భారతీయుల జీవన శైలిలో కొబ్బరి ఒక భాగం ఆద్యాత్మిక జీవనంలో హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో వినియోగించేది నారికేళ ఫలమే. ఆద్యాత్మికంగానే కాకుండా నిత్య జీవనంలో రుచికరమైన ఆహారపదార్థాల తయారీలో కొబ్బరికి ఉన్న పాత్ర వర్ణింపనలవికానివి. నలభీమాదులైనా తమ వంటల్లో అనాదిగా కొబ్బరిని వినియోగించకుండా భోజనప్రియులకు సంపూర్ణ తృప్తిని ఇవ్వలేకపోయారు. ఇది ఒక భాగంకాగా అసలు కొబ్బరి చెట్టులోని ప్రతి భాగమూ వేరు మొదలుకొని 30 మీ. పైగా ఎదిగే కాండంతో సహా, ఆకులు, ఈనెలు, ద్రవాలతో సహా అన్నీ మానవజాతికి సంపూర్ణ సేవా యోగ్యమైనవే. అనేకసార్లు కొబ్బరి వనాల ప్రాశస్త్యాన్ని ఈ పత్రిక వేదికగా లిఖించుకున్న మనం సృష్టిలో అతి మధురమైన, ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన కొబ్బరినీళ్ళు, ఆధునిక జీవనంలో ఆరోగ్యాన్ని రక్షించే అతి సహజమైన వీటి గురించి ఈ వ్యాసంలో ప్రత్యేకంగా తెలుసుకుందాం.

మార్కెట్‌ ప్రపంచంలో అతి సహజమైన కొబ్బరి నీటికి ఎలా గుర్తింపు తీసుకువచ్చి, సకల జన వినియోగానికి ఉపయోగించ వచ్చునో, తద్వారా కొబ్బరి రైతుకు, వినియోగదారుడికి, మార్కెట్‌కు పరిచయం చేసే వాణిజ్యవేత్తకు ఇది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

కాదేది వార్తకు అనర్హం అన్నట్లు ఒక పాత్రికేయుడు భావించే సమయంలో, ప్రపంచంలో ఏ వస్తువుకైనా విలువ జోడించి అమ్ముకోవడమనేది, వినియోగదారునికి చేర్చడమనేది కర్తవ్యంగా ఒక వాణిజ్యవేత్త భావిస్తాడు. సహజంగా బజారులో మనం ఎంతో ఆబగా తాగి దాహాన్ని తీర్చుకునే కొబ్బరినీళ్ళు నేడు వ్యాపార మహాసామ్రాజ్యాల సందర్శనా వస్తువులుగా పెద్ద పెద్ద బజారుల ముఖద్వారాలను తడుతున్నాయి. పేరుమోసిన బహుళజాతి కంపెనీలతో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు కూడా కొబ్బరినీళ్ల ప్యాకేజింగ్‌ కంపెనీని స్థాపించి, మన పెరటిఫలం నుండి లభించే మధురమైన జలాన్ని ప్రపంచానికి పంచుతున్న అద్భుతమైన ఆవిష్కరణను 'అగ్రిక్లినిక్‌' పత్రిక మీ ముందుంచుతుంది. కొబ్బరి, దాని ప్రయోజనాలు, ముఖ్యంగా కొబ్బరి నూనె చిరకాలంగా భారతీయ జీవనంలో ఒక భాగం కాగా, కొబ్బరి ఉప ఉత్పత్తులను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసి రైతుకు అధిక ఆదాయంతోపాటు అనేక మందికి ఉపాది కల్పించే దిశలో భాగంగా కొబ్బరి నీరాను బ్రాండింగ్‌ చేసి ప్రపంచమార్కెట్‌కు పరిచయం చేస్తున్నారు.

తాజాగా కొబ్బరినీటిపై, వాణిజ్య విలువను జోడించే ప్రక్రియలపై పరిశోధన సాగిస్తున్న రెండు వర్ధమాన సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో ఉత్పాదక కంపెనీలను ప్రారంభించాయి. భువనగిరి, కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లికి చెందిన రెండు వినూత్నమైన సంస్థలు కొబ్బరినీళ్ళ బ్రాండింగ్‌కు శ్రీకారం చుట్టాయి. ఇందుకు సంబంధించిన విధివిధానాలు తెలుసుకునే ముందు కొబ్బరినీళ్ళ ప్రయోజనం గురించి తెలుసుకుందాం...

