Print this page..

వెలగపండు పోషక విలువలు, విలువ ఆధారిత ఉత్పత్తులు

ఆహార మరియు  పోషణ  భద్రతలో పండ్లు ప్రముఖమైన పాత్రను పోషిస్తున్నాయి. సుమారు ప్రపంచ పండ్ల విస్తీర్ణంలో 12.5 భారతదేశం కలిగి ఉంది మరియు ఉత్పత్తిలో 2 వ స్థానంలో  నిలుస్తుంది. ఎన్నోరకాల పండ్లు మన దేశంలో పండిస్తున్నప్పటికీ వాటి కోత తరువాత జరిగే నష్టాలు, పండ్లను పూర్తిగా వినియోగించకుండా చేస్తున్నాయి. ఈ నష్టాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా ఉంది. పంటకోత దశ నుండి వినియోగదారుని   చేరేవరకు రమారమి 30-40 శాతం నష్టం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ, తినే ఆహారం సాధ్యమైనంత వరకు ఎటువంటి రసాయనాలు లేకుండా తీసుకొవడానికి సముఖత చూపిస్తున్నారు. 

మర్కెట్లో రకరకాల దేశీ పండ్లనే కాకుండా అరుదైన విదేశీ పండ్లను చూస్తున్నాం మరియు అధిక ధరలున్నప్పటికీ వాటికున్న ఆరోగ్య లాభాల దష్ట్యా కొంటున్నాం. మన దేశంలోనే  పండే ఎన్నో వైవిధ్యభరితమైన పండ్లు వెలుగులోకి వస్తే మరియు వాటి యొక్క వినియోగం పెరిగితే విదేశాల నుండి పండ్ల దిగుబడికి పెట్టే ఖర్చు తగ్గించవచ్చు. అడవి ప్రాంతాల్లో లభించే వెలగపండు, మారేడు, ఫల్సా పండు, నేరేడు పండ్లు పుష్కలమైన పోషక విలువలను కలిగి ఉండడమే  కాకుండా చౌకగా కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఈ చెట్లను ప్రత్యేకంగా పెంచడం జరగదు కాబట్టి రసాయన ఎరువుల అవశేషాలు కూడా ఉండవు. సాధారణంగా ఈ పండ్లు కాలనుగుణంగా దొరకడం వల్ల సీజన్లో అవసరంకన్నా ఎక్కువగా లభించడం, వాటిని సరిగ్గా ఇతర ప్రాంతాలకు తరలించే సౌకర్యాలు లేకపోవడం వల్ల నిరుపయోగంగా పడేసే పరిస్ఠితి ఉంది. ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా కాలనుగుణంగా లభించే పండ్లను ప్రాసెసింగ్‌ చేసి ఎక్కువ కాలం నిల్వ ఉంచగల పదార్ధాలుగా మార్చడం వల్ల వినియోగాన్ని పెంచవచ్చు. 

జాం, జెల్లీ, కాండీ, పచ్చళ్లు, స్క్వాష్‌ మరియు ఎండు పండ్ల రూంపంలో సంవత్సరమంతా ఆస్వాదించవచ్చు దీని ద్వారా అధిక ఆదాయం పొందవచ్చు. తక్కువ ఉపయోగించే లేదా ప్రాసెసింగ్‌ చేయబడే పండ్లలో వెలగపండు ఒకటి. వెలగపండు ''లిమోనియా అసిడిసిమియా'' అను శాస్త్రీయనామాన్ని,  ఎలిఫెంట్‌ ఆపిల్‌, వుడ్‌ ఆపిల్‌ అనే వాడుక నామాలను కలిగి భారతదేశం, థాయిలాండ్‌, మలేసియా, కంబోడియా, మరియు సియోన్లో పండుతుంది.  భారతదేశంలో అన్నిప్రాంతాల్లో పండించకపోయినా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, మధ్య ప్రదేశ్‌, తమిళనాడు  వంటి రాష్ట్రాల్లో పండిస్తున్నారు. రుచికి చింతపండులా పుల్లగా ఉండే వెలగపండు అక్టోబర్‌ నుండి మార్చిలో పండుతుంది. దాదాపు ఈ పండులోని ప్రతిభాగం వివిధ రోగాలకు మందుగా వినియోగిస్తారు. వెలగపండు విశిష్టమైన ఔషధ గుణాలను కలిగి ఉండడం వల్ల హద్రోగాలు, కాలేయ సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తారు. నోటిసంబంధ వ్యాధులు నయం చేయడానికి వాడతారు. 100 గ్రా. వెలగపండులోగల పోషక విలువలు కింది విధంగా ఉంటాయి.

