రియ పదార్ధం కుళ్ళిపోయే ప్రక్రియలో అనేక ఉపయోగకరమైన పదార్ధాలను ఉత్పత్తి చేయడవమే కాయకుండా నేలయొక్క భౌతిక రసాయన లక్షణాలను మెరుగు పరుస్తుంది. సేంద్రియ వ్యవసాయంలో నేలలో ఉండే సూక్ష్మజీవులను నిరంతరంగా పోషించడానికి కంపోస్ట్‌, జంతు సంబంద లేదా పచ్చిరొట్ట ఎరువులను తప్పనిసరిగా ఉపయోగించాలి. సేంద్రియ పదార్ధం ముడి రూపంలో అనేక పోషకాలను కలిగి ఉంటుంది. కుళ్ళిపోయే ప్రక్రియలో ఇది నత్రజని, భాస్వరము, గంధకము, జింక్‌ మరియు కాపర్‌ వంటి పోషకాలను మొక్కలకు అందుబాటులో ఉండే రూపంలో విడుదల చేస్తుంది. నేలలో మొక్కల పోషకాలను సమతుల్యం చేయడానికి సేంద్రియ పదార్ధాలతో పాటు రాతి పొడులను (రాక్‌ పౌడర్స్‌) ఉపయోగించవచ్చు. ఇవి దీర్ఘకాలికంగా పోషకాలను అందజేయగలవు, కానీ స్వల్పకాలిక పోషకలోపాలు అదిగమించడానికి అంత త్వరగా కరిగే పోషక వనరులు కావు. మొక్కలకు 9 మూలకాలు పెద్దమొత్తంలో అవసరం అవుతాయి. వీటిని ప్రధాన పోషకాలు (మాక్రోన్యూట్రియంట్స్‌) అని, కొద్ది మొత్తంలో అవసరం అయ్యే మరో 9 మూలకాలను సూక్ష్మ పోషకాలు (ట్రీస్‌ ఎలిమెంట్‌ లేదా మైక్రో న్యూట్రియంట్స్‌) అని అంటారు. 

పెద్ద మొత్తంలో అవసరం అయ్యే 9 ప్రధాన పోషకాలలో మూడింటిని ప్రథమ పోషకాలు అంటారు. అవి నత్రజని, భాస్వరం మరియు పొటాష్‌ మరో మూడింటిని ద్వితీయ పోషకాలు అంటారు అవి కాల్షియం, మెగ్నీషియం మరియు సల్ఫర్‌. మిగిలిన మూడు కర్బనము, హైడ్రోజన్‌ మరియు ఆక్సిజన్‌ మొక్కలకు సహజంగా వాతావరణం నుంచి లభిస్తాయి. 

ప్రథమ పోషకాలు :

నత్రజని : 

మొక్కలకు అవసరమైన ప్రధాన పోషకాలలో నత్రజని అత్యంత ముఖ్యమైనది. నత్రజని సమృద్ధిగా ఉన్న నేలలో మొక్కలు ధృడంగా మరియు పచ్చగా పెరుగుతాయి. మొక్కలో ప్రోటీన్ల ఉత్పత్తికి ఇది అత్యంత అవసరం. వార్షిక పంటలకు ప్రారంభ పంట కాలంలో భారీ మొత్తంలో నత్రజని అవసరం. ఇది విత్తనాలతో తయారయ్యే సీడ్‌ కేక్‌, సీడ్‌ మీల్‌, చేపల వ్యర్ధాలు, పశువుల ఎరువులు మరియు వ్యర్ధాలలో అధికంగా ఉంటుంది. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు సాధారణంగా చివికిన పశువుల ఎరువు, పంట అవశేషాలతో తయారు చేసిన కంపోస్ట్‌, వర్మి కంపోస్ట్‌ లేదా పప్పుధాన్య పంటలలో పంట మార్పిడి, పచ్చిరొట్ట ఎరువులు వంటివి నత్రజని సరఫరా చేయడానికి వాడతారు. ఎరువు, వంటగది వ్యర్ధాలు, పంట వ్యర్ధాలు, జంతువుల వ్యర్ధాలతో సమృద్ధిగా ఉండే కంపోస్ట్‌ నత్రజని యొక్క దీర్ఘకాలిక మూలం. ఇలా సమృద్ధి చేయబడిన కంపోస్ట్‌ పూర్తిగా తయారయి పూర్తి నత్రజనిని మొక్కలకు సరఫరా చేసేంత పరిపక్వత కలిగి ఉండాలి. లేనిచో నత్రజనిని కొద్ది మొత్తంలో నెమ్మదిగా విడుదల చేయడం వలన పూర్తిస్థాయిలో వినియోగం కాదు.