కొబ్బరి నీళ్ళు -ప్రయోజనాలు :

కొబ్బరి నీళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఎండాకాలం వచ్చింది. అంటే దాహం తీర్చుకోవడానికి లేదా అనారోగ్యంగా ఉండి కోలుకునే సమయంలో కొబ్బరినీళ్ళ అవసరం చాలా ఎక్కువ. ఏ కాలంలో అయినా ఏ మాత్రం ఆరోగ్యానికి భంగం అనే భయం లేకుండా తాగగలిగేది కొబ్బరినీళ్ళే. ఇంకొక ముఖ్య విశేషం ఏమిటంటే కొబ్బరి నీళ్ళను కల్తీ చేయలేం. ఎందుకంటే కొబ్బరినీళ్ళు పైన బొండాల రూపంలో పలుచని తోలు, మధ్య పీచు, లోపల గట్టి పెంకు రక్షణగా ఉండి లోపల కొబ్బరితో నీళ్ళు ఉంటాయి. కొబ్బరి నీటిలో శరీరానికి మేలు చేసే పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రస్తుతం వైద్యులు కూడా కృత్రిమ శీతల పానీయాల జోలికి పోకుండా సహజ సిద్ధమైన కొబ్బరి నీళ్ళు తాగమని సలహా ఇస్తున్నారు. కొబ్బరినీళ్ళు ఏ విధంగా ఆరోగ్య ప్రదాయిని తెలుసుకుందాం...

1. కొబ్బరి నీళ్ళలో చాలా తక్కువ కొవ్వు శాతం ఉండడం వల్ల ఎంత తాగినా లావవుతామని భయపడాల్సిన పని లేదు. దీనిలోని ఖనిజాల వల్ల కొబ్బరి నీరు తాగడం వల్ల మామూలు నీరు తాగిన దానికన్నా కడుపు నిండినట్లుగా ఉంటుంది.

2. ముఖం మీద మొటిమలు లాంటివి ఉన్నప్పుడు చర్మానికి రక్షణగా పనిచేసేది కొబ్బరినీళ్ళే. నిజానికి చర్మ రక్షణ ఉత్పత్తులన్నీ కొబ్బరి సంబంధిత ఉత్పత్తులతో తయారైనవే. చర్మాన్ని శుభ్రం చేయడానికి కొద్దిగా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల చర్మ సౌందర్యం వృద్ధి చెందుతుంది. చర్మంలోని ఎక్కువ నూనెలను తొలగించి చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

3. ఆల్కహాల్‌ సేవనం వల్ల ఏర్పడ్డ హ్యాంగ్‌ ఓవర్‌ నుండి విముక్తి పొందడానికి కొబ్బరి నీళ్ళు బాగా ఉపయోగపడతాయి. హ్యాంగ్‌ ఓవర్‌ వల్ల కడుపులో వ్యర్థపదార్థాలను తొలగించడానికి మూత్రం ద్వారా, వాంతుల ద్వారా కోల్పోయిన ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను అందివ్వడానికి కొబ్బరి నీళ్ళు ఉపయోగపడతాయి.

4. జీర్ణక్రియకు కొబ్బరినీళ్ళు సహాయపడతాయి. కొన్ని పదార్థాలు అరగవు అన్న అనుమానం ఉన్నప్పుడు కొబ్బరి నీళ్ళు తాగితే ఉపశమనం లభిస్తుంది. కొబ్బరి నీళ్ళలోని పీచు ఘాడత అజీర్తిని తగ్గించి ఆమ్ల తీవ్రతను తగ్గిస్తుంది.

5. క్రీడాకారులు శక్తి కోసం తాగే ఎనర్జీ కూల్‌ డ్రింక్‌ల కన్నా కొబ్బరి నీళ్ళు చాలా మంచివి. ఎందుకంటే కొబ్బరినీళ్ళలో పొటాషియం ఎనర్జీ డ్రింక్‌ల్లో కన్నా రెండు రెట్లు అధికంగా (294 మి.గ్రా.) ఐదు రెట్లు తక్కువ చక్కెర (5 మి.గ్రా.) ఉంటుంది. స్పోర్ట్స్‌ డ్రింకుల్లో ఉండే సోడియంకౌంట్‌ 41 మి.గ్రా. కానీ కొబ్బరి నీళ్ళలో సోడియం కౌంట్‌ 25 మి.గ్రా. ఉంటాయి.

