Print this page..

చిలకడ దుంప సాగు - మేలైన యాజమాన్య పద్ధతులు

ఆంధ్ర రాష్ట్రంలో పండించే దుంప పంటల్లో చిలకడ దుంప చాలా ముఖ్యమైనది. తక్కువ కాల పరిమితిలో ఎక్కువ ఉత్పత్తిని ఇచ్చే మంచి పోషకాలు గల ఈ దుంపను కూరగాను, ఆకులను పశువుల దాణాగానూ మరియు ఆల్కహాల్‌ తయారీలోనూ వినియోగిస్తున్నారు. ఆంధ్రరాష్ట్రంలో 3.215 ఎకరాల్లో 25-720 టన్నుల ఉత్పత్తితో పండించబడుతోంది. విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు కొన్ని తెలంగాణా ప్రాంతాల్లో ఈ దుంప సాగు చేయబడుతుంది. 

ఉపయోగాలు : 

 • వీటి ఆహార విలువలు బంగాళాదుంప కంటే మెరుగైనవి. 
 • కూరగాయగా వాడతారు. 
 • ఆకులను ఆకు కూరగా తింటారు.
 • ఆకుల్లో కెరటిన్‌, మాంసకృత్తులు, విటమిన్‌-సి, భాస్వరం ఎక్కువగా ఉంటాయి. 
 • ఈ దుంపలను స్టార్చ్‌, పెక్టిన్‌, ఆల్కహాల్‌ తయారీలో ముడి సరుకుగా వాడతారు. 

నేలలు : 

మురుగు నీటి పారుదల సౌకర్యం గల ఒండ్రు, ఇసుక, గరప నేలలు సాగుకు అనుకూలం. బంక మట్టి నేలల్లో దుంపలు సరిగా ఊరవు. 

వాతావరణం : 

ఇది ఉష్ణ మండల పంట. ఎక్కువగా సూర్మరశ్మి తాకుతూ చల్లని రాత్రులు పగటి సమయం తక్కువ. రాత్రి సమయం ఎక్కువ ఉండే కాలంలో దుంపలు బాగా వృద్ధి చెందుతాయి. నీడ ఎక్కువగా ఉండే దుంపలు సరిగా ఊరవు. ఈ పంట ఎక్కువ వర్షాలు తట్టుకోలేదు. 

రకాలు : 

సామ్రాట్‌, కిరణ్‌, యస్‌ 30/21 శ్రీనందిని, శ్రీవర్ధిని, వర్ష, శ్రీరత్న, శ్రీబద్ర రకాలు అందుబాటులో ఉన్నాయి. 

విత్తనం : 

ఈ పంట తీగల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఒక మోస్తరు లేతగా ఉన్న తీగలను నాటడానికి ఉపయోగించాలి. సుమారు 30 సెం.మీ పొడవు 3-4 కణుపులు 5-6 ఆకులు ఉన్న తీగలను నాటడానికి ఎంచుకోవాలి. నాటే ముందు తీగను ఫెనిట్రోథయాన్‌ 2 మి.లీ+1 గ్రా. కార్బండిజమ్‌ లీటరు నీటికి కలిపిన ద్రావణంలో ముంచి నాటడం వల్ల ముక్క పురుగు తీవ్రతను తగ్గించవచ్చు. 

నాటేకాలం : 

 • ఖరీఫ్‌    -    జూన్‌, జులై
 • రబీ    -    అక్టోబర్‌, నవంబర్‌
 • వేసవి    -    ఫిబ్రవరి, మార్చి

నారుమడులు : 

సాధారణంగా తీగలను నాటి దుంపను ఉత్పత్తి చేస్తారు. కొత్త ప్రాంతాల్లో తీగల కొరకు నారుమళ్ళలో దుంపలను నాటి, తీగలను వృద్ధి చేయాలి. 4-5 సార్లు తీగలతో వ్యాప్తి చేశాక, తరువాత మళ్ళీ దుంపలను నాటి నారు పెంచుకోవాలి. 

నారుమడి తయారి : 

ప్రాధమిక నారుమడి : నాటేందుకు మూడు నెలల ముందు ప్రాధమిక నారుమడి పెంచాలి. ఒక హెక్టారుకు నాటేందుకు 100 చ.మీ ప్రాధమిక నారుమడి అవసరం. పొలంలో 60 సెం.మీ దూరంలో బోదెలు చేయాలి. ఒక్కో బోదెపై 25 సెం.మీ దూరంలో 125-150 గ్రా. బరువైన విత్తన దుంపలను నాటాలి. నాటిన 15 రోజులకు 1.5 కి. యూరియా 100 చ.మీ నారుమడిని వేయాలి. నాటిన 40-45 రోజలకు తీగలను ద్వితీయ నారుమడితో నాటేందుకు 20-30 సెం.మీ పొడవు ఉండేటట్లు కత్తిరించాలి. 

