Print this page..

సేంద్రియ పద్ధతిలో యాసాంగిలో పసుపు సాగు

పసుపు దుంపజాతి పంట. దీనిని ఎక్కువగా ఉష్ణ మండలంలో తేమతో కూడిన వాతావరణంలో పండించవచ్చు. పసుపు దుంపల్లోని కర్కుమిన్‌ పసుపుదనాన్ని కలిగించే పదార్ధం. సుగంధ తైలం 2 నుండి 6 శాతం ఉండడం వలన ఆహార పదార్ధాలకు రంగు, రుచి, సువాసనలను చేర్చుటను గాను ఔషధాలలోను సౌందర్య సాధనాలలోను, పరిమళ ద్రవ్యాల తయారీలోను, రంగుల పరిశ్రమల్లోను ఉపయోగిస్తారు. అధిక కర్కుమిన్‌ గల పసుపు రకాలకు మార్కెట్‌ ఎక్కువగా ఉంది.

నేలలు :

బలమైన నేలలు పసుపు పండించడానికి శ్రేష్టమైనవి. గరప నేలలు, మురుగునీటి పారులద సౌకర్యం గల ఇతర నేలలు అనుకూలం. చౌడు నేలలు, నల్లరేగడి భూములు, నీరు నిలువ ఉండే నేలలు పనికిరావు. ఉదజని సూచిక 5 నుండి 7.5  ఉన్నచో ఈ పంటకు అనుకూలం. సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉండాలి.

రకాలు : 

రాజేంద్ర సోనియా, ప్రతిభ, అల్లేసి, రశ్మి, ప్రభ, సుదర్శన, సుగంధం

విత్తే సమయం :

స్వల్పకాలిక రకాలను అక్టోబరు చివరి వారంలో మధ్యకాలిక రకాలను నవంబర్‌ మొదటి పక్షంలో, దీర్ఘకాలిక రకాలను నవంబర్‌ రెండో పక్షంలో విత్తుకోవాలి.

విత్తనము :

ఎకరాకు సుమారుగా 1000 కిలోల విత్తనం కావాలి. తల్లి కొమ్ములు, పిల్ల కొమ్ములు నాటడానికి వినియోగించుకోవచ్చు. 6 నుండి 8 సెం.మీ. పొడవు గల ధృఢంగా ఉండే మొలకెత్తు మొగ్గలున్న పిల్ల కొమ్ములు అనువుగా ఉంటాయి.

నేల తయారీ :

వేసవిలో లోతు దుక్కులు చేసి గుల్లబారేటట్లు దున్నాలి. 6,8 సార్లు దున్నిన ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 10 టన్నుల చెరువు మట్టి వేసి కలియదున్నాలి. విత్తే సమయంలో 2500 కిలోల నాడెప్‌ కంపోస్ట్‌ వేయాలి. 125 కిలోల ఘనజీవామృతాన్ని వేసి దున్నాలి.

విత్తన శుద్ధి :

ఎంపిక చేసిన 1000 కిలోల విత్తనాన్ని బీజామృతం / బీజరక్ష / పంచగవ్య లేదా ఎ.ఇ.మం.లో ముంచి అరగంట నానబెట్టిన తర్వాత విత్తనాన్ని జాగ్రత్తగా తీసి నీడలో ఆరబెట్టి విత్తుకోవడం మంచిది. విత్తనశుద్ధి చేయడం వలన విత్తనం ద్వారా సంక్రమించే దుంప, వేరుకుళ్ళు, తాటాకు తెగులు, ఆకుమచ్చ తెగుళ్ళకు కారణమైన శిలీంద్రాలు నాశనమవుతాయి. భూమిలోని హానికర శిలీంద్రాలు కొంతకాలం వరకు విత్తనాన్ని ఆశించవు.

నీటి యాజమాన్యం :

తక్కువ వర్షపాత ప్రాంతాల్లో పసుపును నీటి వసతి కింద సాగు చేయాలి. 4 నుండి 6 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. పసుపులో బిందుసేద్యం ద్వారా ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. దుంపకుళ్ళు ఆశించినప్పుడు నీటి తడుల మధ్య వ్యవధి పెంచాలి. కాలువల మధ్య భూమిని పచ్చి ఆకులు లేదా ఎండు ఆకులతో కప్పి ఉంచాలి. దీనివల్ల పసుపు బాగా మొలకెత్తడమే గాక కలుపు పెరగదు.

