ముద్దొచ్చే జంతువులతో ముంచుకొచ్చే ముప్పు


రచయిత సమాచారం

డా. ఎం. కోటేశ్వర రావు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, కరీంనగర్, మొబైల్: 707 55 89 571


జులై 6, వరల్డ్ జూనోసిస్ డే సందర్భంగా ప్రత్యేక వ్యాసం

ఆరోగ్యమే మహా భాగ్యం ఇది ఎంత పాత మాటో, అంత పదునైన మాట కూడా. రోగాలతో అల్లాడాలని, జబ్బులతో డబ్బులు వదిలించుకోవాలని ఎవరూ కోరుకోరు. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనే ప్రతి ఒక్కరూ ఆశ పడతారు. అయితే ఆశ ఒక్కటే ఉంటే చాలదు. అందుకు తగిన ఆచరణ కూడా ఉండాలి. 
పౌష్టికాహారం తీసుకుంటూ, చక్కటి వ్యాయామం చేస్తూ, క్రమ శిక్షణగా జీవిస్తే చాలు ఆరోగ్యంగా ఉండొచ్చు అనుకుంటారు చాలా మంది. అది నిజమే. కానీ ... అది ఒక్కటే నిజం కాదు. అవన్నీ పాటించినా కూడా రోగాలు రెచ్చిపోటానికి, జబ్బులు జబ్బలు చరుచుకోటానికి, వ్యాధులు విజృంభించటానికి యింకా అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మనం కలలోనైనా ఊహించలేo. కాబట్టే కొత్త జబ్బుల బారిన పడుతూ ఉంటాం. 
సగటు మనిషి, రైతులు, బీదా బిక్కి, కూలీనాలీలతో పాటు, విద్యావంతులు, ఉద్యోగస్థులు కూడా తెలిసో తెలియకో రోజూ రోగాల రాజ మార్గంలో నడుస్తూ ఉంటారు. అలాంటి వారందర్నీ అప్రమత్తం చేసి, వారు ఆశపడే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందుకునేలా చేయటానికి ఉద్దేశించిందే “వరల్డ్ జునోసిస్ డే” 
( ప్రపంచ సాంక్రమిక వ్యాధుల దినం) ”
ను పురస్కరించుకున్న ఈ వ్యాసం.      
నిమ్న శ్రేణి జీవుల నుండి మనుషులకు, మనుషుల నుండి నిమ్న శ్రేణి జీవులకు సహజ సిద్ధంగా సంక్రమించే వ్యాధులను “జూనోసెస్” అంటారు. ఇలాంటి జూనోసిస్ వ్యాధులు దాదాపు 200 వరకూ ఉన్నాయి.  వీటిలో ర్యాబిస్ (పిచ్చి కుక్క వ్యాధి) అనేది అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధి. లూయీస్  పాశ్చర్ అనే ప్రఖ్యాత శాస్త్రవేత్త, పిచ్చి కుక్క కాటుకు గురి అయిన వ్యక్తికి, జులై 6, 1885వ, తేదీన మొట్ట మొదటిసారిగా యాంటీ ర్యాబిస్ టీకాను విజయవంతంగా చేశారు. చారిత్రకంగా, సాంకేతికంగా, వైజ్ఞ్యానికంగా చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలచిపోయే ఆ రోజును అంటే జులై 6 వ, తేదీని ఆ నాటి నుండి ప్రతి సంవత్సరం “ వరల్డ్ జూనోసిస్ డే” ( ప్రపంచ జూనోసిస్ దినం) గా నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తోంది.    

జంతువుల నుండి మనుషులకు, మనుషుల నుండి జంతువులకు సంక్రమించే ఈ జూనోటిక్ వ్యాధుల గురించి ప్రజలకు, రైతులకు, పశువైద్య సిబ్బందికి అవగాహన కల్పించటం ద్వారా, వారిని అప్రమత్తం చేసి, రోగాల బారిన పడకుండా చేయటం వరల్డ్ జూనోసిస్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. 
జంతువులు, పక్షులను పెంచుకొనే వారు, వాటితో సన్నిహితంగా ఉంటారు. పాలను, పాల ఉత్పత్తులను, మాంసం, జంతు ఉత్పత్తులను ఉపయోగించని వారు బహుశా ఎవరూ ఉండరు. ఆ క్రమంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక జూనోటిక్ వ్యాధి బారిన పడే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కాబట్టి వినియోగదారుల దృష్టిని ఆకర్షించి, ఈ వ్యాధులపట్ల వారు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అందరూ తెలుసుకొనేలా, ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించటానికి “ వరల్డ్ జూనోసిస్ డే” నాడు పశు సంవర్ధ శాఖ, పశు వైద్య కళాశాలలు, సంబంధిత సంస్థలు వివిధ కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుంది. 

