Print this page..

అంధత్వ రహిత సమాజం కొరకు కృషి

ప్రకాశం జిల్లాను అంధత్వ రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా ఏలూరి ఛారిటబుల్‌ ట్రస్టు ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తుందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. 10 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, రాబోయే కాలంలో కూడా కొనసాగుతూనే ఉంటాయని ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లా, ఇంకొల్లు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏలూరి ఛారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే దృక్పదంతోనే ఈ సంస్థను స్థాపించానని తుది శ్వాస వరకు ప్రజలకు సేవ చేయడమే తన ఏకైక లక్ష్యమని ఆయన అన్నారు.

తన తండ్రి స్వర్గీయ ఏలూరి నాగేశ్వరరావు స్మారకార్థం నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలు ప్రజలకు ముఖ్యంగా పేదలకు, వృద్ధులకు ఎంతో ఉపకరిస్తున్నాయని 'సర్వేంద్రియానాం నయనం ప్రధానం' అనే నినాదం, 'ప్రజలే దేవుళ్లు-సమాజమే దేవాలయమన్న' స్వర్గీయ ఎన్‌.టి.ఆర్‌. ఉవాచ. తనకు స్ఫూర్తిదాయకమని ఆ బాటలోనే వ్యయ ప్రయాసలకోర్చి తాము ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా అమలు చేస్తున్నామని తెలిపారు. పర్చూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు విస్తృతంగా ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఈ శిబిరాలను నిర్వహించి అనేకమంది నిరుపేదలను ఉచిత వైద్య సేవలను అందించామని ఆయన తెలిపారు. తాజాగా ఇంకొల్లు మండలంలో నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ట్రస్టు ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టింది. వివిధ గ్రామాలకు వెళ్ళేందుకు బస్సు సౌకర్యం కల్పించింది. 

అంధకారంలో ఉన్న ప్రజలకు వెలుగులు నింపాలనే లక్ష్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. ఇప్పటికే సుమారు 40 వేల పైగా ప్రజలకు కంటి పరీక్షలు చేయించడం జరిగిందని రానున్న కాలంలో లక్షకు పైగా ప్రజలకు కంటి పరీక్షలు చేసే విధంగా తన లక్ష్యం కొనసాగుతుందని తెలిపారు. ఇకపై అనేక వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు ఉచిత మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి కీళ్ళ, మోకాళ్ళ పరీక్షలు, ఉచిత గుండె పరీక్షలు, స్త్రీలకు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఎక్కువ సేవలను ఉచితంగా అందించడానికి ట్రస్టు ఎంతో దోహదపడుతుందని అన్నారు. 

ఏలూరి ఛారిటబుల్‌ ట్రస్టు కేవలం వైద్య సేవలకే పరిమితం కాకుండా బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన విజ్ఞానాన్ని అందించేలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. నేటి యువత సమాజమార్పు కోసం పాటుపడే విధంగా సామాజిక కార్యక్రమాలతో పాటు క్రీడా రంగంలో రాణించే విధంగా తమ ట్రస్టు తోడ్పాటునందిస్తుందని నియోజకవర్గ యువతకు క్రీడా సామగ్రిని అందచేయడం జరుగుతుందని వివరించారు. విద్యార్థులకు 10వ తరగతి స్టడీ మెటీరియల్‌తో పాటు ఉచితంగా నోటు పుస్తకాలను సరఫరా చేయడం, నియోజకవర్గంలోని ప్రజలందరికీ తమ ట్రస్టు ద్వారా పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా సేవలు కొనసాగిస్తానని ఏలూరి తెలిపారు. ఇకపై జిల్లా వ్యాప్తంగా   ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

రానున్న కాలంలో ఈ జిల్లాను అంధత్వ రహిత జిల్లాగా రూపుదిద్దేందుకు కృషి సాగుతుందని ఏలూరి ఛారిటబుల్‌ ట్రస్టుతో పాటు గుంటూరు శంకర నేత్ర వైద్యశాల వారి సహకారంతో ఉచిత వైద్య సేవలను జిల్లా వ్యాప్తంగా విస్తృతపరచేందుకు కృషి చేస్తున్నామని అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారికి ఈ ఉచిత వైద్య శిబిరాలు ఎంతో దోహదపడతాయని ఆయన అన్నారు. 

నోవా అగ్రిటెక్‌ కంపెనీ ఉపాధ్యక్షులు పి. అజయ్‌బాబు సారధ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్‌ తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లూరి నాయుడమ్మ, నాయుడు హనుమంతరావు, వీరగంధం ఆంజనేయులు, గంజి వెంకటారావు, తిరుమలశెట్టి శ్రీహరి, షేక్‌ జమాలుద్ధీన్‌, మానం హరిబాబు, రావి సీతయ్య, ఇండ్ల శ్రీను, చెరుకూరి రమేష్‌, కర్రి సుబ్బారావు, షేక్‌ రఫి, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
 

రచయిత సమాచారం

నోవా అగ్రిటెక్‌