Print this page..

నల్లమల అడవి పరిరక్షణపై వెల్లువెత్తుతున్న గళంసామాజిక మాధ్యమాల వేదికగా సంచలనం

ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రత, వ్యవసాయ అనుబంధ రంగాలపై ఇప్పటికే సామాజిక మాధ్యమాలు బాధ్యతాయుతంగా తమ పాత్రను నిర్వహిస్తున్నాయి. అలాగే మానవజాతి ఎదుర్కోబోతున్న పెనునీటిసంక్షోభంపై వెల్లవెత్తుతున్న ఆందోళనను అంతర్జాల శక్తులు తమ విభిన్నమైన పోస్టుల ద్వారా ప్రపంచానికి నివేదిస్తున్నాయి. తాజాగా నల్లమల అడవిలో యూరేనియం తవ్వకాలపై జరుగుతున్న ప్రయత్నాలను నిరశిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఉద్యమస్పూర్తి వెల్లివిరుస్తుంది. అటవీ జంతువుల, అరుదైన జంతువులు మటుమయ్యే దుస్ధితిని, ఆతరువాత ఎదుర్కోవలసిన పర్యావరణ సమస్యలను ప్రపంచానికి అర్ధమయ్యే రీతిలో వ్యాసాలు, సూచనలు, అభిప్రాయాలు వివిధ రూపాల్లో ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింభిచే విధంగా మాధ్యమాలు సమాజానికి ఒక వరంగా పరిణమించాయి. 

ఇటీవల కాలంలో మహిళలను అనేక రకాలుగా వేదించడం, నేర పూరితంగా నెటిజన్ల నుండి డబ్బులు అపహరించడం, హింసను ప్రేరేపించడం, సామాజిక భద్రతకు పెనుముప్పుగా ఈ మాధ్యమాలు వ్యవహరిస్తున్న దశనుండి సామాజిక అభ్యుదయం, స్పృహ వైపుకు ఈ మాధ్యమాలు పరిణామ క్రమంలో పరుగెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పచ్చదనం, పరిశుభ్రం కాలుష్యనివారణ, శుద్దమైన తాగు, సాగు నీరు కొరకు జరుగుతున్న ఆందోళనకు మాధ్యమాల మద్దతు సంపూర్ణంగా లభిస్తుండడం విశేషం. ఈ రంగాల్లో పనిచేసే స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర  వ్యవస్థలు, సామాజిక హితం కోసం జరుగుతున్న కార్యకలాపాలను ప్రముఖంగా వెలుగులోకి తీసుకురావడం ద్వారా సామాజిక మాధ్యమాలు తమ కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తుండడం, ప్రధాన స్రవంతి మీడియా అంతా పాలకుల అంతఃపుర వైభవాలను, పాలకవర్గాల ముఠాతగాదాలు ఈ ముట్టడికైన ఖర్చులు, మతలబులు, కైఫీయతుల మత్తులో మునిగిపోయి ఉండడం ఆ బాధ్యతను ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్స్‌అప్‌, లింక్‌డిన్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో చేపట్టడం ఈ శతాబ్దపు అత్యంత పరిణామక్రమమైన విశేషం. 

ప్రపంచంలోని ప్రతి ఇంట్లోనూ ఒక్కో కుటుంబ సభ్యుని చేతిలో అరచేతిలో ప్రగతిని చూపెట్టే స్మార్ట్‌ మొబైల్స్‌ ఉండడం వీటిలో అధిక శాతం మందికి సామాజిక మాధ్యమాల్లో ఏదో ఒక దానిలో అకౌంటు ఉండడం ఈ రకంగా ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలు ఒకే మాధ్యమ వేదికపై ఒకే ఇంటిలో మనుషుల్లా వ్యవహరించడం పరిపాటిగా మారింది. 

ఈ మాధ్యమాల సమాచార సాంకేతిక విప్లవానికి దృష్టాంతంగా అమెజాన్‌ అడవుల్లో రగిలిన మహా కార్చిచ్చు ప్రపంచ నెటిజన్లనందరినీ ఆందోళనకు గురిచేసి ఏకీకృత భావ వ్యక్తీకరణకు అవకాశమేర్పడడం మంచి పరిణామం. స్థానిక సమస్యలైనా, అంతర్జాతీయ ప్రాచుర్యం ప్రభావం కలిగిన అంశాలైన సరే నిమిషంలో ప్రపంచవ్యాప్తంగా ఒకవెల్లువలా వ్యాపించగలిగిన ప్రస్తుత స్థితిలో కారడవినుండి మహానగరాల వరకు, అగాధాల నుండి హిమాలయ పర్వత శ్రేణి వరకు ఎక్కడికైనా మన ఆవేదన, ఆందోళన వ్యాపిస్తున్న దశలో రోజుల తరబడి అమెజాన్‌ అడవి తగలబడిపోతున్న తీరు, జంతువుల విషాదాంతం యావత్‌ మానవ జాతిని ఆందోళనలో నింపివేసింది. అంతేకాదు ప్రపంచానికి 30 శాతం ప్రజలకు ఆక్సిజన్‌ అందించే ఒక మహావృక్షాల సమూహం కాలి బూడిదవ్వడం మరింత చర్చనీయాంశంగా మారింది. 