6. ఆహారంలో ఉండే ఎలక్ట్రోలైట్లు హెచ్చు తగ్గులుగా ఉంటే అవి అధిక రక్తపీడనాన్ని లుగచేస్తాయి. కొబ్బరి నీళ్ళలో ఈ ఎలక్ట్రోలైట్లు తగు పాళ్ళలో ఉండడం వల్ల రక్తపీడనాన్ని అదుపు చేసే సహజ ఔషదంగా పనిచేస్తుంది. కాబట్టి రోజూ ఉదయాన్నే కొబ్బరి నీళ్ళు తాగడం అలవాటు చేసుకుంటే రక్తపీడనం అదుపులో ఉంటుంది.

7. కొబ్బరి నీళ్ళలో అన్నింటికన్నా ముఖ్యమైన విషయం దీనిలో ముఖ్యమైన పోషకాలు కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌, పొటాషియం మరియు సోడియం వంటివి తగుపాళ్ళలో ఉంటాయి కాబట్టి అనారోగ్యంతో బాధపడేవారు త్వరగా కోలుకోవడానికి కొబ్బరినీరు తాగడం మంచిది.

8. కొబ్బరి నీళ్ళు రుచి ఆరోగ్య లాభాలు మాత్రమే కాకుండా దీన్ని తీసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా మంచి బలవర్ధకమైన పానీయంగా ఉపయోగించడానికి కారణం ఇది శరీరంలోని నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తుంది. అన్ని కాలాల్లో, అన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది. ముఖ్యంగా పేద దేశాలవారికి కొబ్బరినీళ్ళు ప్రాణాలను కాపాడే ఆరోగ్యప్రదాయిని.

కొబ్బరి నీళ్ళతో చక్కెర వ్యాధి?

పటాపంచలవుతున్న అనుమానాలు :

ఘగర్‌ వ్యాధితో బాధపడేవారు కొబ్బరి నీళ్ళు తీసుకోవడానికి భయపడుతుంటారు. ఘగర్‌ లెవల్స్‌ పెరుగుతాయని కొబ్బరి నీళ్ళు తాగకుండా దూరం పెడతారు. అయితే అలాంటివన్నీ కేవలం అపోహలే అంటున్నారు పరిశోధకులు. కొబ్బరినీళ్ళు తాగే వారిలో ఘగర్‌ లెవల్స్‌ పెరగడానికి బదులుగా తగ్గుతాయని వారు స్పష్టం చేస్తున్నాసఱ. కొబ్బరినీళ్ళు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయని ఈ మేరకు వారు నిరూపించారు కూడా.

కొబ్బరి నీళ్ళులో ఉండే కేవలం 3 గ్రా. పీచు పదార్థం, సులువుగా జీర్ణమయ్యే ఆరు గ్రాముల పిండి పదార్థం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని మధుమేహ వ్యాధిగ్రస్తులు నిరభ్యంతరంగా కొబ్బరినీళ్ళు తీసుకోవచ్చునని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.

ఇన్సులిన్‌కి స్పందించే గుణాన్ని మెరుగుపరచి రక్తంలో చక్కెరను తగ్గించే మెగ్నీషియం విరివిగా ఉన్నందువల్ల టైప్‌-2 డయాబెటీస్‌, ప్రీ-డయాబెటిక్స్‌ ఉన్నవారు కొబ్బరినీళ్ళు తీసుకుంటే మంచిది.

ఆవిష్కరణలకు ఆకాశమే హద్దు

కాదేదీ వాణిజ్యానికి అనర్హం :

వెనుకటికొకసారి జంధ్యాల సారధ్యంలో వచ్చిన ఓ సినిమాలో ''కొబ్బరి నీళ్ళా జలకాలాడి.... కోనాసీమా కోకాగట్టి'' అని కడియం ఉద్యానవనాల్లో ఓ యువ జంట పాడుకున్న పాటను విన్నాము. అది కొబ్బరి ప్రత్యేకతకు, కోనసీమ అందాలకు సంబంధించిన వ్యవసాయ సందర్శనకు అంటే నేడు ప్రముఖంగా ప్రస్తావిస్తున్న అగ్రిటూరిజంకు సంబంధించిన విశేష అంశం.

