Print this page..

నాటుకు స్వస్తి - విత్తే విధానంఫిలిప్పీన్స్‌ తరహాలో వరిసాగు

తొలి ప్రయోగ ప్రాజెక్టు తెలంగాణలోనే

''ఇర్రి'' సంస్థతో ఒప్పందం:

నేడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాగు విధానాలు కూడా మార్పు చెందడం సహజసిద్దంగా కొనసాగుతుంది. నాటి వ్యవసాయ విధానాల ద్వారా ఆశించిన ఫలితాలతోపాటు జనాభాకు సరిపడా ఉత్పత్తులను అందివ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. శాస్త్ర, సాంకేతిక విధానం వ్యాప్తి చెందున్న తరుణంలో వ్యవసాయ రంగంపై కూడా ఈ విధానం అతివేగవంతంగా పనిచేస్తూ వస్తుంది. ఇతర దేశాలతో పోల్చుకుంటే మన రాష్ట్రాల్లో అంతగా రైతాంగంలోకి నూతన వ్యవసాయ విధానం పొడచూపలేక పోతుంది. ఇంకా పాత పద్ధతిలోనే నేడు వ్యవసాయం కొనసాగుతుంది. తెలంగాణలో ఏర్పాటు చేసిన అతిపెద్ద ప్రాజెక్టుల ద్వారా, నీటి వనరుల సామర్ధ్యం పెరగడం వల్ల సాగు విస్తీర్ణం పెరగనుంది. తెలంగాణ ప్రభుత్వం ఆయకట్టు విస్తరణ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్‌లో సుమారు 10 లక్షల హెక్టార్లు, రబీలో 6.50 లక్షల హెక్టార్లలో వరిసాగవుతుంది. దీన్ని ఖరీఫ్‌లో 25 లక్షలకు గానూ, రబీలో 15 లక్షల హెక్టార్ల వార్షిక వరి సాగు 40 లక్షల హెక్టార్లకు పెంచేందుకు అవకాశాలు ఉన్నాయి. 

నేడు వ్యవసాయ సాగు విధానం శ్రమతో కూడుకోవడం వల్ల కూలీల కొరత రైతులను బాధిస్తుంది. వరి నాట్లకు కూలీలు వచ్చే పరస్థితి కనిపించడం లేదు. కూలీల కొరత వల్ల వరి సాగు తగ్గే అవకాశం కూడా లేకపోలేదు. ఇటువంటి పరిస్థితులను అధిగమించేందుకు నూతన వ్యవసాయ సాగు విధానాలను తెలంగాణ రైతాంగంలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే వివిధ దేశాల నూతన పద్ధతుల వ్యవసాయ విధానాలను అధ్యయనం చేసింది. తక్కువ శ్రమతో ఎక్కువ ఉత్పత్తులను సాధించే పద్ధతులను అనుసరించేందుకు ఇటీవల కాలంలో తెలంగాణ జయశంకర వ్యవసాయ విశ్వ విద్యాలయం నూతన వంగడాలను సైతం రూపొందించడం జరిగింది. సాధారణంగా వరి సాగు నాట్ల పద్ధతిలోనే సాగుతుంది. కానీ దీనికి నీరు పుష్కలంగా ఉండాలి. నీరు తగినంతగా లేకపోయినా దిగుబడులు తగ్గుతాయి. నీరు తక్కువగా ఉన్నా అధిక దిగుబడులనిచ్చే వంగడాలను మెట్ట పంటల్లాగానే నేరుగా జల్లి వరి సాగు చేయడానికి ఫిలిప్పీన్స్‌ తరహాలో వరిని పండించడానికి తొలి ప్రయోగాత్మక ప్రాజెక్టును తెలంగాణలో చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం కోరడంతో ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ తన అంగీకారాన్ని తెలిపింది. 

ఫిలిప్పీన్స్‌తో ఒప్పందం : 

ఆచార్య జయశంకర వ్యవసాయ విశ్వ విద్యాలయ శాస్త్రజ్ఞులు వరి సాగులో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఫిలిప్పీన్స్‌ వరి పరిశోధనా సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఫిలిప్పీన్స్‌లో నిర్వహించిన పరిశోధనలకు ఇక్కడి వాతావరణం పూర్తిస్థాయి అనుకూలమని గుర్తించిన ఆ సంస్థ అధికారులు తెలంగాణ యూనివర్సిటీ అధికారులు అడిగిందే తడవుగా తన మొదటి ప్రాజెక్టును ఇక్కడే మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఆ ప్రకారం రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేస్తుంది. ఈ నూతన ప్రయోగాత్మక వరిసాగు విధానం అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం పొందవలసి ఉన్నందున ఆ దిశగా సానుకూల కసరత్తు జరుగుతుంది. వచ్చే ఏడాది నుండి రాష్ట్రంలో తక్కువ నీటి వినియోగమే కాకుండా, నాటు వేసే అవసరం లేకుండా మిగతా ఆరుతడి పంటల మాదిరిగానే పొలాల్లో విత్తనాలు వేయడం ద్వారా వరిలో అధిక దిగుబడి సాధించేందుకు ప్రయోగాత్మక ప్రాజెక్టు అమల్లోకి రానుంది. 

సిఎంని ఒప్పిస్తాం.. - మంత్రి నిరంజన్‌రెడ్డి

వరి రైతులకు మరింత చేయూత నిచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. ఆచార్య జయశంకర వ్యవసాయ విశ్వ విద్యాలయం ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (''ఇర్రి'')తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం శుభపరిణామం అని అన్నారు. 

తక్కువ నీటి ఖర్చుతో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులను సాధించే క్రమంలో జరిగిన పరిశోధనలు వాటి ఫలితాలు తెలంగాణ రైతుకు ఎంతగానో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సాగు విధానం రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రభుత్వపరంగా అనుమతి అవసరమని అందుకోసం వైస్‌ఛాన్సలర్‌ ప్రవీణ్‌రావులతో కలసి సిఎంకు నివేదిస్తామని మంత్రి తెలిపారు. ఇర్రి సంస్థ ప్రతినిధులు వ్యవసాయ శాస్త్రజ్ఞులు, అధికారులతో మంత్రి సమీక్షా, సమావేశం నిర్వహించారు. రైతులకోసం చేసే ప్రతి పనిని ప్రోత్సహిస్తుందని రైతు హితం కోసం ప్రభుత్వం పాటు పడుతుందని ఇప్పటికే రైతు సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు. 

ఐదేళ్ళ పాటు అమల్లో ప్రాజెక్టు : 

ఈ ప్రాజెక్టు ఐదేళ్ళ పాటు అమల్లో ఉంటుందని తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయ వైస్‌ఛాన్సలర్‌ ప్రవీణ్‌రావు తెలిపారు. నీటిపారుదల రంగంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మరెక్కడా జరుగడం లేదని అన్నారు. ఉత్పత్తి, ఉత్పాదక విషయంలో తెలంగాణ ఇప్పటికే పంజాబ్‌ వంటి రాష్ట్రాల సరసన చేరిందని అన్నారు. ఇటువంటి ఒప్పందాల వల్ల మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆయన తెలిపారు. 

రచయిత సమాచారం

- ఇ. రాంబాబు, అగ్రిక్లినిక్‌ ప్రతినిధి