Print this page..

రబీ ఆవాల పంటలో యాజమాన్య పద్ధతులు

ఆవాల పంటను మన దేశంలో సాగయ్యే నూనె గింజల పంటల్లో అత్యధిక విస్తీర్ణములో సాగవుతున్న పంట. ఈ పంటను ప్రధానంగా ఉత్తర భారతదేశంలో రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యాన మరియు మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో అధిక విస్తీర్ణములో సాగు చేయబడుతున్నది. ఉత్తర తెలంగాణలో ఆవాల పంట పండించుటకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. చల్లని మరియు పొడి వాతావరణం పంట సాగుకు అనుకూలము. ఆవాలులో 37 నుండి 42 శాతం నూనె ఉంటుంది. తక్కువ నీటి వనరులు, సులభ యాజమాన్యము మరియు స్థిరమైన మార్కెట్‌ ధరలు ఈ పంటను రబీలో సాగు చేయుటకు అనుకూలము మరియు లాభదాయమకైనదిగా చెప్పవచ్చు.

విత్తే సమయం : 

అక్టోబర్‌ నెల మొదటిపక్షం నుంచి నవంబర్‌ నెల మొదటి పక్షం వరకు ఈ పంటను విత్తుకోవచ్చును.

నేలలు :

బరువైన నెలలు ఆవాల పంటకు అనుకూలము. ఈ పంటను తేలిక పాటి నేలలు, నల్ల రేగడి మరియు ఒండ్రు నేలల్లో కూడా పండించవచ్చు.

విత్తన మోతాదు :

ఎకరానికి 2.0 కిలోల విత్తనము సరిపోతుంది.

విత్తే దూరం, విత్తే పద్ధతి :

ఎకరా మోతాదు విత్తనానికి కనీసం 5 కిలోల ఇసుక కలిపి గొర్రు సహాయంతో వరుసల మధ్య 45 సెం.మీ., మొక్కల మధ్య 15-20 సెం.మీ. దూరం ఉండేలా విత్తాలి.

విత్తన శుద్ధి : 

కిలో విత్తనానికి 3 గ్రా. కాప్టాన్‌తో విత్తనశుద్ధి చేయాలి.

రకాలు :

వరుణ, పూసా అగ్రాన్‌, పూస మహక్‌, నరేంద్ర, అనే ప్రాచుర్యంలో ఉన్న రకాలను ఎంచుకోవచ్చు (లేదా) ప్రైవేట్‌ రంగానికి చెందిన (బ్లాక్‌ గోల్డ్‌, పయెనీర్‌ సీడ్స్‌) రకాలను కూడా వేసుకోవచ్చు.

ఎరువుల యాజమాన్యం :

ఎకరాకు 2-3 టన్నుల బాగా మాఘిన పశువుల ఎరువును విత్తే ముందు వేసుకోవాలి. 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం మరియు16 కిలోల పొటాసియంనిచ్చే ఎరువులను ఒక ఎకరానికి వేయాలి. రెండవ దఫా నత్రజని ఎరువును పైరు పూతకు వచ్చే ముందు (55-60 రోజులు) వేయాలి.

కలుపు యాజమాన్యం :

పంట విత్తిన తర్వాత 40-60 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. పెండిమిథాలిన్‌ (30%) 600 మి.లీ. ఒక ఎకరానికి సరిపోయేలా 200 లీటర్ల నీటితో కలిపి విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు నేలపై పిచికారి చేయాలి. పైరు 30 మరియు 60 రోజుల దశలో వరుసల మధ్య అంతరసేద్యం చేయాలి.

నీటియాజమాన్యం :

ఆవాల పంట సాగుకు 300-400 మి.మి నీరు అవసరం ఉంటుంది. మొత్తంగా పంటకు 3 నుండి 4 తడులు ఇచ్చి మంచి దిగుబడులను సాధించవచ్చును. కొమ్మలు ఏర్పడే దశ (30 నుండి 40 రోజులు) మరియు పూత, కాయ ఏర్పడే దశలు (60 నుండి 80 రోజులు) కీలకమైనవి.

అంతర పంటలు, పంటల సరళి :

ఖరీఫ్‌ మొక్కజొన్న, సోయబీన్‌, పత్తి తర్వాత ఆవాల పంటను సాగు చేయవచ్చును.  శనగ - ఆవాలు 5:1 లేదా 3:1 నిష్పత్తిలో అంతర పంటల సాగు లాభదాయకము.

సస్యరక్షణ :

సాప్లై : 

ఈ పురుగు ఆకులపై చిన్న చిన్న రంద్రాలను చేసి గుడ్లను పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు ఆకులను పూర్తిగా తిని వేసి ఈనెలను మాత్రమే మిగులుస్తాయి. ఈ పురుగు ముఖ్యముగా మొక్క తొలిదశలో నష్టాన్ని కలుగజేస్తుంది. అనగా ఈ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా నవంబర్‌ నెలలో పంటపై కనిపిస్తుంది. కావున ఈ పురుగు నివారణకు ఎసిఫేట్‌ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పేనుబంక :

పిల్ల మరియు పెద్ద పురుగులు ముదురు నలుపు రంగులో ఉండి మొక్క యొక్క లేత ఆకులు, కాండము మరియు కాయలపై గుంపులు గుంపులుగా ఉండి వాటి నుండి రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ పురుగు ఆశించిన మొక్కలు వడలిపోయి చివరికి చనిపోతాయి. అంతే కాకుండా ఈ పురుగు విసర్జించే తేనె వంటి జిగట పదార్ధము ఆకులపై ఉండటము వలన కిరణజన్య సంయోగక్రియ సరిగ్గా జరగక మొక్క ఎదుగుదల కుంటు పడుతుంది.

ఈ పురుగు నివారణకు డైమిథోయేట్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

బీహారి గొంగళి పురుగు :

తల్లి పురుగు ఆకులపై గుడ్లను పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన గొంగలిపురుగు ఆకులను తినివేసి నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ పురుగు నివారణకు ఎసిఫేట్‌ 1.5 గ్రా. లీటరు నీటికి లేదా క్లోరిఫైరిపాస్‌ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తుప్పు తెగులు :

ఆకులపై తెల్లటి బుడుపెల్లాంటి పదార్ధం ఏర్పడుతుంది. ఈ తెగులు నివారణకు ప్రొఫికొనజోల్‌ 1 మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పంట కోత :

పంట పక్వానికి వచ్చినపుడు కాయలు పసుపు రంగుకు మారతాయి. మొక్కలను కోసి ఎండిన తర్వాత కర్రలతో కొట్టి విత్తనాన్ని కాయల నుంచి వేరు చేయాలి.విత్తనాలలో తేమ 8-9 శాతం వరకు వచ్చేలా ఎండబెట్టాలి.

రచయిత సమాచారం

పి. మదుకర్‌ రావు, శాస్త్రవేత్త (ఆగ్రానమి), డి. పద్మజ, శాస్త్రవేత్త (ప్లాంట్‌ బ్రీడింగ్‌), ఎస్‌. ఓంప్రకాశ్‌ (కీటకశాస్త్రం), ఎన్‌. నవత, శాస్త్రవేత్త (ఆగ్రానమి), బి. మాధవి, శాస్త్రవేత్త (ఆగ్రానమి), ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పొలాస, జగిత్యాల.