Print this page..

వివిధ పంటల్లో తుత్తునాగం(జింకు) ప్రాముఖ్యత


రైతులు పండించే పంటలన్నింటిలో జింకులోపాన్ని గుర్తించారు. కొన్ని పైర్లలో జింకు లోపం వల్ల తీవ్రస్థాయిలో నష్టం కలుగగా మరికొన్ని పంటల్లో తీవ్రత తక్కువగా ఉంది. సూక్ష్మపోషకమైన జింకు కొద్ది పరిమాణంలోనే మొక్కకు అవసరం. ఏ పంటలోనైనా ఒక్క పోషక లోపం ఉన్నా మనం వేసే నత్రజని, భాస్వరం, పొటాష్‌లు సరైన ఫలితాలు ఇవ్వవు. కనుక జింకు లోపాన్ని సకాలంలో గుర్తించి సవరిస్తే ముఖ్యపోషకాలు కూడా బాగా ఉపయోగపడి అధిక దిగుబడికి తోడ్పడుతుంది.

జింక్‌ లోపం కారణాలు :

రైతులు సాధారణంగా నత్రజని, భాస్వరం, పొటష్‌ వేయడానికి బాగా అలవాటుపడ్డారు. జింకు, ఇతర సూక్ష్మ పోషకాలను ప్రత్యేకించి పైర్లకు వేయటం లేదు. రైతులందరూ అధిక దిగుబడి రకాలు, సంకర రకాలు వేయడం వల్ల తక్కువ కాలపరిమితి రకాలతో సంవత్సరంలో 3-4పంటలు పండిస్తున్నారు. సాంద్ర వ్యవసాయంతో పాటు దిగుబడులు బాగా పెరగడం వల్ల భూమిలో సహజంగా ఉండే సూక్ష్మపోషక నిల్వలు త్వరగా, క్రమంగా ఖాళీ అయ్యాయి. దీనికి తోడు సేంద్రియ ఎరువుల వాడకం కూడా తగ్గింది. ఈ కారణాల వల్ల సూక్ష్మపోషకాలతో ముఖ్యమైన పంటల్లో దిగుబడిని  తీవ్రంగా తగ్గిస్తాయి. 

జింకు లోపం రావడానికి అనుకూల పరిస్థితులు :

  • అధిక మొతాదులల్లో నత్రజని, భాస్వరం ఎరువుల వాడకం, పోషకాల సమతుల్యత లోపించడం.
  • సంవత్సరంలో ఎక్కువ కాలం నీరు నిల్వ ఉంటూ మురుగు పోని పల్లపు ప్రాంతాలు.
  • సున్నపు పాలు, క్షార గుణం (కారు చౌడు) ఎక్కువగా ఉన్న నల్ల రేగడి నేలలు.
  • బాగా మాగిన సేంద్రియ ఎరువులు తగినంత పరిమాణంలో వేయక పోవడం, సరిగా చివకని సేంద్రియ ఎరువుల వాడకం.
  • వరి తరువాత వరి వరుసగా వేస్తున్న పొలాలు, నారుమడి తీసిన వెంటనే అందులో వరి నాటడం.
  • చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న సమయంలో వేసిన పైర్లలో జింకు లోప తీవ్రత అధికంగా ఉంటుంది.

జింకు వల్ల ఉపయోగాలు :

  • మొక్కలో అమినో ఆమ్లాలు, మాంసకృత్తులు తయారు కావడానికి జింకు ఉపయోగ పడుతుంది.
  • నత్రజని, భాస్వరం పోషకాల సమర్థ వినియోగానికి కూడా జింకు తోడ్పడుతుంది.
  • మొక్క ఎదుగుదలకు కావాల్సిన ఇండోల్‌ అసెటిక్‌ ఆసిడ్‌ (ఆక్సిన్స్‌) అనే హార్మోను తయారు కావడానకి జింకు ఉపయోగపడుతుంది.
  • కార్భోఎన్‌మైడ్రేస్‌, అల్కహాల్‌ డీ హైడ్రోజినేస్‌ వంటి ఎంజైముల్లో జింకు ఒక ముఖ్యభాగం.

జింకు కనీస స్థాయి : 

జింకు సాధారణ నేలలో 1.0 పి.పి.ఎం. ఉంటే మంచి దిగుబడి ఇవ్వడానికి సరిపోతుంది. 0.65 పి.పి.ఎం. నేలలో కనీస స్థాయి (క్రిటికల్‌ లిమిట్‌)గాను, మొక్కలోని ఆకు భాగాల్లో 20 పి.పి.ఎం. కనీస స్థాయిగాను నిర్థారించారు. ఈ స్థాయికి తగ్గినప్పుడు పైర్లపై లోప లక్షణాలు కనిపిస్తాయి. లోపం సరిదిద్ధకపోతే దిగుబడి తగ్గడం, సరిదిద్దితే దిగుబడి పెరగడం స్పష్టంగా గమనించవచ్చు. అయితే మొక్క భాగాల్లో జింకు 400 పి.పి.ఎం. మించి ఉన్నప్పుడు హానికరంగా పరిణమిస్తుంది.

