Print this page..

కంది పంటలో సస్యరక్షణ

ఆంధ్రప్రదేశ్‌లో కంది పంటను సుమారు 8.72 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేసి 1.33 లక్షల టన్నులు కంది ఉత్పతి చేస్తున్నారు. పత్తి, మిరప, పొగాకులకు ప్రత్యామ్నాయంగా అలాగే పెసర, మినుము, సోయాచిక్కుడు, వేరుశనగ లాంటి పైర్లతో మిశ్రమపంటగా కందిని ఖరీఫ్‌లో పండిచవచ్చు.  కందిని సాధారణంగా తొలకరి పంటగా వేసినప్పుడు కంది ఎక్కువ పెరగటం వల్ల ఈ పంటను ఆశించే కాయతొలుచు పురుగు మరియు మారుకా మచ్చల పురుగు నివారణ కష్టమవుతుంది. 

అదే విధంగా రబీ కంది, అనువైన ఎత్తులో ఉండటం వల్ల సస్యరక్షణ చర్యలు చేపట్టటం తేలిక. రబీ కంది జనవరిలో పూతకొస్తుంది. ఈ సమయంలో శనగపచ్చ పురుగు ఉధతి తక్కువగా ఉంటుంది. కాబట్టి కంది పంటలో అధిక దిగుబడిలు పొందటానికి అనువైన సాగు పద్ధతులు మరియు సస్యరక్షణ ప్రభావితం చేస్తాయి.

పురుగులు : 

ఆకుచుట్టు పురుగు : 

ఈ పురుగు కంది పెరిగే దశలో ఆశించి ఆకులను పూతను చుట్టగా చుట్టుకొని లోపల ఉండి ఆకును గీరి తింటుంది. దీని నివారణకు 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్‌ లేదా 2.0 మి.లీ క్వినాల్‌ఫాస్‌ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కాయ తొలుచుపురుగు : 

ఈ పురుగు పూత పిందె దశలో కాయలను రంద్రాలు చేసి గింజలను తింటూ, ఒక కాయ నుండి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకు  ఇడాక్సాకార్బ్‌ 1.0 మి.లీ లేదా స్పైనోసాడ్‌ 0.3 మి.లీను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

మారుకా మచ్చల పురుగు :

ఈ పురుగు లేత పూమోగ్గ, పిందె,  కాయ ఏర్పడే దశలో ఆశిస్తుంది. దీని నివారణకు క్లోరిపైరిపాస్‌ 2.5 మి.లీ లేదా  థయోడికార్బ్‌ 1 గ్రా. లేదా ఫ్లూబెండిమైడ్‌ లేదా సైహాలోత్రిన్‌ 1.0 మి.లీ లేదా డైక్లోరోవాస్‌ 1.0 మి.లీ లేదా స్పైనోసాడ్‌ 0.3 మి.లీ.ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 

కాయ ఈగ :

కాయ ఈగ ఆశించినప్పుడు నష్టం బయటకు కనిపించదు. దీని పిల్ల పురుగులు కాయ లోపలే ఉండి గింజలను తినేస్తుంది. ఈ పురుగు అన్ని దశలను కాయ లోపలే పూర్తి చేసుకొని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది. తల్లి పురుగు లేత పిందె దశలో కాయలపై గ్రుడ్లు పెడుతుంది. కాబట్టి పిందే దశలో 5 శాతం వేపగింజల కాషాయం పిచికారి చేసినట్లయితే గ్రుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు. గింజ గట్టిపడే దశలో మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా డైమిథొయేటే 2.0 మి.లీ లేదా ప్రోపెనోపాస్‌ 2.0 మి.లీ లేదా థయాక్లోప్రిడ్‌ 0.7 మి.లీ.ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తెగుళ్ళు : 

ఎండు తెగులు :

ఈ తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కాని మొక్కలో కొంత భాగం గాని వాడి ఎండిపోతాయి. ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగం చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి. దీని నివారణకు ఈ తెగులు అధికంగా కనిపించిన పొలాల్లో పొగాకు లేక జొన్నతో పంట మార్పిడి చేయాలి, ఐ.సి.పి.ఎల్‌ 87119 మరియు ఐ.సి .పి 8863 వంటి కంది రకాలు ఈ తెగుళ్ళను తట్టుకుంటుంది. ఈ తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు. నీరు నిల్వ ఉండే భూముల్లో కందిని సాగు చేయకూడదు.

ఇది వైరస్‌ తెగులు. తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగు గల చిన్న ఆకులను విపరీతంగా తొడుగుతుంది. పూత పూయదు. ఈ తెగులు అసరియా కజాని అనే ఇరియోపిడ్‌ నల్లి ద్వారా వ్యాపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధపు పొడి లేక 4 మి.లీ. కేరాతిన్‌ ను కలిపి వారానికి రెండు దఫాలు పిచికారి చేయాలి. ఈ తెగులను తట్టుకోగల ఐ.సి .పి.యల్‌ 87119 ఐ.సి.పి.యల్‌ 85063 బి.యస్‌. యం.ఆర్‌ 853 బి.యస్‌. యం.ఆర్‌ 736 రకాలను సాగుచేసుకోవచ్చు.

మాక్రోపోమినా ఎండుతెగులు : 

ముదురు మొక్కలు కాండం పైన నూలు కండె ఆకారం కలిగిన ముదురు గోధుమ వర్ణపు మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు చుట్టు గోధుమ వర్ణంలోను మధ్య భాగం తెలుపు వర్ణంలో ఉంటాయి. యం. ఆర్‌. జి 66 కంది రకం ఈ తెగులను తట్టుకుంటుంది. కందిని ఎక్కువ కాలం ఒకే పొలంలో వేయరాదు.

రచయిత సమాచారం

కె . రెడ్డెమ్మ,  రీసర్చ్‌ అసోసియేట్‌ (సేద్య విభాగం), డా . యం. కిషన్‌ తేజ్‌, శాస్త్రవేత్త (సస్యరక్షణ విభాగం), డా . యం. రెడ్డి కుమార్‌,  సమన్వయ కర్త, జిల్లా ఏరువాక కేంద్రం, కలికిరి, చిత్తూరు జిల్లా.