Print this page..

మామిడిలో నెలవారిగా చేయాల్సిన యాజమాన్య పనులు

మామిడిసాగులో ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉన్నప్పటికీ మనదేశంలో దిగుబడులు తక్కువగా ఉండడమే కాకుండా విదేశీ ఎగుమతులకు కావలసిన కాయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తగినట్లు లేనందున మామిడి ఎగుమతులు తక్కువగా ఉన్నాయి. మన రాష్ట్రంలో వివిధ మామిడి రకాలను సాగుచేస్తున్నప్పటికీ నాణ్యమైన పంట దిగుబడిని సాధించడంలో రైతులు వెనుకంజలో ఉన్నారు. దీనికి కారణం మామిడి తోటలు నాటి బ్రతికించుకుంటే పంట దానంతట అదే వస్తుందనే దోరణిలో ఉన్నారు చాలా మంది రైతులు. అంతేకాకుండా మామిడి సాగుకు కావలసిన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యాజమాన్య పద్ధతులైన కొమ్మ కత్తిరింపులు, కొమ్మ పెరుగుదల యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, నీటి నిర్వహణ, అంతర కృషి, సస్యరక్షణలను సకాలంలో సక్రమంగా చేయనందున పండ్ల నాణ్యత, దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నవి. కావు నాణ్యత, ఉత్పాదకత పెంచేందుకు నెలవారీగా చేపట్టవలసిన అధునాతన యాజమాన్య పద్ధతులను కింది విధంగా అనుసరించాలి. 

జూన్‌లో చేయవలసిన యాజమాన్య పనులు : 

కాయకోత అనంతరం, 15-20 రోజులకు కొమ్మ కత్తిరింపులు జరపటం వల్ల కొత్త చిగుళ్ళు వస్తాయి. ఆ తర్వాత లీటరు నీటికి యూరియా  20 గ్రా. + జింక్‌ సల్ఫెట్‌ 5 గ్రా. కలిపి పిచికారి చేయాలి. తొలకరి వర్షాలు పడగానే, నేలలో పదును చూసుకొని వరుసల మధ్య మొదటిసారి దున్నాలి. దీని వల్ల కలుపు నివారణ, భూమిలో కీటకాల గుడ్లు నిద్రావస్థలో ఉన్న పురుగులు బయటపడి ఎండవేడికి నశిస్తాయి. పక్షులు తింటాయి. నేల గుల్ల బారి వర్షపు నీరు బాగా ఇంకుతుంది.

జూలైలో చేయవలసిన యాజమాన్య పనులు : 

ఈ మాసంలో వర్షాలు పడుతుంటాయి. చెట్ల పాదుల్లో 4-5 అంగుళాల లోతుగా తవ్వాలి. అలాగే,  కలుపు పెరగకుండా పచ్చి రొట్ట పైరులైన జీలుగ, జనుము, పిల్లి పెసర, పెసర, ఉలవలను ఎకరాకు 15-20 కిలోల విత్తనాన్ని విత్తుకోవాలి. దీని వల్ల భూసారం, నేలలో నీటిని నిల్వచేసుకొనే గుణం పెరగడం ద్వారా అతి వేడి సమయంలో కూడా చెట్లు చనిపోకుండా ఉంటాయి. 

ఆగస్టులో చేయవలసిన యాజమాన్య పనులు : 

ఈ నెలలో చెట్టు ప్రధాన కాండం (మొదలు) నుండి 5-6 అడుగుల దూరంలో తవ్విన పాదుల్లో 75 శాతం సిఫారసు చేసిన ఎరువులను యూరియా (1.63కిలోలు), సింగల్‌ సూపర్‌ ఫాస్ఫెట్‌ (4.69 కిలోలు) మరియు పొటాష్‌ (1.25 కిలోలు) రూపంలో వేయాలి. 

సెప్టెంబర్‌లో చేయవలసిన యాజమాన్య పనులు : 

వర్షాల చివర్లో రెండవ సారి పొలాన్ని దున్నాలి. దీని వల్ల నేల గుల్ల బారి లోపలి పొరల్లోని తడి ఆవిరైపోతుంది. ఇలా తేమ ఆవిరైపోవటం పూతకు ఎంతో అవసరం. 50 శాతం పూత దశకు చేరిన పచ్చిరొట్ట పైర్లను భూమిలో కలియ దున్నాలి. దీని వల్ల భూసారం, నేలలో నీటిని నిల్వచేసుకొనే గుణం పెరగడం ద్వారా అతి వేడి సమయంలో కూడా చెట్లు చనిపోకుండా ఉంటాయి. 

అక్టోబర్‌లో చేయవలసిన యాజమాన్య పనులు : 

ఈ నెల నుండి పూత వచ్చే వరకు నీటి తడులను తోటలకు పెట్టకూడదు. కానీ, ఈశాన్య ఋతుపవనాల ప్రభావం వల్ల పడే వర్షాల కారణంగా భూమిలో తేమ అధికమవుతుంది. దీని వల్ల పూత తగ్గటం లేదా ఆలస్యంగా రావటం జరుగుతుంది. అందువలన మరొకసారి పొలాన్ని దున్నుకోవాలి.  చెట్ల ఎదుగుదల లోపాలుంటే లీటరు నీటికి సూక్ష్మ పోషక మిశ్రమాన్ని 5 గ్రా. చొప్పున కలిపి పిచికారి చేయాలి. 