ద్వితీయ నారుమడి : పొలం తయారీలో బాగా చివికిన పశువుల ఎరువును 500 కే.జీ దుక్కిలో వేయాలి. ప్రాధమిక నారుమడిలో పెరిగిన తీగల్ని (20-30 సెం.మీ పొడవు) 60 సెం.మీ దూరంలో చేసిన బోదెలపై 20 సెం.మీ దూరంలో నాటాలి. నాటిన 15-30 రోజులకు ఒకసారి 5 కి. యూరియాను వేయాలి. 45 రోజులకు తీగలు తయారవుతాయి. 

తీగల ఎంపిక : 

నేరుగా ప్రధాన పొలంలో నుండి తీసుకున్న తీగల కంటే రెండు నారుమడుల్లో పెంచిన తీగలు ఆరోగ్యమైనవిగా ఉండటమేకాక ధృడంగా పెరిగి ఎక్కువ దిగుబడినిస్తాయి. 20-30 సెం.మీ పొడవుతో 3-4 కణుపులు ఉన్న తీగలను నాటితే బాగా బతికి ఎక్కువగా దిగుబడినిస్తాయి. తీగలను నాటేటప్పుడు మధ్య భాగాన్ని భూమిలో పూడ్చి, రెండు చివరలు భూమిపై ఉండేటట్లు తీగల్ని నాటాలి. మరో పద్ధతిలో తీగల్ని నిలువుగా కాని, ఏటవాలుగా కాని 2-5, 7-5 సెం.మీ లోతులో నాటాలి. 

ఎరువుల యాజమాన్యం : 

ఎకరానికి 6-8 టన్నుల పశువుల ఎరువుతో పాటుగా 25 కి. భాస్వరం, 16 కి. పొటాష్‌ను ఇచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి. నత్రజని 2 దఫాలుగా అంటే నాటిన 30 మరియు 60 రోజులకు వేయాలి. 16 కి. పొటాష్‌ను రెండవ దఫాగా నాటిన 60 రోజులకు వేయాలి. 

అంతరకృషి  : 

పైరు తొందరగా పెరిగి కలుపు మొక్కల పెరుగుదలను అదుపు చేస్తుంది. నాటిన 15-30 రోజల మధ్యలో ఒకసారి కలుపు తీసి మట్టిని ఎగదోయాలి. దీని వల్ల దుంప నాణ్యత పెరుగుతుంది. 

నీటి యాజమాన్యం  : 

తీగలు నాటేటప్పుడు నీటిలో తేమ ఉండాలి. నాటిన వెంటనే నీరు పెట్టాలి. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు వారానికి ఒకసారి నీరు పెట్టాలి. నాటిన 30 రోజుల వరకు పంట నీటి ఎద్దడికి గురికారాదు. దుంప పెరుగుదల దశలో వారం రోజల వ్యవధిలో నీరు పెట్టాలి. 

సస్యరక్షణ : 

ఈ పంటలకు చీడ పీడల సమస్య తక్కువ అయినప్పటికీ పంటను ఆశించే పురుగుల్లో ముఖ్యమైనది ముక్క పురుగు. దీని గ్రబ్స్‌, తల్లి పురుగులు, తీగలను, దుంపలను ఆశిస్తాయి. ముక్క పురుగు ఆశించిన లేత ఆకులు మాడి నల్లగా మారతాయి. ఈ పురుగు సోకిన దుంపలు ఒక విధమైన టర్పంటైన్‌ను పోలిన వాసనను కలిగి తినడానికి పనికి రావు. 

నివారణ : 

 • నాటేముందు తీగలను లీటరు నీటికి 2.5 మి.లీ క్లోరిపైరిఫాస్‌ + 3 గ్రా. కార్బండిజమ్‌ ద్రావణంలో ముంచి నాటాలి. 
 • నాటిన 60 రోజుల తరువాత బోదెలకు మట్టిని ఎగద్రోయాలి. 
 • 100 చ.మీ లకు ఒకటి చొప్పున లింగాకర్షక బుట్టలను పెట్టాలి. 
 • కోత కోసిన తరువాత మిగిలిన కొమ్మలు, తీగలను కాల్చి నాశనం చేయాలి. 

పంట కోత : 

నాటిన నాలుగు నెలల్లో పంట కోతకు సిద్ధంగా ఉంటుంది. ఆకులు పసుపు రంగుకు మారినప్పుడు దుంపలు తవ్వుకోవాలి. తీగలను కోసివేసి గడ్డపారతో తవ్వి దుంపలను తీయాలి. తేలిక పాటి నేలల్లో నాగలితో దున్ని దుంపలను తీసుకోవచ్చు. కోసిన దుంపలను నీడలో 3-5 రోజుల వరకు నిల్వ చేయవచ్చు. దుంపలను సన్నని ఇసుక పొరల్లో ఉంచి 75 రోజుల వరకు నిల్వ చేయవచ్చు.
 

రచయిత సమాచారం

డా|| సి.హెచ్‌. శ్రీలతావాణి, డా||. పి కిషోర్‌ వర్మ, కె. గోపాలకృష్ణమూర్తి