Print this page..

చిరుధాన్యాల పోషక విలువలు - ప్రాసెసింగ్‌లో మెళకువలు

సాధారణంగా కొర్రలు, సామలు, అరికలు, ఊదలు, వరిగలు, రాగులను చిరుధాన్యాలుగా పిలుస్తారు. ఇవి భారతదేశంలో అతి ప్రాచీన సాంప్రదాయ పంటలు. పూర్వకాలం చిరుధాన్యాల విలువలను గుర్తించి వాటిని ఆహారంగా తీసుకునేవారు, అలాగే ప్రధాన ఆహార పంటగా సాగుచేసేవారు. హరిత విప్లవం అనంతరం వీటి యొక్క సాగు క్రమ క్రమంగా తగ్గిపోయి వాటిస్థానంలో వరిసాగు అధికమైంది. ప్రస్తుత కాలంలో నోటికి రుచించే శుద్ధి చేసిన ఆహారాన్ని తీసుకోవడానికి అలవాటు పడి, శరీరానికి కావల్సిన పోషకాలను అందించే చిరుధాన్యాలకు మెల్లగా దూరమైపోయి అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాము. 

మారుతున్న వాతావరణ పరిస్థితులు మరియు ఆహార అలవాట్ల కారణంగా చిన్నతనం నుండే ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్న ఈ సమయంలో చిరుధాన్యాలు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. దీనికి అనుగుణంగా ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ, అవగాహన పెరగడంతో చిరుధాన్యాలను  ఆహారంగా వరి, గోధుమలకు బదులుగా తీసుకోవడం గమనిస్తున్నాం.

చిరుధాన్యాల సాగుపై రైతులు మొగ్గు చూపించడానికి ఈ కింది కారణాలు పేర్కొనవచ్చు. 

చిరుధాన్యాలను ఏ నేలలోనైనా పండించవచ్చు. ఇవి ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగలవు కాబట్టి అతి తక్కువ వర్షపాతం ఆమ్ల, క్షార పరిస్థితుల్లో కూడా సాగుచేయవచ్చు. ఎరువులు మరియు రసాయన మందులు వినియోగించవలసిన అవసరం అతి తక్కువ. కావున తక్కువ పెట్టుబడితోనే ఈ పంటలను పండించుకోవచ్చు. 

పూర్వం సాంప్రదాయ పద్ధతిలో ఆడవారు రోకలిని ఉపయోగించి పొట్టుతీసేవారు.చాలా శ్రమ మరియు సమయం వెచ్చించడం వల్ల మరియు స్థానికంగా ప్రాసెసింగ్‌ పరికరాలు అందుబాటులో లేని కారణంగా వీటి సాగుపై మొగ్గు చూపేవారు కాదు. కానీ ప్రస్తుతకాలంలో ఈ ప్రాసెసింగ్‌ పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల రైతులు పండించే పంటను సులభంగా ప్రాసెసింగ్‌ చేసుకొని అమ్ముకోవడం ద్వారా లాభసాటి మార్గంలో ముందుకు సాగుతున్నారు.

చిరుధాన్యాల పోషక విలువలు : 

శుద్ధి చేసిన ఆహారాన్ని (ప్రాసెస్ట్‌ ఫుడ్‌) తినడంవల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. తద్వారా రక్తంలో గ్లూకోస్‌ స్థాయివెంటనే పెరుగుతుంది. ఇలాంటి ఆహార పదార్థాలను ఎక్కువ గ్లైసెమిక్‌ఇండెక్స్‌ (జి.ఐ) కలిగి ఉన్న వాటిగా పరిగణిస్తారు. జి.ఐ తక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోస్‌ స్థాయిలు వెంటనే పెరగవు ఇవి షుగర్‌ వ్యాధి నియంత్రణలో ఉంచుకోవడానికి అలానే సరైన శారీరక నిర్వహణకు ఉపయోగపడతాయి. ఇలా ఆలస్యంగా జీర్ణం అయ్యే లేదా తక్కువ జి1 ఉన్న ఆహార ధాన్యాల్లో చిరుధాన్యాలు ముందు నిలిచాయి. శరీరానికి తగినంత ఆక్సిజన్‌ను అందించే రక్తకణాలకు ఇనుము, రాగి అవసరం. ఇవి రెండూ చిరుధాన్యాల్లో అధికంగా ఉంటాయి. 

రక్తపోటు నియంత్రించే ఫార్పరస్‌, క్యాన్సర్‌లను అడ్డుకునే ఫైటో న్యూట్రియంట్స్‌, కండరాలు మరియు నరాల సామర్ధ్యాన్ని పెంచే రక్తంలో షుగర్‌ని నియంత్రించే మెగ్నీషియం, శరీరంలో ఉండే వ్యర్థపదార్థాలను తొలగించుటకు మరియు రోగనిరోధక శక్తిని పెంచుటకు కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్‌ ఈ చిరుధాన్యాల్లో అధికం. అదేవిధంగా అధిక పీచుపదార్థాలు కలిగిన చిరుధాన్యాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. చిరుధాన్యాలు గ్లుటిన్‌ ఫ్రీ కావడం వల్ల జీర్ణకోశ సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో ఉపయోగపడతాయి.

