Print this page..

పులుపు నిమ్మలో పూత నియంత్రణ - యాజమాన్య పద్ధతులు

మన రాష్ట్రంలో కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు మరియు పవ్చిమగోదావరి మొదలైన జిల్లాల్లో పులుపు నిమ్మ తోటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉన్నాయి. దక్షిణ భారత దేశంలో సాగయ్యే నిమ్మ తోటల్లో సంవత్సరంలో రెండు శాతం మాత్రమే సహజ సిద్దంగా పూత ఏర్పడుతుంది. మొదటిసారి పూత జనవరి-ఫిబ్రవరి నెలల్లో పూతకు వచ్చి జూన్‌-ఆగష్టు నెలల్లో కాయ దిగుబడి వస్తుంది. రెండవ దఫాగా జూన్‌-జులైలో పూతకు వచ్చి డిసెంబరు-జనవరిలో దిగుబడి వస్తుంది.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకొని సంవత్సరం పొడవునా చెట్లపై పూత, పిందె, కాయలను వివిధ దశల్లో గమనిస్తున్నాం. పులుపు నిమ్మ సాగు చేసే రైతులు మొక్కలకు నీటిని ఎప్పుడు పడితే అప్పుడు అందించడం వల్ల సరైన సమయంలో చెట్లు పూతకు రావడం లేదు. వేసవికాలంలో కాయ దిగుబడికి మంచి డిమాండ్‌ ఉండడం వల్ల రైతులు వేసవిలో అధిక దిగుబడిని సాధించడానికి కొన్ని ముఖ్యమైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలి. 

వేసవికాలంలో కాయ దిగుబడిని పెంచడానికి అక్టోబరు - నవంబరులో చెట్లను వాడుకు తీసుకురావాలి. నిమ్మజాతి చెట్లలో పూత దశకు రావడానికి కొమ్మల్లో పిండిపదార్థాలు ఎక్కువగానూ, నత్రజని మోతాదు తక్కువగానూ ఉండాలి. నిమ్మ చెట్లను వాడుకు గురిచేయడం వల్ల కొమ్మల్లో పిండిపదార్థాల నిల్వ శాతం పెరుగుతుంది. ఆ తరువాత 10-15 రోజులకు ఒకే సారి నీటిని, పోషకాలను అందించి కొమ్మలను చిగురింపచేయవచ్చు. చిగురించిన కొమ్మల అడుగుభాగాలపై పూత ఏర్పడుతుంది. ఈ విధంగా చెట్లను వాడుకు తీసుకువచ్చే విధానాన్ని ''బహార్‌ పద్ధతి'' అని అంటారు. కానీ మన రాష్ట్రంలో నిమ్మసాగులో ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాల తాకిడికి అక్టోబరు - నవంబరులో వర్షాలు ఎక్కువగా వస్తాయి. ఇలాంటి సమయాల్లో చెట్లను సహజంగా వాడుకు తీసుకురావడం కుదరదు. కనుక రైతులు ఈ కింద సూచించిన యాజమాన్యపద్ధతులను పాటించి వేసవిలో అధిక దిగుబడులను పొందవచ్చు. 

పాటించవలసిన యాజమాన్య పద్ధతులు : 

 • జూన్‌లో 50 పి.పి.యం (50 మి.గ్రా.) జిబ్బరెల్లిక్‌ ఆమ్లాన్ని సెప్టెంబరులో 1000 పి.పి.యం సైకోసెల్‌ ద్రావణాన్ని అక్టోబరులో పొటాషియం నైట్రేట్‌ 10 గ్రా. లీటరు నీటికి కలిపి చెట్లపై పిచికారి చేయాలి.
 • నవంబరు మొదటి పక్షంలో చెట్టుకు 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి, 500 గ్రా. యూరియా, 400 గ్రా. మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ ఎరువులను చెట్ల పాదుల్లోవేసి నీరందించాలి.
 • ఎరువులు వేసిన 10-15 రోజులకు చెట్లు చిగురించి పూత రావడం మొదలౌతుంది.
 • ఇగురు వచ్చిన 10-15 రోజులకు సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని (జింక్‌ సల్ఫేట్‌ 5 గ్రా., మాంగనీస్‌ సల్ఫేట్‌ 2 గ్రా., మెగ్నీషియం సల్ఫేట్‌ 2 గ్రా., ఫెర్రస్‌ సల్ఫేట్‌ 2 గ్రా. కాపర్‌ సల్ఫేట్‌ 3 గ్రా., బోరాక్స్‌ 1 గ్రా., సున్నం 6 గ్రా., యూరియా 10 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి) 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
 • పిందె బఠాణి సైజులో ఉన్నప్పుడు హార్మోన్ల లోపం వల్ల పిందెరాలుడును గమనించినప్పుడు ప్లానోఫిక్స్‌ 2.5 మి.లీ. 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.
 • కాయ పెరిగే దశలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి.
 • జనవరిలో (కాయపెరిగే దశలో) 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి, 300 గ్రా. యూరియా, 350 గ్రా. మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ ఎరువులను చెట్టు ఒక్కింటికి వేసి నీటిని అందించాలి.
 • ఫిబ్రవరిలో 2.5 సెం.మీ. మందంతో వేరుశనగ పొట్టు, వరి ఊక, వరి గడ్డి లాంటి వ్యవసాయ పదార్థాలతో చెట్ట పాదులను కప్పాలి.  దీనివల్ల వేసవిలో నీటి నిల్వ సామర్ధ్యం పెరిగి సేంద్రియ పదార్థం అందుబాటులో ఉంటుంది.
 • నిమ్మకాయ గోళీకాయ పరిమాణంలో ఉన్నప్పుడు మంగు ఆశించకుండా నీటిలో కరిగే గంధకం 3 గ్రా. / లీ. (లేదా) ప్రొపార్‌గైట్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
 • వేసవిలో కాయపరిమాణం, రసం శాతం తక్కువగా ఉంటుంది. కనుక పొటాషియం నైట్రేట్‌ 10 గ్రా./లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
 • మార్చి-ఏప్రిల్‌లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాయ పసుపు లేదా గోధుమ రంగుకు మారుతుంది. దీన్ని నివారించడానికి యూరియా 10 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
 • గజ్జి తెగులును తట్టుకొని అధిక దిగుబడినిచ్చే బాలాజి మరియు పెట్లూరు సెలక్షన్‌-1 రకాలను నాటి పైన సూచించిన యాజమాన్య పద్ధతులను పాటించి వేసవిలో మంచి దిగుబడులను పొందవచ్చు.

రచయిత సమాచారం

డా|| ఎం. రాజా నాయక్‌, ఉద్యాన కళాశాల, అనంతరాజుపేట, కడప జిల్లా, ఫోన్‌ : 8897998978