Print this page..

శనగ సాగులో మేలైన యాజమాన్యం

శీతాకాలంలో మంచు ఆధారంగా మిగులు తేమను ఉపయోగించుకుంటూ నల్లరేగడి నేలల్లో రబీలో పండించే పప్పు ధాన్యాల పంట శనగ. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 1.5 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగు చేయబడుతుంది. అందులో ముఖ్యంగా జోగులాంబ గద్వాల్‌, కామారెడ్డి, సంగారెడ్డి మరియు ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఎక్కువగా సాగవుతుంది. ముఖ్యంగా ఖరీఫ్‌లో వేసిన స్వల్పకాలిక పంటలు పూర్తి అవగానే లేదా ఏ పంటా వేయని పొలాల్లో ఈ పంటను విత్తుకోవచ్చు. నీరు నిలవకుండా చౌడు లేని, తేమ బాగా పట్టి ఉంచే సారవంతమైన, మధ్యస్థ, నల్లరేగడి నేలలు మరియు ఉదజని సూచిక 6-7 ఉండే నేలలు ఈ పంట సాగుకు అనుకూలం.

విత్తుకునే ముందు భూమిని నాగలితో లేదా కల్టివేటర్‌తో ఒకసారి, తరువాత గొర్రుతో రెండు సార్లు మెత్తగా దున్ని చదునుచేసి విత్తుటకు సిద్ధం చేయాలి. పశువుల ఎరువు 10 టన్నులు, గంధకం 16 కిలోలు, నత్రజని 8 కిలోలు, మరియు భాస్వరపు ఎరువులు 20 కిలోలు ఎకరాకు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. విత్తే ముందు భూమిలో సరిపడా తేమ ఉండేటట్లు చూసుకోవాలి. 

కాబూలీ రకాలు :

కె.ఎ.కె.2 : పంట కాలం 95- 100 రోజులు కలిగి ఉండి, ఎకరానికి 8-10 క్వింటాళ్ళ దిగుబడిని పొందవచ్చు.

ఐ.సి.సి.వి.-2 (శ్వేత) : ఎండు తెగులును తట్టుకునే స్వల్పకాలిక రకం   

విత్తన మోతాదు :

విత్తన బరువును బట్టి విత్తన మోతాదు ఎకరాకు మారుతుంది దేశవాళీ రకాలలో ఎకరానికి 25-30 కిలోలు మరియు కాబూలీ రకాల్లో 45-60 కిలోలు అవసరమవుతుంది.

విత్తన శుద్ధి :

విత్తుకునే ముందు విత్తన శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యం. థైరామ్‌ లేదా కాప్టాన్‌ 3 గ్రా. లేదా కార్బండజిమ్‌ 2.5 గ్రా. లేదా వాటి వాక్స్‌ పవర్‌ 1.5 గ్రా. కిలో విత్తనంలో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. శనగను మొదటిసారిగా పొలంలో సాగు చేసేటప్పుడు మొదట శిలీంధ్ర నాశిని మందులతో శుద్ధిచేసి ఆరబెట్టిన తర్వాత రైజోబియం కల్చర్‌ను విత్తనాలకు పట్టించాలి. దీనికై ఎనిమిది కిలోల విత్తనానికి 200 గ్రాములు రైజోబియం మిశ్రమాన్ని 300 మి.లీ. నీటిలో, 10 శాతం బెల్లం మిశ్రమాన్ని పట్టించి బాగా కలిపి నీడలో ఆరబెట్టుకొని విత్తుకోవాలి. ఎండు తెగులు సమస్యాత్మకంగా ఉన్న భూముల్లో ట్రైకోడెర్మా విరిడి 8 గ్రా. కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.

విత్తే దూరం :

సాళ్ళ మధ్య 30 సెం.మీ. మరియు మొక్కల మధ్య 10  సెం.మీ. ఉండేలా చూసుకోవాలి. లావు గింజలైన కాబూలీ రకాలు విత్తినపుడు సాళ్ళ మధ్యన 45 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. మొక్కల సాంద్రత ఎకరాకు 1,33,333 ఉండేటట్లు జాగ్రత్త వహించినట్లయితే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. విత్తనాన్ని నాగలి లేదా గొర్రుతో సాళ్ళ పద్ధతిలో విత్తుకోవాలి. భూమిలో సరైన తేమశాతం ఉండేలా చూసుకొని 5-8 సెం.మీ. లోతులో పడేలా విత్తుకోవాలి. యాంత్రికంగా ట్రాక్టర్‌ కల్టివేటరు లేదా సీడ్‌ డ్రిల్‌ కమ్‌ ఫెర్టిలైజర్‌ బోదె కాలువల పద్ధతిలో కూడా విత్తుకోవచ్చు.