ఈ దిగువ పట్టికలో చిరుధాన్యాలు మరియు వరి, గోధుమల యొక్క పోషక విలువలను చూడవచ్చు. 

వివిధ రకాల చిరుధాన్యాలు మరియు ఇతర ధాన్యాల పోషక విలువలు (100 గ్రా.లో 12% తేమ కలిగిన ధాన్యాలు)

ధాన్యాలు  పిండి
 పదార్థాలు
 (గ్రా)
మాంస
కృత్తులు 
 (గ్రా)
కొవ్వు
పదార్థాలు
 (గ్రా)
శక్తి 
(కేలరీలు)
(గ్రా)
 పీచు
 పదార్థాలు
(గ్రా)
 కాల్షియం
(మి.గ్రా.) 
ఫాస్పరస్‌
(మి.గ్రా.)
మెగ్నీషియం
(మి.గ్రా.) 
జింక్‌
(మి.గ్రా.) 
ఇనుము
 (మి.గ్రా.)
 థయామిన్‌
(మి.గ్రా.)
రైబోప్లోవిన్‌
(మి.గ్రా.)  
నియాసిస్‌
 (మి.గ్రా.)
కొర్రలు 60.2 12.3 4.3 351 6.7 31  290 81 2.4 2.8 0.5  0.11  3.2
సామలు 67  7.7  4.7 329 7.6  17 220 91   1.8 9.3 0.3 0.05 3.2
అరికలు  65.9  8.3 1.4  535 5.2  35 188  122 1.6 1.7  0.15 0.20 2
వరిగలు 70.4 12.5 1.1 354 5.2 8 206 153 1.4 2.9 0.41 0.28 4.5
ఊదలు 65.5 6.2 4.8 300 13.6 22 280 82 3.0 18.6 0.33 0.10 4.2
అండు
కొర్రలు
71.3 8.9 1.9 338 8.2 28 276 - - 7.7 - - -
జొన్నలు 70.7 10.4 3.1 329 2 25 222 133 1.9 5.4 0.38 0.14 4.3
సజ్జలు 67 11.8 4.8 363 2.3 42 240 124 2.7 11 0.38 0.20 2.8
రాగి 72 7.3 1.3 336 3.6 344 283 146 2.5 3.9 0.42 0.17 11
వరి 78.2 6.8 0.5 362 1 33 160 19 1.2 1.8 0.41 0.05 4.3
గోధుమ  71.2 11.8 1.5 348 2 30 306 125 2.8 3.5 0.41 0.15 5.0

చిరుధాన్యాల ప్రాసెసింగ్‌లో మెళకువలు : 

పండించిన చిరుధాన్యాలను నేరుగా ఆహారంగా తీసుకోలేము. అంతే కాకుండా పాతకాలపు ఆహారపదార్ధాలను నేటి తరం వారు తినలేరు కూడా అందువల్ల ఈ చిరుధాన్యాలను ప్రాసెస్‌ చేసి అధిక ఆహార పదార్థాల తయారీకి అనుకూలంగా మారిస్తే వినియోగం గణనీయంగా పెరుగుతుంది. పంటకోత కోసిన తరువాత నాణ్యతలోను మరియు పరిమాణంలో సుక్షీణత చెందకుండా ఉంచడం ప్రాసెసింగ్‌ యొక్క ముఖ్య ఉద్దేశం. 

చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ ముఖ్యంగా రెండు పద్ధతుల్లో ఇమిడి ఉంది. 1. ప్రాధమిక ప్రాసెసింగ్‌, 2. ద్వితీయ ప్రాసెసింగ్‌, 

ప్రాధమిక ప్రాసెసింగ్‌ పద్ధతులు : 

ప్రాధమిక ప్రాసెసింగ్‌లో ప్రధానంగా పనికిరాని వ్యర్థపదార్థాలు, రాళ్లు, తాలు గింజలను వేరుచేయడం, ధాన్యపు గింజల నుండి బియ్యంగా మార్చడం. 

చిరుధాన్యాలను శుభ్రపరచుట,  గ్రేడింగ్‌ చేయుట : 

పంటను కోసి నూర్చిన తరువాత వాటిని క్షీణిత లేకుండా సురక్షితంగా నిల్వచేయుటకు గాను గింజల్లో తేమ శాతం 10-12 శాతం వచ్చే వరకు ఆరబెట్టుట అవసరం. చిరుధాన్యాలను శుభ్రపరచుట మరియు గ్రేడింగుల మూలంగా ధాన్యంపైన దుమ్ము, ధూళి, రాళ్ళు మరియు అవాంచిత ఇతర పదార్థాల తొలగించుట కొరకు డి-స్టోనర్‌ ఉపయోగపడుతుంది. దీనిలో ప్రధాన భాగాలు ఆస్పిరేటర్‌ మరియు గ్రేడర్‌. 

