Print this page..

రాజశ్రీ పెరటి కోళ్ళ పెంపకం

ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కోడిమాంసం, కోడిగుడ్ల లభ్యత తక్కువ ఉంది. దీంతో వాటి ధరలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రస్తుతం ఉన్న దేశవాళీ కోళ్ళ ఉత్పత్తి సైతం తక్కువగానే ఉంది. దీన్ని అధిగమించేందుకు రాజేంద్రనగర్‌లోని అఖిల భారత సమన్వయ పరిశోధన ప్రాజెక్టు ఎక్కువ గుడ్లను ఉత్పత్తి చేయగల రాజశ్రీ కోళ్ళను ఉత్పత్తి చేసింది. అయితే ఇవి పెరటిలో పెంచుకునేందుకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో వీటి పెంపకం ఆదాయ వనరుగా మారిపోయింది. గ్రామీణ మహిళలకు సులభంగా ఉపాధి కల్పించేది పెరటి కోళ్ళ పెంపకం.

రాజశ్రీ కోళ్ళ లక్షణాలు : 

రాజశ్రీ కోళ్ళు శరీర బరువు మధ్యస్థంగా ఉండటంతోపాటు, పొడవైన కాళ్ళు కలిగి చురుకుగా కదులుతూ పిల్లులు, కుక్కలు, గద్దల నుంచి తప్పించుకొనగలవు. వీటికి వ్యాధి నిరోధకశక్తి ఎక్కువ. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొనగలవు.  వీటి గుడ్డు బరువు నాటు కోళ్ళ గుడ్డు బరువు కన్నా ఎక్కువ. రాజశ్రీ కోళ్ళు ఎక్కువ కాలం బతుకుతాయి. రాజశ్రీ కోళ్ళు ఒక రోజు వయసు కోడిపిల్ల బరువు 38-40 గ్రాములు ఉంటే అదే నాటు కోడి పిల్ల బరువు 25-28 గ్రాములు ఉంటుంది. సంవత్సరానికి 160-180 గుడ్లను పెడుతాయి. వీటి గుడ్ల 50-55 గ్రాముల బరువు కలిగిఉంటాయి. వీటి పెంపకానికి అయ్యే ఖర్చులు చాలా తక్కువ. ఒక కోడి నుంచి రూ.12 వందల వరకు ఆదాయం వస్తుంది.

ఇతర నాటు కోళ్ళతో పోలిస్తే...

20 వారాల వయసు గల రాజశ్రీ పిట్ట 1500 గ్రా. ఉంటే అదే నాటు కోడి 800-950 గ్రా. ఉంటుంది. రాజశ్రీ కోడి పుంజు 1750 గ్రా. బరువు ఉంటే నాటుకోడి పుంజు 1200-1400 గ్రా. ఉంటుంది. మొదటి గుడ్డుపెట్టే వయసులో రాజశ్రీ కోళ్ళకు 160 రోజులు పడితే నాటు కోళ్ళకు 224 రోజుల పడుతుంది. రాజశ్రీ కోళ్ళు ఒక సంవత్సరంలో 160-170 గుడ్లు పెడుతాయి. నాటు కోళ్లు 45-60 గుడ్లు మాత్రమే పెడుతాయి. మొదటి ఆరు వారాల్లో రాజశ్రీ కోళ్లు 98 శాతం బతికితే అదే నాటు కోళ్లు 90 శాతమే బతుకుతాయి.

పెంపకం : 

