Print this page..

ఆగాకర సాగులో మెలకువలు

ఆగాకర (మెమార్డికా డయోకో) కుకుర్బుటేసి కుటుంబానికి చెందిన బహువార్షిక తీగజాతి కూరగాయ పంట. ఇది విత్తనం, దుంప పిలకలు, కత్తిరింపుల ద్వారా వృద్ది చెందుతుంది. 6-10 సం|| వరకు కాపును ఇస్తుంది. దీన్ని బోడకాకర, స్పైన్‌గార్డు అనికూడా పిలుస్తారు. ఇది అడవి, ఎతైన కొండ ప్రాంతాల్లో వర్షాధారంగా పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజిమాబాద్‌, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, విజయనగరం, గోదావరి జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉంది. దీని లేతకాయలను కూరగాను, పచ్చళ్ళలో వాడతారు.

సాగు : 

ఆగాకర ఆడ, మగ మొక్కలు వేరుగా ఉంటాయి. మొక్క వేరు భాగం భూమిలో చిలకడ దుంపలాగా ఉండి 6-10 సం|| వరకు కాపు ఇస్తుంది. వీటి పిలకలను వేరు చేసి మొక్కలుగా నాటుకోవచ్చు. మొలకెత్తిన విత్తనాల్లో 30 శాతం మాత్రమే ఆడ మొక్కలు ఉంటాయి. ప్రతి 10 ఆడమొక్కలకు 1 మొగ మొక్క ఉంటే కాపు బాగా వస్తుంది. వీటి ఆకులు 1,3,5 కొమ్మలు కలిగి ఉంటాయి. పూలు పసుపు రంగులో ఉంటాయి. లేత ఆకుపచ్చ రంగు కాయలను కూరగా వాడతారు. పండిపోయిన కాయలు నారింజ రంగులో ఉంటాయి. గింజలు మిరియాల లాగా ఉంటాయి. 

ఆగాకరలో ఉంటే పోషక పదార్థాలు (ప్రతి 100 గ్రా.)

పోషక పదార్థాలు  మామూలు కాకర  ఆగాకర
నీరు (గ్రా.)   84.1   92.1
మాంసకృత్తులు గ్రా.)    3.2    1.6
కొవ్వు (గ్రా.)    1     0.2
పిండిపదార్ధం (గ్రా.)    7.7    4.2
నార (గ్రా.)    3    0.8
కాల్షియం (మి.గ్రా.)    33    20
ఫాస్పరస్‌ (మి.గ్రా)   42 70
ఐరన్‌ (మి.గ్రా)  4.6     1.8
థయామిన్‌ (మి.గ్రా) 0.05    0.07

వాతావరణం : 

ఇది ఎక్కువగా కాలువ, చెరువు గట్లపై బీడు భూముల్లో, కొండ ప్రాంతాల్లో సహజసిద్దంగా తీగలాగా అల్లుకొని పెరిగే కూరగాయ ఈ మధ్యకాలంలో దీని పోషక విలువలు వైద్య సంబంధమైన  ఉపయోగాలను గుర్తించడం వల్ల దీన్ని సాగులోకి తీసుకురావడానికి మరియు ప్రాచుర్యం పెంపొందించడానికి కృషిచేస్తున్నారు. 

రకాలు : 

1. మైవికార్టికా కొచ్చిన్‌ చైనన్‌సిస్‌ :

ఇది ఎక్కువగా ఒరిస్సాలో సాగులో ఉంది. దీని కాయలు పెద్దగా, కోడిగ్రుడ్డు ఆకారంలో ఉండి 40 గ్రా. బరువు ఉంటాయి. పూలు తెలుపు రంగులో ఉండి ఆకులు పెద్దగా ఉంటాయి మరియు గింజలు తెల్లగా ఉంటాయి.

2. మెమార్టికా డయోకా :

ఇది మనరాష్ట్రంలో ఎక్కువగా కనిపించే జాతి. దీనికాయలు 5-10 సెం.మీ. పొడవు ఉంటాయి. కాయలు చిన్నగా 10-20గ్రా. బరువు ఉంటాయి. పూలు పసుపు రంగులో ఉంటాయి. ఆకులు ఒకే తమ్మతో ఉన్న తీగలు ఎక్కువ దిగుబడినిస్తాయి. కాబట్టి ఈ రకం తీగలను తీగ మొక్కల ద్వారా లేదా వేరు దుంపల ద్వారా సాగు చేసుకుంటే అధిక దిగుబడినిస్తాయి. 

నారుమడి తయారు విధానం : 

దుంపల ద్వారా :

ఆగాకర మొక్క తీగలు జూన్‌ నుండి నవంబరు వరకు ఉంటాయి. ఆ తరువాత తీగలు ఎండిపోయి భూమిలో దుంపలు నిద్రావస్థలో   ఉంటాయి. కనుక జూన్‌ నుండి నవంబరు మధ్య ఎక్కువగా పూసే ఆడమొక్కలను ఎంచుకోవాలి. వీటి దుంపలను సేకరించి విత్తన దుంపలుగా మరుసటి సంవత్సరం నాటుకోవచ్చు. 2-3 సంవత్సరాల్లో వీటికి వచ్చే పిల్ల దుంపలను కూడా విత్తనంగా వాడవచ్చు. 