కానీ వాణిజ్య పరంగా కొబ్బరి విలువను రెట్టింపు చేసే 150 పైగా ఉత్పత్తులను ఇప్పుడు మనం చూస్తున్నాం. మన శరీరంలో అలసట, నీరసం, కడుపులో మరి ఏదో బాధ కలిగినప్పుడు, జ్వరంగా అనిపించినప్పుడు, హృదయ సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు, జీర్ణకోశ, మూత్రపిండాలు ఇతర విసర్జిత అంగాల్లో సమస్య ఉన్నప్పుడు మనకు వచ్చే ఒకే ఒక్క ఆలోచన కొబ్బరినీళ్ళు సేవించాలని ఇలా ఆలోచన వచ్చిందే తడవుగా అందుబాటులో కొబ్బరి చెట్లు ఉంటే ఎక్కించి బోండాలు దించుకోవడం లేదంటే బజారులో ప్రతిచోటా లభించే కొబ్బరి బోండాలను కొని కొట్టించుకొని తాగడం చేస్తాము.

'కొడుకులు చేయని పనిని ఒక కొబ్బరి చెట్టు చేస్తుందని' నమ్మి, తమ పెరటిలోనే కాకుండా పొలం గట్లపై, చేపల చెరువు గట్లపైన, గ్రామ రహదారుల పక్కన, ఏకంగా ఎకరాల్లోనే కొబ్బరి సాగు చేసి తరతరాలుగా కల్పతరువైన కొబ్బరి సాగును కొనసాగించుకుంటున్నాం.

వరదలు, తుఫాన్లు, సునామీలు వచ్చి లక్షలాది చెట్లు కూలిపోయినా, తెగుళ్ళు, పురుగులతో ఇబ్బంది పడుతున్నా, గిట్టుబాటు ధర ఉన్నా లేకపోయినా కొబ్బరి సాగు జీవితాల్లో భాగస్వామ్యమైపోయిన తీరప్రాంతాల పరిస్థితి మనకు తెలిసిందే. చెట్టు వేళ్ళ నుండి ఆకులు, ఈనెల వరకు పూర్తిగా మానవులకు ఉపయోగపడే ఈ కొబ్బరి పంటలో అసాధారణమైనది కొబ్బరి నీరు. ఈ నీటిని వాణిజ్య సరళిలో సీసాల్లో నింపి నేడు ప్రపంచాన్ని శాశిస్తున్న సూపర్‌ మార్కెట్ల నుండి చిల్లర దుకాణాల వరకు వ్యాపార విస్తరణను చేస్తూ నూతన ఆవిష్కరణలకు తెరలేపాడు ఓ యువకుడు.

పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరుకు చెందిన గోటేటి అరుణ్‌ కుమార్‌ అనే యువ ఇంజనీర్‌ వరుణ్‌ ఆక్వా బేవరేజస్‌ ప్రై. లిమిటెడ్‌ అనే సంస్థను స్థాపించి వాణిజ్యపరంగా కొబ్బరి నీటిని 12 నెలల పాటు నిల్వ ఉండే విధంగా ఒక సరికొత్త సాంకేతిక పద్ధతి ద్వారా సీసాల్లో నింపి దానికి ''కోకో వైబ్రెంట్‌'' అని నామకరణం చేశారు.

ఇందుకోసం ఆయన సుదీర్ఘమైన సమయాన్ని పరిశోధనలకు కేటాయించి చివరికి విజయవంతంగా మార్కెట్‌లోకి తీసుకురాగలిగారు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పట్టభద్రుడైన గోటేటి ఈ విభాగంలో అమెరికాలో పరిశోధనలు చేసి భారత్‌కు తిరిగివచ్చారు. 2014లో పరిశోధనలు ప్రారంభించి అనేక నిద్రలేని రాత్రులు గడిపి చర్చించి ఒక సామాజిక బాధ్యతగా ప్రజలందరి దీర్ఘకాలిక ఆరోగ్యభద్రత, వాణిజ్యపరమైన విజయావకాశాలు తద్వారా విలువ ఆధారిత పరిశ్రమ స్థాపన ద్వారా రైతుకు సాధికారత కల్పించేందుకు నడుంకట్టారు.

వినియోగదారుల మార్కెట్‌లో ప్రస్తుతం దీర్ఘకాలికంగా ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న కృత్రిమ శీతల పానీయాల స్థానంలో సహజ సిద్ధమైన కొబ్బరి నీటిని సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కొబ్బరి నీటి సహజత్వాన్ని, రుచిని, శుచిని అదే స్ధాయిలో, దానిలోని ఆరోగ్య విలువలను, నష్టపోకుండా యధాతధంగా సరఫరా చేసేందుకు తగిన ప్రాతిపదికను అరుణ్‌కుమార్‌ సిద్ధం చేశారు.