లోప నిర్థారణ : 

జింకు లోపం నిర్థారించడానికి మూడు పద్ధతులు ఉన్నాయి.  1. మట్టి నమూనాల విశ్లేషణ 2. మొక్క ఆకు భాగాల విశ్లేషణ  3. మొక్కపై కనిపించే లోప లక్షణాల ఆధారంగా లోప నిర్థారణ. మొదటి రెండు పద్ధతులు ప్రయోగశాలలో మాత్రమే చేయవచ్చు. మూడవ పద్ధతి ఏ పరికరాలు అవసరం లేకుండానే పైరుపై లక్షణాలను చూసి లోపం నిర్థారించడం. లోప లక్షణాలను గురించి అవగాహన కలిగి, గుర్తించడంలో అనుభవం ఉన్నవారు జింకు లోపాన్ని సులభంగా గుర్తించగలరు.

జింకులోప సవరణ : 

జింకులోపం సరిదిద్దడానికి జింకు లవణాలు, జింకు ఛిలేట్లు, జింక్‌ ఫ్రిట్స్‌ దేన్నయినా వాడవచ్చు. సాధారణంగా జింక్‌ సల్ఫేట్‌ (21 శాతం జింకు), జింకు చీలేట్స్‌ (12 శాతం జింకు) వాడే అలవాటు ఉంది. గాజు కర్మాగారాల్లో తయారయ్యే జింక్‌ ఫ్రిట్స్‌ కూడా వాడవచ్చు. జింకును చివరి దుక్కిలో నేలకు వేయడం వల్లగాని, పైరుపై ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా కానీ లోపాన్ని సరిదిద్దవచ్చు. 

వరి పంటలో జింకులోప సవరణ :

వరి పంటలో  ఖరీఫ్‌ కన్న రబీలో జింక్‌లోపం అధికంగా  ఉంటుంది. వరి ముదురు ఈకుల చివర్లలో ఈనెకి ఇరువైపులా ముదురు ఇటుక రంగు మచ్చలేర్పడుతాయి.  కొత్తగా ఏర్పడే ఆకులు మాములు కన్న చిన్నవిగా నూలుకంటె ఆకారంలో ఉంటాయి. ఈ లోప నివరణకు ఎకరాకు 20 కిలోల జింక్‌సల్ఫేట్‌ ఆఖరి దుక్కిలో వేయాలి.  

వేరుశనగ పంటలో జింకులోప సవరణ : 

పైరు మొలచిన నెల రోజుల నుండి జింకు లోపం కనిపిస్తుంది. ఆకులు మామూలుకన్నా చిన్నవిగా ఉంటాయి. దళసరిగా ఉంటాయి. మొక్క బాగా దూరం తగ్గిపోతుంది. ఆకులో ఈనెల మధ్య భాగం పసుపు రంగుకు మారుతుంది. చివరికా ఆకంతా పసుపుగా మారి ఈనెలు మాత్రం ఆకుపచ్చగా ఉంటాయి. ఈ లోప నివరణకు ఎకరాకు 20 కిలోల జింక్‌సల్ఫేట్‌ ఆఖరి దుక్కిలో వేయాలి. పైరుపై లోపం కనిసించినప్పుడు 0.2 శాతం జింక్‌ సల్ఫేట్‌ ద్రావణం అయిదారు రోజుల తేడాతో రెండు సార్లు పిచికారీ చేసి లోపం సవరింపవచ్చు.

నిమ్మతోటల్లో  జింకులోప సవరణ : 

పండ్ల తోటల్ల్లో కెల్లా నిమ్మ, నారింజ, బత్తాయి తోటల్లో పలు  సూక్ష్మపోషక లోపాలు కనిపిస్తాన్నాయి. పుల్ల నిమ్మ కన్నా బత్తాయి తోటల్లో లోపం ఎక్కువగా కనిపిస్తుంది. కొత్తగా పెట్టిన కొమ్మల్లోని లేత ఆకుల్లో ఈనెలు మధ్య భాగాలు పసుపు రంగుకు మారడం, ఆకులు మాములుగా ఉండాల్సిన దానికన్నా సైజు తగ్గడం, కణుపుల మధ్య దూరం తగ్గి ఆకులు దగ్గర దగ్గరగా గుబురుగా ఏర్పడడం జరుగుతుంది. లోపం తీవ్రంగా ఉన్నప్పుడు కాయలు చిన్నవిగా, తొక్క మందంగా తయారవుతుంది. పండ్లు రుచిగా ఉండవు. లోపం నివారింపడానికి 0.5 శాతం జింకు సల్ఫేటు ద్రావణాన్ని 10 రోజుల తేడాతో 2 సార్లు పిచికారీ చేయాలి.

రచయిత సమాచారం

పి. మధుకర్‌ రావు, శాస్త్రవేత్త (అగ్రానమి), డి. అనిల్‌, శాస్త్రవేత్త (అగ్రానమి), యన్‌. నవత, శాస్త్రవేత్త (అగ్రానమి), బి.మాధవి, శాస్త్రవేత్త (అగ్రానమి),  ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పొలాస, జగిత్యాల, ఫోన్‌ : 9505507995