అంతర పంటలు :

రెండు వరుసల పసుపు, ఒక వరుస మొక్కజొన్న వేయడం వలన పసుపు దిగుబడులను గణనీయంగా పెంచవచ్చు. అదే విధంగా మొక్కజొన్న వలన అదనపు లాభాన్ని ఆర్జించవచ్చు. ఒక్కసారి పసుపు వేసిన పంట చుట్టూ రక్షక పంటగా 2 వరుసల కంది పంట వేసుకోవాలి. దీనివలన అదనపు ఆదాయం సమకూరడమే గాక గాలిని అడ్డుకుంటుంది.

ఎరువుల యాజమాన్యం :

విత్తనం విత్తే ముందు 2500 కిలోల నాడెప్‌ కంపోస్ట్‌ వేయాలి. 125 కిలోల ఘనజీవామృతాన్ని విత్తేటప్పుడు వేసి 60 రోజుల తర్వాత 125 కిలోల ఘనజీవామృతాన్ని మొక్క మొదళ్ళలో వేయాలి. అలాగే విత్తిన 45 రోజులకు 200 లీటర్ల ద్రవ జీవామృతాన్ని మొక్కల మొదళ్ళలో వేయాలి. అలాగే విత్తిన 45 మరియు 75 రోజులకు 200 లీటర్ల ద్రవజీవామృతాన్ని మొక్కల మొదల్ళలో పోయాలి. 100, 125 రోజులకు ద్రవజీవామృతాన్ని 200 లీటర్లు ఒక ఎకరాకు మొక్కల మొదళ్ళ వద్ద పోయాలి లేదా నీటి తడులు ఇచ్చినపుడు దానితో కలిపి పారించాలి. ప్రతి 20 రోజులకొకసారి పంచగవ్య పిచికారి చేయాలి. దీనివలన మొక్క ఏపుగా పెరగడమే కాకుండా, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకొంటుంది.

250 నుండి 300 కిలోల వేప పిండిని ఎకరాకు వేసినచో దుంప కుళ్ళును నివారించవచ్చు. నీటి తడి ఇచ్చిన తరువాతనే వేప పిండిని చల్లాలి. ఎరువుతోపాటు 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంద్రనాశక పొడిని సేంద్రియ ఎరువులో కలుపుకొని నేలలో వేసినచో దుంప కుళ్ళును మరియు ఆకుమచ్చ తెగులు నివారించవచ్చు. ఎకరానికి 3 కిలోల సూడోమోనాస్‌ ఫ్లోరెసెన్స్‌ అనే బ్యాక్టీరియా పొడిని కూడా కలిపినట్లయితే భూమి నుండి సోకే వేరుకుళ్ళు, దుంపకుళ్ళు నివారించవచ్చు.

పంట కోత : 

పసుపు పంట 210 నుండి 270 రోజులకు త్రవ్వకానికి వస్తుంది. పసుపు పంట పక్వానికి చేరుకున్న కొద్దీ మొక్కల ఆకులు ఎండడం ఆరంభమవుతాయి. మొక్కలు ఎండిపోయే వరకు పంట కోయరాదు. పసుపును త్రవ్వే రెండు రోజుల ముందు మొక్క ఆకులు, కాండాలను భూ మట్టానికి కోయాలి. తరువాత నీరు పెట్టిన 2 రోజుల తర్వాత దుంపలు త్రవ్వకం ప్రారంభించాలి. త్రవ్వి తీసిన వారం లోపల ఉడకబెడితే పసుపు నాణ్యత బాగా ఉంటుంది.

