Print this page..

కనుమరుగవుతున్న ప్రాచీన పనిముట్లు , పట్టణీకరణతో ఉనికి కోల్పోతున్న వృత్తి దారులు-ఉత్పాదనలు , వ్యవసాయ విప్లవకారులైన సహజ ఇంజనీర్లు ఇక కనుమరుగు


అనాదిగా వ్యవసాయానికి ఆది గురువులుగా ఉన్నది చేతివృత్తి కళాకారులే. ఆదిమ సమాజం నుండి, బానిస బంధాల నుండి మానవ సమాజాన్ని విముక్తి చేయడంలో ప్రధానపాత్ర వహించింది వ్యవసాయమే. వ్యవసాయానికి ప్రేరణగా నిలచిన కుల వృత్తుల ఉనికిని సమాజం మరచిపోయినా నేటికీ ప్రాచుర్యంలో ఉన్న నిపుణత ఆర్య సంస్కృతి పరిణామక్రమంలో అట్టడుగున పడి కనిపించకుండా పోయింది. మానవ సమాజం చేసిన అనేక త్యాగాలను మనుధర్మ శాస్త్రం వర్ణ వివక్షతతో అడుగుకు నెట్టివేసింది. ''అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలోయ్‌ ఇప్పుడు'' అని మహాకవి శ్రీశ్రీ ఘనంగా పిలుపునిచ్చిన నేపధ్యం, కంచె ఐలయ్య లాంటి బహుజన దళిత మేధావి కలం నుండి జాలువారిన ఆధునిక సాహిత్య ధోరణిలో విశ్లేషించినప్పుడు సమాజ ప్రగతికి ఆయా వర్గాలు పాటుపడిన విధానాన్ని సమీక్షించుకుంటే వ్యవసాయ విప్లవంలో దళిత బహుజనుల పాత్ర గురించి మనం విఫులంగా తెలుసుకోవచ్చు. 

ఆచరణ అలవాట్లే కులవృత్తులు : 

ఇక వెనక్కి వెళితే చెకుముకి రాళ్ళ ద్వారా నిప్పును కనుగొనడం, జంతువులను చంపి లేక మచ్చిక చేసుకొని ఆహారాన్ని సంపాదించుకోవడం, పదునైన ఆయుధాలను తయారుచేసుకోవడానికి లోహాలను వినియోగించుకోవడం వంటి పరిణామ క్రియల నేపధ్యంలోనే చేతి వృత్తి కళాకారుల కృషి, నైపుణ్యం సమాజానికి ఎలా ఉపయోగపడిందో మనం ఒక్కసారి పరిశీలిద్దాం....

జంతువులను చంపి తినడం, అడవిలోని దుంపలు, చెట్లకు కాసిన కాయలు కోసుకొని ఆరగించడం నుండి భూమి తల్లిని మచ్చిక చేసుకొని పంటలు పండించి పొట్టపోసుకోవడం ఒక అద్భుతమైన కళగా ఆవిర్భవించడానికి ఈ కులవృత్తుల్లో ప్రధానమైన కమ్మరి పని చేసేవారే వ్యవసాయానికి ఆదిగురువులైనారు. వారే వర్ణవ్యవస్థ బలపడిన కొద్దీ కమ్మరి కులంగా ప్రసిద్ధి పొందారు. ఆహార సంపాదన కొరకు పదునైన లోహపు ఆయుధాలను బాణాల రూపంలో తయారు చేసుకోవడం, తమను తాము రక్షించుకునేందుకు ఆయుధాల తయారీ, భూమిని తవ్వి విత్తనాలు నాటేందుకు, చదును చేసేందుకు, దున్నుకునేందుకు తయారుచేసిన కర్రు అనంతరం నాగలిగా రూపాంతరం చెంది ప్రపంచానికే తలమానికమైన వ్యవసాయ ఉపకరణంగా మారింది. నాగలి ఆవిర్భావంతోనే భూమీకి పచ్చాని రంగులేసే రైతాంగ వ్యవస్థకు మూల స్థంభంగా కమ్మరి కులస్తులు ప్రాశస్త్యం పొందారు. 