లోప లక్షణాలు :

ఆకులు వాటి యొక్క సహజంగా మెరిసే ఆరోగ్యకరమైన ఆకుపచ్చ రంగు కోల్పోతాయి. తరువాత ముదురు ఆకులు పసుపు రంగులో పాలిపోయి క్రమేణా మొక్కలు బలహీనంగా మరియు అనారోగ్యంగా కనిపిస్తాయి. 

లోప సవరణ :

జీవామృతము, పంచగవ్య, ఆవుమూత్రం వంటి గోవు ఆధారిత ఎరువులు త్వరితగతిన నేరుగా నత్రజనిని సరఫరా చేస్తాయి. చేపల ఎమల్షన్‌, వర్మివాష్‌, సేంద్రియ నత్రజని యొక్క వాణిజ్య ఉత్పత్తులు ఆకులపై పిచికారి చేయడం వలన నేరుగా నత్రజనిని గ్రహిస్తాయి. ఇది పంటను త్వరగా కోలుకునేటట్టు చేస్తుంది.

క్రింద తెలిపిన జీవన ఎరువులను వాడటం వలన మొక్కలకు నత్రజనిని అందించవచ్చు.

జీవన ఎరువు వాడదగిన పంటలు  ఉపయోగం
రైజోబియం (ఇది పంటను అనుసరించి తగిన స్ట్రెయిన్‌ వాడుకోవాలి)  చిక్కుడు జాతి మరియు  పప్పుదినుసులైన కంది, పెసర, మినుము,  వేరుశనగ, శనగ, సోయాబీన్‌ మొ..  20 నుంచి 200 కేజీల  నత్రజనిని ఒక  హెక్టారుకు   అందిస్తాయి.
అజటోబాక్టర్‌ పప్పు దినుసులు కాని మెట్ట పంటలకు నేలలో కలపాలి. హెక్టారుకు 20-25  కిలోల నత్రజనిని ఇస్తుంది
అజోస్పెరిల్లమ్‌ పప్పు జాతికి చెందని మొక్కజొన్న, బార్లీ, ఓట్స్, జొన్న, చిరుధాన్యాలు చెరకు, వరి మొదలగు పంటలు హెక్టారుకు 20-25  కిలోల నత్రజనిని ఇస్తుంది
నీలి ఆకుపచ్చ నాచు (బ్లూ గ్రీన్ ఆల్గె) & అజోలా  వరి హెక్టారుకు 30 నుంచి  100  కిలోల నత్రజనిని ఇస్తుంది

 

భాస్వరం (ఫాస్పరస్‌) :

భాస్వరం మొక్కల యొక్క ఆరోగ్యకరమైన వేరు వ్యవస్థ, కిరణజన్య సంయోగక్రియ, ఎటిపి ద్వారా శక్తి బదిలీ మరియు మొక్కల యొక్క పరిపక్వతకు ఎంతో అవసరం. మొక్కలు భాస్వరం గ్రహించాలన్న అది ఒక ప్రత్యేకమైన కరిగిన రూపంలో ఉండాలి. లేనిచో భూమిలో భాస్వరం నిలువలు ఉన్నా మొక్కలు గ్రహించలేవు. భాస్వరం కాల్షియం లేదా ఇనుముతో బందించి ఉన్నప్పుడు అది మొక్కలకు అందుబాటులో ఉండదు. ఇది నేలలో తక్కువగా ఉన్నా, అందుబాటులో లేని రూపంలో ఉన్నా పంట కాలంలో ప్రారంభంలో పంట పెరుగుదలను పరిమితం చేస్తుంది. కనుక సేంద్రియ వ్యవసాయంలో అనుమతించిన రూపంలో భాస్వరం అందించవలసి ఉంటుంది. హార్డ్‌రాక్‌ ఫాస్ఫేట్‌ 2% ఫాస్ఫేట్‌ మరియు మృదువైన రాక్‌ ఫాస్పేట్‌ 3% ఫాస్పేట్‌ను కలిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం కంపోస్ట్‌, రాక్‌ ఫాస్పేట్‌ మరియు ఎరువులు వేయడం వలన నేలలో నత్రజని మరియు భాస్వరం, పొటాష్‌ వంటి మూలకాలు పెరుగుతాయి. కానీ ఒక్కొక్కసారి మితిమీరి వాడటం వలన భాస్వరం శాతం పెరిగి చెరువులు, కుంటలు మరియు నూతులలో నీటిని కలుషితం చేసే అవకాశం ఉంది. కనుక భూమిలో భాస్వరం నిల్వలను నిర్ధారించుకుని తగినంత ఎరువులు మాత్రమే వాడాలి.

