ఆరోగ్యానికి తెలంగాణ సోనా: ఐఎస్‌బీ


రచయిత సమాచారం


తెలంగాణ సోనా(ఆర్ ఎన్ ఆర్ 15048) బియ్యం ఆరోగ్యానికి మేలైనవని, మధుమేహ సమస్య ఉన్నవారికీ ఉపయుక్తంగా ఉంటాయని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) అధ్యయనం గుర్తించింది. ఈ బియ్యంతో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయని ఐఎస్ బీ ఆచార్యులు మధువిశ్వనాథ్ వెల్లడించారు. సోనా రకంలో 8.76శాతం అధికంగా ప్రొటీన్లు; బీ2, బీ3 విటమిన్లు మెండుగా ఉంటాయని గుర్తించినట్లు చెప్పారు. ఈ బియ్యానికి బ్రాండ్ ఇమేజ్ కల్పించే అంశంపై ఐఎస్ బీ చేస్తున్న అధ్యయనం కొలిక్కి వచ్చింది. ఈ నెల 20న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించనుంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన మూడు వంగడాల్లో.. సోనా రకం బహుళ ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. ఈ పంట తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ సాగులో ఉంది. ఈ బియ్యానికి అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ తెచ్చేందుకు ఐఎస్ బీతో గత ఆగస్టు 14న రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా భారత్ సహా ప్రపంచ దేశాల్లో బియ్యం రకాలు, వినియోగదారుల అభిరుచులు, అలవాట్లపై ఐఎస్ బీ మార్కెటింగ్ విభాగాధిపతి ప్రొ.డీవీఆర్ శేషాద్రి పర్యవేక్షణలో అధ్యయనం చేశారు.