రాష్ట్రంలో పెసర మరియు మినుమును తొలకరిలో, రబీలో మరియు వేసవిలో వరి కోతల తరువాత పండిస్తున్నారు. ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత పథకం ద్వారా అపరాల పంటలను, ప్రోత్సహించడం వల్ల అపరాల విస్తీర్ణం బాగా పెరిగింది. పెసర మరియు మినుము సాగులో సరైన మెళకువలు పాటించకపోవడం మరియు కొత్తగా ఎదురవుతున్న చీడపీడల సమస్యల వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. సమస్యలను అధిగమించడానికి శాస్త్రవేత్తలు సూచించిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకొని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల ఆశించిన దిగుబడులను సాధించవచ్చు.

సస్యరక్షణ :

పురుగులు :

చిత్త పురుగులు :

ఈ పురుగులు పైరుపై రెండు ఆకుల దశలో ఎక్కువగా ఆశించి గుండ్రటి చిన్న చిన్న రంధ్రాలు చేస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉండి నివారించకపోతే 80 శాతం మొక్కలు ఈ దశలోనే చనిపోతాయి. నివారణకు క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1 గ్రా. లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తామర పురుగులు :

పైరు చిరు దశలో ఎక్కువగా ఆశించి ఆకుల్లో రసాన్ని పీల్చి 15-20 శాతం నష్టాన్ని కలుగచేయడమే కాకుండా ఆకుముడత అనే వైరస్‌ వ్యాధిని వ్యాపింపచేస్తాయి. నివారణకు మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1 గ్రా. లేదా ఫిప్రోనిల్‌ 1.5 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. లేదా సెస్పైనోసాడ్‌ 0.3 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తెల్ల దోమ :

ఆకుల్లోని రసాన్ని పీల్చడమేకాక ఎల్లోమొజాయిక్‌ అనే వైరస్‌ వ్యాధిని (పల్లాకు తెగులు) వ్యాపింపచేస్తాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్‌ 0.2 గ్రా. లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పొగాకు లద్దె పురుగు :

మొదట రెండు దశల్లోని పిల్ల పురుగులు ఆకుల్లోని పత్రహరితాన్ని గీకి తినడంవల్ల ఆకులు తెల్లగా జల్లెడలాగా మారిపోతాయి. తరువాత దశలో గొంగళి పురుగులు ఆకులకు రంధ్రాలు చేసి, ఆకులను పూర్తిగాను, పూలను మరియు పిందెలను కూడా తింటాయి.

నివారణకు ఈ కింద సూచించిన సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించాలి.

1. ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసి పురుగు ఉధృతిని గమనించాలి.

2. తల్లి పురుగులు ఆకు అడుగుభాగాన గుడ్ల సముదాయాన్ని పెడతాయి. ఈ ఆకులను తుంచి గుడ్లను నాశనం చేయాలి.

3. ఎకరాకు 20,000 ట్రైకోగ్రామా బదనికలను వారం తేడాతో 2 పర్యాయాలు వదలాలి.

4. ఎకరాకు ఎన్‌.పి.వి 200 యల్‌.ఇ ద్రావణాన్ని సాయంత్రం వేళలో పిచికారి చేయాలి.

5. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పొలంలో ''విషపు ఎర'' ముద్దలను పొలంలో సాయంత్రం వేళలో వెద చల్లుకోవాలి. (విషపు ఎరగా 5 కిలోల తవుడు + అరకిలో బెల్లం కలిపి అరలీటరు మోనోక్రోటోఫాస్‌ లేదా క్లోరిపైరిఫాస్‌ మందును సరిపడా నీటిని కలిపి విషపు ఎరను చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి.