జూనోటిక్ వ్యాధులు మనుషులకు రావటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అవేంటంటే ..? 
మనిషి తన జీవనోపాధికి పశువుల పెంపకం, గొర్రెలు-మేకల పెంపకం, కోళ్ళ పెంపకం వంటి వృత్తుల పైన ఆధారపడటం సర్వసాధారణం. మరి కొందరు వృత్తిగా కాకపోయినా, అవసరార్ధం, ఆసక్తితో, ఆకర్షణతో, కొన్ని రకాల జంతువులను, పక్షులను పెంచుతూ ఉంటారు. వృత్తిగా చేపట్టిన వారు ఆదాయాన్ని పొందుతున్నారు. దాంతో పాటే పాలు, గ్రుడ్లు, మాంసం వంటి పౌష్టికాహారాన్ని తద్వారా ఆరోగ్యాన్నీ పొందుతున్నారు.  
ఇక ఆసక్తితో పెంచేవారు ఆనందాన్ని, వినోదాన్ని పొందుతున్నారు. అయితే ... అందమైన గులాబీ పక్కనే గుచ్చుకునే ముళ్ళు ఉన్నట్టు, తియ్యని తేనె పట్టు చుట్టూ కాటేసే ఈగలు ఉన్నట్టు, ఆదాయాన్ని, ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చే ఈ జంతువులు, పక్షుల పెంపకంలో కొన్ని సమస్యలు, ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి.  వృత్తిగా చేపట్టినా, ఆసక్తితో పెంచినా, యజమానులు, పనిచేసే వారు ఆయా జంతువులు, పక్షులకు అత్యంత సన్నిహితంగా మెలగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఆ జంతువులు, పక్షులకు సంబంధించిన కొన్ని వ్యాధులు మనుషులకు సంక్రమించి, సాధారణ ఆరోగ్య సమస్యల నుండి ప్రాణహానిని కూడా కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి పశువులను, జంతువులను, కోళ్ళను, పక్షులను పెంచేవారు, జంతు ప్రదర్శనా శాలలు, జంతు ప్రయోగశాలలు, వ్యాధి నిర్ధారణా కేంద్రాలలో పని చేసే వారు, పశు వైద్య శాల సిబ్బంది, చర్మం, తోళ్ళ పరిశ్రమలలో పనిచేసే వారు, ధాన్యపు గిడ్డంగులలో పనిచేసే వారు ఈ జూనోటిక్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడుకోవచ్చు. 

బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, ఫంగస్, క్లామిడే వంటి జీవుల వలన ఈ జూనోటిక్ వ్యాధులు వస్తాయి. వ్యక్తుల యొక్క వయసు, ఆరోగ్య స్థితి, శరీరంలోని వ్యాధినిరోధక శక్తి వంటి అంశాలను అనుసరించి ఈ వ్యాధులు సోకటం, వాటి తీవ్రత, అవి కలిగించే హాని ఆధారపడి ఉంటాయి. అలాగే వ్యాధికారకం మనిషికి ఎంత వరకు హాని కలిగించ గలుగుతుంది అనేది, ఆ వ్యాధి కారకం యొక్క రకం, జాతి పైన ఆధారపడి ఉంటుంది. గాలి, నీరు, ఆహారం, జంతు ఉత్పత్తులను వినియోగించటం ద్వారా వ్యాధి సంక్రమణ జరుగుతుంది. 
వైరస్ ద్వారా వ్యాపించే జూనోటిక్ వ్యాధులు : ర్యాబిస్, మెదడు వాపు, మ్యాడ్ కౌ, గాలికుంటు వ్యాధి 
బ్యాక్టీరియా వల్ల వ్యాపించే జూనోటిక్ వ్యాధులు : బ్రూసెల్లోసిస్, క్షయ, సాల్మొనెల్లోసిస్, ఆంత్రాక్స్, గ్లాండర్స్
పరాన్న జీవుల వలన వ్యాపించే జూనోటిక్ వ్యాధులు : యాంకైలో స్టోమియాసిస్, హైడాటిడియోసిస్, అలర్జీ, ఎగ్జిమా ( గజ్జి), అమీబియాసిస్, బాలంటీడియోసిస్, టాక్సో ప్లాస్మా.  