లోప లక్షణాలు :

ఆకులు, ఈనెలు మరియు కాడలు ఊదా రంగులోకి మారుతాయి. పంట పూత సమయంలో ఉంటే ఆకులు పసుపు రంగులోకి మారి వాటి క్రింద భాగం ఊదా నుండి ఎరుపు రంగుకు మారుతుంది. పంట కోత సమయంలో నత్రజని లోపంతో వచ్చే పసుపు రంగు మరియు భాస్వరం లోపంతో వచ్చే పసుపు రంగు ఒకేలా అనిపించినా భాస్వరం లోపంలో పునరుత్పత్తి భాగాలైన గింజలు సరిగా ఏర్పడక తాలు గింజలు వంటి లక్షణాలు ఉంటాయి.

లోప సవరణ :

భూమి యొక్క ఉదజని సూచిక 6 నుండి 7 అనగా తటస్థంగా ఉండేటట్లు చూసినచో భాస్వరం మొక్కకు సరిగా అందుతుంది. ఉదజనిసూచిక తక్కువగా ఉండి భూమి ఆమ్ల గుణంతో ఉన్నచో లైమ్‌స్టోన్‌ అనగా సున్నపు రాయిని వేసి ఉదజని సూచికని తటస్థ పరుచుకోవాలి. ఎముకల పొడిలో (బోన్‌ మీల్‌) రాక్‌ ఫాస్పేట్‌ కంటే 20 రెట్లు అధికంగా భాస్వరం లభిస్తుంది. కానీ అది చాలా ఖరీదైనది. ఎముకల బూడిద కూడా 16% ఫాస్పేట్‌ అందిస్తుంది మరియు అందుబాటు ధరలో దొరుకుతుంది. వీటన్నింటికంటే కంపోస్టు తయారీ సమయంలో రాక్‌ ఫాస్పేట్‌ని చల్లుకోవడం కంపోస్టు పిట్‌కు కొత్త ముడి పదార్ధం వేసిన ప్రతి సారీ రాక్‌ ఫాస్పేట్‌ చల్లటం, బూడిద, నిమ్మ మరియు ప్రత్తి పంట వ్యర్ధాలు, చేపల వ్యర్ధాలు వంటి వాటిని కంపోస్టింగ్‌లో వాడటం వలన కంపోస్ట్‌లో భాస్వరం శాతం పెరుగుతుంది. నేలలో భాస్వరపు నిలువలు ఉన్నా కూడా సూక్ష్మ జీవుల ప్రక్రియ ద్వారా మాత్రమే అది మొక్కలకు అందుబాటులో ఉండే రూపంలోకి మారుతుంది.

సూక్ష్మ జీవి   పంటలు ఉపయోగాలు
ఫాస్పేట్‌ సాల్యుబిరైజింగ్‌ బ్యాక్టీరియా   అన్ని పంటలు  5 నుంచి 30% దిగుబడి పెరుగును
వి.ఎ.ఎమ్‌ వెసిక్యులార్‌ ఆర్బిస్కులార్‌ మైకోరైజా చెట్లు,వార్షికపంటలు  మరియు ఉద్యానవన పంటలు  30 నుంచి 50% దిగుబడి పెరిగి నీటి సంగ్రహణ  పెరుగుతుంది

      

పొటాషియం :

పొటాషియం మొక్కలలో ఖ2ూ రూపంలో ప్రవహిస్తుంది. మొక్కల ఆరోగ్యం మరియు రోగ నిరోధకతకు ఇది ఎంతో అవసరం. పొటాషియం ఎంజైమ్‌ కార్యకలాపాల్లో ముఖ్యమైన పాత్ర పోషించి చక్కెరల తయారీ మరియు వాటి బదిలీకి ఉపయోగపడుతుంది. ఇది నీటి లభ్యత ఉన్నప్పుడు స్టొమాట తెరుచుకుని, నీటి ఎద్దడి ఉన్నప్పుడు మూసుకుపోవడానికి ఉపయోగపడుతుంది. కనుక మొక్కను వరదలు మరియు కరువు సమయంలో కాపాడుతుంది. ఆకులలో క్లోరోఫిల్‌ను పెంచి తద్వారా కిరణజన్య సంయోగక్రియను పెంచి అధిక ఉత్పాదకతకు సహాయపడుతుంది. సేంద్రియ వ్యవసాయంలో నేలలో పొటాషియం నిల్వలు పెంచడానికి గ్రానైట్‌ నుంచి వచ్చే దుమ్ము, గ్రీన్‌సాండ్‌ వంటి వాటిని ఎకరానికి 3 నుంచి 5 టన్నుల వరకు వేసుకోవచ్చు. ఇవి మొక్కలకు పొటాసియంను నెమ్మదిగా అందిస్తాయి. నేలకు కలప బూడిదను అందించడం ద్వారా మొక్కకు పోటాషియం త్వరితగతిన అందుతుంది కానీ ఈ బూడిద భూమిని క్షారవంతంగా మారుస్తుంది. అనగా ఉదజనిసూచికను పెంచుతుంది. కనుక మొక్కలు పొటాషియం లోపాలు చూపినపుడు మాత్రమే కలప బూడిదను వాడుకోవాలి.

