అరటిని పండించడంలో ప్రపంచంలో భారతదేశానిదే మొదటిస్థానం. మనదేశంలో 858 వేల హెక్టార్ల విస్తీర్ణంలో 29,163 వేల మెట్రిక్‌ టన్నుల అరటి పండుతుంది. దేశంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణంలో 20 శాతం మరియు ఉత్పాదనలో 37 శాతం అరటిదే. రాష్ట్రాల్లో తమిళనాడు, గుజరాత్‌ మరియు మహారాష్ట్రలో విస్తీర్ణంలోనూ, ఉత్పాదకతలోనూ ముందు స్థానంలో ఉన్నాయి. అరటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 60 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పండుతుంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, గుంటూరు, కృష్ణ, విశాఖపట్నం, విజయనగరం మరియు కర్నూలు తదితర జిల్లాల్లో అరటిని ఎక్కువగా పండిస్తున్నారు.

టిష్యూకల్చర్‌ విధానం అందుబాటులోకి వచ్చిన తరువాత పంటల సాగులో అధిక దిగుబడుల సాధనకు మార్గం సుగమం అయినది. ముఖ్యంగా టిష్యూకల్చర్‌ అరటి సాగు రైతులకు లాభాలు పండిస్తుంది. ఈ పద్ధతిలో పిలకలను ఉత్పత్తి చేయడంతో క్రమంగా సాంప్రదాయ పద్ధతిలో తోటల నుండి పిలకలు తెచ్చి నాటే పద్ధతికి రైతులు స్వస్తి పలుకుతున్నారు. టిష్యూకల్చర్‌ అరటి రకాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణ అరటి రకాలు వెర్రితల, బొడ్డు తెగులు, లీఫ్‌స్ట్రీక్‌ వంటి వైరస్‌ తెగుళ్ళ తాకిడి ఎక్కువగా ఉండడంతో రైతులు ఆశించిన దిగుబడులు సాధించలేకపోతున్నారు.

టిష్యూకల్చర్‌ అరటిని సాధారణ రకాలతో పోల్చుకుంటే ఇటువంటి తెగుళ్ళ తాకిడిని తట్టుకోగల శక్తి ఉంటుంది. అంతేగాక టిష్యూకల్చర్‌ అరటి 6 అడుగులకు మించి ఎత్తు కూడా పెరగదు. అందువల్ల ఈదురు గాలులకు పడిపోకుండా ఉంటుంది. టిష్యూకల్చర్‌ అరటిని సాగుచేస్తే ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తుంది. అలాగే దిగుబడికి వస్తే ఒక గెల 15-25 కిలోల బరువుతో ఉంటుంది. గెలకు దాదాపు రూ. 250-300 వచ్చే అవకాశం ఉంది. పూత, ఫల సాయంలో పంట మొత్తం ఒకే రకంగా ఉంటుంది. పంట కాలం తక్కువ దిగుబడి, రాబడి ఎక్కువ.

అరటి ఉత్పత్తి - సమగ్ర యాజమాన్యం :

వాతావరణం :

ఇది ఉష్ణమండలపు పంట. 15-350 సెం.మీ. ఉష్ణోగ్రతలో బాగా పండుతుంది. గాలిలో తేమ 50-70 శాతం వరకు ఉండాలి.

ఉష్ణోగ్రత :

25 -35 సెం.మీ. ఈ పంట పండించుటకు అనుకూలం. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఆకులపై మచ్చలు ఏర్పడి, కిరణజన్య సంయోగక్రియ తగ్గి ఎదుగుదల ఆగిపోతుంది. తక్కువ ఉష్ణోగ్రతల వల్ల గెలల్లో ఎదుగదల ఆగిపోతుంది.

వర్షపాతం :

ప్రతి సంవత్సరం 800-1700 మి.లీ. లేదా నెలకు 100 మి.లీ. వర్షపాతం ఉండాలి. వర్షాలు క్రమపద్ధతిలో లేకుండా మరియు అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రదేశాల్లో పండించడం మంచిది కాదు. తగిన నీటి వసతి ఉండేలా చూసుకోవాలి. అలాగే పంటలో నీటి నిల్వ ఉండడం వల్ల పనామా లాంటి తెగుళ్ళు వచ్చి పంట దిగుబడులకు అధిక నష్టం కలుగుతుంది.

గాలి వేగం :

అరటి పంట పండించే ప్రదేశాల్లో గాలి వేగం గంటకు 50 కి.మీ. మరియు అంతకంటే ఎక్కువగా ఉంటే పంట పడిపోయి అధికంగా నష్టం కలుగుతుంది. పంట పడిపోవడం సాధారణ అరటి రకాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

గాలిలో తేమ శాతం :

గాలిలో తేమ 50 నుండి 60 శాతం ఉండడం అరటి పంటకు మంచిది. పొడిగాలి ఎక్కువగా ఉండడం వల్ల అరటి ఆకులకు అంతగా ఎదుగుదల ఉండదు.

నీటి యాజమాన్యం :

అరటి పంట జీవిత కాలంలో 900-1200 మి.లీ. నీరు అవసరం. వేరు అంతర్ణివేశ ప్రదేశాల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు 3-4 రోజులకు నీటిని పంటకు అందించాలి. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు 7-8 రోజులకు అందించాలి.