శనగలో అంతరపంటలుగా మొక్కజొన్న-శనగ, జొన్న-శనగ, పెసర/మినుము-శనగ, సోయా చిక్కుడు-శనగ, నువ్వులు-శనగ మరియు శనగ + ధనియాలు (16:4) వేసుకోవచ్చు.

ఎరువుల యాజమాన్యం :

మొదటగా 2 టన్నుల పశువుల ఎరువు ఎకరాకు చివరి దుక్కిలో వేసి పంట మొదళ్ళలో రోటావేటర్‌తో కలియదున్నాలి. అదేవిధంగా 2 కిలోల  ఫాస్పోబ్యాక్టర్‌ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి దుక్కిలో గానీ, విత్తేటప్పుడు గానీ సాళ్ళలో పడేటట్లు వేసుకోవాలి. ఈ ఎరువు భూమిలో లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరమును లభ్యమగు రూపంలోకి మార్చి మొక్కలకు అందిస్తాయి. రసాయన ఎరువులను వాడే ముందు భూసార పరీక్షను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. రసాయన ఎరువులైన నత్రజని 8 కిలోలు, భాస్వరం 20 కిలోలు, పొటాష్‌ 8 కిలోలు మరియు గంధకం నిచ్చే ఎరువులు 40 కిలోలు ఎకరాకు వేసుకోవాలి. మరియ ఎరువుల రూపంలో  18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ లేదా 50 కిలోల డి.ఎ.పి. మరియు 14 కిలోల పొటాసియంను ఎకరాకు వాడాలి. 8-12 కిలోల నీటిలో కరిగే గంధకాన్ని విత్తే సమయంలో వేసుకోవాలి. భాస్వరం ఎరువును సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ రూపంలో వేసినట్లయితే పంటకు కావలసిన గంధకం అందుతుంది. పంట యొక్క కీలక దశలైన మొగ్గదశ మరియు గింజ కట్టే దశల్లో, బెట్ట పరిస్థితుల్లో 2% యూరియా లేదా డి.ఎ.పి. ద్రావణం (20 గ్రా. యూరియా లేదా డి.ఎ.పిని ఒక లీటరు నీటికి) పిచికారి చేస్తే కొంత మేరకు దిగుబడులు పెంచవచ్చు.

సూక్ష్మ పోషక లోపాలు మరియు యాజమాన్యం :

సాధారణంగా శనగలో జింకు, ఇనుము మరియు గంధకం లోపాల్ని గమనించవచ్చు. ఈ పోషక ధాతు లోపాలు వాటి లక్షణాలను ఎలా గుర్తించాలో, ఈ లోపాలు ఏర్పడటానికి అనుకూల పరిస్థితులు మరియు లోప సవరణ చర్యలు ఈ క్రింద వివరించబడ్డాయి. 

జింక్‌ :

ఈ పోషక దాతు లోపిస్తే పంట ఎదుగుదల లోపించి చిట్టి ఆకులు ఏర్పడతాయి. కణుపుల మధ్య దూరం తగ్గి కాలిపోయిన మచ్చలు కనిపిస్తాయి.  ఇది వరి తర్వాత శనగ సాగు చేసే నేలల్లో ఉదజని సూచిక ఎక్కువగా (8.5 కంటే ఎక్కువ) ఉన్న నేలల్లో కనిపిస్తుంది. ఈ పోషక లోపాన్ని సవరించడానికి 20 కిలోల జింక్‌ సల్ఫేట్‌ ఒక ఎకరాకు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఒకవేళ పైరుపై దీని లోప లక్షణాలు కనిపించినట్లయితే రెండు గ్రాముల జింక్‌ సల్ఫేట్‌ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

ఇనుము :

ఇనుము లోపం ఉన్నట్లయితే లేత ఆకులు పసుపు రంగులోకి మారి ఎండి రాలిపోతాయి. సున్నపు నిల్వలు ఎక్కువగా ఉండి ఉదజని సూచిక ఎక్కువ (8.5 కంటే ఎక్కువ) ఉన్న నేలల్లో ఈ లోపం కనిపిస్తుంది. ఈ ధాతు లోపాన్ని సవరించడానికి 5 గ్రా. ఫెర్రస్‌ సల్ఫేట్‌ (అన్నభేది), 1 గ్రా. నిమ్మ ఉప్పుతో కలిపి పైరుపై వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

