Print this page..

రబీ వేరుశనగలో చీడపడలు - సస్యరక్షణ చర్యలు

నూనె గింజల పంటలలో వేరుశనగ ప్రధానమైన పంట వేరుశనగను ప్రధానంగా రబీ/వేసవిలో ఆరుతడి పంటగా చెరువులు మరియు బోరుబావులు క్రింద సాగుచేయబడుతుంది. ముఖ్యంగా రాయాలసీమ అన్ని జిల్లాలలోను, ఉత్తర కోస్తాలో విజయనగరం, శ్రీకాకుళం మరియు విశాఖపట్నం జిల్లాల్లోను, తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌, వరంగల్‌, కరీంనగర్‌, నల్గొండ మరియు ఖమ్మం జిల్లాల్లో సాగు చేయబడుతుంది. నాణ్యమైన, అధిక దిగుబడునిచ్చే రకాలు అందుబాటులోకి వచ్చినప్పటికి, చీడపీడల ఉధృతి అధికమై, సరియైన సమయంలో (తొలి దశలో) రైతులు గుర్తించకపోవడం వలన వేరుశనగలో కాయ దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి.

రబీ వేరుశనగ పంటలో పూత దశ నుండి కాయలు ముదిరే దశ వరకు వివిధ రకాల చీడపీడలు ఆశించి పంటను నష్టపరుస్తున్నాయి. ముఖ్యంగా రసం పీల్చే పురుగులు (తామర పురుగు, పచ్చదోమ, పేనుబంక ), ఆకు తినే పొగాకు లద్దెపురుగు, ఆకుమడత పురుగు, ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు మరియు కాండం కుళ్ళు తెగుళ్ళు ఆశించి పంటకు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి.

పొగాకు లద్దె పురుగు :

తల్లి పురుగులు ఆకుల పైబాగాన గుంపులుగా గ్రుడ్లు పెడతాయి. గ్రుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు గుంపులుగా ఉండి ఆకులపై పత్రహరితాన్ని గోకి తినివేసి, జల్లెడాకుగా మారుస్తాయి. ఎదిగిన లద్దె పురుగులు సాయంత్రం / రాత్రి వేళలో ఆకులను ఆశించి పూర్తిగా తినివేస్తాయి. ఈ పురుగు పంట తొలి దశ నుండి (అనగా విత్తిన 20 రోజూల నుండి) మొక్కలను ఆశించి నష్టపరుస్తాయి. 

నివారణ :

 • వేసవిలో ట్రాక్టరుతో లోతుగా దుక్కులు చేయడం వలన ప్యూపా దశలో బయటపడ్డా ఎండవేడిమికి లేదా పక్షుల బారిన పడి నాశనం అవుతాయి.
 • గుడ్ల సముదాయాన్ని మరియు పిల్ల పురుగుల సముదాయాలను ఆకులతో సహా ఏరి నాశనం చేయాలి.
 • వేరుశనగ పైరు చుట్టూ 50-100 ఆముదము, ప్రొద్దుతిరుగుడు మొక్కలను ఎర పంటలుగా నాటాలి. ఆ విధంగా రెక్కల పురుగుల ఉధతిని అంచనా వేయాలి.
 • ఎకరానికి పంటపై ఒక అడుగు ఎత్తులో 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి.
 • గ్రుడ్లు / చిన్న లద్దెపురుగు సముదాయమునూ ఆకులపై కనిపించిన వెంటనే 5 శాతం వేప గింజల కషాయము (10 కిలోల వేప గింజల పొడి, 200 లీటర్ల నీటికి 12 గంటలు నానబెట్టి వడగట్టి) ఎకరా పైరుపై సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి. 
 • చిన్న లద్దె పురుగు నివారణకు క్వినాల్‌ ఫాస్‌ 400 మి.లీ. లేదా క్లోరోఫైరిఫాస్‌ 500 మి.లీ. మందును 200 లీ. నీటికి కలుపుకొని ఎకరానికి పిచికారి చేసుకోవాలి.
 • బాగా ఎదిగిన లద్దె పురుగు నివారణకు నోవాల్యురాన్‌ 200 మి.లీ. లేదా థయోడికార్డ్స్‌ 200 గ్రా. లేదా క్లోరిపైరిఫాస్‌ 500 మి.లీ. లేదా క్లోరాంత్రనిలిప్రోల్‌ 60 మి.లీ.లలో ఒక మందును 200 లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.
 • బాగా ఎదిగిన లార్వాలు / లద్దె పురుగులు నివారణకు విషపు ఎరను (10 కి. తవుడు, 1 బెల్లం, 1/2 లీ. క్లోరిపైరిఫాస్‌) తయారు చేసి సాయంత్రం వేళల్లో చిన్న చిన్న ఉండలుగా చేసి పంటలో వెదజల్లాలి.