మధ్య ఆసియా నుండి ఆర్యులు తరలిరావడం, భారతదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకోవడం, సింధు నాగరికతను అధిగమించి ఈ ప్రాంతంలో ఆదిపత్యానికి కృషి చేయడం ప్రారంభానికి ముందే మనదేశంలో వడ్రంగి, కంసాలి, కుమ్మరి మొదలైన చేతివృత్తులకు ప్రాధాన్యం ఉండేది. మన పురాణాల్లో ఘనంగా చెప్పుకునే సురాపానం, కల్లుకు ప్రతిరూపమేననేది అందరూ ఎరిగినదే. దేవతామూర్తులు సేవించారని చెప్పుకునే ఈ సురాపానాన్ని చెట్ల నుండి ఎంతో శ్రమకోర్చి తీసేవారిని గౌడ కులస్థులుగా ముద్ర వేశారు. 

పుట్టుకతో కులం అంటగట్టిన ధర్మాలు : 

అలాగే కలపతో గృహాల నిర్మాణం, గృ¬పకరణాల తయారీ, యడ్లబండి, నాగలి రూపకల్పన చేసిన విశ్వకర్మలు వడ్రంగి కులస్థులుగా వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడి ఆది ఇంజనీర్లుగా ప్రాఖీస్త్యం పొందారు. ఇలా చేతి వృత్తుల తయారీదారులందరినీ ఒకే గాటన సూద్రకులాలుగా ముద్రవేసి ఆర్యులు మనుధర్మశాస్త్రం ప్రకారం సమాజంలో అధములుగా చిత్రీకరించి భారత సామాజిక వ్యవస్థను వివక్షపాలు చేశారు. అసలు మనుధర్మ శాస్త్రమే ఒకరకంగా ప్రకృతి విరుద్దంగా ఆవిర్భవించిందని చెప్పవచ్చు. బ్రాహ్మణులు ముఖం నుండి, రాజులు భుజాల నుండి వైశ్యులు ఉదరం నుండి పుట్టారని, సూద్రులు కాళ్ళ నుండి జన్మించారని ఒక కల్పిత సూత్రీకరణను ధర్మంగా చిత్రీకరించి, దాన్నే హిందూ ధర్మంగా పరిగణించి, పైమూడు అగ్రవర్ణాలు తప్పా మిగిలిన వారందరూ శూద్రులేనని, భూమిపై, బురదలో, శారీరక శ్రమతో బ్రతుకవలసిన వారేనని, కేవలం అగ్రవర్ణాలను పూజించడానికి, సేవించడానికి మాత్రమే జన్మించారని చేసిన సూత్రీకరణ కోట్లాది మంది ప్రజలను బానిస భందాల్లోకి నెట్టివేసింది.

వ్యవసాయానికి పునాది ఆదివాసీలే : 

ఆదిమ సమాజం నుండి మానవుడు తన ఉనికిని కాపాడుకునేందుకు, ఆకలిని తీర్చుకొని తద్వారా శక్తిని ప్రోధి చేసుకునేందుకు ఉపక్రమించే క్రమంలో ఒక్కొక్కటిగా పనిముట్లను స్వయం ప్రతిభతో సృజించి సమాజ అభివృద్దికి, పరిమాణ క్రమంలో నాగరికత అభివృద్ధికి తోడ్పడినారు. అసలు వ్యవసాయమనే కళను సమాజానికి అందించిన వారు ఆదివాసీలు. తొలి సాగు పాఠాలను తమ అనుభవంతో రంగరించి ప్రకృతిని, జీవాలను తమ దారిలోకి తెచ్చుకున్న తొలి నాగటి వీరులు ఆదివాసీలే. 