పోషకాల మోతాదు : 

తేమ    64.2 (%)
మాంసకృత్తులు   7.1 (గ్రా)
క్రొవ్వు    3.7 (గ్రా)
ఖనిజలవణాలు   1.9 (గ్రా)
పీచుపదార్ధం   5.0 (గ్రా)
కార్బోహైడ్రేట్స్‌    18.1(గ్రా)
కెరోటిన్‌   61(మై.గ్రా)
విటమిన్‌ సి   3 (మి. గ్రా)
థయామిన్‌   0.4 (మి. గ్రా)
రైబోఫ్లెవిన్‌   0.17 (మి. గ్రా)
నియాసిన్‌   0.8 (మి. గ్రా)
కాల్షియమ్‌   130 (మి. గ్రా)
ఫాస్ఫరస్‌   110 (మి. గ్రా)
ఐరన్‌   0.48 (మి. గ్రా)
మెగ్నీషియం 0.41(మి. గ్రా)
క్రోమియం    0.21 (మి. గ్రా)
మాంగనీస్‌   0.18 (మి. గ్రా)
జింక్‌   0.10 (మి. గ్రా)

 

వెలగపండు గుజ్జుతో వివిధ విలువాధరిత ఉత్పత్తులైన క్యాండీ, షరబత్‌, స్క్వాష్‌, జూస్‌, చట్నీ, జాం మరియు జెల్లి వంటివి తయారు చేయవచ్చు.

వెలగపండు జామ్‌ తయారి విధానం : 

  • మంచి పండ్లను ఎంపిక చేసుకోవాలి
  • గుజ్జు తీయాలి
  • 1:1 నిష్పత్తిలో గుజ్జు మరియు చక్కెరను కలపాలి
  • ఈ మిశ్రమాన్ని సన్నని మంట మీద అప్పుడప్పుడూ తిప్పుతూ 15 నిముషాల వరకు ఉడికించాలి
  • సిట్రిక్‌ ఆసిడ్‌ (1 శాతం) మరియు ఉప్పు (చిటికెడు) వేయాలి
  • ఎండ్‌ పాయింట్‌ (650) చూచుట  
  • చల్లని ప్రదేశం/ఫ్రిజ్డ్‌లో నిల్వ ఉంచుట

వెలగపండు టాఫీ తయారి :

తాజా పండ్లను ఎంపిక చేసుకొని శుభ్రపరచుకోవాలి 500 గ్రా. గుజ్జును తీసి పెట్టుకోవాలి. ఈ గుజ్జును దగ్గరకయ్యేవరకు సుమారు 10 నిమిషాలు ఉడికించాలి ఇలా ఉడికించిన తరవాత 500 గ్రా. చక్కెర కలిపి అపవిడప్పుడు తిప్పుతూ ఉడికించాలి. 100 గ్రా మిల్క్‌ పౌడర్‌ కలపాలి. మిల్క్‌ పౌడర్‌ ఉండలుగా అవ్వకుండా ఉండాలంటే కొంచెం నీటిలో కలిపి ఆ తరువాత చక్కెర మరియు గుజ్జు మిశ్రమానికి కలపాలి. 50 గ్రా. డాల్డా వేసి మరలా ఉడికించాలి దీనికి 5 గ్రా. సిట్రిక్‌ ఆసిడ్‌, చిటికెడు ఉప్పు వేయాలి. చివరగా రిఫ్రాక్టొమీటెర్‌   ఉపయోగించి ఎండ్‌ పాయింట్‌ (71.5 బి0) నిర్ధారించుకోవాలి. ఇలా బాగా దగ్గరకైన మిశ్రమాన్ని వెన్న లేదా డాల్డా పూసిన ట్రేలో సమాంతరంగా పరచి గది ఉష్ణోగ్రత వద్ద చల్లబరచాలి. ఇప్పుడు కావలసిన ఆకారంలో చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకొని బట్టర్‌ పేపర్లో చుట్టి గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచుకోవాలి. వెలగపండు బార్‌ చిన్నపిల్లలకు, బరువు తక్కువగా ఉన్నవారికి ఇవ్వవచ్చు.