లోప లక్షణాలు : 

పొటాషియం లోపాన్ని గుర్తించడం సులభం. ఆకు అంచులు పసుపు రంగులోకి మారుతాయి. తరువాత గోదుమ రంగులోకి మారి వంకర్లు తిరుగుతాయి.  దీని లోపం వలన మొక్క యొక్క కణుపుకి కణుపుకి ఉన్న దూరం తగ్గిపోయి ఆకులన్నీ దగ్గర దగ్గరగా గుబురుగా వచ్చినట్లు కనిపిస్తాయి. 

లోప సవరణ :

గ్రానైట్‌ దుమ్ము, గ్రీన్‌శాండ్‌, చేపల ఎమల్షన్‌, సీవీడ్‌ మరియు కలప బూడిద ఈ లోపాన్ని సవరించగలవు. బాగా కుళ్ళిన ఎరువు, సమృద్ధి పరిచిన కంపోస్ట్‌ అనగా మొక్కజొన్న కాండాలు, పత్తి విత్తనాల చెక్క వంటి పొటాషియం అధికంగా ఉండే పదార్ధాలతో సమృద్ధిపరిచిన కంపోస్టు వాడటం ద్వారా ఈ లోపాన్ని సవరించుకోవాలి.

కాల్షియం, మెగ్నీసియం మరియు సల్ఫర్‌ :

కాల్షియం, మెగ్నీషియం మరియు సల్ఫర్‌లను ద్వితీయ మూలకాలు అని అంటారు. ఎందుకంటే మొక్కలకు తక్కువ పరిమాణంలో అవసరం. కానీ మొక్కల పెరుగుదలకు అవి నత్రజని, ఫాస్పరస్‌ మరియు పొటాసియం వంటి ప్రథమ మూలకాల వలె అవసరము.

కాల్షియం : 

సాధారణంగా కాల్షియం ఆకులలో సమృద్ధిగా ఉంటుంది. ఇది కణజాలాన్ని గోడలను నిర్మించి జీవక్రియ యొక్క ఉప ఉత్పత్తులుగా ఉత్పత్తి చేయబడిన ఆమ్లాలను తటస్థీకరిస్తుంది. ఇది మొక్కలలో ప్రోటీన్ల తయారీకి ఉపయోగపడుతుంది. మొక్కలు మెగ్నీషియంను అధికంగా సంగ్రహించి దాని విష ప్రభావానికి లోనుకాకుండా కాపాడుతుంది.

లోప లక్షణాలు :

కాల్షియం లోపం వల్ల మొక్క ఎగువ భాగంలో ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. కాని ఇది నత్రజని లోపం కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకనగా నత్రజని లోపం వల్ల ముందుగా మొక్క దిగువ భాగం ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. కాల్షియం లోప లక్షణాలు కొన్ని పంటలలో ఎక్కువగా కనిపిస్తాయి. టమాట మొక్కలలో కాండం మృదువుగా మారి పండ్లు బ్లాసమ్‌ ఎండ్‌ రాట్‌ అనే జబ్బుతో కుళ్ళిపోతాయి.

బఠానీలు వంటి కొన్ని మొక్కలలో ఆకుల మధ్యలో ఎర్రటి పాచెస్‌ కనిపించి అంచులకు వ్యాప్తి చెందుతాయి. మొక్కలు మరుగుజ్జుగా మారి కళాకాంతి లేకుండా ఉంటాయి.

లోప సవరణ :

సున్నపు రాయిని నేలలో వేయడం వలన ముఖ్యంగా డోలమైట్‌ సున్నపు రాయిలో కాల్షియంతోపాటు మెగ్నీషియం కూడా ఉంటుంది. కనుక మొక్కలు త్వరగా సంగ్రహిస్తాయి. మట్టిలో కాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా తక్కువగా ఉంటే డోలమైట్‌ లేదా మెగ్నీషియం అధికంగా ఉంటే కార్బైట్‌ లేదా తక్కువ మెగ్నీషియం ఉన్న సున్నపురాయిని వాడవచ్చు.