ఆధునిక ప్యాకింగ్‌ వ్యవస్థలో వచ్చిన మార్పులను ఉపయోగించుకొని కొబ్బరి నీళ్ళను ఎక్కువకాలం పాటు యధాతధంగా నిల్వ ఉంచే విధంగా యంత్రాంగాన్ని తయారు చేసి కొబ్బరి వాణిజ్య రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు.

కోకో వైబ్రెంట్‌ విశిష్టతలు :

1. కోకో వైబ్రెంట్‌ నూటికి నూరు శాతం కొబ్బరి బోండాంలోని సహజమైన ఐదు గుణాలను యధాతధంగా కాపాడుతుంది. అదనంగా కొవ్వు శాతం, చక్కెర లేకుండా సహజంగా ఇది ఆస్వాదించినప్పుడు కొబ్బరి బోండాంలోని నీటిని తలపిస్తుంది.

2. ఇది పూర్తిగా స్వంత పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేయబడింది. దానివల్ల ప్రతి అడుగులోనూ, ముఖ్యంగా బోండాలను సేకరించి నిల్వ చేసి ఓడలకు ఎక్కించే వరకు దాని స్వచ్ఛతను, సహజత్వాన్ని, రుచిని , ప్రమాణాలను కాపాడుతూ తయారైనది.

3. ప్యాకేజింగ్‌ పరిశ్రమలో వస్తున్న ఆధునిక పాలిప్రోప్లిన్‌ పరిజ్ఞానంతో తయారుచేసిన పెట్‌ బాటిల్స్‌లో నీటిని నింపడం ద్వారా సహజత్వాన్ని కాపాడతారు.

4. ప్రపంచ నలుమూలలా అత్యంత సహజమైన, రుచికరమైన కొబ్బరి నీటిని యధాతధంగా ప్రజలకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు.

5. కొబ్బరి చెట్టు నుండి సీసాల్లో నింపే వరకు, సరైన బోండాలను సేకరించి ఫ్యాక్టరీకి తీసుకువచ్చే వరకు వాటిని శుద్ధి చేసి సీసాల్లో నింపే వరకు ఆఖరి ప్రయత్నంగా దాని సహజత్వాన్ని ప్రమాణాలను కాపాడేందుకు సకల చర్యలు తీసుకున్నారు.

కోకో వైబ్రెంట్‌ మార్కెట్‌లోకి రావడానికి ప్రాథమికంగా ఈ ఉత్పత్తి పరిశోధన చేయడానికి, అనుమతించడానికి భారత ప్రభుత్వ డిఎఫ్‌ఆర్‌ఎల్‌ సంస్థ సహకారాన్ని తీసుకున్నారు. మైసూర్‌లో ఉన్న ఈ సంస్థ కేంద్ర రక్షణశాఖకు చెందిన పరిశోధన అభివృద్ధి సంస్థ అనుబంధమైంది. డిఎఫ్‌ఆర్‌ఎల్‌ సూచన మేరకు కేంద్ర కొబ్బరి అభివృద్ధి బోర్డు (సిడిబి) ఈ పరిశ్రమ ముందుకు రావడానికి తోడ్పాటు ఇచ్చింది. డిఎఫ్‌ఆర్‌ఎల్‌-సిడిబి సంయుక్త కృషి వల్ల 12 నెలలు కొబ్బరి నీరు పాలిప్రోప్లిన్‌ బాటిళ్ళలో నింపే సాంకేతికత చేకూరింది.

కొబ్బరి బోండాంతో పోలిస్తే కోకో వైబ్రెంట్‌ వినియోగం వల్ల ఉపయోగాలు :

1. 365 రోజులు వినియోగదారులకు అందుబాటులో ఉంచవచ్చు.

2. బోండాం కంటే దీన్ని ఎక్కడికైనా సులభంగా పట్టుకువెళ్ళవచ్చు.

3. కొబ్బరి బోండాల్లో చిన్న పెద్ద తేడాల వల్ల నీరు తక్కువ ఉంటుంది. కానీ కోకో వైబ్రెంట్‌లో నికరంగా 250 మి.లీ. నీటిని పొందవచ్చు.