గంధకం :

గంధకం లోపం గనుక గమనించినట్లయితే పంటలో మొదటగా లేత చిగురు హరిత వర్ణం కోల్పోయి, ఆ తర్వాత మొక్క అంతా పసుపు రంగుకు మారుతుంది. ఈ లక్షణాలు ఎప్పుడైతే నేలలో 8  పి.పి.ఎం  కంటే తక్కువ గంధకం ఉన్నప్పుడు గమనించవచ్చు. ఈ లోపాన్ని సవరించడానికి 8-12 కిలోల నీటిలో కరిగే గందకాన్ని ఎకరాకు విత్తుకునే సమయంలో వేసుకోవాలి.

కలుపు యాజమాన్యం

విత్తిన 30 రోజుల వరకు  కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తేముందు ఫ్లూక్లోరాలిన్‌ 45% ఎకరాకు1-1.2 లీ. చొప్పున 200 లీ. నీటిలో కలిపి నేలపై పిచికారి చేసి భూమిలో కలియ దున్నాలి. అదే విధంగా విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు మొలకెెత్తక ముందే పెండిమిథాలిన్‌ 30% ఎకరాకు 1.3-1.6 లీ. / 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. విత్తిన 30 నుండి 35 రోజుల దశలో గొర్రుతో అంతర కషి చేసి కూడా కలుపు నివారించుకోవచ్చు.

నీటి యాజమాన్యం :

నేలలోని తేమను బట్టి 1 లేదా 2 తేలికపాటి తడులు ఇవ్వాలి. నీటి తడులు పెట్టేటప్పుడు పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి.  పూత దశకు ముందు అనగా విత్తిన 30 నుండి 35 రోజులకు ఒకసారి మరియు గింజ కట్టే దశలో విత్తిన 55 నుండి 65 రోజులకు ఒకసారి తడులను అందిస్తే మంచి దిగుబడులను పొందవచ్చు. 

పంటను ఆశించే పురుగులు :

శనగపచ్చ పురుగు :

ఈ పురుగు ఆశించినట్లయితే పంట తీవ్రమైన నష్టానికి గురై దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. దీని యొక్క తల్లి పురుగు లేత చిగుళ్ళపై లేదా పిందెలపై విడివిడిగా లేత పసుపు రంగు గుడ్లను పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగు మొగ్గల్ని గోకి తింటుంది. ఎదిగిన లార్వాలు మొగ్గల్ని తొలిచి, కాయలోనికి తలను చొప్పించి మిగిలిన శరీరాన్ని బయటకు ఉంచి లోపల గింజలను తిని డొల్ల చేస్తాయి. ఈ పురుగు తిన్న కాయలకు గుండ్రటి రంధ్రాలు కనిపిస్తాయి. మొగ్గ, పూత మరియు పిందె దశలో చిరుజల్లు లేదా వర్షం పడి రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినట్లయితే ఈ పురుగు యొక్క ఉధతి ఎక్కువ అవుతుంది.

నివారణ :

మొదటగా వేసవిలో లోతైన దుక్కులు చేసుకోవాలి. అంతరపంటగా ధనియాలు 16:4 సాగు చేయాలి. చుట్టుపక్కల 4 నాలుగు వరసల జొన్న పంట,  50 నుండి 100 బంతి మొక్కలను నాటుకోవాలి. జీవరసాయనాలైన వేప గింజల కాషాయం లేదా వేప నూనె (300 పి.పి.ఎమ్‌) 5 మి.లీ. మొగ్గ దశలో పిచికారి చేయాలి. బ్యాసిల్లస్‌ తుఇంజెన్సిస్‌ 300 గ్రా. ఒక ఎకరానికి మరియు హెలికోవెర్పా యన్‌.పి.వి. 200 మి.లీ. ద్రావణాన్ని ఎకరాకు పిచికారి చేసుకోవాలి. ద్రావణాన్ని ఎకరాకు పిచికారి చేసుకోవాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి.