ఏయే వృత్తులలో ఉన్న వారికి ఏయే జూనోటిక్ వ్యాధులు రాగల అవకాశం ఉందో ఒకసారి పరిశీలిద్దాం

వృత్తి/ పని/ సందర్భం

సోకటానికి అవకాశం ఉన్న కొన్ని జూనోటిక్ వ్యాధులు 

పిచ్చి కుక్క కాటు వలన 

ర్యాబిస్ ( పిచ్చి కుక్క వ్యాధి)

కుక్క పిల్లలతో ఆడే వారికి 

టాక్సో కారియాసిస్, లెప్టో స్పైరోసిస్

కుక్కలను, లేగ దూడలను తాకినప్పుడు 

గజ్జి, చర్మ వ్యాధులు 

పందులు, దోమల వలన 

మెదడు వాపు వ్యాధి

అపరిశుభ్రమైన పాలు, గ్రుడ్లు, మాంసం

బ్రూసెల్లోసిస్

పందికొక్కులు, ఎలుకల వలన 

ప్లేగు,టైఫస్, లిస్టీరియా,హిస్టోప్లాస్మా

పశువులతో సన్నిహితంగా మెలగటం 

క్షయ వ్యాధి ( టి.బి)

ఉన్ని, తోళ్ళ పరిశ్రమలో పనిచేసే వారికి, కబేళా కార్మికులు, పశు వైద్య సిబ్బంది, అటవీ సిబ్బంది, వేటగాళ్ళు 

దొమ్మ రోగం ( ఆంత్రాక్స్), బ్రూసెల్లోసిస్, గ్లాండర్స్, లెప్టో స్పైరోసిస్, టెటనస్, క్యూ ఫీవర్, సాల్మొనెల్లోసిస్, జపనీస్ ఎన్ సెఫలైటిస్, రిలాప్సింగ్ ఫీవర్, టి.బి, విబ్రియోసిస్, ఎరిసెఫలాయిడ్, పాశ్చురెల్లోసిస్, హెర్పిస్ మొదలైనవి

సరిగా ఉడకని గ్రుడ్లు, మాంసం వలన 

సాల్మొనెల్లోసిస్

పంది మాంసం వలన 

టీనియాసోలియం

కర్రకోత పనిచేసేవారికి (వుడ్ వర్క్) 

సాల్మొనెల్లోసిస్

గొర్రెలు, మేకల కాపరులకు 

గజ్జి, దురద

కోళ్ళ ద్వారా 

రాణికెట్, సిట్టకోసిస్, సాల్మొనెల్లోసిస్, బర్డ్ ఫ్లూ, న్యూ కాస్టల్ డిసీజ్, ట్యుబర్ క్యులోసిస్

గొర్రెలు-మేకల వలన 

ఆంత్రాక్స్, క్యూ ఫీవర్, బ్రూసెల్లోసిస్, సార్కో సిస్టిస్, లిస్టీరియా, మేంజ్ మొదలైనవి 