ఆ తరువాత 'పొలాలనన్నీ హలాలదున్ని' ఇలా తలంలో హేమం పిండిన కర్మజీవులు రైతులు, రైతు కూలీలు. వీరందరికంటే ముఖ్యమైన వారు చేతివృత్తి కళాకారులు. ఆహారాన్ని పొందే పరిణామ క్రమంలో దాని సాధన కొరకు, దాన్ని మరింత రుచికరంగా, సురక్షితంగా సేవించేందుకు కావలసిన పరికరాలను తయారుచేసింది ఈ ఆది ఇంజనీర్లే. నిప్పును కనుగొని, కలప వినియోగాన్ని అందుబాటులోకి తెచ్చుకొని, కొలిమిని రగిలించి, దానిలొ లోహాలను కరిగించి వ్యవసాయ పనిముట్లు తయారుచేసి, సమాజానికి శాశ్వత సౌకర్యం కల్గించిన వారు వడ్రంగి, మ్మరి కులస్థులు. ఆహారాన్ని వండుకోవడానికి, నాగరికంగా జీవించడానికి, జిహ్వకు అనువైన పదార్థాలను చేసుకోవడానికి కుండలను తయారుచేసింది, గృ¬పకరణ రంగాన్ని తీర్చిదిద్దింది కుమ్మరి కులస్థులు. 

శ్రమజీవి అయిన మానవుడు ఎప్పుడూ ఒకేరకమైన ఆహారాన్ని, పానీయాలను తీసుకోవడంతో విసుగుచెందుతాడు. ప్రకృతి ప్రసాదించే అన్ని ద్రవాలు, ఆహారం సొంతం చేసుకొని భూలోకంలో స్వర్గాన్ని చూడడానికి ప్రయత్నిస్తారు. ఆహ్లాదకరంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేందుకు దారులు వెతుకుతున్న నేపద్యంలో తాటి, ఈత ఇతర వృక్షాల నుండి కల్లు గీసి దాన్ని సేవించి ఆనందించడానికి అలవాటు పడింది. తద్వారా సమాజంలో నాగరికత స్థాయిని హెచ్చించడానికి పాటుపడింది గౌడ కులస్థులు. మనదేశంలో తప్ప ఎక్కడా స్వాభావికమైన ఇటువంటి సురాపానాన్ని ఏ జాతి కనుగొనలేక పోయింది. తేనె తప్ప చెట్ల నుండి ద్రవ్యాలను తీసి ఆస్వాదించే సాంకేతికత మరెక్కడా లేదు. పాశ్చాత్య దేశాల్లో కృత్రిమంగా రసాయనాలతో తయారు చేసే సారా, ఇతర ఉత్ప్రేరకాలను వాడుతున్నారు. పారిశ్రామిక విప్లవం తరువాతే నాగరీకులమని చెప్పుకునే ఐరోపా దేశాలు బ్రాంది, విస్కీలను తయారు చేయడం ప్రారంభించాయి. కానీ మన దేశంలో పురాణకాలం నుండి సురాపానం ప్రాచుర్యంలోకి వచ్చిన స్థితికి ఆధారాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా గౌడ కులస్థులుగా ఉన్న మహత్తరమైన చేతివృత్తి జాతి కల్లుగీత కార్మికులే కావడాన్ని మనుధర్మశాస్త్రం వెలుగులోకి తేలేదు. 

ఏ దేశానికైనా, సంస్కృతికైనా దాని అత్యున్నత స్థాయిని వస్త్ర్రధారణే తెలియచేస్తుంది. అగ్గిపెట్టెలో పట్టే పట్టు వస్త్రాలను తయారుచేసిన భారతీయ చేనేత వస్త్ర కళాకారులను ఈ దశలో మనం గుర్తు చేసుకోవాలి. వర్షాధార పంటగా దేశంలోని కోట్లాది హెక్టార్లలో పండే పత్తి పంటను వస్త్రాలుగా మలచి నాగరికతకు అర్ధం చెప్పిన చేనేత వృత్తిదారులను ఒక శూద్రకులం కింద ముద్రవేసి సాలీలుగా, వెనుకబడిన వర్గంగా చిత్రీకరించ బడడం మన భారతీయ విభజించి పాలించే మనువులకే చెల్లింది.