శాఖల ద్వారా : 

ఎంచుకున్న మంచి మొక్కల తీగలను 5 కణుపులు ఉండేలా కత్తిరించి సెరడిక్స్‌-బి అనే హార్మోను పొడిలో ముంచి, ఎతైన నారుమళ్ళలో నాటి లోతు తడులు ఉండే నేల లోతుల్లో వేర్లు వస్తాయి. వీటి వేర్లు దుంపలుగా మారి మరుసటి ఏడాది విత్తనం మొక్కలుగా నాటుకోవడానికి పనికివస్తాయి. 

విత్తనం ద్వారా : 

ఇది సులువైన పద్ధతి. విత్తనం మొలకశాతం 30గా ఉంటుంది. అందులో 30 శాతం ఆడమొక్కలు ఉంటాయి. ఎకరాకు 2I2 మీ. దూరంలో నాటడానికి 1000 ఆడమొక్కలు అవసరమవుతాయి. దీనికి 9 వేల గింజలే అవసరం. ఈ లెక్క ప్రకారం ఎకరాకు 1-3 కిలోల విత్తనం అవసరమవుతుంది. ప్రతి 1000 మొక్కలకు 100 మగ మొక్కలు ఉండాలి. 

నారుమడిని 4I1 మీ. తయారు చేయాలి. 15 సెం.మీ. వరుసల మధ్య దూరం ఉంచి వరుసల్లో 10 సెం.మీ. దూరంలో విత్తనాలు విత్తాలి. వీటిపై గడ్డి వేసి పెట్టాలి. 40-45 రోజుల్లో మొలకలు వస్తాయి. మార్చి నెలాఖరులో నారుమడి వేస్తే జూన్‌లో నాటడానికి తయారవుతాయి. 

నాటడం : 

2I2 మీ. దూరంలో నాటుకోవాలి. నేరుగా గుంతల్లో విత్తనాలు నాటుకోవాలంటే ప్రతి గుంతకు 10-15 విత్తనాలు వేస్తే 3-5 మొలకలు 40-45 రోజుల్లో వస్తాయి. అప్పుడు ఒక ఆడతీగను ఉంచి మిగతావి వేరే చోట నాటుకోవాలి. 

ఎరువులు : 

ఎకరాకు 8-10 టన్నుల ఎరువు, 40 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్‌ను వాడాలి. 50 కిలోల నత్రజని 3 సమభాగాలుగా నాటిన 15, 30, 45 రోజుల్లో అన్ని మొక్కలకు సమంగా ఇవ్వాలి. 

పందిరి : 

భూమికి 4-6 అడుగుల ఎత్తులో కొబ్బరి తాడు లేదా జి.ఐ వైరుతో పందిరి ఏర్పరచుకోవాలి. తీగలను అంతటా పాకించాలి, లేదా తీగకు అల్లుకోవాలి. 

సస్యరక్షణ : 

విత్తనశుద్ధిని బావిస్టిన్‌ / మాంకోజెబ్‌తో చేయాలి. (3 గ్రా. / కిలో విత్తనం)

పేనుబంక : 2 మి.లీ. ఫిప్రోనిల్‌ / లీటరు నీటికి

పాముపొడ : డైమిథోయేట్‌ 2 మి.లీ. / లీటరు నీటికి 

మొగ్గ కాయతొలిచే పురుగు : 0.5 థయోడికార్బ్‌ / లీటరు నీటికి 

పండు ఈగ : 3 గ్రా. కార్బరిల్‌ + బెల్లం + నారు కలిపిన విషపు ఎరను మట్టి మూకుళ్ళలో పెట్టాలి. 

దిగుబడి :

వారానికి 2 సార్లు కోతకు వస్తుంది. ప్రతి కోతకు 40 కిలోల కాయలు సుమారుగా వస్తాయి. ఆగస్టు నుండి నవంబరు దాకా కాయలు వస్తాయి. కాయకోత నవంబరు తరువాత రాదు. అప్పుడు చెట్లకు నీర ఉఇవ్వరాదు. తీగ ఎండు దుంపలు నిద్రావస్థలోకి పోతాయి. మళ్ళీ మే-జూన్‌ నుండి మొలకలు వస్తాయి.
 

రచయిత సమాచారం

డా|| ఎ. నిర్మల, డా|| యమ్‌. వెంకటేశ్వర రెడ్డి, డా|| నీరజ ప్రభాకర్‌, డా|| ఎ. మనోహర్‌ రావు, కె. అరుణ,  ఉద్యానవిభాగం, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్‌, ఫోన్‌ : 8330940330