గుర్రాలు 

ఆంత్రాక్స్, గ్లాండర్స్, హిస్టో ప్లాస్మోసిస్,  ట్రిప్న సోమియాసిస్ మొదలైనవి

పిల్లులు

ర్యాబిస్, క్యూ ఫీవర్, మంప్స్, క్యాట్ స్క్రాచ్ 

కుందేళ్ళు

కాలా హజార్, కాక్సీడియా, లీష్మీనియా 

కోతులు

ర్యాబిస్, ఫైలేరియా, మలేరియా, ఎల్లో ఫీవర్

కొన్ని ముఖ్యమైన జూనోటిక్ వ్యాధులు, వాటి వివరాలు: 
ర్యాబిస్: ముఖ్యంగా పిచ్చికుక్క కాటు వలన ఈ వ్యాధి కలుగుతుంది. మన దేశంలో ప్రతి సంవత్సరం 30 వేల మంది ఈ వ్యాధి వలన చనిపోతున్నట్టు ఒక అంచనా. 
మెదడు వాపు: జపనీస్ ఎన్ సెఫలైటీస్ అనే ఈ వ్యాధి పందుల శరీరం పైన ఉండే దోమలు కాటు వేయటం ద్వారా సోకుతుంది. ఎందరో చిన్న పిల్లలు ఈ వ్యాధి వలన మరణిస్తున్నారు. 
బర్డ్ ఫ్లూ(ఏవియన్ ఇన్ ఫ్లు యెంజా):  అడవి పక్షుల వలన వ్యాపించే ప్రాణాంతకమైన వ్యాధి యిది. గతంలో కొరోనా వైరస్ తరహాలో  అనేకమంది ఈ వ్యాధి వలన చనిపోవటం తెలిసిందే.
మ్యాడ్ కౌ వ్యాధి: ఒకప్పుడు ఇంగ్లండ్ లో ఈ వ్యాధి వలన విపరీతమైన జన నష్టం జరిగింది. 

జంతువుల నుండి మనుషులకు వ్యాధులు ( జూనోసెస్) రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు :
1.    వ్యాధి సోకిన జంతువులు, కోళ్ళ మాంసం తినకూడదు.
2.    పూర్తిగా ఉడికిన మాంసాన్ని మాత్రమే తినాలి.
3.    సరిగా ఉడకని గ్రుడ్లను తినకూడదు.
4.    వ్యాధి సోకిన పశువుల పాలను ముఖ్యంగా పచ్చి పాలను సేవించకూడదు
5.    చెడిపోయిన, అపరిశుభ్రమైన పాలు, మాoసం, గ్రుడ్లు తినకూడదు.
6.    పాడి పశువులను, జంతువులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి
7.    పాలను బాగా మరిగించి తాగాలి
8.    పశువులు, జంతువులు, పక్షులు, కోళ్ళకు  కాలానుగుణంగా ఇవ్వవలసిన వ్యాధి నిరోధక టీకాలను తప్పనిసరిగా వేయించాలి.
9.    పాలను క్షేత్ర స్థాయిలో తప్పనిసరిగా ప్రాథమికంగా పరీక్షించాలి.
10.    పశువులు, జంతువులు, పక్షుల కొనుగోలు, అమ్మకాల కేంద్రాలలో డాక్టర్ సర్టిఫికెట్ తీసుకునే విధానం సక్రమంగా అమలు చెయ్యాలి
11.    పోస్ట్ మార్టం పరిక్షలు విధిగా నిర్వహించాలి
12.    వధ శాలల దగ్గర శుభ్రత, జంతువుల ఆరోగ్యం పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి. 
13.    ర్యాబిస్, ఆంత్రాక్స్, గ్లాండర్స్ వంటి వ్యాధుల గురించి రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించాలి
14.    పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా యాంటీ ర్యాబిస్ టీకాను వేయించాలి
15.    కుక్కలను పెంచేవారు, పశు వైద్య సిబ్బంది యాంటీ ర్యాబిస్ టీకాను ముందుగానే వేయించుకోవటం శ్రేయస్కరం
16.    పశువులు, జంతువులకు విధిగా నట్టలనివారణ చెయ్యాలి
17.    పందులకు గ్రామ శివార్లలో మాత్రమే ఆవాసానికి అనుమతి ఇవ్వాలి
18.    పౌల్ట్రీ ఫారాలు, జంతు ప్రదర్శన శాలలు, సర్కస్ కంపెనీలలో పనిచేసే వారు, డైరీ ఫారాలలో పనిచేసే వారు, పశు పోషకులు, జంతు ప్రేమికులు వ్యక్తిగత పరి శుభ్రతపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. మాస్క్ ధరించటం మంచిది.
19.    మృత జంతు కళేబరాలను లోతైన గోతిలో, సున్నం చల్లి పూడ్చి పెట్టాలి. 
20.    జంతు ఆవాసాలను అప్పుడప్పుడు క్రిమిసంహారకాలతో శుభ్రం చెయ్యాలి.
21.     పశు సంవర్ధక శాఖ, ఆరోగ్య శాఖ, పంచాయితీ, మున్సిపల్/కార్పొరేషన్ అధికారులు ర్యాబిస్ నివారణకు సంయుక్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి
22.    స్వచ్ఛoద సంస్థలు జూనోటిక్ వ్యాధుల ప్రచారం, నివారణలో క్రియాశీలక పాత్ర వహించాలి.
23.     జూనోసిస్ డే ను విజయవంతం చేసి, ప్రజలలో అవగాహనను పెంచటంలో అందరూ సహకరించాలి.