మానవోద్ధరణకు, ముఖ్యంగా పరిపూర్ణమైన మానవ వనరుల అభివృద్ధికి మూలకారణమైంది సంపూర్ణ ఆహారం. పగలనక, రాత్రనక కష్టపడి, తన శ్రమను పెట్టుబడిగా పెట్టినా పోషకాహారం లేక అలమటించే కోట్లాది మందికి నదులు, చెరువులు, సముద్రాల్లో లభించే చేపలు, రొయ్యలు, ఇతర జలచరాలను ఆహారంగా అందించే మత్స్యకారులు మన మనువుల దృష్టిలో శూద్రులు, అధములే. 

జంతువులను మచ్చిక చేసుకొని, వాటిని వ్యవసాయానికి ఉపయోగించుకోవడంతో పాటు, పాలు అనే మహత్తరమైన పోషకాహారాన్ని మానవజాతికి అందిస్తున్న మహత్తరమైన వృత్తిలో ఉన్న పశు పోషకులకు, కోట్లాది మంది ప్రజలకు చాలినంత మాంసం ఉత్పత్తులను అందిస్తున్న గొర్రెలు, మేకలు పెంపకందారులను యాదవులు గానూ, కురుమలు గానూ, నామకరణం చేసి శూద్రజాతుల్లో కలిపివేసిన పాపం మన ప్రాచీన ఆధునిక మనువులదే. 

మనుధర్మ శాస్త్రం వెనుకబడిన కులాల (శూద్రల) సామాజిక, ఆర్థిక పరిస్థితులను పూర్తిగా దిగజార్చివేయగా, రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో గిరిజనులు, దళితులు చట్టసభల్లో ప్రతినిధులుగా, రాజ్యాధికారంలో కొంతమేరకైనా భాగస్వామ్యులుగా ఉంటూ వస్తున్నారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్‌, పూలే వంటి మహనీయుల కృషి ఫలితంగా భారతదేశంలో ఒక కొత్త సామాజిక దృక్కోణం నెలకొంది. మహిళలతో కలిపి 90 శాతం మంది ఉన్న సమాజాన్ని ఆధునిక మనువులు దోపిడీకి వినియోగించుకుంటున్న నేపధ్యంలోనే సంస్కరణల పేరుతో ప్రపంచంలో ఒక కొత్తగాలి వీస్తుంది. బహుళజాతి కంపెనీల ఆదిపత్యాన్ని పదిలంగా ఉంచుకునే వ్యవస్థ సృష్టించిన మొదటిదశ సంస్కరణలు వృత్తి కళాకారులను, చేతివృత్తి నైపుణ్య కారులను పూర్తిగా అనాధలను చేసింది. 

యాంత్రీకరణతో కులవృత్తులకు స్వస్తి : 