రసం పీల్చు పురుగులు (తామర పురుగులు, పచ్చదోమ, పేనుబంక) :

ఈ పురుగులు పంట వేసిన 20 రోజుల నుంచి వీటి ఉధతి గమనించవచ్చు. పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులు ముడుచుకొని, మొక్కలు గిడసబారిపోతాయి. పూత దశలో ఆశించినచో పూత రాలిపోతుంది. వేరుశనగలో తామర పురుగులు మొవ్వుకుళ్ళు మరియు కాండం కుళ్ళు, వైరస్‌ తెగుళ్ళను వ్యాపింపచేస్తాయి.

నివారణ :

 • రసం పీల్చే పురుగుల నివారణకు మోనోక్రోటోఫాస్‌ 320 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 300 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 80 మి.లీ. ఏదైన ఒక మందును 200 లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఆకుముడత పురుగు :

ఆకుపచ్చ రంగులో నల్లని తల కలిగిన పిల్ల పురుగులు రెండు, మూడు ఆకులను కలిపి గూడు చేసి వాటి నుండి పచ్చ దనాన్ని తిని వేయడం వలన ఆకులన్ని ఎండిపోయి కాలినట్లు కనిపిస్తాయి. బెట్ట పరిస్థితులలో ఈ పురుగు ఉధతి ఎక్కువగా ఉండును.

నివారణ : 

 • నోవాల్యురాన్‌ 200 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్‌ 500 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్‌ 320 మి.లీ. + డైక్లోరోవాస్‌ 200 మి.లీ. ఏదైనా ఒక మందును 200 లీ. నీటిలో కలుపుకొని వాడుకున్నట్లైతే ఈ పురుగును నివారించవచ్చును.

తిక్కా ఆకుమచ్చ తెగులు :

ఈ తెగులు రెండు విధాలుగా వస్తుంది. ముందుగా వచ్చే ఆకుమచ్చ తెగులు విత్తిన 30 రోజుల తర్వాత కన్పిస్తుంది. గోధుమ వర్ణపు నల్లటి మచ్చలు కొంచెం గుండ్రంగా ఉండి ఆకు పైభాగాన ఏర్పడి చుట్టూ పసుపు పచ్చని వలయం నిర్దిష్టంగా కన్పిస్తుంది మరియు ఈ తెగులు ఆకుల అంతటా వ్యాపించి ఆకులు ఎండిపోయి, రాలిపోతాయి.

ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులు లక్షణాలు విత్తిన 40-45 రోజుల తర్వాత ఈ తెగులు కన్పిస్తాయి. ఈ తెగులు మచ్చలు చిన్నవిగా, గుండ్రంగా వుండి, ఆకు అడుగు భాగాన నల్లని రంగును కలిగి ఉంటాయి. ఈ మచ్చల చుట్టూ పసుపు పచ్చని వలయాలు ఉండవు. తిక్కా ఆకుమచ్చ తెగులు, ఆకు తొడిమలను, కాండంను మరియు ఊడలను ఆశించి పంటకు నష్టం కలుగజేస్తాయి.