డ్రిప్‌ పద్ధతి :

ఈ పంటకు బిందు సేద్యం అనువైన మార్గం. నేరుగా వేరు వ్యవస్థకే నిర్ణీత పరిమాణంలో నీటిని పంపవచ్చు. తక్కువ కాలంలో పంట చేతికి అందడం, కలుపు మొక్కలు తక్కువగా ఉండడం మరియు నీటి వినియోగం కూడా ఆదా అవుతుంది. ఇలాంటి కారణాల వల్ల డ్రిప్‌ పద్ధతి ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు. మొక్కకు రోజుకు 25 లీటర్ల నీరు అవసరం ఉంటుంది.

ఎరువుల యాజమాన్యం :

అరటి పంటకు స్థూల, సూక్ష్మపోషకాలు చాలా ముఖ్యమైనవి. స్ధూలపోషకాలైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియం వాటిని ఎక్కువ మోతాదులో అందించాలి. సూక్ష్మపోషకాలైనటువంటి ఐరన్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌, కాపర్‌, బోరాన్‌లు తక్కువ మోతాదులో అందించాలి. నాటిన తరువాత మొక్కకు 25 కిలోల పశువుల ఎరువును అందించాలి. అలాగే 30 రోజులకు ఒకసారి 50 గ్రా. యూరియా, సూపర్‌ఫాస్ఫేట్‌, పొటాష్‌ 3 నెలల వరకు అందించాలి. 4 నెలల తర్వాత 75 గ్రా. చొప్పున ఈ 3 పోషకాలను మొక్కకు అందించాలి.

సూక్ష్మపోషకాలు :

పోషకాలు రసాయనాలు మోతాదు

ఐరన్‌ పెర్రస్‌ సల్ఫేట్‌ 5 గ్రా./లీ. నీటికి

లేదా నోవా ఫెర్‌

జింక్‌ జింక్‌ సల్ఫేట్‌ 5 గ్రా./లీ. నీటికి

లేదా నోవా జింక్‌

బోరాన్‌ బోరాక్స్‌ 1 గ్రా./లీ. నీటికి

లేదా నోవా బోరాన్‌

మెగ్నీషియం మెగ్నీషియం సల్ఫేట్‌ 2.5 గ్రా./లీ. నీటికి

లేదా నోవా మ్యాగ్‌

పోషక లోపాలను గుర్తించుట :

నైట్రోజన్‌ :

ఆకు పరిమాణం చిన్నదిగా ఉండి, ఎదుగుదల ఆగిపోతుంది. ఈనె, ఆకు భాగాలు ఇటుక రంగులోకి మారిపోతాయి.

ఫాస్పరస్‌ :

వేరు వ్యవస్థ తక్కువగా అభివృద్ధి చెంది మొక్క గిడసబారిపోతుంది, ముదురు ఆకులు పసుపు రంగుగా మారతాయి.

పొటాషియం :

పంట ఎదుగుదల ఆగిపోతుంది. ఆకుల చివరి భాగాలు పసుపు పచ్చగా మారతాయి. చీడపీడలు అధికంగా ఆశించే అవకాశం కలదు.

సల్ఫర్‌ :

కొత్తగా వచ్చే లేత ఆకులు బాగా లేత రంగులో ఉండడం, ఆకుపచ్చ రంగులోకి మారడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. మరియు ముదురు ఆకులు రంగును కోల్పోతాయి.

బోరాన్‌ :

ఆకు చివరి భాగాలు ఎండి రాలిపోతాయి. ఆకులు చిన్నవిగా ఉంటాయి. ఆకుల ఈనెలు ఉబ్బెత్తుగా ఉండి ఆకులు బిరుసుగానూ, పెళుసుగానూ ఉంటాయి. ఆకులపై నిలువుగా (పెద్ద ఈనెకు సమాంతరంగా) చారలు ఏర్పడతాయి.

కాపర్‌ :

ఆకు పెద్ద ఈనె, పక్క ఈనెలు వెనక్కి వంగి గొడుగు ఆకారంలోకి ఆకులు మారుతాయి. ఆకులు పసుపు పచ్చ రంగులోకి మారి రాలడం జరుగుతుంది.

ఐరన్‌ :

లేత ఆకులు తెలుపు చారలతో ఉంటాయి. ధాతులోపం అధికంగా ఉన్నప్పుడు లేత ఆకులు పూర్తిగా తెలుపు రంగుకు మారి క్రమేపి ఎండిపోయి అరటి చెట్టు ఎదుగుదల తగ్గిపోతుంది.

పైన పోషకలోపాలను తెలుసుకొని తగిన సమయంలో పోషకాలను అందించడం ద్వారా పోషక లోపాలను అరికట్టి, నాణ్యమైన అధిక దిగుబడులను సాధించవచ్చు.

టిష్యూకల్చర్‌ మొక్కలు లభించే ప్రదేశము :

ప్రిన్సిపల్‌ సైంటిస్టు, ఉద్యాన పరిశోధనా స్థానం,

కొవ్వూరు, పశ్చిమగోదావరి జిల్లా,

ఫోన్‌ : 08813 231507

పత్తి వెంకటనారాయణ, M.Sc., (Agri), Plant Physiology ఫోన్‌ : 8247083031