మెగ్నీషియం :

మెగ్నీషియం కిరణజన్యసంయోగక్రియ, క్లోరోఫిల్‌ తయారీ మరియు నత్రజని, భాస్వరం మరియు సల్ఫర్‌ వంటి ఇతర మూలకాలను సంగ్రహించడం కొరకు అవసరం.

లోప లక్షణాలు :

మెగ్నీషియం లోపం ఉన్నపుడు మొక్కల్లో భాస్వరం లోపం కూడా కనిపిస్తుంది. ఎందుకనగా మెగ్నీషియం లోపం ఉన్నపుడు మొక్కలు భాస్వరాన్ని గ్రహించలేవు. ఆకులు, ఈనెల మధ్యలో పాలిపోవడం, ఆకు అంచులలో ఆకులు పసుపు రంగులోకి మారటం వలన ఆకులపై చారలు కనిపిస్తాయి. కొన్ని సార్లు ఆకుల ఈనెలు పచ్చగా ఉండి మిగిలిన భాగం ఎరుపు లేదా ఊదా రంగులోకి మారుతుంది. ఆకుల లోపలిభాగం పసుపు రంగులోకి మారుతుంది. ఆకుల లోపలిభాగం పసుపు రంగులోకి మారి, గోధుమ రంగు అంచులు పైకి తిరిగి పెళుసుగా మారతాయి.

లోప సవరణ :

మట్టిలో డోలమైట్‌ సున్నపురాయిని వేసినట్లయితే అది మెగ్నీషియం కూడా కాల్సియంతో పాటు అందిస్తుంది. కాని కాల్షియం అవసరం లేకుండా కేవలం మెగ్నీషియం మాత్రమే కావాలంటే ఎప్సమ్‌ లవణాలు లేదా సేంద్రియ వ్యవసాయానికి అనుమతి పొందిన 'సల్‌ - ఫా - మాగ్‌' వంటి తక్కువ ధరకు దొరికే ఉత్పత్తులు వాడవచ్చు. ఎప్సమ్‌ లవణాల ధర ఎక్కువగా ఉన్నచో నేలలో వేసే బదులు ఆకులపై పిచికారి చేసుకోవాలి. లీటరు నీటికి 20 గ్రా. వరకు ఈ ఎప్సమ్‌ లవణాన్ని నీటిలో కరిగించి తగినంత ద్రావణాన్ని తయారు చేసుకొని వారం వారం పిచికారి చేసుకోవచ్చు.

సల్ఫర్‌ (గంధకము) :

మొక్కలలో ప్రోటీన్లు మరియు ఎంజైముల తయారీకి సల్ఫర్‌ సహాయపడుతుంది. ఇసుక నేలలో సల్ఫర్‌ని పట్టి ఉంచడం ఒక సమస్య. తక్కువ సేంద్రియ పదార్థం ఉండి ఇసుక శాతం ఎక్కువగా ఉన్న భూములలో మట్టి రేణువులు సల్ఫర్‌ని బందించలేవు. కనుక అది నేలలోకి ఇంకిపోయి మొక్కలకు అందుబాటులో ఉండదు.

లోప లక్షణాలు :

సల్ఫర్‌ లోపం వల్ల కూడా ఆకులు పసుపు రంగులోకి మారతాయి. కాని ఇది నత్రజని లోపం వల్ల వచ్చే పసుపు రంగు కంటే భిన్నంగా ఉంటుంది. నత్రజని లోపం వలన ఆకు అంతా పసుపుగా మారి పెళుసుగా అవుతుంది. కాని సల్ఫర్‌ లోపం వలన ఎక్కువ సంఖ్యలో పెళుసుగా లేని పసుపు ఆకులు ఉండి మొక్క పెరుగుదల ఆగిపోతుంది.

చిక్కుళ్ళు, బ్యాబేజి, కాలిఫ్లవర్‌, ఉల్లి, వెల్లుల్లి వంటి పంటలు పెద్ద మొత్తంలో సల్ఫర్‌ని తీసుకోవడమే కాకుండా లోప లక్షణాలను త్వరగా చూపిస్తాయి.

లోప సవరణ :

మట్టి పరీక్షలో సల్ఫర్‌ లోపం నిర్ధారణ అయితే సేంద్రియంగా పురాతన సముద్ర నిక్షేపాల నుంచి పొందిన సల్ఫేట్‌ ఆఫ్‌ పొటాష్‌ మెగ్నీషియం వాడవచ్చు. దీనిలో 27% వరకు సల్ఫర్‌ ఉంటుంది.

