Print this page..

పసుపు సాగులో పురుగులు, తెగుళ్ల నివారణకు మేలైన యాజమాన్య పద్ధతులు

ఆంధ్రప్రదేశ్‌లో పసుపును దాదాపు 20 వేల హెక్టర్లలో సాగుచేస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు, కడప, కర్నూలు, కష్ణా, విశాఖపట్నం మరియు తూర్పు, పచ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఈ పంటను మురుగు నీటి పారుదల కలిగి, సేంద్రియ కర్భనం ఎక్కువగా గల బరువైన నేలల్లో సాగుచేయవచ్చు. చౌడు మరియు క్షార నేలలు, లోతట్టు ప్రాంతాలు పనికిరావు. 

ముఖ్యంగా దుగ్గిరాల ఎరుపు, దుగ్గురాల తెలుపు. మైదుకూరు, ఆర్మూరు, టేకూరుపేట వంటి దీర్ఘకాలిక రకాలను ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఇవే కాకుండా ఇతర అధిక దిగుబడినిచ్చే రకాలైన ప్రభ, ప్రతిభ, ప్రగతి, అలెప్పి సుప్రీం, కష్ణ వంటి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. పసుపు సాగులో దుంప కుళ్ళు ప్రధానమైన సమస్య కనుక, ఆ తెగులును తట్టుకునే రకాలను సాగుచేసుకుంటూ మేలైన యాజమాన్య చర్యలను చేపట్టిన అధిక దిగుబడులను సాధించవచ్చు.

విత్తనం మరియు విత్తన శుద్ధి : 

పొడవుగా ధడంగా ఉన్న పిల్ల కొమ్ములు (20-30 గ్రా. బరువు ఉండి 6-8 సెం.మీ. పొడవు) మరియు తల్లి కొమ్ములు నాటుకొనుటకు అనుకూలం. ఎకరానికి 1000 కిలోల విత్తనం అవసరం. విత్తనం నాణ్యత కలిగి మొలక శాతం అధికంగా ఉండాలంటే విత్తన శుద్ధిని రెండు సార్లు చేయాలి. విత్తన దుంపలు నిలువచేసేటప్పుడు మరియు విత్తడానికి ముందు చేసుకోవాలి. దీనివల్ల దుంపల ద్వారా వ్యాప్తిచెందే దుంపకుళ్ళు, తాటాకు తెగులు, ఆకుమచ్చ తెగులు వంటి శిలీంద్ర తెగుళ్లను అదుపుచేయవచ్చు. భూమిలో ఉన్న తెగులు కారక శిలీంద్రాలు కూడా విత్తిన వెంటనే దుంపలను ఆశించవు. లీటరు నీటికి 3 గ్రా. మాంకోజెబ్‌ లేదా మెటలాక్సిల్‌ కలిపి మందు ద్రావణంలో దుంపలను 40 నిమిషాలు ఉంచి బయటకు తీసి నీడలో ఆరబెట్టి తరువాత నాటుకోవాలి. విత్తన దుంపలను పొలుసు పురుగులు ఆశించిన శిలీంద్రనాశినితో పాటు లీటరు నీటికి 5 మి.లీ. మలాధియాన్‌ లేదా 2 మి.లీ. మోనోక్రోటోఫాస్‌ కలుపుకోవాలి. విత్తన శుద్ధి తరువాత ఆరబెట్టిన దుంపలకు ట్రైకోడెర్మావిరిడి 10 గ్రా. లీటరు నీటికి కలిపి ఆ ద్రావణంలో మరలా శుద్ధి చేసి దుంపలను అరబెట్టి విత్తుకోవాలి. 

పసుపులో ప్రధాన సమస్యలైన దుంప కుళ్ళును నివారించుటకు పొలంలో నీరు నిలిచి ఉండకుండా ఉండుటకు ఎత్తుమడుల పద్ధతిలో (మీటరు వెడల్పు గల ఎత్తు మడులకు మధ్య 30 సెం.మీ.  వెడల్పు కాలువలు ఉండేలా తయారు చేసిన మడుల్లో నాటుట) గాని లేదా బోదె సాళ్ళ పద్ధతిలో (45-60 సెం.మీ. ఎడం ఉండే బోదెలను చేసుకుని బోదెల మీద 20 సెం.మీ. ఎడం ఉంచి దుంపలు నాటుట) గాని విత్తన దుంపలను నాటుకోవాలి. సాధారణంగా రైతులు వేసే సమతల మడుల పద్ధతిలో దుంప కుళ్ళు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది కనుక మురుగు నీటి పారుదలకు ఏర్పాట్లు చేయాలి.

ఎరువుల యాజమాన్యం : 

తప్పనిసరిగా సేంద్రియ ఎరువులను వాడాలి. దీనివల్ల భూమి స్వభావము వద్ధి చెంది సేంద్రియ కర్బన శాతం పెరగటం వల్ల దుంపలు ఆరోగ్యవంతంగా పెరిగి అధిక దిగుబడి పొందటానికి దోహదపడతాయి. సుక్ష్మధాతులోపాలు రాకుండా జింక్‌ సల్ఫేట్‌ను చివరి దుక్కిలో వేయాలి. ఆముదం పిండి లేదా వేపపిండిని తప్పనిసరిగా వేయడం వల్ల దుంప పుచ్చు కలుగచేయు ఈగ ఆశించకుండా పంటను కాపాడవచ్చు. పోటాష్‌ ఎరువులను తప్పని సరిగా వేయాలి, దీని ద్వారా మొక్కలు చీడపీడలను తట్టుకునే సామర్ధ్యాని పెంపొందించుకుంటాయి.

