Print this page..

అధిక వర్షాల కాలంలో వివిధ పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తలు

సాధరణంగా అకాల వర్షాల వల్ల పంటలకు తీవ్రమైన నష్టం కలుగుతుంది. పంట దశను బట్టి పంట నష్ట తీవ్రత ఉంటుంది. అంతేకాక పంటల యందు చీడ పీడలు అధికమై నష్టం కలుగ జేస్తాయి. పంట దిగుబడి తగ్గి నాణ్యత తగ్గడం వల్ల రైతుకు నికర ఆదాయం తగ్గుతుంది. అందువల్ల సరైన యజమాన్యం చేయడం వల్ల పంటలను అధిక వర్షాలనుండి కాపాడుకోవచ్చు. 

వరి : 

పెరుగుదల దశలో వరి పైరు నీటిముంపుకు గురైతే ...

 • పొలంలో ముంపునీటిని వీలైనంత త్వరగా బయటకు పంపించాలి.
 • ఎకరానికి 30 కిలోల యూరియా మరియు 15 కిలోల పొటాష్‌ ఎరువులు పైపాటుగా వేయాలి.
 • వరిలో పాముపొడ తెగులు ఉధతి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది, ఈ తెగులు వరిలో దుబ్బుచేసే  దశ నుండి ఆకులపై మచ్చలు  ఏర్పడి  క్రమేణా పెద్దదై పాముపొడ మచ్చలుగా మారుతాయి. ఉధతి ఎక్కువైనట్లయితే మొక్కలు ఎండి వాడిపోవును. నివారణకు ప్రోపికొనజోల్‌ 1 మి.లీ. లేక హెక్సాకొనజోల్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి దుబ్బుకి తగిలేల 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు  పిచికారి చేయాలి.
 • అలాగే వరిలో అగ్గితెగులు ఉధతికి ఈ వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి. అగ్గి తెగులు  సోకినప్పుడు  ముదురు ఆకులపై నూలు కండే ఆకారంలో గోధుమ రంగు మచ్చలు వచ్చి ఆకులు ఎర్రబడతాయి. క్రమేపీ మచ్చలు కలసిపోయి పంట ఎండి పోయినట్లు కనిపిస్తుంది. నివారణకు  ట్రైసైక్లోజోల్‌ 0.6 గ్రా. లేదా  కసుగామైసిన్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
 • వరిలో తుప్పు మచ్చలు  (జింక్‌ లోపం) ఉండే  వరి నాటిన 2 నుండి 6 వారాల్లో ముదురాకు చివరిలో ఈనెకు ఇరుప్రక్కల తుప్పు లేక  ఇటుకరంగు  మచ్చలు కనపడతాయి. ఆకులు చిన్నవిగా పెళుసుగా ఉండి వంచగానే  శబ్దం వస్తుంది. మొక్కలు గిడసారి బారి దుబ్బు చేయవు. లీటరు నీటికి 2 గ్రా. జింక్‌ సల్ఫేట్‌ను కలిపి 5 రోజుల వ్యవధిలో 2 లేక 3  సార్లు  పిచికారి  చేయాలి. 
 • అవసరాన్ని బట్టి వరి పనలపైన 5 శాతం మెత్తటి ఉప్పును తడిచిన గింజెల పైన పలుచగా చల్లుట వల్ల మొలక రాకుండా కొంత వరకు నివారించవచ్చును.

మొక్కజొన్న : 

పెరుగుదల దశలో ఉన్న పైరుపై వర్షాలు ఎక్కువైనప్పుడు...

 • పొలంలో ముంపు నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపించాలి.
 • ఎకరానికి 50 కిలోల యూరియా మరియు 20 కిలోల పొటాష్‌ ఎరువులు పై పాటుగా వేయాలి .
 • కాండం తొలుచు పురుగు మరియు ఆకు ఎండు తెగులు ఉధతి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది.
 • ఉథృతి ఎక్కువైనట్లైతే నివారణకు ఎకరానికి 400 మి.లీ. ప్రొఫెనొఫాస్‌ మరియు ప్రోపికొనజోల్‌ 200 మి. లీ. 200 లీ. నీటికి కలిపి బాగా తడిచేటట్లు పిచికారి చేయాలి. 
 • వర్షాలు తగ్గిన 3-4 రోజుల తరువాత వరసల మధ్య  భాగాన్ని  గుంటకతో గాని గొర్రు ద్వారా గాని సేద్యం చేయాలి.

కోత దశలో ఉన్న పైరుపై వర్షాలు ఎక్కువైతే

 • వర్షాలు తగ్గిన పిదప కోత చేపట్టాలి.
 • చేను నేలకు ఒరిగితే పొలంలోని నీటిని పిల్ల కాలువల ద్వారా బయటకు పంపించి చేను పైన ప్రోపికొనజోల్‌  1 మి. లీ. లేదా హెక్సాకొనజోల్‌  2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 

కోత  తరువాత కల్లం పైన ఆరబెట్టిన మొక్కజొన్న కండెలు తడిస్తే :

 • వీలైనంత వరకు నీటిలో తడవకుండా చూడాలి. తడి కండెలను కుప్పగా పోయకూడదు.
 • తడి కండెల పైన టర్పీన్ల్లు కప్ప కూడదు, గాలి బాగ  తగిలేల  ఇంటిలో ఆరబెట్టుకోవాలి. అవసరాన్ని బట్టి కండెల పైన 5 శాతం మెత్తటి ఉప్పును తడిచిన కండెలు పైన పలుచగా చల్లి కింద మీద బాగా కలపడం వల్ల మొలక రాకుండా కొంత వరకు నివారించవచ్చును.
 • వర్షాలు తగ్గిన తరువాత కండెలను ఎండబెట్టి నూర్పిడి చేయాలి.

