మామిడిలో కోతానంతరం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు


రచయిత సమాచారం

డా. వి. చైతన్య, డా. జి. హేమంత్ కుమార్, డా. పి. శ్రీరంజిత, డా. కె. రవికుమార్, కృషి విజ్ఞాన కేంద్రం, వైరా


భారతదేశంలో పండించే పండ్ల తోటలలో ప్రధానమైనది మామిడి. దీనిని ఫలరాజుగా పిలుస్తారు. భారతదేశంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణంలో 35 శాతం సాగు విస్తీర్ణంను కలిగి ఉంది. భారతదేశంలో 22,58,130 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడగా తెలంగాణ రాష్ట్రంలో 1,15,990 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నది. మన రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, వరంగల్, కరీంనగర్ వంటి జిల్లాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 13,674 హెక్టార్లలో మామిడిని సాగు చేస్తున్నారు. మామిడి తోటలలో సాధారణంగా కోతలు పూర్తి కావస్తున్న తరుణమిది. సాధారణంగా మామిడి రైతులు పూత, కాత దశలో మాత్రమే మామిడి తోటలపై దృష్టి పెడతారు. కోత తర్వాత మళ్ళీ పూత, కాత వచ్చినప్పుడు మాత్రమే చెట్టుకు కావలసిన ఎరువులను అందిస్తారు. దీని వలన చెట్టుకు సరైన పోషకాలు సరైన సమయంలో లభించక పూత సకాలంలో రాకపోవడం, వచ్చిన పూత, పిందె సరిగా నిలవక పోవడం జరిగి దిగుబడి మీద ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు మామిడి రుచులను వచ్చే ఏడాది కూడా అధిక దిగుబడులతో ఎక్కువ మంది వినియోగదారులకు అందించుటకు కోత అనంతరం రైతులు తోటలలో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలి.
ముఖ్యంగా మన దగ్గర ఉన్న తోటల్లో అధిక శాతం ముదురు తోటలు అనగా  10 సంవత్సరాలకు పైబడినవి ఉన్నవి. పంటకోత తర్వాత మామిడి మొక్కలు చాలా శక్తిని పండ్ల ద్వారా కోల్పోవడం వలన జూన్, జూలై మాసాలలో చెట్లు బలహీనంగా, పెరుగుదల లేకుండా నిద్రావస్థ దశలో ఉండి, చెట్లలో ఎండు కొమ్మలు కూడా కనిపిస్తాయి. ఈ విధంగా 20-30 రోజుల పాటు ఏ విధమైన యాజమాన్య పద్ధతులను పాటించకుండా ఉండి, ఆ తర్వాత కొమ్మల కత్తిరింపులు, అంతరకృషి చేయాలి.

కొమ్మ కత్తిరింపులు :
మామిడి కాయ కోతల అనంతరం కాయ తొడిమలున్న కొమ్మలను, ఎండిన కొమ్మలను, తెగులు సోకిన మరియు విరిగిన కొమ్మలను కత్తిరించాలి. అలాగే చెట్ల లోపల గాలి, వెలుతురు ప్రవేశానికి అడ్డు తగులుతున్న కొమ్మలను తొలగించాలి. పూత కాడలను కత్తిరించాలి. పూత కాడల నుంచి వెనుకకు 15 సెం.మీ. వరకు కత్తిరించాలి. దీని వల్ల కొత్త కొమ్మలు పుట్టుకొచ్చి, అవే వచ్చే ఋతువులో పుష్పిస్తాయి. అనగా నవంబర్, డిసెంబర్ నెలలో పూతకు వస్తాయి. కత్తిరింపులు చేసిన తర్వాత ప్రతి రెమ్మ చివరి నుండి 3-5 చిగుర్లు వస్తే ఆరోగ్యంగా ఉన్న రెండింటిని నిలుపుకొని మిగిలిన వాటిని తీసివేయాలి. కత్తిరింపుల వలన కొంతమేర తగ్గే అవకాశం ఉంది. కత్తరించిన కొమ్మ భాగాలకు బోర్డోపేస్ట్ పూయాలి. లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి చెట్టంతా తడిచేలా పిచికారి చేయాలి.

దుక్కి దున్నడం :
తొలకరిలో అనగా జూన్, జూలై మాసాలలో రైతాంగం చెట్ల మధ్యన దున్నటం చేయాలి. దీని వలన కోశస్థ దశలో ఉన్న పురుగులు, కలుపు నివారించబడుతుంది. అంతేకాకుండా నేల గుల్లబారి, వేర్లు బాగా గాలి పీల్చుకొని చెట్టు ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. అదే విధంగా నేలకు వర్షపు నీటిని పట్టి ఉంచే గుణం పెరుగుతుంది. చెట్ల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో పచ్చిరొట్ట పైర్లను వేసి వాటిని పూత దశలో అనగా ఆగష్టు నెలలో రెండవ దుక్కి చేపట్టినప్పుడు నేలలో కలిసేలాగా దున్నాలి. దీని వలన నేల సారవంతం అవుతుంది. మూడవ దుక్కి అక్టోబర్ నెలలో చేపట్టినట్లయితే నేలలో తేమ ఆరిపోయి సకాలంలో పూత రావడానికి దోహదపడుతుంది. దున్నేటప్పుడు చెట్టు నుండి 1.5 - 2.0 మీటర్ల దూరం వదిలి దున్నుకోవాలి.

ఎరువుల యాజమాన్యం :
కాపు కాసే తోటలో చెట్లకు సరియైన మోతాదులో ఎరువులను అందించాలి. ఒక సంవత్సరం వయస్సు ఉన్న చెట్లకు 10 కిలోల పశువుల ఎరువు, 200 గ్రా. యూరియా, 600 గ్రా. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 150 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను వేయాలి.
5 సంవత్సరాల వయస్సు ఉన్న చెట్లకు 50 కిలోల పశువుల ఎరువు, కిలో యూరియా, 3 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 1.75 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లను వేయాలి. మామిడికోత అయిన వెంటనే సిఫారసు చేసిన 2/3 వంతు ఎరువులను వేయాలి. మిగతా ⅓  భాగం ఎరువులను కాయ ఎదుగుదల దశలలో ఫిబ్రవరి రెండవ లేదా మూడవ వారంలో వేయాలి. సూక్ష్మధాతు లోపాలు ఎక్కువగా ఉన్న తోటల్లో చెట్టుకు 150 గ్రా. జింక్ సల్ఫేట్, 75 గ్రా. బోరాక్స్ మరియు 100 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్ 125 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ పశువుల ఎరువుతో కలిపి జూన్-జూలై మాసాలలో మొక్కల పాదుల్లో వేయాలి.
పైన సూచించిన విధంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మామిడి చెట్లు సెప్టెంబర్, అక్టోబర్ లో కొత్త చిగుర్లు వేసి సకాలంలో పూత రావడమే కాక మంచి దిగుబడులు పొందవచ్చు