ఒకరోజు వయసు గల రాజశ్రీ కోడిపిల్లలు మొదటి ఆరు వారాల వరకు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేవు. కనుక వీటికి తగిన వేడిని ఇవ్వవలసి వస్తుంది. తదుపరి కోడిపిల్లలను బయటికి విడిచిపెట్టి పెరటిలో పెంచవచ్చు. నర్సరీలో పెరిగిన రాజశ్రీ పిల్లలను బయట ఉండే ఖాళీ ప్రదేశాన్ని బట్టి 20 పిల్లల వరకు పెంచుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ ప్రదేశం ఉంటే 100-200 పిల్లలను కూడా పెంచుకోవచ్చు. దీనికోసం కోళ్ళను మొదటి దశలో బయట వాతావరణానికి అలవాటు చేయాలి. ఈ కోడి పిల్లల గూళ్ళల్లో ఒకొక్క కోడికి రెండు చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించాలి. కోళ్ళు సాయంత్రం అయ్యేటప్పటికి గూటికి చేరేటట్లు శిక్షణ ఇవ్వాలి. ప్రతిరోజు కోళ్ళు వదిలే ముందు శుభ్రమైన నీటిని అందించాలి. ఈ రాజశ్రీ కోళ్ళు పెరటిలో తిరుగుతూ లభించే గింజలను, పురుగులను తిని జీవిస్తాయి. కానీ ఈ ఆహారం సరిపోదు. కాబట్టి మన ఇంట్లోని గింజలను కానీ తక్కువ ఖర్చులో లభించే దాణాను అందించాలి.

వ్యాపార సరళిలో పిల్లలను తెచ్చుకున్న తరువాత 

ఎక్కువ సంఖ్యలో వ్యాపార సరళలో పెంచుకోవాలనుకుంటే పిల్లలను ఆరు నుంచి ఎనిమిది వారాల వరకు షెడ్లలో శాస్త్రీయ పద్ధతిలో పెంచాలి. షెడ్డులో వరి పొట్టు వంటి లిట్టర్‌ను రెండు మూడు అంగుళాల మందం పోసి పేపర్లు పరవాలి. వాటిపై దాణా, నీటి పాత్రలను చక్రాకారంగా అమర్చాలి. మొదటి వారం గదిలో 95 డిగ్రీల ఫారన్‌ హీట్‌ ఉండేవిధంగా బ్రూడర్లను ఏర్పాటు చేయాలి. కోడి పిల్లలు ఫారంలోకి వచ్చిన వెంటనే గ్లూకోజ్‌ లేదా ఎలక్ట్రాల్‌ పౌడరు కలిపిన నీటిని తాగేలా ముక్కుల ముంచి వీటిని ఫారంలోకి వదలాలి. మొదటి రోజు మొక్కజొన్న గింజల పొడిని పేపర్‌పై చల్లి రెండో రోజునుంచి మార్కెట్‌లో దొరికే బ్రాయిలర్‌ లేదా గ్రోయర్‌ రకానికి చెందిన దాణాను వాడవచ్చు. ఆరు వారాల తరువాత కోడి పిల్లలను ఇంటి పెరట్లో, పొలాల్లో తిరిగేలా వదలాలి. ఈ దశనుంచి ఇక వాటికి దాణాను అందించాల్సిన అవసరంలేదు. తోలు గుడ్లు, లేదా పెంకు పలుచగా ఉన్న గుడ్లు పెడితే కోళ్లకు ఆహారంతో పాటు గవ్వలు లేదా సున్నపు రాయి వంటివి అందించడం ద్వారా కాల్షియం లోపాన్ని నివారించాలి. లాభాలు చవిచూడాలంటే పెట్టలను ఒకటిన్నర సంవత్సరం, పుంజులను పద్నాలుగు నుంచి పదహారు వారాలపాటు పెంచాలి. పెట్ట సంవత్సరానికి 160కి పైగా గుడ్లు పెడుతుంది. గుడ్డును ఐదు రూపాయలకు అమ్మినా ఏడాదికి ఎనిమిది వందల రూపాయల ఆదాయం వస్తుంది. ఇరవై కోళ్ల చిన్న యూనిట్‌ ద్వారా ఖర్చులన్నీ పోను ఏడాదికి రూ.5 వేలు లాభం వస్తుంది. వెయ్యి కోళ్ల యూనిట్‌ను వ్యాపార సరళిలో ఏర్పాటు చేయాలంలే రూ.75 వేల పెట్టుబడి అవసరం అవుతుంది.