6. చివరిగా క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. లేదా నోవాల్యురాన్‌ 1 మి.లీ. లేదా థయోడికార్బ్‌ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

మారుకా మచ్చల పురుగు :

నల్ల మచ్చలు గల లేత పసుపు వర్ణం గల పురుగు మినుము / పెసర పైర్ల లేత ఆకులను, పూతను, పిందెను గూడుగా ఏర్పరచుకొని పూత, పిందె, కాయలను తిని పంటకు నష్టం కలుగచేస్తుంది. నివారణకు పైరు పూత దశకు రాకముందు నుండే చర్యలు చేపట్టాలి. పూత దశలో (35 రోజుల వయసులో) తప్పని సరిగా పైరుపై 5 శాతం వేప గింజల కషాయం లేదా వేపనూనె 5.0 మి.లీ. ఒక లీటరు నీటికి కలపి పిచికారి చేసినట్లయితే రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు.

మొగ్గ మరియు పూత దశలో పిల్ల పురుగులు కనిపించినట్లయితే వెంటనే క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. లేక థయోడికార్బ్‌ 1.0 గ్రా. లేక ఎసిఫేట్‌ 1.0 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పంటలో గూళ్ళు గమనించినట్లయితే నివారణకు ఎసిఫేట్‌ 1.0 గ్రా. లేక క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. లేక నొవాల్యురాస్‌ 1 మి.లీ. ఏదో ఒక మందుతో పాటుగా తప్పనిసరిగా ఊదర స్వభావం కలిగిన డైక్లోరోవాస్‌ మందును 1.0 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మరలా అవసరమైతే మందులను మార్చి మార్చి 2-3 సార్లు పూత మరియు కాయ దశల్లో పిచికారి చేయాలి.

ఒక వేళ పురుగు ఉధృతి అధికంగా గమనించినప్పుడు స్పైనోశాడ్‌ 0.3 మి.లీ. లేక ఎమామెక్టిన్‌ బెంజోయేట్‌ 0.4 గ్రా. లేక రైనాక్సిపిర్‌ 0.3 మి.లీ. లేక ప్లూబెండమైడ్‌ 0.2 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారి చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.

తెగుళ్ళు :

బూడిద తెగులు :

విత్తిన 30-35 రోజుల తరువాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముదురు ఆకులపై, బూడిద లాగా చిన్న చిన్న మచ్చలుగా కనబడి, క్రమేణా పెద్దవై ఆకులపై, కింది భాగాలకు కొమ్మలు మరియు కాండంపై వ్యాపిస్తాయి. నివారణకు లీటరు నీటికి కార్బండిజమ్‌ లేదా థయోఫానేట్‌ మిథైల్‌ 1 గ్రా. లేదా కెరాథేన్‌ 1 మి.లీ. లేదా హెక్సాకొనజోల్‌ 2 మి.లీ. లేదా ప్రోపికొనజోల్‌ 1.0 మి.లీ. లేదా మైక్లోబుటానిల్‌ 1.0 గ్రా. లేదా డైఫెన్‌కొనాజోల్‌ 1.0 మి.లీ. కలిపి 10-15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. తెగులును తట్టుకునే (టి.యమ్‌ 96.2)రకాలను విత్తుకోవాలి.

కొరినోస్పొరా ఆకుమచ్చ తెగులు :

ఈ తెగులు సోకిన ఆకులపై చిన్న చిన్న గుండ్రని గోధుమ రంగు మచ్చలు ఏర్పడి అనుకూల వాతావరణ పరిస్థితుల్లో పెద్ద మచ్చలు వలయాకారంగా ఏర్పడి ఆకులు ఎండి రాలిపోతాయి. నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా. మాంకోజెబ్‌ లేదా ప్రొపికొనజోల్‌ 1.0 మి.లీ. 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

సెర్కోస్పొరా ఆకుమచ్చ తెగులు :

ఈ తెగులు సోకిన ఆకులపై గోధుమ రంగు గుండ్రని చిన్న చిన్న మచ్చలు కనిపించి అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఈ మచ్చలు పెద్దవై ఆకులు ఎండి రాలిపోతాయి. దీనివల్ల కాయలో గింజలు సరిగా నిండవు. దీని నివారణకు లీటరు నీటికి హెక్సాకొనజోల్‌ 2.0 మి.లీ. లేదా ప్రోపికొనజోల్‌ 1.0 మి.లీ. లేదా కార్బండిజమ్‌ 1 గ్రా. లేదా థయోఫానేట్‌ మిథైల్‌ 1 గ్రా. కలిపి వాడడం ద్వారా ఆకుమచ్చ తెగులుతో పాటు బూడిద తెగులు కూడా నివారించవచ్చు.