అమెజానే కాదు పాలమూరును, కర్నూలు, ప్రకాశం జిల్లాలను ఆనుకొని ఉన్న నల్లమల అడవి ఉనికిపై కూడా వస్తున్న వార్తలు  ఉద్వేగానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే అడవుల్లో షల్టర్లు తీసుకుంటున్న మావోఈస్టులు, తీవ్రవాద దళాల అణచివేతకు చేపడుతున్న రహదారుల విస్తరణ, అభివృద్ధి పేరుతో సహజ అటవీ ప్రాంతాన్ని విద్వంసం చేయడం, రోడ్ల నిర్మాణంతో పెనువృక్షాలను పెకలించి వేయడం, అడవి బిడ్డల నుండి పోడుభూములను గుంజుకోవడం, ఆదిమ జాతులను దోపిడీ నుండి రక్షించడానికి తీసుకువచ్చిన 1/70 చట్టాన్ని నీరుకార్చడం సహజ అటవీ భూములను ప్రాజెక్టుల పేరుతే ముంచివేయడం, పేపర్‌ పరిశ్రమల పేరుతో వృక్షాల నిర్మూలన వంటి చర్యలు జీవ భౌతిక పరిస్థితులను, వైవిధ్యాన్ని రూపుమాపడం పెను వినాశకరంగా మారిన నేపద్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో యూరేనియం నిల్వల వెలికితీత భయానక స్థితికి చేర్చుతుంది. 

భూమిపుత్రులైన నల్లమల చెంచుల మనుగడకు, నల్లమల చుట్టూ నెలకొని ఉన్న లంబాడి తండాల మనుగడకు గొడ్డలపెట్టయిన యూరేనియం తవ్వకాల అంశం మొదట లంబాడీ గిరిజనుల వాట్స్‌అప్‌ గ్రూపుల ద్వారా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు మైదాన ప్రాంత నెటిజన్లు కూడా వాట్సాఅప్‌తో పాటు వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా దీన్ని అందుకొని ఆందోళనా పథంలోకి వచ్చేశారు. సామాజిక స్తృహ ఉన్న ప్రముఖ చిత్రదర్శకుడు శేఖర్‌ కమ్ములతో పాటు ప్రముఖ కవి, గేయ రచయిత గోరేటి వెంకన్న వివిధ మాధ్యమాల ద్వారా ఇచ్చిన ప్రకటనలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు ప్రముఖంగా పెడుతున్న పోస్టులు, తెలంగాణాకు చెందిన యువ కాంగ్రెస్‌ ఎంపి రేవంత్‌ రెడ్డి నల్లమల ప్రాంతంలో పర్యటించి చేసిన సింహగర్జనలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెనుతుఫాన్లు సృష్టిస్తున్నాయి. 

సామాజిక మాధ్యమాలను దాటుకొని ఇప్పుడు నల్లమల ఉద్యమం రాజకీయ రంగును అలుముకుంటున్న నేపధ్యంలో అక్కడి ప్రజల మనోభావాలను వెలికి తీసుకువచ్చి యూరేనియం తవ్వకాల నిలుపుదలకు ఢిల్లీ నుండి గల్లీ వరకు హైదరాబాద్‌ నుండి అమరాబాద్‌ వరకు ఒక శాంతియుత ఉద్యమ కెరటం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను తాకనున్నది. ఈ ప్రగతిశీల ప్రజా ఆకుపచ్చ సేనను నడిపించే బాధ్యత పౌర సమాజంపైనే ఆధారపడి ఉన్నట్లు  తెలుస్తుంది. ఒకపక్క ప్రభుత్వాల అండదండలతో దూకుడు పెంచుతూ ఆకుపచ్చ సైన్యంతో పల్లెలను చుట్టుముట్టేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు. అడవినే ఆధారంగా చేసుకుని జీవించే ఆదివాసీ గిరిజన ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసేందుకు జరుగుతున్న కుటిల కార్పోరేట్‌ శక్తుల కుట్రలకు ఆదిలోనే అంతమొందించేందుకు కృషి జరిగేందుకు యావత్‌ ప్రజానీకం ఆసన్నమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

రచయిత సమాచారం

అగ్రిక్లినిక్ డెస్క్