పురుగులు :

దుంప పుచ్చు : 

ఇది దుంప తోలుచు ఈగ వల్ల కలుగుతుంది. ఈ ఈగ పిల్ల పురుగులు తెల్లటి బియ్యపు గింజను పోలి ఉండి భూమిలో ఉన్న దుంపల లోనికి తోలుచుకొనిపోయి దుంపలోని పదార్ధాలను తినివేస్తాయి. దీనివల్ల సుడిఆకు, దాని దగ్గరలో ఉండే లేత ఆకులు వాడి గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. మొవ్వ లాగిన తేలికగా ఊడి వస్తుంది. దుంపలో కణజాలం దెబ్బతింటుంది. మొక్క ఎదుగుదల నిలిచిపోయి దుంపల నాణ్యత, దిగుబడి తగ్గుతాయి. పుచ్చు ఆశించిన దుంపలు వండితే తొర్రల మాదిరి కనబడతాయి.

నివారణకు దుంపలను ప్రొఫినోఫాస్‌ 2 మి.లీ. నీటికి కలిపిన ద్రావణంలో దుంపలను నానబెట్టి విత్తన శుద్ధి చేయాలి. దుంప పుచ్చు లక్షణాలు కనబడగానే ఎకరాకు 100 కిలోల వేప పిండిని మొక్కల మధ్యవేయాలి. ఉదతి ఎక్కువగా ఉంటె కార్బోఫ్యురాన్‌ 3జి. గుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లాలి. మురుగు నీటి సౌకర్యం కల్పించాలి.

అల్లిక రెక్కల నల్లి : 

తల్లి, పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన ఉండి ఆకులలో నుండి రసాన్ని పిలుస్తాయి. దీనిద్వారా ఆకులు పసుపు రంగులోనికి మారి పెరుగుదల కోల్పోతాయి. నివారణకు మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఎర్ర నల్లి :

పిల్ల మరియు తల్లి నల్లులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి రసాన్ని  పీలుస్తాయి. ఆశించిన ఆకులు పాలిపోయి ఎండిపోతాయి. నివారణకు నీటిలోకరిగే గంధకం 3 గ్రా. మరియు జిగురు మందు 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తెగుళ్ళు :

దుంప, వేరు కుళ్ళు : 

పొలంలో ఈ తెగులు ఆశించిన మొక్కల్లో ముదురు ఆకులు ముందుగా వాడిపోయి గోధుమ రంగులోనికి మారి చివరగా ఎండిపోతాయి. తరువాత మొక్క లేత ఆకులకు ఈ తెగులు వ్యాపిస్తుంది. తల్లి మరియు పిల్ల దుంపలు కుళ్ళి మెత్తబడతాయి. మొక్కలను లాగిన భూమట్టానికి ఊడి వస్తాయి. కుళ్ళిన దుంపలు చెడు వాసన వస్తాయి, నాణ్యత బాగా తగ్గుతుంది. 

తెగులు గమనించిన వెంటనే కాపర్‌ ఆక్సి క్లోరైడ్‌ ను 3 గ్రా. లేదా రిడోమిల్‌ 2 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్ళు బాగా తడిచేటట్లు పోయాలి. పైరు విత్తుకునే ముందు తప్పనిసరిగా 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడి జీవ శిలీంద్రాన్ని విత్తనశుద్ధిని చేయాలి. ట్రైకోడెర్మా విరిడి 2 కిలోలు 80 కిలోల పశువుల ఎరువు + 20 కిలోల వేపపిండిలో వృద్ధిపొందించి విత్తనం నాటిన నెలరోజులకు భూమిలో తేమ ఉన్నప్పుడు వేయాలి. సమస్యాత్మక ప్రాంతాల్లో తెగులును తట్టుకునే రకాలైన సుదర్శనం లేగా సుగుణ రకాలను సాగుచేయాలి.

తాటాకు తెగులు : 

ఈ తెగులు సోకిన ఆకులపై అండాకారంలో గోధుమ మచ్చలు ఉండి, మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం ఉంటుంది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు, గాలిలో అధిక తేమ, ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల వ్యాపిస్తుంది. నివారణకు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. తెగులు సోకి ఎండిన ఆకులను కత్తిరించి నాశనం చేయాలి. కార్భండిజిమ్‌ 1 గ్రా. లేదా మాంకోజెబ్‌ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 3-4 సార్లు పిచికారి చేయాలి. 

అకుమచ్చ తెగులు :  

ఆకులపై మొదట చిన్న చిన్న పసుపు రంగు చుక్కలు ఏర్పడతాయి. తరువాత చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలుగా మారతాయి. తెగులు ఎక్కువైతే ఆకులు మాడిపోతాయి. నివారణకు వ్యాధి సోకిన ఆకులను కత్తిరించి నాశనం చేయాలి. కార్భండిజిమ్‌ 1 గ్రా. లేదా మాంకోజెబ్‌ 2.5 గ్రా. లీటరు లేదా ప్రోఫికోనజోల్‌ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. 

రచయిత సమాచారం

డా|| పి. సుధాజాకబ్‌, సీనియర్‌ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటశాల, కృష్ణ జిల్లా