మన రాష్ట్రంలో కంది పంటను చాలా తక్కువ విస్తీర్ణంలో మాత్రమే సాగు చేశారు. దీనికి రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులే ప్రధాన కారణం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నమోదు కావలసిన వర్షపాతం కంటే తక్కువ మోతాదు కావడంతో చాలా మంది రైతులు కందిని ఖరీఫ్‌లో సాగు చేయలేక పోయినా మరి ఇప్పుడు వర్షాలు కురిస్తే ఇప్పుడు కందిని సాగు చేసుకోవచ్చా? ఒకవేళ సాగుచేస్తే ఏ ప్రాంతాల్లో సాగు చేయవచ్చు? ఎలాంటి రకాలు సాగుచేసుకోవాలి వంటి సందేహాలు చాలా మంది రైతుల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రబీ కంది సాగు గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఏ ప్రాంతాలు అనుకూలం?

1. వర్షాభావ పరిస్థితులు ఏర్పడి సరైన సమయంలో ఏ పంటను విత్తినప్పుడు

2. తొలకరిలో విత్తుకొన్న పంట వర్షాభావ పరిస్థితుల వల్ల పంట పూర్తిగా దెబ్బతిన్నప్పుడు

3. తొలకరిలో తక్కువ కాల పరిమితి గల పైర్లు (పెసర, దోస, మినుము, నువ్వు) సాగు చేసుకొని పంట కోసిన తరువాత రబీలో కంది సాగుకు అనుకూలం.

4. దక్షిణకోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, గుంటూరులో ఈశాన్య రుతుపవనాల వల్ల కురిసే వర్షాలను ఉపయోగించుకొని రబీ కందిని వర్షాధార పంటగా సాగు చేయవచ్చు.

5. నీటి వసతి ఉండి కందిని సాగుచేసే ఏ ప్రాంతంలోనైనా రబీ కందిని సాగుచేసుకోవచ్చు.

రబీ కంది వల్ల ఉపయోగం :

తొలకరి కంది ఎక్కువ ఎత్తు పెరగడం వల్ల ఈ పంటను ఆశించే కాయ తొలుచు పురుగు, మారుకా మచ్చల పురుగు నివారణ కష్టమవుతుంది. రబీ కంది అనువైన ఎత్తులో ఉండడం వల్ల సస్యరక్షణ చర్యలు చేపట్టడం తేలిక.

రబీ కందికి అనువైన రకాలు :

రబీ కందికి ప్రత్యేకమైన రకాలు అంటూ ఏమీ లేవు. ప్రతి సంవత్సరం మనం ఖరీఫ్‌కు ఏ రకాలైతే వాడుతున్నామో ఆ రకాలనే వాడుకోవచ్చు. కానీ మనకు ఇప్పుడు తక్కువ రోజులకే కోతకు వచ్చే రకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆ రకాలను సాగు చేస్తే రబీ కందిలో కూడా మంచి దిగుబడులు సాధించవచ్చు.

లక్ష్మి :

రబీ కాలానికి అనువైన రకం. కాల పరిమితి రబీలో అయితే 120-130 రోజులు. చెట్టు గుబురుగా ఉండి కొమ్మలు ఎక్కువగా వస్తాయి. కానీ మనం రబీలో సాగుచేస్తున్నాం. కాబట్టి కొమ్మలు ఎక్కువగా రావు. దిగుబడి ఎకరానికి 5-6 క్వింటాళ్ళు వస్తుంది.

పాలెం కంది (పి.ఆర్‌.జి-158) :

ఎక్కడైతే ఎండు తెగులు సమస్య ఉంటుందో ఆ ప్రాంతాలకు ఇది చాలా అనువైన రకం. రబీలో కూడా సాగుచేసుకోవచ్చు. ఎకరానికి 5-6 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది.

ఎల్‌.ఆర్‌.జి-41 :

పూత పసుపు వర్ణంలో ఉంటుంది. పూత అంతా ఒకే సారి వస్తుంది. రబీలో 120-130 రోజులకు పంట కోతకు వస్తుంది. ఎకరానికి 5-7 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది.