సామాజిక ఇంజనీర్లుగా (సోషల్‌ ఇంజనీర్లుగా) పేరొందిన శూద్రులనే వెనుకబడిన కులాలు తమ మనుగడను కోల్పోయి, తాము నిర్మించిన వ్యవస్థకు ఇక తమ పనిముట్లు అవసరం లేదని భావించి అందరిలాగానే వ్యవసాయ ప్రక్రియకు దూరమయ్యారు. దుక్కిటెడ్లు, నాగలి స్థానంలో ట్రాక్టర్లు రావడం, అన్నీ పనిముట్ల ద్వారా చేసే పనులు ట్రాక్టర్‌ సహాయంతోనే నిర్వహించుకోవడం ప్రారంభం కావడంతో వృత్తి కళాకారుల జీవన విధానానికి నష్టం కలిగింది. చేనేత మగ్గాల స్థానంలో భారీ యంత్రాలు రావడం, కల్లుగీత కార్మికులు వినియోగించే మోతాడుల స్థానంలో ప్రస్తుతం యంత్ర భూతాల ద్వారా తాటి, కొబ్బరి చెట్లు ఎక్కే పరికరాలు రావడం, దళితులు వరి నాట్లకు దూరమై వాటి స్థానంలో యంత్రాలు రావడం ఆది గురువులైన ఆదివాసీల మనుగడ వారు పుట్టిపెరిగిన అడవిలోనే ప్రశ్నార్థకం కావడం, చెట్లను నరికి వేసి కలపను కాగితపు పరిశ్రమకు వినియోగించడం, చివరకు భయంకరమైన పర్యావరణ దుస్థితికి దారి తీయడం, యురేనియం, బాక్సైట్‌ ఖనిజాల కోసం పచ్చని అడవులను నాశనం చేయడం, కార్పోరేట్‌ ప్రయోజనాలకు, కంపెనీలకు మౌలిక సౌకర్యాల పేరుతో భూ పందారాలు చేయడం ఇవన్నీ కలసి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయడం, పంటలు పండే భూములను సేకరించి అభివృద్ధి పేరుతో పచ్చదనాన్ని నాశనం చేసి చివరకు రైతులను, వ్యవసాయాన్ని నమ్ముకున్న వృత్తి కళాకారులను, వ్యవసాయ కార్మికులను ఆకలి దప్పులకు గురిచేయడం వంటి విధానాలు పూర్తిగా ప్రతికూల పరిస్థితులకు దారితీసినా అభివృద్ధి - ఉపాది పేరుతో మాయమాటలు చెబుతున్నారు. 

కనుమరుగైన వ్యవసాయ పనిముట్లు : 

కార్పోరేట్‌ ప్రేరిత ప్రజాస్వామ్యంలో చేతివృత్తులు - పనిముట్లు ఏ విధంగా కనుమరుగవుతున్నాయో తెలుసుకుందాం... ముఖ్యంగా వ్యవసాయ పనిముట్ల విషయానికొస్తే బాన, బండి, ఇరుసు, ఎద్దులబండి, నాగలి, గొర్రు, పార, కర్రు, గునపము, గొడ్డలి, కొడవలి, కత్తి, మోకు, పగ్గం, పలుపు, ముల్లకర్ర, కొంకి, గోరుగిల్లు, చిక్కం, మొదలగునవి వ్యవసాయానికి ఉపయోగించే పరికరాలు... వీటిలో ఇనుప పరికరాలను కంసాలి చేస్తాడు. కర్రతో చేసే వాటిని వడ్రంగి చేస్తాడు. నారదారాలతో తయారు చేసే పగ్గం, మోకు వంటి వాటిని రైతులు సొంతంగా చేసుకుంటారు. ఇప్పటికే వీటిలో చాలా వరకు కనుమరుగైనవి. ఆధునిక నీరు పారించే యాజమాన్య పద్ధతులు రావడంతో కపిలి, ఈతం, గూడ మొదలైన పరికరాలు వాడుకలో లేకుండాపోయి కనుమరుగైపోయాయి. 

ఇకపై ప్రదర్శనాశాలలోనే కనిపించే పరికరాలు : 

