మన రాష్ట్రంలో వరి ప్రధానంగా ఖరీఫ్‌, రబీ పంట కాలాల్లో సాగుచేస్తున్నారు. ఇటీవల కాలంలో రైతాంగం వరి సాగులో ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా కూలీలు దొరకక సకాలంలో వరి నాట్లు, కలుపు తీయకపోవడం అనియంత్రిత విద్యుత్‌ ప్రసారాలు, వర్షాభావ పరిస్థితుల వల్ల వరి సాగ నానాటికీ దుర్భరం అవుతుంది. దీనికి తోడు పురుగులు, తెగుళ్ళు, కలుపు రైతుకు కొరకరాని కొయ్యగా తయారై దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి.

దేశంలో జరిగిన వివిధ పరిశోధనల్లో లుపు మొక్కల వల్ల సాంప్రదాయ వరిలో 35 శాతం, మెట్ట వరిలో 68 శాతం, డ్రమ్‌సీడర్‌ (నేరుగా విత్తే వరి) వరిలో 75 శాతం దిగుబడులు తగ్గుతాయని తేలింది.

వరిలో సాధారణంగా కనిపించె కలుపు మొక్కలు :

గరిక, చిప్పర, ఊద, దొమకాలు, నక్షత్రగడ్డి, అల్లిగడ్డి, గుంటగలిజేరు, అమృతకాడ, తూటికాడ మొదలగునవి.

వరిలో కలుపు ఎక్కువగా రావడానికి కారణాలు :

వేసవిలో లోతు దుక్కులు చేయకపోవడం

పొలాన్ని దమ్ము చేసేటప్పుడు సరిగా మురగనివ్వకపోవడం

సరైన నీటియాజమాన్యం పాటించకపోవడం

నారుమడిలో సమగ్ర కలుపు నివారణ పాటించకపోవడం

సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం

విత్తనాల్లో కలుపు గింజలు చేరడం మొదలైనవి

సాంప్రదాయ పద్ధతి (నాటు పెట్టు పద్ధతి) :

నారుమడి చేయునప్పుడు తగు జాగ్రత్తలు పాటించినట్లయితే ప్రధానపొలంలో వచ్చే కలుపును ఆదిలోనే నిర్మూలించవచ్చు. దీనికి నారుమడిని 10-15 రోజుల వ్యవధిలో 2-3 దఫాలుగా దమ్ము చేసి మురగనిచ్చి చదును చేయాలి. విత్తనాలు విత్తిన వారం రోజులకు బ్యూటాక్లోర్‌ 7.5 మి.లీ. / లీటరు నీటికి లేదా అక్సాడయార్జిల్‌ 0.25 గ్రా. / లీటరు నీటికి కలిపి నారుమడిలో నీటిని తీసివేసి పిచికారి చేయాలి.

విత్తిన 15-20 రోజులకు (ఏకదళ బీజాలు) గడ్డిజాతి కలుపు నివారణకు సెహలోఫాప్‌ బ్యుటైల్‌ 2 మి.లీ. / లీటరు నీటికి లేదా బిస్‌పైరిబాక్‌ సోడియం 0.5 మి.లీ. / లీటరు నీటికి పిచికారి చేయాలి.

ప్రధాన పొలంలో (నాటు పెట్టిన తరువాత) కలుపు నివారణకు దమ్ము చేసేటప్పుడు ఎక్కువ రోజులు మురగనివ్వాలి అలా చేయడం వల్ల తక్కువ కలుపు వస్తుంది. పొలం గట్లపైన చుట్టు పక్కల గడ్డి నిర్మూలనకు 10 మి.లీ. గ్లైఫోసేట్‌ను ఒక లీటరు నీటిలో కలిపి 10 గ్రా. యూరియా కలిపి నాటుటకు ముందు పిచికారి చేయాలి. నాటిన 20-30 రోజుల్లో పొలంలో అధికంగా ఉన్నట్లయితే మనుషుల సహాయంతో గానీ కలుపు మందుల పిచికారి వల్ల నిర్మూలించవచ్చు.

నారుపెట్టిన 3-5 రోజులకు ఎకరానికి 35 గ్రా. ఆక్సాడయార్జిల్‌ పొడి మందును అర లీటరు నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని 20 కిలోల పొడి ఇసుకకు కలిపి పొలంలో నీటిని తీసి సమానంగా వెదజల్లాలి. లేదా 4 కిలోల బ్యూటాక్లోర్‌ 4 శాతం గుళికలు కూడా సమర్థవంతంగా కలుపును నివారించవచ్చు. పంట ఎదిగే దశలో ఆశించి కలుపు నివారణను గడ్డి జాతుల నివారణకు సెహలోఫాస్‌ బ్యుటైల్‌ 250-300 మి.లీ. / ఎకరానికి లేదా ఫినాక్సిప్రాప్‌ ఇథైల్‌ 250 మి.లీ. / ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