ఎసిఫేట్‌ 75 శాతం ఎస్‌.పి. 1.5 గ్రా. లేదా క్వినాల్‌ఫాస్‌ 25% ఇ.సి. 2.0 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు ఇంఆక్సాకార్బ్‌ 14.5% యస్‌.సి. 1.0 మి.లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ 18.5% ఎస్‌.సి 0.3 మి.లీ. లేదా ఫ్లూబెండమైడ్‌ 39.35% యస్‌.సి. 0.2 మి.లీ. లీటరు నీటిలో వేసి కలుపుకోవాలి. లేదా లామ్డసైహాలోత్రిన్‌ 5% ఇ.సి. 1 మి.లీ. లీటరు నీటిలో లేదా ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ 5% యస్‌.జి. 0.5 గ్రా. ఒక లీటరు నీటిలో లేదా థయోడికార్బ్‌ 75% డబ్య్లు.పి. 1.5 గ్రా. లీటరు నీటిలో లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ 9.3% + లామ్డాసైహాలోత్రిన్‌ 4.6% జడ్‌.సి 0.4 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.

రబ్బరు పురుగు :

ఇది మొగ్గ దగ్గర పత్రహరితాన్ని గోకి తిని నష్టం కలుగజేస్తుంది. పైరు తొలిదశలో ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. దీని ఉధతి ఎక్కువైనప్పుడు ఆకులు పాలిపోయి రాలిపోతాయి. ఎప్పుడైతే బెట్ట వాతావరణం కలిగి తర్వాత అధిక వర్షపాతం నమోదు అయినప్పుడు మరియు తొలి 20 - 25 రోజులలో రబ్బరు పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది.

నివారణ :

దీని నివారణకు క్వినాల్‌ఫాస్‌ 25% ఇ.సి. (2 మి.లీ. / లీటరు నీటికి) లేదా క్లోరిపైరిఫాస్‌ 20% ఇ.సి. (2.5 మి.లీ. / లీటరు నీటికి) లేదా నొవాల్యురాన్‌ 10% ఇ.సి. లేదా డైఫ్లూబెంజురాన్‌ 25% డబ్య్లు.పి. (1 మి.లీ. / లీటరు నీటికి) మందును పురగు ఉధృతిని బట్టి 2-3 సార్లు 4-5 రోజుల వ్యవధిలో పిచికారి చేసుకోవాలి. 

శనగ పంటను ఆశించే తెగుళ్ళు :

ఎండు తెగులు :

ఈ తెగులు సోకిన మొక్క యొక్క ఆకులు వడలిపోయి, పసుపు రంగులోకి మారి రాలిపోవును. తెగులు వచ్చిన మొక్కలు అక్కడక్కడ గుంపులు, గుంపులుగా చనిపోవును. భూమిలో ఉన్న శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. ఇది పంట అన్ని దశలలో వ్యాపించును. కాయ దశలో ఎక్కువగా ప్రభావిత మగును. 

నివారణ :

మొదటగా శిలీంధ్రనాశినిలతో విత్తన శుద్ధి చేసుకోవాలి. తెగులును తట్టుకొనే రకాలైన ఐ.సి.సి.వి-2, ఐ.సి.సి.వి-10, జె.జి.11, ఐ.సి.సి.వి-37, నంద్రాల శనగ - 47 ఎన్నుకోవాలి.

రైజోక్టోనియా ఎండు తెగులు (డ్రై రూట్‌ రాట్‌) :

ఈ తెగులు సాధారణంగా పూత, కాయ సమయంలో కనబడును. అక్కడక్కడ ఆకులు పాలిపోయి, మొక్క పై భాగం తలలు వాల్చును. లేదా మొక్క మొత్తంగా ఎండిపోవును. మొక్క తీసి చూసినచో వేర్లు నల్లగా మారి, కుళ్ళినట్లుగా కనిపించును. ప్రధాన వేరు మాత్రమే కనబడును. పిల్ల వేర్లు ఉండవు.  మరియు వేరు బాగా గిడసబారి పోవును. ఇది భూమి ద్వారా వ్యాప్తి చెందును. సాధారణంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి 250-300 సెం.గ్రే. నమోదైనచో ఈ తెగులు ఉధృతి ఎక్కువగా కనబడును. భూమిలో తేమ బాగా తగ్గినపుడు / బెట్ట పరిస్థితుల్లో కూడా తెగులు ఉధృతి పెరుగుతుంది.

నివారణ :

ఎండు తెగులుకు సూచించిన విధంగా పాటించాలి. జె.జి-11 అనే రకం కొంత వరకు ఈ తెగులును తట్టుకొంటుంది. బెట్ట పరిస్థితులలో అవకాశమున్నట్లయితే తేలికపాటి తడి ఇవ్వవలెను.

రచయిత సమాచారం

డా. ఓ. శైల, జి. నీలిమ, డా. సి.హెచ్‌.వి. దుర్గారాణి, డా. కె. అనిల్‌ కుమార్‌, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పాలెం, పి.జె.టి.ఎస్‌.ఎ.యు