నివారణ:

 • తెగులు తట్టుకునే వేమన, కదిరి-9, అభయ, ధరణి మరియు కదిరి హరితాంధ్ర రకాలను విత్తుకోవాలి.
 • వేరుశనగలో సజ్జ / మొక్కజొన్న పంటను 7:1 నిష్పత్తిలో అంతర పంటగా వేయాలి.
 • ఈ తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే ఎకరాకు కార్బండిజిమ్‌ + మ్యాంకోజెబ్‌ కలిసివున్న మందును 500 గ్రా. లేదా క్లోరోథాలోనిల్‌ 400 గ్రా. లేదా హెక్సాకొనజోల్‌ 200 మి.లీ. ఏదైన ఒక మందును 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

త్రుప్పు లేదా కుంకుమ తెగులు :

ముదురు ఆకుల అడుగు భాగాన ఎరుపు లేదా ఇటుక రంగు గల బొడిపెల లాంటి మచ్చలు ఏర్పడతాయి, ఆకుల పైభాగంలో పసుపు రంగు మచ్చలు కన్పిస్తాయి. వాతావరణం అనుకూలంగా   ఉన్నప్పుడు (రాత్రి ఉష్ణోగ్రతలు 20-25 డిగ్రీల సెంటిగ్రేడ్‌, గాలిలో అధిక తేమ శాతం మరియు చిరుజల్లులతో కూడిన వర్షం మూడు రోజుల పాటు) మచ్చలు అన్నీ కలిపిపోయి ఆకుల ఎండిపోతాయి.

నివారణ : 

 • 400 గ్రా. క్లోరోథాలోనిల్‌ లేదా 500 గ్రా. మాంకోజెబ్‌ లేదా 200 గ్రా. బెలటాన్‌ ఏదైనా ఒక మందును 200 లీ. నీటిలో కలిపి పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

కాండం కుళ్ళు తెగులు (బూజు తెగులు / బూడిద తెగులు) :

ఈ తెగులు విత్తిన 70 రోజుల తర్వాత నుండి పంట చివర వరకు ఆశించును. ప్రధానంగా ఈ తెగులు కాండంను, ఊడలు మరియు కాయలను ఆశిస్తుంది. భూమి పైభాగాన ఉన్న కాండం మీద తెల్లటి బూజు తెరలుగా ఏర్పడి ఆ తరువాత ప్రతికూల పరిస్థితులలో తెల్లటి బూజులో ఆవగింజ పరిమాణంలో ఉన్న శిలీంధ్ర సిద్ధ బీజాలు ఏర్పడతాయి. తెగులు ఆశించిన మొక్క మొదళ్ళలోని శాఖలు, ఊడలు ఎండిపోతాయి. ఆశించిన మొక్కలను పీకినపుడు నేలపై ఉన్న పైభాగాలు మాత్రమే ఊడివస్తాయి. వేర్లు మరియు కాయలు నేలలోనే ఉండిపోతాయి. భూమి మరియు విత్తనం ద్వారా ఈ శిలీంధ్రం వ్యాపిస్తుంది.

నివారణ :

 • వేసవిలో లోతైన దుక్కులు దున్నుకోవాలి.
 • ఆరోగ్యవంతమైన విత్తనం ఎన్నుకోవాలి. 
 • ఆలస్యంగా వచ్చు ఆకుమచ్చ తెగులును అదుపులో ఉంచినచో ఈ తెగులు ఉధతి కొంత మేరకు తగ్గుతుంది.
 • ఒక కిలో విత్తనానికి 3 గ్రా. మ్యాంకోజెబ్‌ లేదా 1 గ్రా. కార్బండిజమ్‌ లేదా టిబుకొనజోల్‌ 2% డి.ఎస్‌ కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.
 • రెండు కిలోల ట్రైకోడెర్మా విరిడిని 90 కిలోల పశువుల ఎరువు మరియు అర కిలో బెల్లం కలిపి చెట్టు నీడన పాలిథిన్‌ కాగితం కప్పి 15 రోజులపాటు వృద్ధి చేసుకొని ఒక ఎకరా భూమిలో పదునులో విత్తే ముందు వేసుకోవాలి.
 • తెగులు సోకిన మొక్కలు పీకి నావనం చేసి చుట్టూ గల నేలను 2.5 గ్రా. మాంకోజెబ్‌ లేదా 1 గ్రా. కార్బండిజమ్‌ ఒక లీటరు నీటిలో కలిపి నాజిల్‌ తీసి నేలను తడిసేటట్లు పోయాలి

రచయిత సమాచారం

యస్‌. ఓంక్రాష్‌, శాస్త్రవేత్త (కీటకశాస్త్రం), పి. గోన్యానాయక్‌, జి. మహేష్‌బాబు, డా. ఆర్‌. ఉమారెడ్డి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పొలాస, జగిత్యాల