నవంబర్‌లో చేయవలసిన యాజమాన్య పనులు : 

ఈ నెలలోమల్టీ-కె 10 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి రెండు సార్లు 20 రోజుల వ్యవధిలో పిచికారి చేసినట్లైతే, తోటంతా పూత ఒకే సారి వస్తుంది.  

డిసెంబర్‌లో చేయవలసిన యాజమాన్య పనులు : 

ఈ నెలలో తోటలో పూత మొగ్గ దశ ప్రారంభమవుతుంది. తేనె మంచు పురుగు, పిండి నల్లి, మసి తెగులు, పక్షి కన్ను తెగులు ఆశించటం జరుగుతుంది. వీటి నివారణకు లీటరు నీటికి మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. (లేదా) ఇమిడాక్లోప్రీడ్‌ 0.3 మి.లీ + గంధకం 2.5 గ్రా. కలిపి పిచికారి చేసుకోవాలి.

జనవరిలో చేయవలసిన యాజమాన్య పనులు : 

ఈ మాసంలో తోటంతా పూత దశలో ఉంటుంది. తేనె మంచు పురుగు, బూడిద తెగులు ఉధతి ఎక్కువగా ఉంటుంది. నివారణకు థయోమిథాక్సామ్‌ 0.3 గ్రా. మరియు హెక్సాకొనజోల్‌ 2మీ.లీ  చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఫిబ్రవరిలో చేయవలసిన యాజమాన్య పనులు : 

ఈ సమయంలో తోటలు నల్ల పూత దశ మరియు పిందె కట్టే దశలో ఉంటాయి. తేనె మంచు పురుగు, తామర పురుగులు, బూడిద తెగులు, పక్షి కన్ను తెగులు ఆశిస్తాయి. వీటి నివారణకు ఎసిఫెట్‌ 1.5 గ్రా. + థయోఫినేట్‌ మిథైల్‌ 1 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఈ మందులతో సూక్ష్మపోషక మిశ్రమాన్ని 5 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేసినట్లైతే పిందె రాలుడు తగ్గి, దిగుబడి పెరగడంతో పాటు కాయ నాణ్యత పెరుగుతుంది. ఈ నెలలో చెట్టు ప్రధాన కాండం (మొదలు) నుండి 5-6 అడుగుల దూరంలో తవ్విన పాదుల్లో 25 శాతం సిఫారసు చేసిన ఎరువులను యూరియా (0.53కిలోలు), సింగల్‌ సూపర్‌ ఫాస్ఫెట్‌ (1.56 కిలోలు) మరియు పొటాష్‌ (0.42 కిలోలు) రూపంలో వేసి నీటి తడినివ్వాలి. 

మార్చిలో చేయవలసిన యాజమాన్య పనులు : 

 తోటలో కాయలు బఠానీ మరియు గోలి సైజు దశలో ఉంటాయి. ఈ దశలో కాయతొలుచు పురుగు, పిండినల్లి, పక్షికన్ను తెగులు, తొడిమకుళ్ళు తెగులు ఆశిస్తాయి. వీటి నివారణకు క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ + కార్బెండజిమ్‌ 1 గ్రా చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. కాయ సైజు పెరగడానికి, పిందే రాలుడు సమస్య రాకుండా మల్టీ-కె 10 గ్రా. మరియు ప్లానోఫిక్స్‌ 0.2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తోటలు బెట్టను తట్టుకొనేందుకు నీటి తడిని పెట్టాలి. 

ఏప్రిల్‌లో చేయవలసిన యాజమాన్య పనులు : 

పిందె రాలుడు సమస్య రాకుండా చెట్ల పాదులలో నీటి తడినివ్వాలి. ఈ మాసం చివర్లో పండు ఈగ ఆశిస్తుంది. దీని నివారణకు ప్రతి పది చెట్లకు ఒక్కో పండు ఈగ ఎర బుట్టను వేలాడితీయాలి. 

మేలో చేయవలసిన యాజమాన్య పనులు : 

కాయకోతకు 30-40 రోజుల ముందు నీరు పెట్టడం నిలిపి వేసినట్లైతే, కాయలోని చక్కెర శాతం అధికమై నాణ్యత పెరగటంతోపాటు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఆకులు, పిందెల, కాయల మీద మసి తెగులు ఆశిస్తుంది. దీని నివారణకు గంజిపొడిని వినియోగించవచ్చు. ఒక కిలో గంజి పొడిని 5 లీటర్ల నీటిలో కలిపి వేడి చేసి, చల్లార్చి, నీరు కలిపి 20 లీటర్ల ద్రావణాన్ని తయారు చేసి పిచికారి చేయాలి. పిచికారి చేసిన గంజి ద్రావణం కాయల మీద నుండి రెండు, మూడు రోజుల్లో పొరలు పొరలుగా రాలిపోతుంది. 

రచయిత సమాచారం

పి.ఎస్‌. సుధాకర్‌, సైంటిస్టు (హార్టి), డా|| ఎస్‌. శ్రీనివాసులు, సీనియర్‌ సైంటిస్టు & హెడ్‌,  కృషీవిజ్ఞాన కేంద్రం, తిరుపతి, ఫోన్‌ : 9908836684, 7981070420