పార్థీనియం కలుపుమొక్కలను మనదేశములో మొదటిసారిగా 1955వ సంవత్సరం మహారాష్ట్రలోని పూణేలో గుర్తించడం జరిగింది. ఈ కలుపుమొక్క విత్తనాలు మెక్సికో, అమెరికా మరియు అర్జంటైనా నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం వలన భారతదేశంలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం పార్థీనియం మొక్కలు ఇండియాలో సమారు 35మిలియన్‌ హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. ఈ కలుపు మొక్క పంటపొలాల్లో ఉన్నట్లయితే పంటలలో వచ్చే అన్నిరకాల వైరస్‌కు ఆవాసంగా ఉండటమే కాకుండా దీని వేర్ల ద్వారా విడుదల కాబడిన రసాయనాల వలన పంట దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. మానవులకు మరియు పశువులకు శ్వాస సంబంధ మరియు చర్మ సంబంధ వ్యాధుల ఉధ తి ఎక్కువ అవటానికి ఈ మొక్కలో ఉన్న ''పార్థీనిన్‌'' అనే ఆల్కలాయిడ్‌ కారణం అని పరిశోధనలో వెల్లడైంది.

వయ్యారి భామ (పార్థీనియం హైస్టిరిపోరస్‌) ఆస్టరేసి కుటుంబానికి సంబందించిన ఏకవార్షిక కలుపుమొక్క. దీనిని క్యారట్‌ గడ్డి/ చటక్‌ చాందిని/టి.బి. ఆకు లేదా ముక్కపుడక అని వివిధ పేర్లతో పిలుస్తారు. పార్థీనియం ఎటువంటి ప్రతికూల పరిస్థితులలోనైనా అతి తొందరగా వ్యాప్తి చెందటానికి ముఖ్య కారణం దీని యొక్క విశిష్ట లక్షణాలే, సరాసరి ప్రతి మొక్క 25,000 నుంచి 30,000 విత్తనాల వరకు తయారు చేయటమే కాకుండా, ఈ విత్తనాలు చాలా తేలికగా ఉండి ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి సులభంగా వ్యాప్తి చెందుతాయి. కాండము మీద భూమికి దగ్గరగా ఉన్న శాఖీయ మొగ్గల నుండి కూడా ఇది అబివ ద్ధి చెందుతుంది. వేసవి పొలాల్లో తగినంత తేమ లేనప్పుడు ఈ కలుపు మొక్క పెరుగుదలను నియంత్రించుకొని వర్షాలు పడిన వెంటనే చాలా వేగంగా అబివద్ది చెందుతుంది. పార్థీనియం కలుపు మొక్కలు ప్రతి చదరపు మీటరుకు సరాసరి 25 నుంచి 70 మొక్కలు వరకు ఉంటాయి. ఈ మొక్కలు జీవ వైవిధ్యానికి మరియు పర్యావరణానికి కూడా హాని కల్గిస్తాయి.

పార్థీనియం నిర్మూలనా కార్యక్రమాన్ని రైతు సోదరులందరూ సామూహికంగా కనీసం గ్రామ స్థాయిలోనైనా చేపట్టినట్లయితే పార్థీనియంను నిర్మూలించవచ్చు.

పార్థీనియంమొక్కలను వేర్లతోసహా పూతరాకముందే పీకివేయాలి.

కసివింద (క్యాసియా టోరా) అనే మొక్క విత్తనాలను సేకరించి, ఈశాన్య రుతుపవనాలు పడిన వెంటనే పార్థీనియం ఉదతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చల్లటం వల్ల వీటి నుండి విడుదలయ్యే రసాయనాలు పార్థీనియం విత్తనాల మొలక శాతాన్ని గణనీయంగా తగ్గించుటయే కాకుండా కసివింద బాగా పెరిగిన తరువాత పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగించుకోవచ్చును.