రాజశ్రీ కోళ్ళ ఉత్పత్తి సామర్థ్యం :

ఉత్పత్తి సామర్థ్యం పెట్ట పిల్ల పుంజుపిల్ల
8 వారాల వయస్సులో కోడిపిల్ల బరువు  500 గ్రా.  500 గ్రా.
16 వారాల వయస్సులో కోడి బరువు 1300 గ్రా. 1500 గ్రా.
20 వారాల వయస్సులో కోడి బరువు  1500 గ్రా.   1750 గ్రా.
మొదటి గుడ్డు పెట్టి వయస్సు  160 రోజులు    
ఒక సంవత్సరంలో గుడ్లు ఉత్పత్తి 160-170 గుడ్లు  
గుడ్డు బరువు  55 గ్రామలు  

      

రాజశ్రీ కోళ్ళు త్వరగా పెరిగి ఆరు నెలల వయసుకు మగ కోళ్ళు 2200-2500 గ్రా., ఆడ కోళ్ళు 1800-2000 గ్రా. బరువు పెరుగుతాయి. ఈ దశలో అవసరాన్ని బట్టి ఎక్కువ ఉన్న మగ కోళ్ళను అమ్మవచ్చు. ఆడకోళ్ళు ఈ సమయం నుంచి గుడ్లు పెడతాయి. బ్రీడింగ్‌ కోసం ప్రతి మూడు ఆడకోళ్ళకు ఒక మగ కోడి తప్పనిసరిగా ఉంచాలి. గుడ్డు పెట్టే దశలో కోళ్ళకు పుష్టికరమైన దాణాతో పాటు కాల్షియం అందించాలి. ఈ విధంగా చేసినైట్లెతే పెద్ద సైజు గల గుడ్లు పెడుతాయి. రాజశ్రీ కోళ్ళు సంవత్సరానికి 180 గుడ్ల వరకు పెట్టగలుగుతాయి. రాజశ్రీ కోడి పెట్టకు పొదిగే గుణం లేనందువల్ల వాటి ఫలదీకరణ చెందిన గుడ్లను నాటు కోడిపెట్ట లేదా ఇంక్యుబేటర్‌ సహాయంతో పొదిగించి పిల్లలను పొందవచ్చు.

ఈ కోళ్లు గ్రామీణ ప్రాంతాల్లో విస్తతంగా సంచరించే కారణంగా ఇవి పరాన్నజీవుల బారినపడే అవకాశాలుంటాయి. అందువల్ల ఆరు నెలల కాలవ్యవధిలో నెలకు ఒకసారి డీవార్మింగ్‌ కోసం పైపరిజిన్‌ మందును ఒక చెంచా లెక్కన అర లీటరు నీళ్ళలో కలిపి ఒక్కొక్క కోడికి 5-10 మి. లీటర్లు తాగించాలి. దీనివల్ల వీటి కడుపులో  ఉండే పురుగులను నిర్మూలించవచ్చు. పెరటికోళ్ళకు వచ్చే వ్యాధులన్నింటి నుంచి కాపాడటానికి టీకాలు వేయాలి. అలాగే 8 వ వారంలో ఒకసారి, తదుపరి ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొక్కెర తెగులు రాకుండా టీకాలు వేయించాలి.

రాజశ్రీ కింది పిల్లలకు వివిధ వయస్సలో ఇవ్వవలసిన టీకాలు :

టీకా మందు పేరు వయసు ఇచ్చే పద్ధతి
మారెక్స్‌ వ్యాధి టీకా (Marek's)  ఒక రోజు  పిల్ల చర్మం కింద
కొక్కెర వ్యాధి టీకా (Lastoa)   కంటిలో చుక్కలు
గంబొరా వ్యాధి టీకా (IBD)   కంటిలో చుక్కలు
కొక్కెర వ్యాధి టీకా (Lastoa Booster) 28వ రోజు కంటిలో చుక్కలు
గంబొరా వ్యాధి టీకా (IBD Booster) 30వ రోజు  కంటిలో చుక్కలు
అమ్మతల్లి (Fowl Pox) 36వ రోజు  కండలో సూది
కొక్కెర వ్యాధి టీకా (R2B Live)   6వ వారం కండలో సూది

  

కోడిపిల్లల లభ్యత :

ఒకరోజు వయసు గల కోడి పిల్లలు అఖిల భారత కోళ్ళ పరిశోధన స్ధానం, పశువైద్య కళాశాల, శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్‌, హైదారాబాద్‌, ఫోన్‌ 040-24015316 నందు లభ్యమవును.

రచయిత సమాచారం

డా|| జి.రాంబాబు, పశు వైధ్యాధికారి, కడప, ఫోన్‌ : 9618499184