4. కొబ్బరి బోండాం 4-7 రోజుల్లో సహజత్వాన్ని కోల్పోతుంది. కానీ కోకో వైబ్రెంటు నీళ్ళ సహజత్వం12 నెలలు ఉంటుంది.

5. శీతలీకరణ చేయడం వల్ల రుచి వృద్ధి అవుతుంది.

6. బోండాలను చెత్తబుట్టల్లో వేయలేము, కానీ బాటిళ్ళను చెత్తబుట్టలో సులభంగా వేయవచ్చు.

8. కొబ్బరి బోండాలను పెద్ద పెద్ద షాపుల్లో ఉంచలేము. కానీ కోకో వైబ్రెంట్‌ బాటిళ్ళను ఎక్కడైనా ఉంచుకోవచ్చు.

9. బేకరీలు, ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లు, హాస్పటల్స్‌, టళ్ళు, రెస్టారెంట్లలో ఉంచి అమ్ముకునే అవకాశం ఉంది. అదే విధంగా వేడుకలు, సామూహిక ఉత్సవాల్లో విరివిగా వినియోగించవచ్చు. చిల్లర కొట్లు, సూపర్‌ బజార్లు, బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఏ ప్రదేశమైనా బాటిళ్ళ వ్యాపారానికి అనుకూలమైంది.

ఇటీవల 'అగ్రిక్లినిక్‌' సంపాదకులు, పర్చూరు శాసన సభ్యులు, వ్యవసాయ, ఉద్యాన నిపుణులు ఏలూరి సాంబశివరావును కలిసి కొబ్బరి నీరు - విలువ జోడించిన ఉత్పాదన 'కోకో వైబ్రైంట్‌' విశేషాలను అరుణ్‌ కుమార్‌ వివరించారు. ఈ సమావేశంలో అగ్రిక్లినిక్‌ సంపాదక మండలి సబ్యులు వై. శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ ప్రమాణాలకు అనుగుణంగా 'కోకో వైబ్రెంట్‌'ను ముందుకు తీసుకువెళ్ళాలని ఏలూరి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

వ్యర్థాలతో భవిష్యత్‌ ఉత్పత్తులు :

నీటిని బాటిళ్ళలో నింపి మిగిలిన బోండాల వ్యర్థాలను చార్కోల్‌ తయారు చేయడానికి వినియోగించవచ్చు. అదే విధంగా ఒక వేళ కొబ్బరినీళ్ళు బాటిళ్ళలో నింపే సమయంలో ఏదైనా అవాంతరం ఏర్పడితే దాన్ని కొబ్బరి వెనిగర్‌ తయారీకి కూడా వినియోగించవచ్చు.

పరిశోధనా పత్రంగా కొబ్బరి నీరు :

కరీంనగర్‌ జిల్లా, వీణవంక మండలం, వల్లభాపూర్‌ గ్రామానికి చెందిన గాదె శృతి కొబ్బరి నీరు-నిల్వ-వినియోగం అనే అంశంపై స్వామి కేశవానంద రాజస్థాన్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో పరిశోధన నిర్వహిస్తున్నారు. కొబ్బరి నీటిపై డాక్టరేట్‌ పొందేందుకు ఆమె ఈ వివిధ ఉత్పత్తి కంపెనీల కార్యకలాపాలను అధ్యయనం చేసి ఒక పత్రాన్ని సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొబ్బరి నీటికి విలువ జోడించి బాటిల్స్‌ తయారు చేస్తున్న జైన్‌ ఆగ్రో ఫుడ్స్‌, శక్తి కోకో ప్రాడక్ట్సు, లైఫ్‌ ట్రీ ఆగ్రో కంపెనీలు ఈ రంగంలో ఇప్పటికే ముందడుగు వేస్తున్న సమయంలో భవిష్యత్‌లో బహుళజాతి కంపెనీలను సైతం అధిగమించి ఈ సహజ ఉత్పత్తి పరిశ్రమలు ముందుకు వెళ్ళగలవని వ్యవసాయ ఇంజనీరింగ్‌, ఎమ్‌ఎబియంలు పూర్తి చేసిన రైతు బిడ్డ గాదె శృతి అగ్రిక్లినిక్‌ పత్రికకు తెలియచేశారు.

- వై.వి. నరసింహారావు, అసోసియేట్‌ ఎడిటర్‌,

గాదె శృతి, రీసెర్చ్‌ స్కాలర్‌