పార్థీనియంలో అధిక మొత్తంలో నత్రజని, భాస్వరం మరియు పొటాషియం ఉండటం వలన దీని నుంచి కంపోస్ట్‌ తయారు చేసుకోవచ్చు. ప్రతి 100 కిలోల పార్థీనియం మొక్కలకు 1 కిలో యూరియా లేదా 3 కిలోల రాక్‌ ఫాస్పేట్‌ మరియు 50 గ్రాముల ట్రైకొడెర్మ విరిడి కలపడం వల్ల 4-5 మాసాలలో పార్థీనియం మొక్కల నుంచి సారవంతమైన కంపోస్టును తయారుచేయవచ్చును.

జైగోగ్రామా బైకొలరేటా అనే మెక్సికన్‌ బీటిల్స్‌ను 500 నుంచి 1000 వరకు ఒక హెక్టార్‌ పొలంలో విడుదల చేసినట్లయితే అతి కొద్ది కాలంలో వీటి సంఖ్య 4 లక్షల నుంచి 7 లక్షల వరకు అబివద్ది చెంది ఒక హెక్టారులో ఉన్న పార్థీనియం మొక్కలను నాశనం చేస్తాయి. ఈ బీటిల్స్‌ ఎట్టి పరిస్థితులలోను పంటల మీద గాని వేరే కలుపు మొక్కల మీద గాని ఆశించదు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ వీడ్‌ సైన్సు, జబల్‌పూర్‌ వాళ్ళు రైతు సోదరులకు ఈ బీటిల్స్‌ను అందజేస్తున్నారు.

పంటలేని ప్రాంతాలలో వయ్యారిభామ నివారణకు గ్లైఫోసేట్‌ 10 మి.లీ. గాని లేదా 2,4 డి సోడియం సాల్ట్‌ 5 గ్రాములు/లీటరు నీటికి కలిపి వయ్యారిభామ పూతకు రాక ముందు పిచికారి చేయాలి.

మొక్కజొన్న, జొన్న మరియు చిరు దాన్య పంటలలో విత్తిన వెంటనే అత్రాజిన్‌ 4 గ్రాములు లీటరు నీటికి కలిపి పొలమంతా పడేటట్లు పిచికారి చేయాలి. చెరకు మరియు పశుగ్రాస పంటలలో మెట్రిబుజిన్‌ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పంట మొలకెత్తిన 20-30 రోజులకు కలుపు మొక్కల మీద పడేటట్లు వేయాలి.

200 గ్రాముల సాధారణ ఉప్పుతో పాటుగా తగినంత సబ్బు ద్రావణం లీటరు నీటికి కలిపి పార్థీనియం మొక్కలపైన బాగా పడేటట్లు పిచికారి చేయుట వలన నాశనం చేయవచ్చును.

ఏది ఏమైనా పార్థీనియం సమగ్రంగా నివారించబడాలంటే చిన్నా పెద్దా, ఆడ మగా, విద్యార్ధినీ, విద్యార్ధులు, రైతులు, గ్రామస్తులు అందరూ కూడా మూకుమ్మడిగా పైన తెలియజేసిన నివారణ చర్యలను ఒకే సమయంలో యుద్ద ప్రాతిపదికన చేలల్లో, బంజరు భూముల్లో, రైలు పట్టాల వెంబడి మరియు రోడ్ల ప్రక్కన ఈ విధంగా ఎక్కడికక్కడ సామూహికంగా నిర్మూలన చేసినట్లయితే ఈ కలుపు మొక్కను వీలైనంత త్వరగా నిర్మూలించి పార్థీనియం రహిత ప్రాంతంగా చేయటానికి ఎంతైనా అవకాశము ఉంటుంది.

డా. తులసీ లక్ష్మి, శాస్త్రవేత్త (పంటల ఉత్పత్తి), యస్‌.యం మునీంద్ర నాయుడు, కార్యక్రమ సమన్వయకర్త,

యం. లక్ష్మి నాగ నందిని, సీనియర్‌ రిసర్చ్‌ఫెలో, కృషీ విజ్ఞాన కేంద్రం, నెల్లూరు, ఫోన్‌ : 7093492058