హైదరాబాద్‌, బెంగుళూరు వంటి మహానగరాల్లో ఇటీవల 'ఫాంస్కూల్‌' పేరుతో కొన్ని వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రాలు వెలిశాయి. పల్లెటూళ్ళలో చదువునచ్చక కార్పోరేట్‌ విద్యకు బానిసలుగా మారేందుకు వలస వస్తున్న రైతు కుటుంబాల్లోని పిల్లలు వ్యవసాయ వృత్తికి దూరమై ఇతర వృత్తుల్లో స్థిరపడిన వారి సంతానం. కనీసం తాము తాగే పాలు, ఆహార పదార్థాలు ఎలా వస్తాయో తెలియని అయోమయంలో ఉన్న వారికి వ్యవసాయం, చేతి వృత్తుల వారి గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను తెలియచేయడానికి ఈ పాఠశాలలను  ఏర్పాటు చేశారు. ప్రతి దినం కార్పోరేట్‌ స్కూలు విద్యార్థులు ఈ క్షేత్రాలకు వచ్చి వ్యవసాయం, రైతులు, చేతివృత్తివాళ్ళ సృజనను చూస్తారు. ఇటువంటి పరిస్థితి ముందుముందు మరింత దారుణంగా తయారవుతున్న నేపద్యంలో భావితరాలకు కొయ్యతోచేసిన నాగలి, మేడి, ఇనుముతో చేసిన కర్రు కనబడే అవకాశం లేదు. వాస్తవానికి వ్యవసాయం అనే పదానికి అర్ధం తెలిసింది నాగలి అనే పనిముట్టు ఆవిర్భావంతోనే... కాడెడ్లు కలసి భూమిని దున్నడానికి ప్రారంభం నుండి ఉపయోగించిన నాగలి క్రమేణా అదృశ్యమవుతూ వస్తుంది. ఒక మనిషి సారధ్యంలో నాగలితో భూమిని దుక్కిదున్నే పరిస్థితి నుండి నేడు టిల్లర్లు, ట్రాక్టర్లు అందుబాటులోకి వచ్చాయి. 

ఆధునిక వ్యవసాయానికి పట్టుకొమ్మలుగా ట్రాక్టర్లు నిలుస్తున్నా వేగంగా భూమిని దున్నుతున్నా, రైతులకు శ్రమ తగ్గినా, నష్టపోతున్నది మాత్రం ఆది అప్పటి వృత్తి కళాకారులే.

భూమిని దున్నిన తరువాత దీన్ని చదును చేసి, గట్లువేయడానికి, పాదులు కట్టడానికి, విత్తనాలు చల్లడానికి ఉపయోగపడేది పార అనే పరికరం. ఒకప్పుడు పారలేనిదే పని గడిచేది కాదు. మట్టిపనికి, మడి తయారీకి ప్రముఖమైన పనిముట్టు. పలుగు పార, డోకుడు పార, శెలగ పార, గొనంపార అని పిలవబడే పార రకమేదైనా ఉపయోగపడేది వ్యవసాయానికే. భూమిని లోతుగా తవ్వడానికి గడ్డపార వినియోగించేవారు. ప్రస్తుతం పార, గడ్డపార ఈ రెండు పరికరాలు చేసే పనులను యంత్రపరికరాలు చేస్తుండడంతో వీటి ప్రాముఖ్యత తగ్గి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. 

వ్యవసాయ సంస్కృతిలో భాగమైన కాడెడ్లు, దుక్కిదున్నే క్రమంలో వలపల, దాపల అనే ప్రక్రియకు ఈ ఎడ్లు ఎల్లవేళలా కట్టుబడి ఉంటాయి. దుక్కి దున్నినా, బండిలాగినా, రోడ్డుమీద నడుస్తున్నా, కొట్టాంలో కట్టేసి ఉన్నా అవి అలానే తమ జీవన క్రమానికి కట్టుబడి ఉంటాయి. సాలు వెంబడి సాలు వేసేటప్పుడు కూడా దున్నే రైతుకు అవి అలాగే సహకరిస్తాయి. ఈ కళాత్మక వ్యవసాయ ప్రక్రియలో కనుమరుగైపోయి మొత్తం యాంత్రీకరణ ప్రపంచంలో వ్యవసాయం మునిగిపోయిన నేపద్యంలో 'ఏరువాకా సాగారో రన్నో చిన్నన్న... నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న... ఎలపట దాపట ఎడ్లు కట్టుకొని, ఇల్లాలిని వెంటబెట్టుకొని' అని పాడుకునే ఉల్లాసవంతమైన రోజులివి కావు. రోజుల మారాయి సినిమాలో ఉన్న నాటి పరిస్థితులు కూడా ఆనంద దాయకంగా లేక వృత్తిని నమ్ముకున్న రైతులు, వారిని నమ్ముకున్న చేతివృత్తుల వారిని, వ్యవసాయ కార్మికులను నిరాశ నిస్తేజంలో నింపివేశాయి. 

