Print this page..

ప్రస్తుతం ప్రత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్తి పండించే చాలా ప్రాంతాల్లో సెప్టెంబర్‌ - అక్టోబర్‌లో వర్షాభావ పరిస్థితులు ఉండటం, పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రత్తి మొక్కలు గిడసబారిపోవటం, ఎదుగుదల లోపించడం, ఎర్రబడటం, మొక్కలు వడలిపోయి చనిపోవడం, పూత పిందెలు రాలిపోవడం, ముందస్తుగా ఏర్పడిన కాయలు దాదాపు చెట్టుకు 15-10 కాయలు పక్వానికి రాకముందే ముందస్తుగా పగలటం జరుగుతుంది. అంతే  కాకుండా బెట్ట వాతావరణంలో రసం పీల్చే పురుగులైన తామర మరియు పిండినల్లి ఆశించడానికి అవకాశం ఉంది. సాధారణంగా తేలిక నేలల్లో 10 - 15 రోజులకు బరువు నేలల్లో 20 - 25 రోజులకు తడులు ఇవ్వాలి. బెట్ట వాతావరణ పరిస్థితుల్లో నేలలో సరిపడినంత తేమ లేనప్పుడు మొక్కలు వేరు వ్యవస్థ ద్వారా పోషకాలను గ్రహించలేవు. కానీ మొక్కల్లో ఈ సమయంలో కూడా జీవన ప్రక్రియలు సజావుగా ఉండాలంటే పైపాటుగా పోషకాలను పిచికారి చేసుకోవాలి. పోషకాలు 2 శాతం యూరియా + 1 శాతం మెగ్నీషియం సల్ఫేట్‌ లేక 2 శాతం పొటాషియం నైట్రేట్‌ (మల్టీ కె) + 1 శాతం మెగ్నీషియం సల్ఫేట్‌ లేక 2 శాతం డి.ఎ.పి + 1 శాతం మెగ్నీషియం సల్ఫేట్‌ను పిచికారీ చేయాలి. వీటితో పాటుగా సూక్ష్మపోషక పదార్థాలైన జింకు, బోరాన్‌లను ఆవశ్యకతను గమనించి పిచికారి చేసుకోవడం ద్వారా, సుస్థిర దిగుబడులను సాధించవచ్చు. బెట్ట పరిస్థితుల్లో నేలలో తేమను సంరక్షించుకోవడానికి అంతరకృషి చేసుకోవాలి. 

ప్రత్తిలో నీటి తడులను ఇవ్వదలుచుకున్న వారు నీటి వసతిని అనుసరించి పూత మరియు కాయలు ఏర్పడే దశల్లో తడులను ఇవ్వాలి. ఈ నీటి తడులను వీలైనంత వరకు పల్చగా అంటే ముంపుగా నీరు పారించకుండా ఇస్తే ఆశించినంత ఫలితం ఉంటుంది. అలాగే ప్రత్తిలో నాగలి సాళ్ళు తోలుకుని బోదెలు ఏర్పరుచుకుని సాళ్ళల్లో కనుక నీటిని పారిస్తే నీరు వృధా కాకుండా సద్వినియోగమవుతుంది. అంతే కాకుండా మొక్కల మొదళ్ళకు నీరు తగలకుండా ఉంటుంది. నేల స్వభావాన్ని బట్టి బరువు నేలల్లో పట్టె వదిలి మరో పట్టెలో నీటి తడి ఇచ్చిన ఎడల నీటిని సద్వినియోగ పరుచుకుని మంచి దిగుబడులు పొందవచ్చును.

బిందుసేద్యం ద్వారా నీటిని ఇవ్వగలిగితే ఎక్కువ విస్తీర్ణం తడపడానికి అవకాశం ఉంటుంది. దీనితో పాటుగా పోషకాలను కూడా అందిస్తే నీరు మరియు పోషకాల వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది. అంతేకాకుండా నేల మీద నీరు పారించినట్లైతే మొక్కలు కొంత ఒత్తిడికి గురవుతాయి. అంతే కాకుండా పూత, గూడ కాయలు రాలిపోయే అవకాశం వున్నది. బిందు సేద్యం ద్వారా బరువు నేలల్లో కాయలు ఏర్పడి ఊరే దశల్లో 3-5 రోజులకు  1 గంట సేపు కనుక నీటిని అందించినట్లైతే మనకు నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చని పరిశోధనా ఫలితాలు తెలుపుతున్నాయి. అలాగే తేలికపాటి నేలల్లో అయితే 2-4 రోజులకు తడి ఇవ్వవలసి ఉంటుంది.

