రైతులకు ఆదర్శం మానం శ్రీను 


రచయిత సమాచారం


▪️అద్భుతం: శ్రీను జామ సాగు                         
▪️తైవాన్ పింక్ జామ సాగుతో అధిక ఆదాయం
▪️తోటను పరిశీలించిన ఎమ్మెల్యే ఏలూరి 
▪️వలపర్ల రైతు శ్రీనుకు అభినందనలు  
                 
▪️1.20 కుంటలలో  రూ 5 లక్షలు పెట్టుబడి
▪️ఒక్క కోతతో  1.70 ఆదాయం                        

ఆయన ఓ సామాన్య రైతు.... వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం... ఉన్న పొలంలో అద్భుత ఫలితాలు సాధించాలని ఆశ.... వ్యవసాయంలో ఆటుపోట్లను ఎదుర్కొన్న ఆ రైతు వ్యవసాయాన్ని పండగ చేయాలనే లక్ష్యంతో పండ్ల తోటలు వైపు అడుగులు వేశాడు. రూ.5 లక్షల పెట్టుబడితో 1.20 ఎకరం భూమిలో తైవాన్ పింకు జామ సాగు చేసి అద్భుత ఫలితాలు,అధిక దిగుబడులు సాధించి రైతన్నలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు... ఇంతకీ...  ఇది ఎక్కడ ..?ఈ తోట ఎవరిది....? ఎవరు ఆ రైతు అనుకుంటున్నారా...? ప్రకాశం జిల్లా మార్టూరు మండల పరిధిలోని వలపర్ల, రామాపురం గ్రామం శివారులో ఉన్న ఈ తోట వలపర్ల కు చెందిన మానం శ్రీనివాసరావుది. ఆయన ఓ నిరక్షరాస్యుడు.... వ్యవసాయంపై తనకున్న అపార అనుభవంతో తక్కువ భూమిలో సైతం పండ్ల తోటలను సాగు చేసి అద్భుత ఫలితాలు సాధించవచ్చని ఈ రైతు ధీమాగా చెబుతున్నాడు. 

వలపర్లకు చెందిన మానం శ్రీనివాసరావు పెద్దగా చదువుకోలేదు. అయినా తనకున్న అనుభవం,జ్ఞానంతో భూమిలో బంగారు పంటలు పండించాలని కుతూహలం ఉండేది. కానీ కాలం కలిసి రాక అతివృష్టి ,అనావృష్టి వల్ల పెట్టిన పెట్టుబడులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో జామ తోట సాగు చేయాలనే ఆలోచనకు వచ్చాడు. ఆలోచన వచ్చిందే తడవుగా వెంటనే రోడ్డు పక్కనే ఉన్న 1-20 గుంటల భూమిలో బోరు వేసి డ్రిప్ ఏర్పాటు చేశాడు. పొలం చుట్టూ ముళ్ల తీగ వేశాడు. జంగారెడ్డిగూడెంలో తైవాన్ పింకు జామ మొక్కలు తీసుకువచ్చి మొక్కలు నాటాడు. వాటిని కంటికి రెప్పలా కాపాడుతూ అనుక్షణం అక్కడే ఉంటూ తన అనుభవాన్ని ప్రయోగశాలగా మార్చడు. పంట వేసిన 2 నెలలకే పిందెలు పడ్డాయి. వాటిని తొలగించి పంటకు తడులు వేస్తూ మొక్కలు పోషకాలు వేస్తూ వచ్చాడు. 

8 నెలల నుంచి కోతకు...
తైవాన్ పింకు జామ పంట 4 నెలలకే పంటలో అద్భుత ఫలితాలు కనిపించాయి. ఎనిమిది నెలలకు పంట కోతకు రావడంతో పొలం పక్కన  రోడ్డుపై విక్రయాలు చేపట్టాడు. ప్రజల నుంచి విశేష ఆదరణ లభించడంతో పొలం వద్ద షెడ్ నిర్మించి విక్రయాలు చేస్తున్నాడు.

ఎమ్మెల్యే ఏలూరి ప్రశంసల జల్లు:
నియోజకవర్గ పర్యటనలో భాగంగా రోడ్డు పక్కనే ఉన్న మానం శ్రీనివాసరావు జామ తోటను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరిశీలించారు. సాగు పద్ధతులు పెట్టుబడి ఆదాయ వనరులను అడిగి తెలుసుకున్న ఆయన రైతు శ్రీనివాసరావును అభినందించారు. ఈ సందర్భంగా హార్టికల్చర్ అధికారిగా పనిచేసిన ఎమ్మెల్యే ఏలూరి రైతుకు పలు సూచనలు చేశారు. ఇంకా అధిక దిగుబడులు సాధించి, రైతులందరికీ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

ఒక కాయ కిలో....
 శ్రీనివాసరావు జామ తోటలో తైవాన్ పింకు కాయలు ఒక్కొక్కటి 1 కిలో  ఉన్నాయి. పేదల ఆపిల్ గా పిలిచే జామ సామాన్య ప్రజలు ఇష్టంగా తింటారు. అయితే పైన ఆకుపచ్చరంగులో  లోపల పింక్ కలర్ లో ఉన్న ఈ కాయలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. మార్టూరు మండల కేంద్రం పరిధిలో ఉన్న ఈ జామ తోట కు చుట్టుపక్కల గ్రామాల నుంచి రోజూ వందల సంఖ్యలో ప్రజలు వచ్చి కొనుగోలు చేయడం విశేషం.