వెడల్పాటి గడ్డిజాతులు సమానంగా ఉండి బిస్‌ఫైరిబాక్‌ సోడియం (నామిని గోల్డ్‌) 100-120 మి.లీ. / ఎకరానికి లేదా ఆల్‌మిక్స్‌ 8 గ్రా. 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

డ్రమ్‌సీడర్‌ పద్ధతి (నేరుగా విత్తే పద్ధతి) :

ఈ పద్ధతిలో దమ్ము చేసిన పొలంలో మండి కట్టిన విత్తనాన్ని నేరుగా గాని డ్రమ్‌సీడర్‌ ఉపయోగించి విత్తుకోవచ్చు. ఈ పద్ధతిలో మొదటి 15 రోజులు ఆరుతడిగా నీరు ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి కలుపు సమస్య అధికంగా ఉంటుంది. నాటిన నుండి 40-45 రోజుల వరకు కలుపు యాజమాన్యం కీలకం లేనిచో 80-90 శాతం దిగుబడులు తగ్గును. విత్తనాలు నాటిన 6-7 రోజులకు (2-3 ఆకుల దశ)లో ఎకరానికి ఆక్సాడయార్జిల్‌ 35-50 గ్రా. పొడి మందును అరలీటరు నీటిలో కలిపి 20 కిలోల ఇసుకలో కలిపి పొలంలో బురదపదునులో సమానంగా చల్లాలి. లేదా పైరజొసల్ఫ్యూరాన్‌ ఇథైల్‌ పొడి మందును 80 గ్రా. 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

విత్తిన 20-25 రోజులకు బిస్‌పైరిబాక్‌ సోడియం (నామిని గోల్డ్‌) 100 మి.లీ. / 200 లీ. / ఎకరానికి పిచికారి చేయాలి. 25 రోజుల తరువాత 10-12 రోజుల వ్యవధిలో కొనొవీడర్‌ను నడుపుకొని కలుపు నివారించుకోవచ్చు.

యాంత్రీకరించిన ''శ్రీ'' వరి సాగు పద్ధతులు :

ఈ పద్ధతులు దమ్ము చేసిన పొలంలో వరి నాటే యంత్రంతో వరి నాట్లు వేస్తారు. కావున వరుసల మద్య రమారమి 30 సెం.మీ. మొక్కల మద్య 10-14 సెం.మీ. దూరంలో నాట్లు వేస్తుంది. వరుసల మధ్య ఖాళీ ఎక్కువ కావున కలుపు అధికంగా ఉంటుంది. నాటిన 5 రోజుల్లోపు బ్యుటాక్లోర్‌, అక్సాడయార్జిల్‌, ప్రిటిలాక్లోర్‌ మందులతో ఒక దానిని సిఫారసు మేరకు ఇసుకతో కలిపి చల్లాలి. నాటిన 15 రోజుల తరువాత పవర్‌ కోనోవీడర్‌ చాళ్ళ మద్య నడిపి కలుపును భూమిలో కలియదున్నాలి. దీనివల్ల ఎకరానికి 1-2 టన్నుల పచ్చిరొట్ట భూమిలో కలిసి అధిక దిగుబడులకు ఆస్కారం కలదు.

మెట్ట వరి / ఆరుతడి వరి పద్ధతి :

దుక్కిలో విత్తనాన్ని వేస్తారు కావున కలుపు ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ పద్ధతిలో వేసవి దుక్కులు బాగా చేసి కలుపును ఏరివేయాలి. వీలైతే కాల్చివేయాలి. విత్తనాలు విత్తిన 24-48 గంటలలోపు ఎకరానికి 1 లీటరు పెండిమిథాలిన్‌ (పెండిస్టార్‌) కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పొలం అంతా తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి. లేదా విత్తిన 5-7 రోజులకు 50 గ్రా. పైరజోసల్ఫూరాన్‌ ఇథైల్‌ మందును 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. విత్తిన 15-30 రోజులకు నామిని గోల్డ్‌ 100 మి.లీ. లేదా ఆల్‌మిక్స్‌మందును 200 లీ. నీటిలో కలిపి పొలమంతా పిచికారి చేయాలి.

గొర్రుతో విత్తుకున్నట్లయితే వరుసల మధ్య కొనొస్టార్‌ వీడర్‌ను నడుపుకొని 35 రోజుల తరువాత వచ్చే కలుపును సమర్థవంతంగా అరికట్టవచ్చు. పైన తెలిపిన విధంగా వివిధ వరి సాగు పద్ధతుల్లో సమగ్ర కలుపు నివారణ చర్యలు సకాలంలో చేపట్టినట్లయితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందుటకు అవకాశం కలదు.

సి. రామకృష్ణ, సహాయ ఆచార్యులు, (అగ్రానమి), పి. మధుకర్‌ రావు, శాస్త్రవేత్త (అగ్రానమి) పొలాస, కోరుట్ల