సూక్ష్మ పోషకాలు :

మొక్కలకు 9 సూక్ష్మ పోషకాలు జింక్‌, బోరాన్‌, ఐరన్‌ (ఇనుము), మాంగనీసు, రాగి, మాలిబ్డినం, క్లోరిన్‌, కోబాల్ట్‌ మరియు నికెల్‌ కొద్ది మొత్తంలో అవసరం కాని, మొక్కల ఉత్పాదకతలో కీలకపాత్ర పోషిస్తాయి. తగినంత సేంద్రియ పదార్ధాన్ని నేలకు అందిస్తే సూక్ష్మ పోషకాల కొరత ఏర్పడదు. కలప బూడిద, సీవీడ్‌, కంపోస్టు వంటివి కూడా ఈ సూక్ష్మ పోషకాలను మొక్కలకు అందిస్తాయి.

జింక్‌ (తుత్తునాగం) :

మొక్కలలో అనేక రకాల రసాయన ప్రతిచర్యలకు జింకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. అమైనో ఆసిడ్స్‌ తయారీకి ప్రధాన పాత్ర పోషిస్తుంది.

లోప లక్షణాలు :

జింక్‌ లోపం వల్ల చిన్న చిన్న పసుపు రంగులోకి తిరిగిన ఆకులపై మచ్చలు ఏర్పడి పెళుసుబారతాయి. కణుపుల మధ్య దూరం తగ్గి మొక్కలు పొట్టిగా అవుతాయి. 

వరిలో అయితే జింక్‌ లోపించినప్పుడు ఆకు మొదలు భాగంలో ఈనెలు పసుపు వర్ణంలోకి మారి క్రమేణా తెల్లబడతాయి. కొనభాగం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ముదురు ఆకులలో ఈనెకు ఇరుపక్కల తుప్పురంగు మచ్చలు ఏర్పడి ఆకులు పెళుసుగా శబ్ధం చేస్తూ విరిగిపోతాయి. ఆకులు నూలుకండె ఆకారంలో చిన్నగా మారతాయి. పంటలో పరిపక్వత రాదు. నత్రజని, భాస్వరం, వేసే నేలలో సున్నం ఎక్కువగా ఉండే నేలల్లో ఉదజనిసూచిక 8.5 కంటే ఎక్కువ ఉండే నేలల్లో వరిలో జింక్‌ లోపం సాదారణంగా కనిపిస్తుంది.

లోప సవరణ :

చివికిన పశువుల ఎరువు మరియు కంపోస్టు తగినంత వేసినచో జింకు లోపం నివారించవచ్చు. ఫాస్పేట్‌ రాక్‌, సీవీడ్‌ కూడా జింక్‌ను మొక్కకు అందిస్తాయి. జింక్‌ సాల్యుబిలైజింగ్‌ బ్యాక్టీరియాను వాడటం వలన నేలలో ఉన్న జింక్‌ కరిగి మొక్కలకు అందుబాటులోకి వస్తుంది.

బోరాన్‌ :

బోరాన్‌ కణ విభజన, మొక్కల పెరుగుదల, పూత, కాత, మొదలగు చర్యలలో పాలుపంచుకుంటుంది.

లోప లక్షణాలు :

మొక్కలు త్వరగా పెరగకుండా నెమ్మదిగా అడ్డదిడ్డంగా పెరుగుతాయి. బోరాన్‌ లోపం వలన ప్రధాన కాండం చివర్లు చనిపోవడం వల్ల ప్రక్కనున్న కొమ్మలు పెరిగి మొక్కలు పొట్టిగా మరుగుజ్జుల్లా, పొదల్లా కనబడతాయి. బోరాన్‌ లోపం వల్ల దుంపలు మరియు టర్నిప్‌ వంటి పంటల్లో బ్లాక్‌ హార్ట్‌ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి భాస్వరం లేదా పొటాషియం లోపం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక భూపరీక్షలతో లోపం ఏదనేది నిర్ధారించు కోవాలి. 