ఎల్‌.ఆర్‌.జి-52 :

పూత అంతా ఒకేసారి వస్తుంది. ఎండు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. రబీకి అనువైన రకం. పంట కాలం 120 రోజులు. ఎకరానికి దిగుబడి 5-7 క్వింటాళ్ళు వస్తుంది.

సి.ఒ.ఆర్‌.జి-7 :

మొక్క గుబురుగా పెరిగి కాపు మీద పక్కలకు వాలిపోతుంది. పూలు పసుపు పచ్చగా ఉంటాయి. గింజలు గోధుమ రంగులో ఉంటాయి. పంటకాలం 130 రోజులు. దిగుబడి ఎకరాకు 6-7 క్వింటాళ్ళు.

విత్తన మోతాదు :

ఖరీఫ్‌ కంటే రబీ కందిలో సాళ్ళ మధ్య ఎడం తగ్గించడం వల్ల విత్తిన మోతాదును పెంచవలసి వస్తుంది. సుమారుగా ఎకరానికి 6-8 కిలోల విత్తనం సరిపోతుంది.

విత్తన శుద్ధి :

రైజోబియంతో విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే దిగుబడులు పెరుగుతాయి. ఎండుతెగులు సమస్యగా ఉన్న ప్రాంతాల్లో తప్పకుండా ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంధ్రంతో విత్తనశుద్ధి చేయాలి. ఒక కిలో విత్తనానికి 10 గ్రా. ట్రైకోడెర్మావిరిడి కలపాలి.

విత్తే దూరం :

రబీ కందిలో విత్తే దూరం చాలా ముఖ్యమైనది. రబీ కందిలో సాలుకు సాలుకు దూరం తగ్గించి విత్తుకున్నట్లయితే దిగుబడి ఖరీఫ్‌లో ఎంత వచ్చిందో అంతే దిగుబడి వచ్చే అవకాశం ఉంది. రబీ కందిని వర్షాధారంగా సాగు చేస్తే సాలుకు సాలుకు 45-90 సెం.మీ. దూరంలో విత్తనం విత్తుకోవాలి.

విత్తే సమయం :

రబీ కందిని సెప్టెంబరు 15 నుండి అక్టోబరు 15 వరకు విత్తుకోవచ్చు. అక్టోబరు తరువాత విత్తుకుంటే దిగుబడులు తగ్గుతాయి.

ఎరువుల వాడకం :

ఎకరానికి రబీ కందికి 16 కిలోల నత్రజనిని ఇచ్చే ఎరువులు (35 కిలోల యూరియా), 20 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులు (125 కిలోల ఎస్‌ఎస్‌పి) చివరి దుక్కిలో వేసి కలియదున్నాలి.

కలుపు నివారణ :

రబీ కందిలో విత్తనం విత్తిన వెంటనే పెండిమిధాలిన్‌ అనే కలుపు మందును ఎకరానికి 1.5 లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. విత్తనం విత్తిన 15-20 రోజులకు పొలంలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటే ఇమిజితాఫిర్‌ అనే కలుపు మందును ఎకరానికి 250 మి.లీ. పిచికారి చేయాలి.

పురుగులు :

మారుకా మచ్చల పురుగు :

దీని నివారణకు క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. లేదా నోవాల్యురాన్‌ 0.75 మి.లీ. లేదా థయోడికార్బ్‌ 1 గ్రా. లేదా కొరాజిన్‌ 0.3 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే కందిలో వచ్చే మారుకామచ్చల పురుగును నివారించవచ్చు.

కాయ ఈగ :

కాయ ఈగ రాకుండా పిందె దశలో 5 శాతం వేప గింజల కషాయం పిచికారి చేసినట్లయితే గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు. గింజ ఏర్పడే దశలో మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

డా|| జి. రమేష్‌, శాస్త్రవేత్త, డాట్‌ సెంటర్‌, దర్శి, ఫోన్‌ : 9440358336