ఎండు తెగులు :

ఈ తెగులు ఆశించిన మొక్కలు వడలి, ఎండిపోతాయి. పంటకు అధిక నష్టం కలుగుతుంది. ఈ తెగులు భూమిలో ఉన్న శిలీంద్రం ద్వారా వ్యాపిస్తుంది. కనుక పైరుపై మందులను వాడి నివారించుట లాభసాటి కాదు.

బుట్ట మినుము, ఎల్‌.బి.జి 402, ఎల్‌.బి.జి 611, ఎల్‌.బి.జి 22, ఎల్‌.బి.జి 648, ఎల్‌.బి.జి 685 రకాలకు ఈ తెగులును తట్టుకునే శక్తి కలదు. ఒకే పైరు సంవత్సరాల తరబడి ఒకే పొలంలో వేయరాదు. పొలంలో నీరు నిలవకుండా చూడాలి. ఎండాకాలంలో లోతు దుక్కి చేయడం వల్ల భూమిలోని శిలీంద్ర బీజాలు నశించిపోతాయి. పైరు విత్తుకునే ముందు తప్పనిసరిగా కిలో విత్తనానికి 3 గ్రా. కార్బండిజమ్‌ లేక మాంకోజుబ్‌ గాని పట్టించి విత్తుకోవాలి. ఎకరానికి 2 కిలోల ట్రైకోడెర్మావిరిడి జీవశిలీంద్రాన్ని 80 కిలోలు చివికిన పశువుల ఎరువు + 20 కిలోల వేప పిండితో అభివృద్ధిపరచి విత్తే సమయంలో భూమిలో వేసి కలియదున్నుకోవాలి.

తుప్పు తెగులు :

పైరు పూత దశలో ఈ తెగులు లక్షణాలు కనిపిస్తాయి. ఆకు ఉపరితలంపై లేత పసుపు వర్ణం గల గుండ్రని చిన్న మచ్చలు ఉంటాయి. తరువాత కుంభాకృతితో కూడిన గుండ్రని మచ్చలు కుంకుమ / తుప్పు రంగును పోలి ఉంటాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా. మాంకోజెబ్‌+ 1 మి.లీ. డైనోకాప్‌ లేక 1 మి.లీ. ట్రైడిమార్ఫ్‌ లేక 1 గ్రా. బైలాటాన్‌ కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

పల్లాకు తెగులు :

ఇది వైరస్‌ తెగులు. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు మరియు కాయల మీద పసుపుపచ్చ మచ్చలు ఏర్పడతాయి. తొలిదశలోనే ఈ తెగులు ఆశించినట్లయితే పైరు అంతా పసుపు రంగుకు మారిపోయి పూత మరియు పిందె దశలో ఈ తెగులు ఆశించినట్లయితే పిందెలు, కాయలు పసుపు రంగులోకి మారి వంకర్లు తిరిగి తాలు కాయలుగా మారిపోతాయి. కాయదశలో ఈ తెగులు ఆశించినట్లయితే దిగుబడిలో పెద్దగా కలుగనప్పటికీ గింజలు పసుపు రంగుకు మారి నాణ్యత తగ్గడానికి అవకాశముంది.