లోప సవరణ :

ఫాస్పేట్‌రాక్‌, సీవీడ్‌, చిన్న మొత్తంలో రంపపు పొడి, పీట్‌నాచు వంటి పదార్ధాలను కంపోస్టు సమయంలో వేయడం వలన ఆ కంపోస్టులో బోరాన్‌తో సమృద్ధి చేయబడుతుంది. ద్రవరూపంలో సీవీడ్‌ని పిచికారి చేయడం వలన మొక్కలు త్వరితగతిన బోరాన్‌ను సంగ్రహిస్తాయి. సేంద్రియ సేద్యంలో అనుమతించబడిన సోల్యుబార్‌, ఫెర్టిబార్‌, బయోమీన్‌ బోరాన్‌ వంటివి మొక్కకు బోరాన్‌ని త్వరితగతిని అందిస్తాయి. కాని బోరాన్‌ అధికంగా ఉంటే కూడా పంటకు విషపూరితం. అధిక బోరాన్‌ వలన పంటలు మరుగుజ్జుగా మారి, జిగురు వంటి స్రావాన్ని విడుదల చేస్తాయి. కనుక ఈ బోరాన్‌                   ఉత్పత్తులను నీటిలో కలిపి నేలపై సమానంగా చల్లాలి. ఒకే చోట ఎక్కువ మొత్తంలో వేయరాదు.

మాంగనీస్‌ :

మాంగనీస్‌ మొక్కల పోషణకు, నత్రజని జీవ క్రియకు క్లోరోప్లాస్ట్‌ ఏర్పడటానికి, కిరణజన్య సంయోగక్రియకు ఎంజైమ్‌ల ఉత్ప్రేరణకు ఉపయోగపడుతుంది.  మొక్కల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది.

లోప లక్షణాలు :

క్లోరోసిస్‌ అనగా పచ్చటి ఆకులు పసుపు రంగులోకి మారటం మొదటి లక్షణం కాని, ఇతర పోషకాల లోపం వల్ల కూడా క్లోరోసిస్‌ రావచ్చు. ఆకులు పసుపు వర్ణంలో మారటంతో పాటు తెల్లటి మచ్చలు ఏర్పడి ఆ ప్రాంతంలో కణజాలం చనిపోవడం ద్వారా దీనిని గుర్తించవచ్చు. ఈ పసుపు రంగులోకి మారటం కూడా ఈనెల నుంచి దూరంగా మొదలయ్యి ఈనెల వైపు వస్తుంది. లోపం ఎక్కువగా ఉన్నపుడ మొక్కలు గిడసబారి పూత, కాయ రాదు. దీని లోపం వలన క్యాబేజి, బ్రకోలి వంటి పంటలు చాలా చిన్న పువ్వులు ఇస్తాయి. వంగ, టమాట వంటి వాటిలో కాండాలు కుచించుకుపోయి మొక్కలు మరుగుజ్జుగా అనిపిస్తాయి.

లోప సవరణ :

నేలలో వేసే సేంద్రియ పదార్ధం మరియు సీవీడ్‌ పంటకు అవసరమైన మొత్తం మాంగనీస్‌ను సరఫరా చేయగలవు. కాని దానికి అనువైన ఉదజని సూచిక ఉండాలి అనగా తటస్థంగా కాని స్వల్పంగా ఆమ్లతత్వం కాని కలిగి ఉండాలి. క్షారతత్వం కలిగిన నేలల్లో మొక్కలు మాంగనీస్‌ను సంగ్రహించలేవు. కంపోస్ట్‌లో పంట అవశేషాలను అనగా క్యారట్‌ మొక్కలు, క్యాబేజి, కాలిఫ్లవర్‌, చిక్కుళ్ళు వంటి పంటలు కోసిన తరువాత మిగిలిన అవశేషాలను కలపడం ద్వారా కంపోస్టు మాంగనీస్‌తో సమృధ్ధి పరచబడుతుంది.

ఇనుము (ఐరన్‌)

పత్రహరితం ఉత్పత్తితో ఇనుముకు సంబంధి ఉంది. కాని అందులో భాగం కాదు. నత్రజని స్థిరీకరణకు ఉపయోగపడుతుంది. ఇది నైట్రేట్‌ను అమ్మోనియంగా మార్చి మాంసకృత్తుల తయారీలో   ఉపయోగపడుతుంది.

లోప లక్షణం :

క్లోరోసిస్‌ అనగా ఆకులు పసుపు రంగులోకి మారటం. ఎప్పుడైనా మొక్క క్లోరోసిస్‌ చూపిస్తే మట్టి నమూనా పరీక్షించాలి. ఎందుకనగా అనేక మూలకాల లోపం వలన ఈ లక్షణం కనిపిస్తుంది. మొక్కలు గిడసబారటం చివర్లు పెరగకుండా ఉండడం అదే పండ్ల మొక్కలలో అయితే రుచిలేని పండ్లు ఈ ఇనుము లోపానికి చిహ్నాలు.