బెట్ట వాతావరణంలో ఆశించే రసం పీల్చు పురుగుల నివారణకు ఫ్లోనికామిడ్‌ 0.3 ఎమ్‌.ఎల్‌ / లీ., ఎసిటామిప్రిడ్‌ 0.4 మి.లీ./ లీ, ప్రొఫెనోఫాస్‌లను 2 ఎమ్‌ఎల్‌/లీ. వేపనూనెతో కలిపి ఆకుల అడుగుభాగాన పడేటట్లు పిచికారి చేయాలి. డైఫెన్‌థియురాన్‌ (1.25 గ్రా./ లీటరు నీటికి) పచ్చదోమ మరియు తెల్లదోమను అదుపు చేస్తుంది. అక్కడక్కడా ఫోమాబ్లైట్‌ (కొమ్మ ఎండు తెగులు)ను గమనించడం జరిగింది. దీని నివారణకు 3 శాతం కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లేదా 1 శాతం బావిస్టిన్‌ లేదా 3 శాతం మాంకోజెబ్‌ పిచికారీ చేయాలి. ప్రత్తి పంటను వర్షాధారంగా పండించడం జరుగుతుంది. కాబట్టి, అధిక వర్షాలకు లోనయినప్పుడు, పంట ముంపుకు గురవుతుంది. ప్రత్తి పంట నీటి ముంపుకు గురైనప్పుడు పాటించవలసిన పద్ధతులు. 

35-60 రోజుల పైరు :

ఈ దశల్లో ఉన్న ప్రత్తి పంట అధిక వర్షాలకు లోనైనప్పుడు పంట పూర్తిగా నీటి ముంపుకు గురై 2-3 రోజుల వరకు మురుగు నీటి తీతకు అవకాశం లేనప్పుడు పంట పూర్తిగా మాడిపోతుంది. ఇలాంటి సందర్బాల్లో మరలా ప్రత్తి పంటను తీసికోనట్లయితే, ప్రత్తి పైరును తీసివేసి ప్రత్యామ్నాయ పంటలైన రబీ కంది/మినుము/పెసర/మొక్కజొన్న/జొన్న మొదలగు వాటిని సాగు చేసుకోవాలి. పొలాల్లో నుండి నీరు తీయటానికి అవకాశం ఉంటే వెంటనే నీటిని తీసివేయాలి. పైపాటుగా ఎకరానికి 25-30 కిలోల యూరియా + 10-15 కిలోల పొటాష్‌ నిచ్చే ఎరువులను అందించాలి. అధిక తేమ వల్ల మొక్కలు భూమినుండి పోషకాలను గ్రహించే స్థితిలో ఉండవు. అటువంటి పరిస్థితుల్లో మొక్కలు ఎర్రబడటం, వడలటం, ఎండిపోవడం జరుగుతుంది. దీని నివారణకు 2 శాతం యూరియా లేదా 2 శాతం పొటాషియం నైట్రేట్‌ను 5-7 రోజుల వ్యవధితో రెండు మూడు సార్లు పిచికారీ చేయాలి. అవకాశం వచ్చిన వెంటనే అరకలతో అంతర కృషి చేసుకోవాలి. జింక్‌ లోపనివారణకు 1 లీటరు నీటిలో 2 గ్రా. జింకు సల్ఫేట్‌ కలిపి, 4-5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. 

60-85 రోజుల పైరు :

ముంపుకు గురైనప్పటికి పైరు పైభాగం నీటిలో మునగకుండా ఉన్నట్లైతే 2-3 రోజులు నీరు ఉన్నప్పటికీ నీరు తీసిన తరువాత తగు యాజమాన్యం చేసినట్లైతే సాధారణ దిగుబడులను సాధించటానికి అవకాశం ఉంటుంది. ప్రత్తిలో బోరాన్‌ లోప నివారణకు 1 లీటరు నీటిలో 1.5 గ్రా. సోడియం టెట్రాబోరేట్‌ను కలిపి 10-15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. మెగ్నీషియం లోపనివారణకు 75 మరియు 85 రోజుల దశలో మొక్క ఎదుగుదలను బట్టి లీటరుకు 15-20 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్‌ను కలిపి పిచికారీ చేయాలి. 

