Print this page..

వరికి సుడిదోమ బెడద

ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వరి సాగు చేసే పైర్లలో చీడ పీడలు ఆశించే అవకాశం ఉంది. ప్రస్తుతం చాలా చోట్ల వరి పైర్లు చిరు పొట్ట దశ నుంచి పాలు పోసుకునే దశలో ఉన్నాయి. ఈ దశలో సుడి దోమ ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వరి పంటను సుడిదోమ బారి నుండి రక్షించుకోవచ్చు వరిని ముఖ్యంగా రెండు రకాల దోమలు ఆశించి నష్టపరుస్తాయి.

తెల్ల వీపు మచ్చ దోమ :

ఇవి గోధుమ రంగు దోమ కంటే చిన్నవిగా ఉంటాయి తెల్ల పురుగుల ముందు రెక్కలు కలిసే చోట చివర నల్లటి మచ్చ  ఉంటుంది రెక్కల ముందు భాగంలో తెల్లటి మచ్చ ఉంటుంది. ఇవి 6 -8 గుడ్లను వరి దుబ్బుల మొదళ్ళ దగ్గర ఆకు తొడిమ లోపలి కణజాలంలో పెడతాయి ఈ గుడ్లు విడి విడిగా ఉంటాయి పిల్ల పురుగులు తెల్లగా ఉండి 8-28 రోజుల్లో పెద్ద పురుగులుగా మారుతాయి. ముఖ్యంగా ఈ దోమ వరి పిలకలు వేసే దశలో ఆశిస్తుంది . 

గోధుమ రంగు దోమ : 

ఆడదోమలు మగ వాటి కంటే పెద్దవిగా ఉంటాయి సుడి దోమలు రెక్కలున్నవి, లేనివి ఉంటాయి వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు రెక్కలున్న దోమలు అభివద్ధి చెందుతాయి తల్లి దోమ 300-500  గుడ్లను ఆకు తొడిమలో గాని లేదా మధ్య ఈనేలో గాని పెడుతుంది 2-12  గుడ్లను ఒక దాని పక్కన ఒకటి పెట్టి వాటి చివరలను ఒక దానితో ఒకటి కలిపి గుంపుగా చేస్తుంది. ఈ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు పెద్ద పురుగులుగా మారుతాయి. ముఖ్యంగా వరి పొట్ట దశలో ఆశిస్తుంది.

నష్ట పరిచే విధానం :

ముందుగా రెక్కలున్న సుడిదోమలు పిలకలు వేసే దశలో వరి పైరును ఆశిస్తాయి ఇవి మూడు, నాలుగు వారాల్లో రెక్కలు లేని దోమల్ని (మొదటి సంతతి) ఉత్పత్తి చేస్తాయి. ఆ తరువాత ఇవి రెండో సంతతిని ఉత్పతి చేస్తాయి ఈ దశలో పిల్ల, తల్లి పురుగులు తీవ్రంగా నష్టపరుస్తాయి మనం ఈ దశలో మాత్రమే పురుగుల్ని గుర్తించగల్గుతాం. ఈ సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే రెక్కలున్న మూడోతరం పురుగుల వద్ధి చెంది పైరును నష్టపరుస్తాయి. ఈ సుడిదోమలు వరి దుబ్బుల మొదళ్ళను అశించి నష్టపరుస్తాయి దీంతో మొక్కలు గిడసబారి పోషకాలు అందక పసుపు రంగుకు మారి సుడులు సుడులుగ ఎండిపోతుంది. వీటి ఉదతి అధికంగా ఉన్నప్పుడు వరి కంకి వరకు కూడా అశించి నష్టాన్ని కలుగజేస్తాయి సుడి దోమలు ఆకులపై విసర్జించే తెనే లాంటి జిగురు పదార్థం వల్ల మసి తెగులు సోకుతుంది సుడిదోమలు గ్రాసిస్టంట్‌ వంటి వైరస్‌ తెగుళ్లు కుడా వ్యాప్తి చేస్తాయి.

అనుకూల పరిస్థితులు :

  • సిఫార్సు చేయని మందులను ముఖ్యంగా బయో మందులను విచక్షణా రహితంగా పిచికారీ చేయడం.
  • నత్రజని ఎరువులను (ముఖ్యంగా యూరియా) మోతాదుకు మించి వాడడం. 
  • అధికంగా నీటిని పెట్టి ఉంచడం.
  • పంట మొదటి దశలలో క్లోరోపైరిఫాస్‌, ప్రొఫెనోపాస్‌, లామ్డా సైహలోత్రిన్‌, సింథటిక్‌ పైరిథ్రాయడ్‌ మందులను వాడడం.
  • పగటి ఉష్ణోగ్రత 25-30 డిగ్రీల సెంటిగ్రేడ్ పొలంలో అధిక తేమ ముఖ్యంగా వరి పంట చిరు పొట్ట దశలో ఉన్నప్పుడు కురిసే అధిక వర్షాలు దోమ ఉధృతి పెరగడానికి దోహద పడుతుంది. 
  • సన్న గింజ రకాలను ఎక్కువగా సాగు చేసే ప్రాంతాలు దోమ వ్యాప్తికి అనుకూలంగా ఉంటాయి.

నివారణ చర్యలు : 

  • ప్రధాన పొలంలో ప్రతి 2 మీటర్లకు 20 సెంటీ మీటర్లు కాలి బాటలు తీయాలి.
  • నత్రజని ఎరువులను సిఫారసు చేసిన మోతాదులో విడతల వారీగా వివిధ దశల్లో వేయడం.
  • చిరు పొట్ట దశ నుంచి పూత దశలో ఉన్న వరి పైరును ఆశించిన దోమ నివారణకుగాను బుఫ్రోఫెజిన్‌ 1.6 మి.లీ. లేెదా ఎసిఫేట్‌ 1 .5 గ్రా . లేదా ఇథోపెన్‌ ప్రాక్స్‌ 2 .0 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ + ఎథిప్రోల్‌ 0.25 గ్రా. లేదా ట్రీఫ్లూమేజాపైరి 0 .5 మి.లీ. లేదా పైమెట్రోజిన్‌ 0 .5 గ్రా. లేదా డైనోటేఫ్యురాన్‌ 0 .4 గ్రా. ఒక లీటరు నీటికి కలుపుకొని స్ప్రే చేసుకోవాలి.
  • స్ప్రే చేసేటప్పుడు పాయలు తీసుకొని మొక్కల మొదళ్ళ భాగంలో మందు పడేలాగా పిచికారి చేసుకోవాలి.

రచయిత సమాచారం

డి|| అనీల్‌, శాస్త్రవేత్త (సేద్యశాస్త్ర విభాగం), డా|| శ్రీధర్‌ సిద్ది, శాస్త్రవేత్త (ప్లాంట్‌ బ్రీడింగ్‌), ఎం. సంతోష్‌ కుమార్‌, సాయిల్‌ సైన్స్‌ (పి.హెచ్‌.డి స్కాలర్‌)