ఈ వైరస్‌ తెగులు వివిధ రకాల కలుపు మొక్కల మీద మరియు పిల్లిపెసర పైన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. పల్లాకు తెగులు సోకిన కలుపు మరియు ఇతర మొక్కలను పీకి నాశనం చేయాలి. తొలిదశలో పల్లాకు తెగులు వచ్చిన మొక్కలను పీకి నాశనం చేసి తెగులు ఉధృతిని తగ్గించుకోవాలి. పైరుపై ఒక అడుగు ఎత్తులో పసుపు రంగు రేకులను గాని అట్టలను గాని ఉంచి వాటి మీద ఆముదం గాని లేక గ్రీజు గాని పూసినట్లయితే తెల్లదోమ ఉధృతిని తెలుసుకోవచ్చు. విత్తిన 15 లేక 20 రోజులకు ఒకసారి వేపనూనె 5 మి.లీ. ఒక లీటర నీటికి కలిపి లేక 5 శాతం వేపగింజల కషాయం కాని పిచికారి చేసినట్లయితే పంటను తెల్లదోమ ఆశించకుండా కాపాడుకోవచ్చు. అంతేకాకుండా అప్పటికే పంటలో ఉన్న తెల్లదోమ గుడ్లను మరియు పిల్ల పురుగులను కూడా నాశనం చేసినట్లు అవుతుంది. తెల్లదోమ నివారణకు మోనోక్రోటోఫాస్‌ 2 మి.లీ. లేక ఎసిఫేట్‌ 1 గ్రా. లేక ఎసిటామిప్రిడ్‌ 0.2 గ్రాముల్లో ఏదైనా ఒకదాన్ని ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. అవసరాన్ని బట్టి మందును మార్చి పది రోజుల వ్యవధిలో మరోసారి పిచికారి చేయాలి.

ఆకుముడత, తల మాడు తెగులు / మొవ్వు కుళ్ళు :

ఈ వైరస్‌ తెగులు ఉధృతి వర్షాభావ పరిస్థితుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది తామరపురుగుల ద్వారా ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కల్లో ఆకుల అంచులు వెనుకకు ముడుచుకొని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. ఆకుల అడుగు భాగంలోని ఈనెలు రక్తవర్ణమును పోలిఉంటాయి. లేత దశలో వ్యాధి సోకినట్లయితే తలలు మాడిపోయి, గిడసబారి మొక్కలు వాడిపోతాయి. పైరు ముదురు దశలో తెగులు పాక్షికంగా ఉండి తలలు మాడిపోతాయి. అతి తక్కువ కాపు ఉంటుంది. తెగులు వ్యాప్తి చెందడానికి కారణమైన తామర పురుగులను నివారించుకోవాలి.

సీతాఫలం తెగులు :

ఈ వైరస్‌ తెగులు పేనుబంక ద్వారా ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు ఆశించిన మొక్కల్లో ఆకుల కాడలు మరియు ఆకులు పెద్దవై ఆకుపై ఉబ్బెత్తై ముడతలుపడి సీతాఫలం కాయ లాగా కనబడుతుంది. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారతాయి. ఈ తెగులు సోకిన మొక్కల్లో పూత, పిందె అభివృద్ధి చెందక కాయలు ఏర్పడవు. ఈ తెగులు 70 శాతం వరకు విత్తనం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. కనుక తెగులు సోకని పంట నుండి విత్తనం సేకరించుకోవాలి. తెగులు వ్యాప్తికి కారణమైన పేనుబంక పురుగులను నివారించుకోవాలి. పేనుబంక పురుగు నివారణకు ఎసిఫేట్‌ 1.0 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 0.4 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్‌ 0.2 గ్రా. లేదా థయోమిథాక్సామ్‌ 0.2 గ్రా. లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 2.0 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పేనుబంక ఉధృతిని బట్టి వారం నుంచి 10 రోజుల వ్యవధిలో మందులను మార్చి మార్చి పిచికారి చేయాలి.

జి. శాలిరాజు, డా|| కె. వెంకట సుబ్బయ్య, డా|| వి. దీప్తి, డా|| ఆర్‌.వి.యస్‌.కె. రెడ్డి, డా|| ఇ. కరుణశ్రీ, డా|| టి. విజయ నిర్మల,

డా|| ఎ. దేవి వరప్రసాద్‌ రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం, డా|| వై.ఎస్‌.ఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయం, వెంకటరామన్నగూడెం