ప్రత్తిలో నీటి ముంపునకు యాజమాన్య పద్దతులు

 • వర్షాలు తగ్గగానే, వీలైనంత త్వరగా, మురుగు నీరు తొలగించి అంతరకృషి చేసి, నేల ఆరేటట్లు చేయాలి.
 • నైట్రోజన్‌ను యూరియా రూపంలో, ఎండ ఉన్న సమయంలో పిచికారీ చేయాలి. చల్లగానున్న సమయంలో పిచికారీ చేసినట్లయితే, నీటిముంపుకు గురైన మొక్కలు సమర్ధవంతంగా తీసుకోలేవు. 
 • రెండు శాతం పొటాషియం నైట్రేట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయటం ద్వారా పొటాషియం మరియు నత్రజని లోపాలను సవరించవచ్చు. 
 • 0.2 శాతం ఫెర్రస్‌ సల్ఫేట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయటం ద్వారా ఇనుపధాతు లోపాన్ని నివారించుకోవాలి.
 • పైపాటుగా సిఫారసు చేసిన మోతాదు కంటే మూడవ వంతు ఎక్కువగా నత్రజని మరియు పొటాషియం ఎరువులను నేల ద్వారా అందించాలి. 
 • మొక్క పూత దశలో ఉండి, పూత పిందె రాలటం అధికంగా జరిగినట్లయితే, 10 పి.పియం నాఫ్తలీన్‌ ఎసిటిక్‌ ఆమ్ల ద్రావణాన్ని 4-5 రోజుల్లో 2 సార్లు పిచికారీ చేయటం ద్వారా, మొక్కలోని హార్మోన్లను సమతుల్యతకు తీసుకురావటం ద్వారా, పూత పిందె రాలకుండా నివారించుకోవచ్చు. 
 • గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల పురుగులు, తెగుళ్ళ వ్యాప్తి చెందటానికి అవకాశం ఉంది కాబట్టి, తగు జాగ్రత్తలు వహించాలి.
 • ప్రత్తి పంట తొలిదశలో, నీటి ముంపునకు గురైనప్పుడు, వేరు కుళ్ళు తెగులు ఆశించడానికి అవకాశం ఉంది. వేరుకుళ్ళు నివారణకు, తెగులు సోకిన పాదుల చుట్టూ 3 గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లేదా 1 గ్రా. కార్బండిజమ్‌ లీటరు నీటికి కలిపి వేరు మండలం తడిచేలా పోయాలి. 
 • తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ప్రొఫినోఫాస్‌ 50 ఇ.సి 2 మి.లీ లేదా ట్రైజోఫాస్‌ 40 ఇ.సి 3 మి.లీ. లేక ఎసిటామిప్రిడ్‌ 0.2 గ్రా. లేక 5 మి.లీ వేపనూనె ఒక లీటరు నీటికి కలిపి ఆకుల అడుగు భాగాన పడేటట్లు పిచికారి చేయాలి.
 • ప్రస్తుతపు తేమ వాతావరణంలో ప్రత్తి పంటను వివిధ రకాల ఆకుమచ్చ తెగుళ్ళు ఆశించే అవకాశముంది. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, వాతావరణం తడిగా ఉండి ఉష్ణోగ్రతలు 200-300 మధ్య ఉన్నప్పుడు వేగంగా వృద్ద్ది చెందుతుంది. రాలిన ఆకులపై అధికంగా బీజోత్పత్తి జరిగి తెగులు ఉధృతికి దోహదపడతాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా లీటరు నీటికి 3 గ్రా. మాంకోజెబ్‌ లేక కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ కలిపి పిచికారీ చేయాలి. తెగులు సోకిన పొలంలో లీటరు నీటికి 1 మి.లీ ప్రోఫికొనజోల్‌ లేక 2 మి.లీ హెక్సాకొనజోల్‌ కలిపి 15 రోజుల వ్యవధిలో చల్లుకోవాలి. 
 • బ్యాక్టీరియా వల్ల మచ్చ తెగులు వర్షాకాలంలో మబ్బులు పట్టినప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుంది. అధికతేమ, గాలితో కూడిన వాన చినుకులు, 290-340 ఉష్ణోగ్రత ఈ తెగులు వృద్దికి బాగా దోహదపడతాయి. కాబట్టి ఈ తెగులు నియంత్రణకు లీటరు నీటికి 3 గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ మరియు 100 మి.గ్రా స్ట్రెప్టోసెక్లిన్‌ కలిపి 10-15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి.  

గత మూడు, నాలుగు సంవత్సరాల అనుభవ దృష్ట్యా, గులాబి రంగు పురుగు ఆశించే అవకాశం ఉన్నందున రైతులు ఆర్ధిక నష్ట పరిమితి స్థాయి ననుసరించి గ్రుడ్డుదశపై ప్రభావం చూపే ప్రొఫినోఫాస్‌ 50 ఇ.సి. 2.0 మి.లీ. లేక థóయోడికార్బ్‌ 75 డబ్ల్యు.పి. 1.5 గ్రా. పురుగు మందులను కాని, లేక క్వినాల్‌ఫాస్‌ 25 ఇ.సి. 2.5 మి.లీ. లేక క్లోరిపైరిఫాస్‌ 20 ఇ.సి. 2.5 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో మూడు లేక నాలుగు పర్యాయాలు మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే గొంగళి పురుగు కాయలోపలికి ప్రవేశించకుండానే నివారించుకోవచ్చు. ప్రత్తి పంట చివరి దశలో 120 రోజుల తర్వాత 1 లేక 2 పర్యాయాలు సింధటిక్‌ పైరిత్రాయిడ్స్‌ మందులైన సైపర్‌ మెత్రిన్‌ 25 శాతం ఇ.సి. 1.0 మి.లీ. లేక లామ్డాసైహలోత్రిన్‌ 5.0 శాతం ఇ.సి.1.0 మి.లీ., ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ప్రస్తుతం రైతులు వీలైనంత వరకు పైపాటుగా పోషకాలను పిచికారి చేస్తూ పంటను కాపాడుకోవడం ద్వారా నాణ్యమైన దిగుబడులను పొందవచ్చును.
 

రచయిత సమాచారం

- ఎస్‌. రత్నకుమారి, ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, లాంఫారం, గుంటూరు, ఫోన్‌: 99896 25207