పర్యాటక చిహ్నంగా ఎడ్ల బండి : 

రైతులకు వ్యవసాయంలో ఉపయోగపడే అతిముఖ్యమైన సాధనం ఎడ్ల బండే. పొలంలోని పంటను ఇంటికి చేర్చడానికి, ఇంటివద్దనున్న ఎరువును పొలానికి చేర్చడానికి ఇది ముఖ్యమైన సాదనంగా ఉండేది. వడ్రంగి కళాకారుడు తయారు చేసే ఈ రెండెడ్ల బండి కాలానుగుణంగా మార్పులు చెందుతూ వస్తుంది. మొదట టైరు చక్రాలతో నడిచే విధంగా రూపాంతరం చెందింది. ఎడ్ల బండ్లలో అనేక రకాలున్నాయి. గూడు బండి, సవారీ బండి అనే రెండు రకాలు రైతులను, కూలీలను రవాణా చేయడానికి, పండిన పంటను సంతకు రవాణా చేయడానికి ఈ బండ్లను వినియోగించేవారు. ఒంటెద్దు బండ్లు కూడా ఉండేవి. ఐతే వీటికి కాలం చెల్లిపోయింది. రెండెడ్ల బండ్లు మాత్రం అక్కడక్కడా కనిపిస్తున్నాయి. వీటి స్థానంలో ట్రాక్టర్లు వచ్చేశాయి. ఎద్దులు చేసే అన్ని పనులను ట్రాక్టర్లే చేస్తున్నాయి. 

పశువులను మేపడానికి, గొర్రెల కాపరులు, మేకల కాపరులు, అడవికి వెళ్ళేటప్పుడు సంకటిముద్దను నింపుకొని చింతకాయ పచ్చడి వేసుకొని మద్యాహ్నం తినడానికి చిక్కంలో వేసుకొనివేళ్ళేవారు. చిక్కం అంటే సన్నటి దారాలతో అల్లిన వల. సాయంత్రం తిరిగివచ్చేటప్పుడు అడవిలో దొరికే పండ్లు, కందమూలాలు, రేగిపండ్లు, కలింకాయ, బోడకాకర వంటి అడవి పండ్లను చిక్కంలో నింపుకొని తీసుకు వచ్చేవారు. కాపరులు తెచ్చే అడవి పండ్ల కొరకు పిల్లలు, తల్లుల కొరకు గొర్రెపిల్లలు వేచి ఉండేవి.

పట్టణవాస ప్రభావం పడి పల్లె జీవనం ఛిద్రమై, బ్రతుకు భారమై, వ్యవసాయం కుదేలై, వృత్తులు మూలనపడి, రసహీనంగా మారిపోయిన నేపధ్యంలో నూటికి 70 శాతం కలిగిన జనాభా తమ మనుగడ కొరకు తీవ్రమైన వత్తిడులను ఎదుర్కొని 'ఎవరో వస్తారని... ఏదో చేస్తారని దశాబ్ధాల తరబడి మోసపోతూనే ఉన్నారు'. భ్రమల లోకంలో ప్రజలను ఉంచి కులం, మతం, జాతి, భాష, ప్రాంతం మత్తులో ఉంచి ఎవరికెక్కడ అవకాశముంటే అక్కడ దోపిడీ వ్యవస్థను కొనసాగిస్తూ కార్పోరేట్‌ పాలకులు సజీవంగా కొనసాగించుకుంటూ వస్తున్నారు.
 

రచయిత సమాచారం

- వై.వి. నరసింహారావు, అసోసియేట్‌ ఎడిటర్‌