చిరుధాన్యాల గింజ యొక్క పొట్టు తీయుట : 

చిరుధాన్యాల పొట్టులో శిలీంధ్రజనిత టాక్సిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం. మరియు తినడానికి కష్టంగా ఉండును కనుక దానిపై పొట్టును తీసి బియ్యంగా మార్చాలి. ఈ ప్రక్రియ సాంప్రదాయ పద్ధతుల్లో కష్టతరంగా ఉండేది. ప్రస్తుతం పొట్టుతీయడానికి గాను రిపిడి సూత్రంతో పనిచేసే అబ్రాసివ్‌ డి-హల్లర్‌, రబ్బర్‌ రోల్‌ షెల్లర్‌ అందుబాటులో ఉన్నాయి. రెండు స్టేజీల్లో తయారుచేయబడ్డ సెంట్రిఫుగల్‌ ఇంపెల్లర్‌ పొట్టును పొట్టును  మరియు బియ్యాన్ని వేరుచేయుటకు వేర్వేరు ఔట్లెట్లు మరియు అస్పిరేటర్‌ ఉండును.

బియ్యపు గింజ నుండి ధాన్యాన్ని వేరు చేయడం : 

సెంట్రిఫుగల్‌ డి-హల్లర్‌ నుండి వచ్చిన బియ్యంలోని పొట్టు తీయబడని ధాన్యంను గ్రేడర్‌ ద్వారా వేరు చేసి సెంట్రిఫుగల్‌ డి-హల్లర్లో పోసి బియ్యంగా మార్చవచ్చు. చిరుధాన్యాల ప్రాధమిక ప్రాసెసింగ్‌ కొరకు డి-స్టోనర్‌, డి-హల్లర్‌, గ్రేడర్‌ ఈ మూడు యూనిట్లను 3-ఫేసు విద్యుత్‌ సహాయంతో సుమారు రూ. 3.25 లక్షల ఖర్చుతో సంయుక్తంగా ఉపయోగించినట్లు అయితే రైతు స్థాయిలో కుటీర పరిశ్రమగా నెలకొల్పడానికి అవకాశం కలదు. 

ద్వితీయ ప్రాసెసింగ్‌ : 

ప్రాధమిక ప్రాసెసింగ్‌లో చేసినటువంటి ముడిసరుకును ఆహారంగా తీసుకోవచ్చు. పంట ప్రక్రియను సరళీకృతం చేయడానికి, తినడానికి సిద్ధంగా ఉన్న పదార్థాలను వండుటకు సిద్దంగా ఉన్న పదార్థాలను తయారు చేయుటను ద్వితీయ ప్రాసెసింగ్‌ అంటారు. చిరుధాన్యాల ద్వితీయ ప్రాసెసింగ్‌ ద్వారా మల్టీ గ్రైన్‌ పిండి, రవ్వ, అటుకులు, బిస్కెట్లు మరియు కోల్డ్‌ ఎక్స్‌ ట్రూ డెడ్‌ పదార్థాలను తయారుచేయవచ్చు.

ఈ మధ్యకాలంలో చిన్న మరియు మధ్యంతర చిరుధాన్యాల ఆహార పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి. దీనిలో ప్రధానంగా ద్వితీయ ప్రాసెసింగ్‌ చేసి తయారుచేయబడిన ప్లాక్స్‌ గర్బిణీ మరియు పాలిచ్చే మహిళలకు ఉపయోగకరంగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటాయి. పండించిన చిరుధాన్యాలను, కళ్ళం మీద, ఎటువంటి విలువ జోడింపు లేకుండా దళారులకు అమ్మడం కంటే పైన పేర్కొన్న చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ యంత్రాల్లో తమ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా తక్కువ / మధ్యస్థ సామర్ధ్యం కలిగిన యంత్రాలను ఎంపిక చేసుకొని పండించిన రైతే వ్యాపారవేత్తగా ఎదిగి, చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ చేసుకొని మార్కెటింగ్‌ చేసుకున్న పండించిన పంటకు రెట్టింపు ఆదాయం పొందవచ్చు. 
 

రచయిత సమాచారం

పి. వాసుదేవ రావు, ఎస్‌.వి.ఎస్‌ గోపాల స్వామి, ఎస్‌. విష్ణువర్ధన్‌, డి. సందీప్‌ రాజా, బి. జూస్‌వెస్లీ,  పోస్ట్‌ హార్వెస్టు టెక్నాలజీ సెంటర్‌, బాపట్ల, ఫోన్‌ : 8520989487