పసుపు ఉడికించే సమయంలో జాగ్రత్తలు :

పొలం నుండి తీసిన కొమ్ములను త్వరగా ఉడికించి ఆరబెట్టాలి. తల్లి దుంపలను, పిల్ల కొమ్ములను వేరువేరుగా ఉడకబెట్టాలి. పసుపు ఉడికించే బానలలో దుంపలు మునిగే వరకు నీరు పోసి సమంగా మంట పెట్టాలి. 45 నుండి 60 నిమిషాలకు తెల్లటి నురుగు పొంగి పసుపుతో కూడిన వాసన పొగలు వస్తాయి. అప్పుడు పసుపును నొక్కితే మెత్తగా ఉంటుంది. చిన్న పుల్లను గుచ్చినట్లయితే లోనకు దిగబడుతుంది. పసుపు ఉడికింది అనడానికి ఇదే గుర్తు. పసుపును బయటకి తీయాలి. పసుపు ఉడికించేందుకు వాడే నీరు శుభ్రంగా        ఉండాలి. పేడ కలపరాదు.

పసుపును ఉడకబెట్టడంలో మేలైన పద్ధతులు :

50 కిలోల తల్లి దుంపలను గాని, పిల్ల దుంపలు గాని తీసుకొని 90x55x40 సెం.మీ. సైజు గల జల్లెడ రంధ్రాలు గల ఇనుప తొట్టెలో పోయాలి.  దీనిని కొంచెం పెద్ద సైజు గల ఇనుప కడాయిలో దించాలి. దుంపలు మునిగే వరకు నీరు పోయాలి. ఉడికిన తరువాత దుంపలున్న తొట్టిని పైకి లేపి పరిశుభ్రమైన స్థలంలో పోసి, తిరిగి తొట్టెలో వేరే దుంపలు పోసి ఉడికించాలి.

పసుపు ఆరబెట్టడం :

సమంగా ఉడికిన పసుపును బయట చదునైన శుభ్రమైన టార్పాలిన్‌ లేదా సిమెంటు ప్లాట్‌ఫాంపై కుప్పగా పోయాలి. 24 గంటల తరువాత 2,3 అంగుళాల మందం ఉండేలా పరచాలి. పలుచగా పరిస్తే పసుపు రంగు చెడిపోతుంది. 10-15 రోజులకు పసుపు ఎండుతుంది. 8 శాతం తేమ ఉండేవరకు ఎండబెట్టి నిలువ చేయాలి. ఉడికిన పసుపు తడిస్తే పసుపు నారింజ రంగు వస్తుంది. కాబట్టి తడవకుండా జాగ్త్రత్తలు తీసుకోవాలి. పసుపు ఆరబెట్టేటప్పుడు అప్లాటాక్సిన్‌ అనే విషపదార్ధం చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉడికిన పసుపు తొందరగా ఎండకపోవడం వలన అప్లాటాక్సిన్‌ వృద్ధి చెందుతుంది. దీని నివారణకు వండిన పసుపు ఆరబెట్టేటప్పుడు పైకీ, కిందకు తిప్పాలి. ఉడికించేటప్పుడు తక్కువ, ఎక్కువ ఉడికించరాదు. ఎండా, గాలి తగిలే గట్టి కల్లంలో ఆరబెట్టాలి. పసుపును ఎండబెట్టేటప్పుడు వర్షంలో గాని, మంచులో గాని తడవకుండా టార్పాలిన్‌ కప్పి ఉంచాలి.

పాలిషింగ్‌

ఎండిన పసుపును మెరుగు పెడితే దుంపులు ఆకర్షణీయంగా తయారవుతాయి. పాలిషింగ్‌ చేయడానికి ఇప్పుడు డ్రమ్ములు అందుబాటులో ఉన్నాయి. పసుపు దుంపలను, కొమ్ములను డ్రమ్ములో పోసి హ్యాండిల్‌తో త్రిప్పితే డ్రమ్ము తిరుగుతుంది. డ్రమ్ము పక్క భాగంలో ఇనుప మెష్‌ ఉండడం వలన ఒకదానికొకటి రాసుకుని పసుపు మెరుగు పెట్టబడుతుంది. ఆఖరి దశలో పసుపు పొడిని నీళ్ళలో కలిపి కొమ్ములపై చిలకరించినట్లయితే ఆకర్షణీయంగా తయారవుతాయి. కృత్రిమ రంగులు వాడరాదు.

రచయిత సమాచారం

బానోతు రాంబాబు, టీచింగ్‌ అసోసియేట్‌, ఏకలవ్య ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌, జింగుర్తి, వికారాబాద్‌, ఫోన్‌ : 8008866517