లోప సవరణ :

సేంద్రియ ఎరువులు ముఖ్యంగా కోడి పెంట, పశువుల ఎరువు, గ్రీన్‌శాండ్‌, సీవీడ్‌ ఇనుము మొక్క గ్రహించడానికి వీలైన రూపాన్ని మొక్కకు అందిస్తాయి. భూమిలో సున్నం కాని, భాస్వరం గాని ఎక్కువగా ఉన్నచో మొక్కలు ఇనుము గ్రహించలేవు. కనుక తగినంత సేంద్రియ పదార్ధాన్ని వేసి మొక్కలకు అందుబాటులోకి తేవాలి.

రాగి (కాపర్‌) : 

కాపర్‌ మొక్క యొక్క శ్వాస క్రియకు మరియు ఇనుము వాడుకోవడానికి ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.

లోప లక్షణాలు :

కాండం చివర్లలో ఉన్న ఆకులు వడబడి వాడిపోయి నీరు పెట్టిన తరువాత కూడా తేటగా రావు. దీనిని 'విదర్‌ టిప్‌' అని అంటారు. పండ్ల తోటలలో, కాయగూరలలో మరియు ఆకు కూరలలో కాపర్‌ లోప లక్షణాలు ఎక్కువగా కనబడతాయి. ఈ లోపం ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు సరిగా పుష్పించవు. లెట్యూస్‌లో ఆకులు పాలిపోయి కనబడతాయి.

లోప సవరణ :

పూర్తిగా తయారయిన కంపోస్టు, బాగా చివికిన పవువుల ఎరువు మొక్కలు కాపర్‌ని గ్రహించడానికి ఉపయోగపడతాయి. సీవీడ్‌ని ఆకులు మరియు పెరుగుతున్న కొమ్మలపై పిచికారి చేసిన తక్షణం కోలుకోవడానికి సహకరిస్తుంది.

మాలిబ్డినం :

నైట్రేట్లను అమ్మోనియంగా మార్చి సులభంగా మొక్కలు గ్రహించడానికి మాలిబ్డినమ్‌ ఉపయోగ పడుతుంది. చిక్కుడు వేర్లల్లో రైజోబియం బ్యాక్టీరియా నత్రజనిని స్థిరీకరించడానికి ఇది అవసరం.

లోప లక్షణాలు :

మాలిబ్డినం లోపం యొక్క మొదటి లక్షణం నత్రజని లోపం. ఎందుకనగా నత్రజని గ్రహించడానికి ఇది అవసరం. మొక్క మొదట్లోని ఆకులు పసుపు రంగులోకి మారి మొక్క గిడసబారిపోతుంది. ఆకులు పొడవుగా సాగి 'విప్‌ టయిల్‌' అని పిలవబడుతుంది.

లోప సవరణ :

ఆమ్ల నేలల్లో మాలిబ్డినం ఇతర మూలకాలలో బందింపబడి మొక్కకు లభ్యం కాదు. చిక్కుడు జాతి పచ్చిరొట్ట పంటలు నేలలోకి దున్నిన తరువాత కుళ్ళేటప్పుడు మాలిబ్డినం విడుదల చేస్తాయి. ద్రవరూపంలో ఉన్న సీవీడ్‌ పిచికారి ద్వారా త్వరితగతిన ఇది మొక్కకు అందుతుంది.

క్లోరిన్‌, కోబాల్ట్‌ మరియు నికెల్‌ కూడా మొక్కలకు ఎంతో అవసరమైన సూక్ష్మ మూలకాలు. వీటి లోపం వల్ల కూడా మొక్కలు కళ లేకుండా నిస్తేజంగా ఉంటాయి. మొక్కలకు కోబాల్ట్‌ సమృద్ధిగా అందితేనే బి 12 విటమిన్‌ తయారయి అది మనుషులకు పౌష్టికాహారంగా ఉపయోగపడుతుంది. చిక్కుడు జాతి మొక్కల వేర్లపై ఉండే రైజోబియం బ్యాక్టీరియా నత్రజనిని స్థిరీకరించాలన్న ఇది ఎంతో అవసరం.

సేంద్రియ వ్యవసాయంలో ఏ రకమైన రసాయన ఎరువులు మరియు రసాయన సూక్ష్మ పోషకాలకు అనుమతి లేదు. కనుక రైతు సోదరులు ఎంతో విచక్షణతో అనుమతించిన సేంద్రియ  ఉత్పత్తుల ద్వారా ఈ పోషకాలు మొక్కకు అందేటట్లు చూడాలి.

రచయిత సమాచారం

డా. ఈడ్పుగంటి శ్రీలత, NIPHM, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