కంది :  

పూత సమయంలో అధిక వర్షాలు వల్ల నష్ట పోకుండా ఉండటానికి జాగ్రత్త చర్యలు :

 • వర్షపు నీరు నిలువకుండా ఎప్పటికప్పుడు పొలం నుండి నీరు తీసివేయాలి. 3 గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ను లీటరు నీటికి కలిపి ఆకులు, కాయలు మరియు మొక్క మొదళ్లు బాగా తడిచేలా పిచికారి చేయాలి.
 • పొటాషియం నైట్రేట్‌ 10 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి 200 లీ. మందు ద్రావకూణాన్ని పిచికారి చేయాలి.
 • ఎండు తెగులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. నివారణకు 3 గ్రా. కర్బెండిజం  లీటరు నీటికి కలిపి పిచికారి చేసినచో తెగులును కొంత వరకు నివారించవచ్చును .
 • కంది పంటలో పూత, మొగ్గ దశలో ఉన్నప్పుడు  వర్షాలు ఎక్కువైతే  కాయ తొలుచు శనగపచ్చ పురుగు మరియు మారుకామచ్చల పురుగు ఉధతి  రావడానికి అవకాశం ఉంది కావున నివారణకు పైరు మొగ్గ  దశ నుండి కాయ  దశ వరకు 1 లేదా  2 సార్లు  క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ.  లేక  క్వినాల్‌ఫాస్‌  2.0 మి.లీ.  లేక అసిఫేట్‌ 1.5 గ్రా. లీ నీటికి కలిపి  పిచికారి చేయాలి. పై మందులు తరువాత కూడా శనగ పచ్చ పురుగు నివారించలేక పోతే  ఇండాక్సీకార్బ్‌ 1.0 మి. లీ. లేదా స్పైనోసాడ్‌ 0.3 మి. లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి నివారించుకోవచ్చు .

ప్రత్తి : 

పెరుగుదల  దశలో ఉన్న ప్రత్తి అధిక వర్షాలు బారిన పడితే :

 • వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు పొలం నుండి నీరు తీసివేయాలి. 3 గ్రా. కాపర్‌ఆక్సీక్లోరైడ్‌ను లీటరు నీటికి కలిపి మొదళ్లు తడిచేలా పిచికారి చేయాలి. 
 • పంటకు అదనంగా ఎకరాకు 30 కిల్లోల యూరియా 15 కిల్లోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ పై పాటుగా వేయాలి .
 • వర్షాలు తగ్గాక మాంకోజెబ్‌ + కర్బెండిజం అనే శిలీంద్రనాశిని మందును 2 గ్రా. ల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
 • వర్షాలు తగ్గిన  3-4 రోజుల తరువాత వరసలు మధ్య భాగాన్ని గుంటకతో గాని గొర్రు ద్వారా గాని సేద్యం చేయాలి.

పూత, పిందే దశలో ఉన్న ప్రత్తి అధిక వర్షాలు బారిన పడితే :

 • వర్షపు నీరు నిలువకుండా ఎప్పటికప్పుడు పొలం నుండి నీరు తీసివేయాలి 3 గ్రా. కాపర్‌ఆక్సీక్లోరైడ్‌ను లీటరు నీటికి కలిపి ఆకులు, కాయలు  మరియు మొక్క యొక్క మొదళ్లు బాగా తడిచేలా పిచికారి చేయాలి.
 • ఎకరాకు పంటకు అదనంగా 30 కిలోల యూరియా 15 కిల్లోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌పై పాటుగా వేయాలి .
 • పొటాషియం నైట్రేట్‌ 10 గ్రా. మరియు మెగ్నీషియం  సల్ఫేట్‌  10 గ్రా.  ఒక లీటరు కలిపి 200 లీటర్ల మందు ద్రావణాన్ని  పిచికారి చేయాలి.
 • ఆకు మచ్చ  తెగుళ్లు  ఉధతి  అవడానికి  అవకాశం ఉంది కావున, వర్షాలు తగ్గాక మాంకోజేబ్‌ + కర్బెండిజం అనే శిలీంద్రనాశిని మందును 2 గ్రా. ల చొప్పున అలాగే ప్లాంటో మైసీన్‌ లేదా స్ట్రెప్టోమైసిన్‌ 0.2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
 • పత్తిలో  వర్షాలు వదిలిన  తర్వాత పిండి నల్లి  ఉధతి ఎక్కువ అవడానికి అవకాశం ఉంది నివారణకు లీటరు నీటిటికి 1 మి. లీ. డైక్లోరోఫాస్‌తో పాటు  2 మి. లీ. ప్రొఫెనోఫాస్‌ మందును కలిపి పిచికారి చేయాలి.
 • వర్షాలు తగ్గిన 3-4 రోజుల తరువాత వరసలు మధ్య భాగాన్ని గుంటకతో గాని గొర్రు ద్వారా గాని సేద్యం చేయాలి.

రచయిత సమాచారం

డా|| యస్‌.జాఫర్‌ బాష,  డా|| యస్‌.ఖయ్యుం అహమ్మద్‌, డా|| యన్‌.కామాక్షి, డా|| యం.సుబ్బారావు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, నంద్యాల, కర్నూలు జిల్లా