వెలగపండు పానీయం :

బాగా పండిన వెలగపండ్లను ఉపయోగించి గుజ్జు తీసి పొడిగా చేసి తీపి పానీయాలను చేయవచ్చు. వెలగపండు తోలును తీసివేసి, గుజ్జునుండి గింజలు మరియు ముదురుపీచు తీసేసి కేవలం గుజ్జును మాత్రమే స్పూన్‌ సహాయంతో తీయాలి. ఇలా సేకరించిన గుజ్జుకు అంతే మోతాదులో గోరువెచ్చని నీటిని కలిపి జల్లెడపట్టాలి. తరువాత గుజ్జును స్ప్రే డ్రైయర్‌ లేదా ప్రిజ్‌ డ్రైయర్లో ఎండబెట్టి పొడిని పొందవచ్చు. ఇలా తయారు చేసుకున్న వెలగపండు గుజ్జు పిండిని గాలి చొరవడని డబ్బాలో పొడి ప్రదేశంలో భద్రపరచి కావలసినప్పుడు ఉపయోగించుకోవచ్చు. 50 గ్రా. గుజ్జు పిండికి 500 మీ.లీ నీటిని, 50 గ్రా. చక్కెరను కలిపి రిఫ్రిజిరేటర్లో చల్లబరచి తాగవచ్చు. ఇదే పానీయం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పానీయానికి వివిధ మోతాదుల్లో పోటాషియం మెటాబై సల్ఫేట్‌ (50 పిపిమ్‌), సిట్రిక్‌ ఆమ్లం (50 పిపిమ్‌), సోడియం బెంజోయెట్‌ (50 పిపిమ్‌), బెంజోయిక్‌ ఆమ్లం (50 పిపిమ్‌) కలిపి సుమారు 2-3 నెలలు నిల్వ ఉంచుకోవచ్చు

వెలగపండు స్క్వాష్‌ తయారీ :

చక్కగా పండిన పండ్లను ఎంపిక చేసుకొని  లోపలి భాగాన్ని ముక్కలుగా  తీయాలి. వీటికి  (750 మీ.లీ/ కె.జి ) నీటిని కలిపి  బాగా మెదిపి ముస్లిన్‌ గుడ్డ ద్వారా మెత్తటి గుజ్జుని తీసుకోవాలి. ఈ గుజ్జును కొలిచి సరిపడా నీళ్లు పోసి  మరిగించాలి.  బాగా మరిగిన తరువాత  గుడ్డ సాయంతో వడగట్టాలి. ఈ జ్యూస్‌ ను కొలిచి అదే మోతాదులో చక్కెరను తీసుకోవాలి. చక్కెరపాకం చేసుకొని దానికి పండు జ్యూస్‌ని కలిపి సన్నమంట మీద పెట్టాలి. ఈ  మిశ్రమానికి 0.6 గ్రా కే.ఎం.స్‌. 1.0 గ్రా సోడియం బెంజోయెట్‌ కలిపి గట్టి మూత పెట్టి నిల్వ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు 1:3 నిష్పత్తిలో స్క్వాష్‌ మరియు నీటిని కలిపి చల్లగా సేవించవచ్చు. 

వెలగకాయ పచ్చడి:

వెలగకాయతో రుచికరమైన పచ్చడి కూడా తయారుచేసుకోవచ్చు. దీనికోసం కాయ పైభాగాన్ని తీసివేసి లోపలి భాగాన్ని సేకరించి చిన్న చిన్న ముక్కలుగా తరిగి దీనికి ఉప్పు, జీలకర్ర, ఎండుమిర్చి కలిపి దంచాలి. కొంచెం తీయ్యదనాన్ని  కోరుకునేవాళ్ళు బెల్లం కూడా వేసి పచ్చడిని చేసుకోవచ్చు. ఇలా కచ్చాపచ్చాగా  దంచిన   పచ్చడిని  పోపు చేసి మనం  రోజువారీ తినే చట్నీ లకు  ప్రత్యామ్న్యాయంగా వాడుకోవచ్చు.  

వెలగపండు గుజ్జును మిల్క్‌ షేక్స్లలో, షరబత్‌ తయారీకి అదేవిధంగా వడియాల పిండిలో గుజ్జును  కలుపుకోవచ్చు. వెలగకాయ  ముక్కలను ఎండబెట్టి ఊరగాయ కూడా చేసుకోవచ్చు. వివిధ రకాలైన వంటల్లో వెలగకాయని  లేదా పండును  ఉపయోగించడం  వల్ల ఈ పండు యొక్క వినియోగం పెరిగి పండించే రైతు అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పండ్లు పండ్లు ఎక్కువగా లభించే ప్రాంతాలలోని మహిళలు లేదా స్వయం సహాయక బృందాలు కుటీర పరిశ్రమగా వెలగపండు ఉత్పత్తులను తయారు చేసి విక్రయించవచ్చు.

రచయిత సమాచారం

కె. శాంతి శిరీష, రీసెర్చ్‌ స్కాలర్‌, డా. వై. విజయలక్ష్మి, సీనియర్‌ సైంటిస్ట్‌,అక్రిప్‌హోమ్‌ సైన్స్‌, గృహ విజ్ఞాన కళాశాల, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌, ఫోన్‌ : 8187012311